You Are Here: Home » చిన్నారి » స్వర్గం – నరకం

స్వర్గం – నరకం

ఒక గ్రామంలో భూమయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడు దోపిడీలు చేస్తూ జీవించేవాడు. భూమయ్య దొంగతనాలు చేస్తున్నప్పటికీ అతనికి కొంత పాపభీతి ఉండేది. దాంతో స్వర్గం, నరకం ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకున్నాడు. ఎవరిని అడిగితే తన ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా? అని దీర్ఘంగా ఆలోచించాడు. చివరికి ఒక ఆలోచన వచ్చింది.

కాలిబాటన ప్రయాణం చేస్తున్న ఒక ఋషి దగ్గరకు వెళ్లాడు. కత్తితీసి ‘‘నీదగ్గర డబ్బేమీ ఉండదు. ఆ విషయం నాకు తెలుసు. నాకో అనుమానం ఉంది. దాన్ని నువ్వు తీర్చాలి. స్వర్గం, ఎలా ఉంటాయో చెప్పు. లేదా నీ తల ఎగిరి కిందపడుతుంది’’ అని ఋషిని బెదిరించాడు భూమయ్య.

దానికి ఋషి ‘‘ఛీ.. ఛీ.. నీలాంటి నీచుడితో మాట్లాడవలసిన అవసరం నాకు లేదు’’ అంటూ ముందుకు సాగిపోతుండగా, భూమయ్య కోపంతో ఊగిపోతూ కత్తిని ఋషి పీక మీద పెట్టాడు. ‘‘నువ్వు చెప్పకపోతే ఇక్కడ నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేవు. ఋషి అని కూడా చూడకుండా నీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కాకులకు, గద్దలకు ఆహారంగా వేస్తాను. నా సంగతి నీకు తెలియదు,’’ అంటూ కళ్లెర్ర చేశాడు.

అప్పుడు ఆ ఋషి ‘‘నరకం అంటే నువ్వు ఎక్కడో ఉందని అనుకుంటున్నావు. కానీ అది ఎక్కడో లేదు. ఇక్కడే ఉంది. చూడు నీ శరీరం ఎలా ఊగిపోతోందో. ఎటువంటి ప్రశాంతత లేకుండా ఈ విధంగా ఉండే పరిస్థితే నిజమైన నరకం’’ అన్నాడు. ఋషి. అప్పుడు భూమయ్య, ‘‘స్వామీ! నన్ను క్షమించండి.

మీరు ఋషులు, గొప్ప వారు. మిమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. నరకం గురించి, స్వర్గం గురించి తెలుసుకోవడానికే ఇదంతా చేశాను. అంతే తప్ప మరొకటి కాదు. దయచేసి నన్ను క్షమించండి’’ అంటూ ఋషి పాదాల మీద పడ్డాడు. అప్పుడు ఋషి, ‘‘తప్పు చేసినవాడు తన తప్పును గ్రహించటమే స్వర్గం’’ అని స్వర్గాన్ని, నరకాన్ని భూమయ్యకు అక్కడే చూపించాడు. ఋషి చేసిన హితబోధతో భూమయ్యలో మార్పు వచ్చింది. అప్పటి నుంచి తన దోపిడీ మానేశాడు. కష్టపడి పని చేసుకుంటూ జీవించసాగాడు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top