You Are Here: Home » భవిత » విద్య » ‘స్వరాజ్’ పదాన్ని మొదట ఉపయోగించినవారు?

‘స్వరాజ్’ పదాన్ని మొదట ఉపయోగించినవారు?

ఆధునిక భారతదేశ చరిత్ర

ఆర్య సమాజం
స్వచ్ఛమైన దేశీయోద్యమంగా ఆర్య సమాజోద్యమం ఖ్యాతి చెందింది. దీని స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి. పాశ్చాత్య సంస్కృతిని తిరస్కరించి ఆర్యుల కాలం నాటి ప్రాచీన మతాన్ని ఆదర్శంగా తీసుకొని అప్పటి సమాజాన్ని సంస్కరించాలని ఆయన భావించారు. ఆధునిక భారతదేశంలో మత సంస్కరణోద్యమాల్లో బ్రహ్మ సమాజం తర్వాత రెండోది ఆర్య సమాజం.

ఇది కూడా బ్రహ్మసమాజంలా ఏకేశ్వరోపాసనను బోధించింది. స్వామి దయానంద సరస్వతి 1824లో గుజరాత్‌లోని టంకారా అనే గ్రామంలో శైవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అసలు పేరు మూల్ శంకర్. తన 22వ ఏట సన్యాసం స్వీకరించి, స్వామి విరజానంద దగ్గర శిష్యరికం చేపట్టారు. గురువు బోధనల ప్రచారానికి 1875లో బొంబాయిలో ఆర్య సమాజం స్థాపించారు. సంసార సుఖాల మీద విరక్తి చెంది సన్యాసాన్ని స్వీకరించాడు. విరజానందుడు గురుదక్షిణగా దయానందుడిని రెండు కోరికలు తీర్చమన్నారు. అవి..

1. హిందూ మతానికి మూలాధారం వేదాలు. వేదాలు తిరుగు లేని సిద్ధాంతాలను రూపొందించాయి. ఇతిహాసాలు, ఉపనిషత్తులు, పురాణాలు అంత ప్రామాణిక గ్రంథాలు కావు. హిందూ మతం అంటే వేద ప్రతిపాదిత మతం మాత్రమే.
2. విగ్రహారాధన నిషేధం. వేదయుగంలో ఆర్యుల సమాజంలో విగ్రహారాధన లేదు.
ఈ సిద్ధాంతాలు పూర్తిగా నమ్మిన దయానందుడు వాటి అమలుకు ముందుగా వారణాసి వెళ్లారు. తన ప్రసంగంతో పండితులను ఓడించారు. కలకత్తా వెళ్లి కేశవచంద్రసేనుని కలిశారు. సేన్‌తో సంభాషించిన తర్వాత ఆర్య, బ్రహ్మ సమాజం రెండూ ఏకేశ్వరోపాసన, విగ్రహారాధన నిషేధం అంశాల్లో ఒకే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాయని గ్రహించారు. వేదాలు మినహా మిగిలినవి ప్రామాణికం కావు అనే అంశాన్ని సేన్ ఒప్పుకోలేదు. సేన్ సలహా ప్రకారం దయానందుడు హిందీ భాషలో ప్రసంగాలు చేయడం మొదలుపెట్టారు. దాంతో అతని ప్రసంగాలు ఎక్కువ మందికి చేరాయి. ఉత్తర భారతదేశ యాత్ర తర్వాత దయానందుడుకి బొంబాయిలో ప్రార్థనా సమాజం స్వాగతం పలికింది. తన బోధనలను 1880లో ‘సత్యార్థ ప్రకాశిక’ అనే పుస్తకంలో పొందుపర్చారు. దీన్ని రాయడానికి 4 ఏళ్లు పట్టింది. ‘సత్యార్థ ప్రకాశిక’ ఆర్య సమాజీయులకు ప్రామాణిక గ్రంథం. ఇది వేదాలకు భాష్యం. ధర్మ సంబంధ విజ్ఞాన సర్వస్వం. ఇందులో దేశ దేశాంతరాల మతాలన్నింటినీ సున్నితంగా విమర్శించాడు. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని తోసిపుచ్చిన ఆర్యసమాజం అర్థం లేని మంత్ర తంత్రాలను ఖండించింది. వర్ణ వ్యవస్థ, అస్పృశ్యత, బాల్య వివాహాలు వేదకాలంలో లేవని, వాటిని ప్రస్తావించిన పురాణాలు, ఇతర గ్రంథాలు మనకు ప్రామాణికం కావని దయానంద సరస్వతి ప్రకటించారు. ‘వేదాలకు తరలి వెళ్లండి’ అనే నినాదం ఇచ్చారు.

దయానందుడి ఆర్య సమాజం వైదిక ధర్మ ప్రచార సంఘమైంది. సత్యమార్గం ద్వారా దేవుణ్ని చేరుకోవాలి, దేవుడొక్కడే, అతడు నిరాకారుడు, జనన మరణాలు లేనివాడు, అటువంటి వాణ్ని అందరూ పూజించాలని దయానందుడు ప్రజలను కోరారు. స్త్రీ విద్య, వితంతు వివాహాలను ప్రోత్సహించారు. అస్పృశ్యత, బాల్య వివాహాలను ఖండించారు. సంప్రదాయకంగా వంశపారంపర్యంగా వస్తున్న కుల వ్యవస్థను వ్యతిరేకించారు. పుట్టుకను బట్టి కాకుండా యోగ్యతను బట్టి సమాజాన్ని చాతుర్వర్ణాలుగా విభజించాలని ఆర్య సమాజం భావించింది.

స్త్రీ వివాహ వయో పరిమితి 16 ఏళ్లుగా ఉండాలని దయానందుడు బోధించారు. 1882 లో గోరక్షణ సభను స్థాపించి, గోవధను వ్యతిరేకిస్తూ ప్రచారం చేశారు. ఈ ఉద్యమాన్ని ఇస్లాం మతస్థులు అపార్థం చేసుకోవడం వల్ల హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలు జరిగాయి.

1882లో దయానందుడు స్థాపించిన మరో ఉద్యమం శుద్ధి ఉద్యమం. హిందూ మతంలో సైమైక్యతను సాధించడానికి దయానందుని నాయకత్వంలో ఆర్య సమాజం ఈ ఉద్యమాన్ని చేపట్టింది. ఇతర మతస్తులు, హిందూమతాన్ని వదిలిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి చేర్చుకోవడానికి శుద్ధి ఉద్యమం కృషి చేసింది. ఈ ఉద్యమానికి స్వామి శ్రద్ధానంద, లాలా హంస్‌రాజ్‌లు కృషి చేశారు.

భారతదేశం ఆర్థిక పురోగతి సాధించాలని, భారత ప్రజలను భారతీయులే పాలించాలని దయానందుడు అభిప్రాయపడ్డారు. భారతీయుల అభివృద్ధికి స్వేచ్ఛా స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం అవసరమని, బ్రిటిషర్ల మంచి పాలన కంటే స్వయం పాలన ఎంతో మంచిదని (Good Governance is not substitution to the Home rule) ప్రాచీన వైభవం ప్రాతిపదికగా భారతదేశాన్ని పునర్నిర్మించాలని దయానందుడు సూచించారు. ‘స్వరాజ్’ అనే పదాన్ని తొలిసారి ఉపయోగించింది దయానందుడే. తర్వాత ఇదే పదాన్ని 1906 కలకత్తా సమావేశంలో కాంగ్రెస్ వేదికలో ఉపయోగించిన మొదటి అధ్యక్షుడు దాదాభాయ్ నౌరోజి.

1886లో దయానంద ఆంగ్లో వేదిక్ పాఠశాలను లాహోర్‌లో దయానందుడు స్థాపించారు. 1893లో దయానంద సరస్వతి మరణించారు. ఆ తర్వాత ‘దయానంద్ ఆంగ్లో వైదిక ధర్మకర్తృత్వ సంస్థ’ ఆధ్వర్యంలో ‘దయానంద్ ఆంగ్ల వైదిక కళాశాల’ (DAV College)ను స్థాపించారు. హిందూ సాహిత్యం, హిందూ సంస్కృతి, తత్త్వ శాస్త్రాలు, సంస్కృతం, వేదాలు, ఆంగ్ల విద్య మొదలైనవి ఈ కళాశాలలో బోధించేవారు.

బ్రహ్మసమాజం మాదిరిగా ఆర్యసమాజం కూడా 1892 నాటికి రెండు వర్గాలుగా చీలిపోయింది. అందులో మొదటిది గురుకుల వర్గం. ఇది వైదిక మత ఉద్ధరణ, బ్రహ్మచర్యం, గురుకుల విద్య, శాకాహారులకు ప్రాధాన్యమిచ్చింది. ఈ వర్గానికి పండిత గురుదత్, శ్రద్ధానంద స్వామి, లాలాదేవరాజ్‌లు నాయకులు. రెండోది కళాశాల వర్గం. ఇది ఆధునిక విజ్ఞానం, ఆంగ్ల విద్య ద్వారా వైదిక సంస్కృతి పునరుద్ధరణకు కృషి చేసింది. ఈ వర్గం సామాజిక సంస్కరణకు ప్రాధాన్యమిచ్చింది. లాలా శయనదాస్, లాలాలజపతిరాయ్‌లు ఈ వర్గానికి నాయకులు.

చీలికకు ముఖ్య కారణాలు:
1. విద్యకు సంబంధించిన వివాదం
విద్యాలయాలను స్థాపించి విద్యను ప్రోత్సహించాలి.
గురుకుల విద్య, ప్రాచీన విద్య బోధనను సనాతనవాదులు; కాలేజీ విద్యను విప్లవవాదులు ప్రోత్సహించారు.
2. ఆహారం విషయంలో వివాదం
సనాతనవాదులు మాంసాహారాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించారు. విప్లవవాదులు దీన్ని వ్యతిరేకించారు.
గురుకుల ఆర్య సమాజ్‌కు కేంద్రం హరిద్వార్. ఇక్కడ శ్రద్ధానంద ఒక ఆశ్రమాన్ని స్థాపించారు.
కాలేజీ ఆర్య సమాజ్‌కు కేంద్రం లాహోర్.
లాలాలజపతిరాయ్ తన అనుచరులతో కలిసి అనేక అనాథశరణాలయాలను స్థాపించి, అనాథ హిందువులను మిషనరీల సహాయం కోరే దురావస్థ నుంచి కాపాడారు. దయానంద సరస్వతి మరణం తర్వాత ఆర్య సమాజాన్ని మున్షీరామ్ వ్యాపింపజేశారు.

జీవితాంతం ఆర్య సమాజ సిద్ధాంతాల వ్యాప్తి, విద్యా వ్యాప్తికి ఎంతో కృషి చేసిన మున్షీరామ్ స్వామి శ్రద్ధానందగా ప్రసిద్ధులయ్యారు. ఆర్య సమాజం దేశంలో హిందీ భాష ప్రాముఖ్యం, వేద ధర్మ ఆధిక్యతను ప్రచారం చేసి, భారతీయుల్లో చైతన్యాన్ని కల్గించింది. అనేకమందిని జాతీయోద్యమ నాయకులుగా తీర్చిదిద్దింది.

హేతువాద ప్రకటన ద్వారా ఆర్య సమాజ్ జాతీయ వాదులను ఆకర్షించింది. వాస్తవానికి ఒకప్పుటి ఆర్యసమాజ్ రాజకీయ నిరంకుశత్వానికి గురైంది. ‘ది టైమ్స్’ పత్రిక తరపున సర్ వాలెంటిని చిరోల్ 1907 తర్వాత అశాంతికి కారణాల గురించి దర్యాప్తు చేయడానికి భారత్ సందర్శించారు. ‘ఇంగ్లండ్‌కు, దాని సార్వభౌమాధికారానికి ఆర్యసమాజ్ తీవ్ర ప్రమాదంగా ఉందని’ ఆయన వ్యాఖ్యానించారు.

రామకృష్ణ మఠం:
ప్రాచ్య, పాశ్చాత్య నాగరికతల సమ్మేళనానికి రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు స్వామి వివేకానందుడు గురువు పేరుతో రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. వివేకానందున్ని గొప్ప ఆధ్యాత్మిక శక్తిగా తీర్చిదిద్దిన రామకృష్ణ పరమహంస అసలు పేరు గదోదర ఛటోపాధ్యాయ. ఈయన 1833లో బెంగాల్‌లో జన్మించారు.

లౌకిక విద్యపై ఆసక్తి లేని రామకృష్ణ చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారు. సన్యాసం తీసుకొని, కలకత్తా దక్షిణేశ్వరంలోని కాళిమాత ఆలయంలో పూజారిగా సేవలు చేశారు. అక్కడే ఆశ్రమం స్థాపించి, ‘దక్షిణేశ్వర యోగి’గా ప్రసిద్ధి చెందారు. ఆత్మజ్ఞానంతోనే అత్యున్నత ఆధ్యాత్మిక శిఖరాలకు చేరుకున్నారు.

‘భగవంతుడు ఒక్కడే’ అనే ఏకేశ్వరోపాసనను ప్రబోధించారు. భక్తులు ఏ జాతికీ చెందరనీ, భగవద్భక్తి లేని బ్రాహ్మణుడు ఛండాలుడి వంటి వాడని; భగవద్భక్తి ఉన్న ఛండాలుడు బ్రాహ్మణుడి వంటి వాడని బోధించారు.

ఆకారం లేని నీరు మంచుగా గడ్డ కట్టినప్పుడు ఏ విధంగా ఆకారం పొందుతుందో, అలాగే నిరాకారుడైన భగవంతుణ్ని కూడా ఏ రూపంలో ఊహించుకుంటే ఆ రూపం పొందుతాడని రామకృష్ణ బోధించారు. విగ్రహారాధననను సమర్థించారు. మానవతావాదానికి ప్రాధాన్యమిస్తూ ‘మానవ సేవే మాధవ సేవ’ అనే పిలుపునిచ్చారు. ఈయన ఆధ్యాత్మిక భావనలో స్వామి వివేకానంద పెరిగారు.

భారతీయ సాంస్కృతిక మత ఔన్నత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత స్వామి వివేకానందునికే దక్కుతుంది. ఈయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. 1863లో కలకత్తాలో జన్మించారు. ఏకసందాగ్రాహి. రామాయణం వినడం ఎంతో ఇష్టం.

1880లో కలకత్తా రాష్ట్రీయ కళాశాలలో న్యాయశాస్త్రం అధ్యయనం చేస్తున్నప్పుడు సాంఘిక పరిణామాలు అతడి దృష్టిని ఆకర్షించాయి. తండ్రి హఠాన్మరణంతో ఏర్పడిన దారిద్య్రం అతన్ని ఆధ్యాత్మిక చింతన వైపు మరలించింది. నరేంద్రుడు రామకృష్ణ పరమహంస శిష్యుడై, వివేకానందునిగా మారారు.

వివేకానందుడి గురించి అతని కళాశాల ప్రిన్సిపాల్ హౌస్టి ‘నరేంద్రుడు అద్భుత ప్రతిభాశాలి, ప్రపంచంలోని అనేక దేశాల్లో సైతం తత్త్వశాస్త్ర విద్యార్థుల్లో నరేంద్రుడి వంటి సంపన్నుని నేనింత వరకు చూడలేదని’ అన్నారు.

రామకృష్ణుని తర్వాత దక్షిణేశ్వర ఆశ్రమ బాధ్యతులు వివేకానందుడు స్వీకరించారు. పరమహంస తత్త్వం, విశ్వాసాలను వ్యాప్తి చేశారు. 1893లో చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనానికి హిందూ మత ప్రతినిధిగా హాజరయ్యారు.

తన గంభీరోపన్యాసం ద్వారా వివేకానందుడు భారతదేశ మహోన్నత ఆధ్యాత్మిక సంపదను ప్రపంచ మత ప్రతినిధులకు వివరించారు. సభికులందరినీ సోదర సోదరీమణులుగా సంబోధిస్తూ.. ఆయన చేసిన ప్రసంగం, భారత సంస్కృతి ఔన్నత్యానికి విశ్వమత సమ్మేళనం జేజేలు పలికింది. ఎంతోమంది పాశ్చాత్య మేథావులు వివేకానందుడికి శిష్యులయ్యారు. ఈ ఉపన్యాసం ప్రపంచ ఆధ్యాత్మిక వేత్తలను ఆలోచించేలా చేసింది. అమెరికా, ఐరోపా ఖండాల్లో ఉపన్యాసాల ద్వారా వివేకానందుడు భారతీయ ఆధ్యాత్మిక సంపదను ప్రపంచానికి పంచారు.

మానవతావాదైన వివేకానందుడు దేశంలోని పేదరికం, దైన్యాన్ని చూసి చలించారు. కుల వ్యవస్థను ఖండించారు. మానవులందరిలోనూ దైవత్వం ఉందని, ప్రతి వ్యక్తిలోను శక్తియుక్తులు నిక్షిప్తమై ఉన్నాయని బోధించారు. లక్షలాది పీడిత ప్రజానీకానికి వివేకానందుని బోధనలు అమృతధారలయ్యాయి. మత విషయాల్లో సర్వసమానత్వం, సాంఘిక దురాచారాల నిర్మూలన, అందరికీ విద్యా సౌకర్యాలు కల్పించడం వంటి ఉన్నత ఆశయాల సాధనకు కృషి చేశారు. 1896-97లో వివేకానందుడు రెండు సంస్థలు స్థాపించారు. అవి..

1. రామకృష్ణ మఠ్ – ఆధ్యాత్మిక అంశాలు బోధించే సంస్థ.
2. రామకృష్ణ మిషన్ – పేద ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటైన ధార్మిక సంస్థ.
వివేకానందుడు స్థాపించిన పత్రికలు:
1. ప్రబుద్ధ భారతి (ఆంగ్లం)
2. ఉద్భోదన (బెంగాలీ)
వివేకానందుని ప్రియ శిష్యురాలు ఐరిష్ మహిళ మార్గరేట్ నోబుల్. ఈమెకు వివేకానందుడు ‘సిస్టర్ నివేదిత’ అనే పేరు పెట్టారు. వివేకానందుడు 1902లో మరణించారు. రామకృష్ణ మఠ్, రామకృష్ణ మిషన్‌లకు హౌరాలోని బేలూరు (పశ్చిమ బెంగాల్) ముఖ్య కేంద్రం.

మాదిరి ప్రశ్నలు

1. ‘సకల జ్ఞానాలు, విశ్వ జ్ఞానానికి ఆధారం వేదాలే’ అన్నవారు?
1) స్వామి దయానంద సరస్వతి
2) రామకృష్ణ పరమహంస
3) వివేకానందుడు
4) రాజారామ్మోహన్‌రాయ్

2. వీటిలో దయానంద సరస్వతి రాయని పుస్తకం?
1) సత్యార్థ ప్రకాశిక
2) వేద భాష్య భూమిక 3) వేద భాష్య
4) వేద ప్రకాశిక

3. ఆర్య సమాజ కేంద్రాన్ని బొంబాయి నుంచి ఎక్కడకు తరలించారు?
1) పెషావర్ 2) లాహోర్
3) అమృత్‌సర్ 4) మార్వి

4. రామకృష్ణ మిషన్‌ను ఎప్పుడు స్థాపించారు?
1) 1899 2) 1898 3) 1897 4)1896

5. రామకృష్ణ పరమహంస అసలు పేరు?
1) గదోదర ఛటోపాధ్యాయ
2) మూల శంకరుడు
3) నరేంద్రనాథ్ దత్తా 4) స్వామిదాసు

6. స్వామి దయానంద సరస్వతి శుద్ధి ఉద్యమాన్ని ఎప్పుడు స్థాపించారు?
1) 1885 2) 1883 3) 1882 4) 1881

7. రామకృష్ణ మఠ్, రామకృష్ణ మిషన్‌ల ప్రధాన కేంద్రం?
1) బేలూరు 2) వేలూరు
3) బొంబాయి 4) మద్రాసు

8. దక్షిణేశ్వర యోగి అని ఎవర్ని అంటారు?
1) స్వామి దయానంద సరస్వతి
2) రామకృష్ణ పరమహంస
3) వివేకానంద 4) స్వామి శ్రద్ధానంద
సమాధానాలు
1) 1 2) 4 3) 2 4) 3
5) 1 6) 3 7) 1 8) 2

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top