You Are Here: Home » చిన్నారి » స్వార్థపరులు

స్వార్థపరులు

ఒక అడవిలో ఒక ఆడనక్క ఉండేది. దానికి అడవినిండా ఎందరో స్నేహితులు. రకరకాల జంతువులు తనతో స్నేహం చేస్తున్నందుకు దానికి గర్వం కూడా.

ఒకరోజు అది ఒక స్నేహితురాల్ని కలుసుకోవడానికి వెళుతోంది. దూరంగా కుక్కల అరుపులు వినిపించాయి. అది భయపడిపోయింది. కుక్కలు వేగంగా పరుగెత్తుతాయి. తానుతప్పించుకోలేదు. అవి దగ్గరకు వస్తున్నాయి కూడా.

నక్క ఆలోచించింది. దగ్గరలో ఉన్న గుర్రం ఇంటికి పరిగెత్తి, ‘‘మిత్రమా! నువ్వు నాకు మంచి స్నేహితుడివి. కుక్కలు నావెంటపడుతున్నాయి. నన్ను వీపు మీద ఎక్కించుకుని వేగంగా ఎక్కడికైనా తీసుకుని వెళ్లు’’ అంది గుర్రంతో.

‘‘క్షమించు. నాకు చాలా పని ఉంది. పని పూర్తికాకపోతే యజమానికి కోపం వస్తుంది’’ అని గుర్రం మెల్లగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. నక్కకు ఆశ్చర్యం వేసింది.

‘ఏం చేయాలి’ అనుకుంది. అప్పుడే దానికి మరో స్నేహితుడు ఎద్దు కనిపించింది. ‘‘మిత్రమా! మంచి మిత్రుడివి. నన్ను కుక్కల బారినుండి రక్షించు’’ అని అడిగింది.

‘‘నేను అర్జెంటుగా ఒక మిత్రుడిని కలుసుకోవాలి. ఇప్పటికే బాగా ఆలస్యం అయ్యింది’’ అంటూ వెళ్లిపోయింది ఎద్దు.

నక్క అలాగే మేకను, కోడెదూడను, పందిని, గాడిదను సహాయం అడిగింది అన్నీ ఏవేవో వంకలు చెప్పాయి. అవేవీ దానిని కుక్కల బారినుండి రక్షంచే ప్రయత్నం చేయలేదు.
‘‘నేనెంత తెలివితక్కువదాన్ని. ఇవేవీ నిజమైన స్నేహితులు కావు. అన్నీ స్వార్థపరులే. నాతోవ నేను చూసుకోవలసిందే’’ అనుకుని శక్తికొద్దీ పరిగెత్తింది. ఎలాగోలా కుక్కల బారి నుంచి తనను తాను రక్షించుకుంది.

నీతి: ఎవరో వచ్చి రక్షిస్తారని ఎదురుచూడకుండా, తన పని తను చేసుకోవడం ఎప్పుడూ మంచిది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top