You Are Here: Home » చిన్నారి » 172 రోజులు – ఏడు పర్వతాలు

172 రోజులు – ఏడు పర్వతాలు

రాష్ట్రంలో ఆ ఊరు ప్రత్యేకం. ఆ ఊరిలో ఆ మనిషి ప్రత్యేకం. ఇంతకీ ఆ ఊరేది? ఆ మనిషెవరు?
నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరికీ సుపరిచితమైన ఆ ఊరు ‘గాంధీ జనసంఘం’. ఆ మనిషి మల్లి మస్తాన్ బాబు. ప్రపంచంలో ఎత్తయిన ఏడు పర్వతాలను కేవలం 172 రోజుల్లో అధిరోహించి ఆయన తన సత్తా చాటాడు. అది గిన్నిస్ రికార్డు కూడా సాధించాడు.

మల్లి మస్తాన్‌బాబు ఓ సామాన్య కుటుంబానికి చెందిన యువకుడు. చిన్నప్పటి నుంచి సాహసాలను ప్రేమించాడు. ఎంత సాహసవంతుడో, అంత తెలివైన వాడు కూడా. కాళ్లకు తాళ్లు కట్టుకుని కాలువలో ఈది అందరినీ అబ్బుర పరిచిన ఆ అబ్బాయే క్లాసులో మార్కులను కొల్లగొట్టి చదువులోనూ ముందున్నానని నిరూపించుకున్నాడు.

తన ప్రతిభతో కోరుకొండ సైనిక్ స్కూల్, అక్కడ్నుంచి ఐఐటీ, ఐఐఎంలలో అడుగుపెట్టి, ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉన్నతోద్యోగిగా ఎదిగాడు. ఇది ఆయన అకడెమిక్ రికార్డు. అసలైన రికార్డు పర్వతారోహణం. ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని ఏడు పర్వతాలను ఎక్కిన తొలి భారతీయుడిగా మస్తాన్‌బాబు రికార్డు సృష్టించాడు. అంతేకాదు, 172 రోజుల్లో ఆ ఫీట్ సాధించిన వ్యక్తిగా గిన్నిస్‌కు ఎక్కాడు.

ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కాలని కళాశాల రోజుల్లోనే నిర్ణయించుకున్న మస్తాన్ నిరంతరం దాని గురించే ఆలోచించేవాడు. ఆ సమాచారం సేకరిస్తూ ఉండేవాడు. పర్వతారోహకులను కలిసేవాడు. మెళకువలను నేర్చుకునేవాడు. ఈ క్రమంలో ప్రపంచంలోని ఏడు శిఖరాలు – వాటి అధిరోహకుల గురించి ఓ పుస్తకం ద్వారా తెలుసుకున్న మస్తాన్ వాటిపై కన్నేశాడు.

సరిగ్గా ప్లాన్ చేసుకుని మిత్రుల సాయంతో ఆ ఏడు శిఖరాలను అధిరోహించాడు. కిలిమంజారో (టాంజానియా-ఆఫ్రికా), అకెన్ కాగ్వా (అర్జెంటీనా-దక్షిణ అమెరికా), దెనాలి (అమెరికా-ఉత్తర అమెరికా), ఎల్‌బ్రస్ (రష్యా-యూరప్), కోసిసుజ్కో(ఆస్ట్రేలియా), ఎవరెస్ట్ (నేపాల్-ఆసియా), విన్సన్ మాసిఫ్ (అంటార్కిటికా) పర్వతాలను అత్యంత వేగంగా అధిరోహించి రాష్ట్ర, దేశాల పేరును శిఖర సమానం చేశాడు మస్తాన్.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top