You Are Here: Home » చిన్నారి » కథలు » స్వయంకృతం

స్వయంకృతం

SUNDAY-STORYఆంజనేయులు, సరస్వతమ్మలకు ఏకైక సంతానం అప్పలకొండ. సరస్వతమ్మ కనిపించిన ప్రతి రాయికీ ప్రణమల్లి, ప్రతి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తరువాత అప్పలకొండ ఆమె కడుపున పుట్టాడు. ఇప్పుడు అప్పలకొండకు ముపె్పై ఏళ్లు వచ్చాయి. అతనికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు 24 సంబంధాలకు వెళ్లారు. ఆ సంబంధాలన్నింటిని అప్పలకొండ అసందర్భంగా మాట్లాడి, అక్కడ వెకిలి చేష్టలు చేసి చేతులారా పోగొట్టుకున్నాడు. ఈ రోజు అతన్ని 25వ పెళ్లి చూపులకు తీసుకెళ్తున్నారు. పెట్టెలో ఉన్న ఇస్ర్తీ బట్టలు తీసి కొడుక్కిచ్చింది సరస్వతమ్మ. అప్పలకొండ బట్టలు వేసుకున్నాడు. అయినా ఆమెకేదో వెలితి కనిపించి పక్క వాటాలో ఉన్న శాంతమ్మ దగ్గరకెళ్లి వాళ్లబ్బాయిని కళ్లజోడు, వాచీ, షూ అడిగి తెచ్చి కొడుకును ముస్తాబు చేసి తృప్తిపడింది.

అప్పలకొండ తల నిమురుతూ… ‘‘ఒరే నాయనా పెళ్లి చూపుల సమయంలో అక్కడ జాగ్రత్తగా మాట్లాడు. ఈ కళ్లజోడు, వాచీ, షూ గురించి వాళ్లకు చెప్పకూడదు. అవి అరువు తెచ్చినవని వాళ్లకు తెలియకూడదు. తెలిస్తే ఇవి కొనడానికి కూడా గతి లేదు అనుకుంటారు. అవి నీవేనని వాళ్లు అనుకోవాలి అర్థమైందా?’’ అంది తల్లి. అలాగే అన్నట్లుగా తలూపాడు అప్పలకొండ. అందరూ పెళ్లి కూతురు వాళ్లింట్లో కూర్చున్నారు. వాళ్లు సాంప్రదాయం ప్రకారం ముందుగా పంచదార నీళ్లు కలిపి ఇచ్చారు. అప్పలకొండ నీళ్లు తాగి గ్లాసు టీపాయ్‌ మీద పెడుతూ… ‘‘ఏంటీ పంచదార నీళ్లతో సరిపెట్టేద్దామను కుంటున్నారా? స్వీట్లు, టిఫిన్లు ఏమీ లేవా!?’’ అన్నాడు. సరస్వతమ్మ కొడుపు వైపు కొరకొరా చూసింది. ఆంజనేయు లుకి కొడుకును బరా బరా ఈడ్చి కొట్టాలని పించింది. పెళ్లి కూతురు తండ్రి… ‘‘అబ్బెబ్బే అదేం లేదు బాబూ! అన్ని ఏర్పాట్లు చేశాం’’ అని అంటూండగానే స్వీట్లు, టిఫిన్లు టీపాయ్‌ మీదకొచ్చేశాయ్‌.

సరస్వతమ్మ, ఆంజనేయులు స్వీట్స్‌ తింటూ… ‘‘స్వీట్స్‌ చాలా రుచిగా ఉన్నాయి’’ అన్నారు. అప్పలకొండ స్వీటు కొరికి… తల్లి వైపు సీరియస్‌గా చూసి… ‘‘ఇవేం స్వీట్స్‌ చండాలంగా ఉన్నాయి. నేనింతవరకూ 24 పెళ్లి చూపులకు వెళ్లాను ఎవరూ ఇలాంటి స్వీట్స్‌ పెట్టలేదు’’ అన్నాడు. ఆ మాటకు ఉలిక్కిపడింది సరస్వతమ్మ. తల బాదుకోవాలనిపించింది కానీ చేతిలో స్వీటు ఉండటం వల్ల విరమించు కుంది. ఆంజనేయులు అదిరిపడ్డాడు. కానీ నోట్లో స్వీటు ఉండటం వల్ల దిగమింగుకున్నాడు. పెళ్లి కుమార్తె తండ్రి… ‘‘అదేంటి బాబూ! ఖర్చుకి కూడా వెనుకాడకుండా హైదరాబాద్‌లో ఫేమస్‌ అయిన పుల్లారెడ్డి స్వీట్స్‌ తెప్పించాను’’ అన్నాడు. ‘‘అందుకేనన్నమాట పుల్లగా ఉన్నాయి. సర్లెండి ఎలాగోలా సర్దుకుంటాను’’ అంటూ ప్లేటులో ఉన్న స్వీట్సూ టిఫినూ మొత్తం లాగించేశాడు.

అప్పలకొండ మాటలు విన్న సరస్వతమ్మ ఇంక తట్టుకోలేక నలుగురిలో ఉన్నానని కూడా ఆలోచించకుండా అరచేత్తో నుదురు మీద కొట్టుకుంది. అదే స్థితిలో ఉన్న ఆంజనేయులు కూడా పిడికిలి బిగించి అరచేతిని గుద్దుకున్నాడు. పెళ్లి కుమార్తె తండ్రి… ‘‘ఏమిటమ్మా మీ అబ్బాయి స్వీట్లు పుల్లగా ఉన్నాయంటాడు’’ అన్నాడు. ‘‘వాడి మాటలు మీరేం పట్టించుకోకండి ఒక్కోసారి ఇలాగే తిక్కతిక్కగా మాట్లాడుతూ ఉంటాడు’’ అంది. పెళ్లి కూతురు తండ్రితో సహా వాళ్లందరి ముఖాల్లోనూ రంగులు మారాయి. అది గ్రహించిన ఆంజనేయులు అప్పలకొండ వాళ్లకు నచ్చుతాడో లేదోనన్న అనుమానం మనసులోకి రాగా ‘‘ఏమండీ మా అబ్బాయి మీకు నచ్చినట్టేనా’’ అన్నాడు. ఆ మాట వినగానే అప్పలకొండ జేబులో ఉన్న చిన్న అద్దాన్ని, దువ్వెననూ బయటకు తీసి ఎడమచేత్తో అద్దాన్ని పట్టుకొని కుడిచేత్తో దువ్వెన పట్టుకొని తల దువ్వుకొని వాటిని మళ్లీ జేబులో పెట్టేశాడు.

పెళ్లి కూతురు తండ్రి ‘‘అబ్బాయి బాగానే ఉన్నాడు’’ కానీ అని మధ్యలో ఆగిపోయాడు. అప్పడు అప్పలకొండ కల్పించుకొని… ‘‘మీ అనుమానం నాకర్థమైంది. మీ అమ్మాయి నాకు నచ్చలేదను కుంటున్నారు కదూ! మీరు పెట్టిన స్వీట్స్‌ అంత బాగా నచ్చింది’’ అన్నాడు. ‘‘అదేంటి ఇప్పుడేగా స్వీట్స్‌ బాగాలేదన్నారు?’’ అన్నాడు పెళ్లి కూతురు తండ్రి. ‘‘అలా అన్నానా అనే ఉంటాన్లెండి, సరేగానీ మీకో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. నేను వేసుకున్న బట్టలు నావే. కానీ ఈ కళ్లజోడు, వాచీ, షూ గురించి మీరు అడక్కూడదు. వాటి విషయం మీరు మర్చిపోవాలి అన్నాడు అప్పలకొండ. పెళ్లి కుమార్తె తల్లీ, తండ్రీ ఒకరి ముఖాలు మరొకరు చూసుకొని తర్వాత ఆంజనేయులు వైపు చూశారు. అప్పుడు ఆంజనేయులు ‘‘వాడి మాటలు మీరేం పట్టంచుకోకండి.

ఆ కళ్లజోడు, వాచీ, షూ వాడివే’’ అన్నాడు. ‘‘నాన్నా అబద్ధాలు ఆడకూడదని నాకు చెప్పి… కంచె చేను మేసినట్లుగా నువ్వే అబ్దదం చెబుతున్నావా?’’. అప్పలకొండ మాటకు గతుక్కుమన్నాడు ఆంజ నేయులు. అప్పలకొండ పెళ్లి కూతురు తండ్రితో… ‘‘మీ అమ్మాయిని రెండున్నర ప్రశ్నలు అడగవచ్చా?’’ అన్నాడు. ‘‘అదేంటి, రెండున్నర ప్రశ్నలేంటి?’’ అన్నాడు పెళ్లికూతురు తండ్రి. ‘‘అంటే రెండు పెద్ద ప్రశ్నలు ఒకటి చిన్న ప్రశ్న’’ అన్నాడు. పెళ్లి కూతురు తండ్రి… ‘‘సరే అడుగు’’ అన్నాడు పరధ్యాన్నంగా. అమ్మాయితో… ‘‘నీ పేరేంటి’’ అని అడిగాడు. తలవంచుకుని ఉమ…

‘‘ఉమ’’ అంది. ‘‘అదేం పేరు ఉప్మాలాగా నాకు నచ్చలేదు. నాపేరు అప్పలకొండ, నీ పేరు అప్పలనర్సమ్మగా మార్చుకో! ఏమాంటావ్‌?’’ అని తల్లితో ‘‘ఏమ్మా ఆ పేరయితే బాగుంటుంది కదూ!’’ అన్నాడు. సరస్వతమ్మకు పచ్చి వెలక్కాయ గొంతులో చిక్కుకున్నట్లయి పైకి మాట్లాటలేక ఔనన్నట్టూ, కాదన్నట్టూ తలూపింది. ఈసారి ఆంజనేయులు అరచేత్తో నుదురు మీద కొట్టుకున్నాడు. అప్పలకొండ అప్పలనర్సమ్మగా పేరు మార్చుకోని ఉమను చూస్తూ… ‘‘అన్నట్టు నీకో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. మనమెలాగూ భార్యాభర్తలం కాబోతున్నాం కదా! నేను చెప్పే విషయం మనిద్దరి మధ్యే ఉండాలి. అందుకే రహస్యంగా అరిచి మరీ చెబుతున్నాను. ఈ కళ్లజోడు, వాచీ, షూ గురించి నువ్వు అడక్కూడదు, మర్చిపోవాలి’’ అన్నాడు.

అప్పటివరకు డైలమాలో ఉన్న పెళ్లి కూతురు తండ్రికి అప్పలకొండ వెర్రిబాగులవాడని అర్థమైపోయింది. అంత వరకూ సహనంతో ఉన్న అతను ఉగ్ర నరసింహుడైపోతూ… సరస్వతమ్మ, ఆంజనేయులు వైపు చూస్తూ… ‘‘మతిలేని వాణ్ణి తీసుకొచ్చి నా కూతురు గొంతు కోద్దామని వాచ్చారా!’’ అంటూ వాళ్ల మీదికి దూకాడు. అతని నోటి వెంట ఇంకా చాలా రకాల బూతుమాటలు వచ్చాయి. తల్లీ, తండ్రితో సహా అప్పలకొండ అక్కడి నుంచి బయటకు పరుగెత్తాడు.

– జామి రామారావ్‌

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top