You Are Here: Home » చిన్నారి » స్వప్నం

స్వప్నం

రామకృష్ణ ఆనందానికి అవధుల్లేవు!చాలా రోజుల తర్వాత పెళ్లాం సీతారత్నం అనుకోకుండా పుట్టింటికెళ్లింది పిల్లాడ్ని వెంటపెట్టుకుని.
ఇంకేముంది చిరకాల స్వప్నసుందరి హేమ అతని మనస్సులో మెదిలింది. ఫోన్ చేయగానే గంటలో ఆమె ఇంట్లో వాలిపోయింది.
ఎప్పుడెప్పుడా అని ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న క్షణం రానేవచ్చింది. అతనిలో ఉత్సాహం పరవళ్లు తొక్కింది.

‘‘హేమా, ఈ వేళ నాకెంత ఆనందంగా ఉందో తెల్సా?’’ ఆమెను దగ్గరికి తీసుకుంటూ అన్నాడు రామకృష్ణ. సిగ్గుతో ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి.
‘‘అబ్బో ఎందుకో?’’ ఓరకంట చూస్తూ అంది.
‘‘ఎందుకేంటీ, ఎప్పట్నుంచో అనుకుంటున్నా. ఈ వేళ నా డ్రీమ్‌గాళ్ తలుపుతట్టింది.’’
‘‘మధ్యలో ఆమెవరు?’’ హేమ తెగ ఆశ్చర్యపోయింది కళ్లు పెద్దవిచేస్తూ.

‘‘అరె. ఊర్కో. ఇలాంటి జోకులేయకు. నువ్వుగాక ఇంకెవరుంటారు నాకు…..’’
ఇంతలో మొబైల్ మోగడంతో చటుక్కున మాటలాగాయి. రామకృష్ణకు నెంబరు చూసేంత ఓపిక కూడా లేకపోయింది. చిరాగ్గా ‘హలో’ అన్నాడు.
‘‘ఏవండీ, ఏం చేస్తున్నారు? వండుకున్నారా లేక హోటల్‌కెళుతున్నారా?’’
భార్య గొంతు విన్నాక పచ్చి వెలక్కాయ గొంతులో పడింది అతనికి. హేమ మాటలు వినిపించకుండా కవర్ చేసేందుకు టీవీ సౌండ్ బాగా పెంచాడు.
‘‘ఏం చేస్తా… టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నా.’’

‘‘ఏంటి, ఇంకా ఆఫీసుకు పోలేదా? ఖర్మ, వన్డే మ్యాచ్ కోసం డుమ్మా కొట్టారా?’’ సీత ప్రశ్నల వర్షం కురిపించింది.
‘‘ఇవ్వాళ ఒంట్లో బాలేదు. కొంచెం ఫీవరిష్‌గా ఉంది….’’ అన్నాడు రామకృష్ణ ముక్తసరిగా.
‘‘అయ్యో జ్వరమే. ఓ పని చేయండి. వాచ్‌మెన్‌కు చెప్పండి. ట్యాబ్లెట్ తె చ్చిస్తాడు. అది వేస్కుని రెస్టు తీస్కోండి…..’’
‘‘సరే….’’
‘‘బద్దకించకుండా కాఫీ కలుపుకోండి. మరీ ఎక్కువ సేపు టీవీ చూడొద్దు….’’
‘‘ఇక నువ్వు ఆపితే నేను పడుకుంటా….’’ చిరాగ్గా ఫోను కట్ చేశాడు రామకృష్ణ.
ఈ మాటలన్నీ వింటున్న హేమ అసహనంగా ఇల్లంతా కలయచూస్తోంది. చాలా రోజుల తర్వాత ఆమె వాళ్లింటికొచ్చింది.

‘‘సారీ డియర్, ఏమనుకోకు…. మా అవిడ ఎప్పుడూ అంతే…. సొద పెడుతుంది బుర్ర హీటెక్కేలా…..’’
‘‘సరే…. ఇంతకీ నన్నెందుకు రమ్మన్నావ్ ఇంత హడావిడిగా?’’
‘‘ఏం తెలియనట్టు మాట్లాడతావ్?’’ రామకృష్ణ మురిపెంగా ఆమెను గుండెలకు హత్తుకున్నాడు.
‘‘మాటిమాటికీ ఇట్లా ఇంటికి రావడం నచ్చదు నాకు. నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటారు’’ తలొంచుకుని మెల్లగా అంది హేమ.
‘‘మరయితే పెళ్లి చేసుకుందామా!.’’
‘‘వామ్మో….. పెళ్లా! నాకస్సలు ఇష్టం లేదు.’’

‘‘గవర్న్‌మెంట్ ఎంప్లాయిని. నాకు లేని భయం నీకెందుకు? అంతా నే చూసుకుంటాగా. రెండు వైపులా సమస్యలు రాకుండా చూసుకునే పూచీ నాది’’ భరోసాగా అన్నాడు రామకృష్ణ.
ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో రామకృష్ణ తలుపుతీశాడు.
ఎదురుగా పేపర్ బాయ్ పళ్లికిలిస్తూ నిలబడ్డాడు.
రామకృష్ణకు చిరాకేసింది.
‘‘ఇప్పుడెందుకొచ్చావ్? రెండు రోజులాగి రా’ అని చెప్పి భళ్లున తలుపేశాడు.
‘‘మరైతే ఏం చేద్దాం? పెళ్లీగిళ్లీ లేకుండా ఇట్లోనే ఉండిపోతావా’’ రామకృష్ణ మళ్లీ ఆమెను మాటల్లోకి దింపాడు.
‘‘ఇట్లా మాట్లాడితే మళ్లీ నీ మొహం చూడను. ఫోను కూడా ఎత్తను….’’ హేమ చిరుకోపం ప్రదర్శించింది.
ఏం మాట్లాడాలో పాలుపోలేదు రామకృష్ణకు. ఆమెను కూల్ చే సేందుకు టాపిక్ మార్చాడు.
‘‘దాని సంగతి వదిలేయ్…. స్వీటు, హాటు… ఏమైనా తింటావా?’’

‘‘నాకేం వద్దిప్పుడు. త్వరగా పోవాలి. మమ్మీ నాకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది….’’
హేమ మాటలు పూర్తికాకుండానే మళ్లీ మొబైల్ మోగింది.
‘‘ఏవండీ…. ఎట్లా ఉంది? ఇడ్లీ తెప్పించుకుని తినండి, లేకపోతే నీరసమొస్తుంది, కిచెన్ అల్మారాలో కుడివైపు కారప్పొడి చేసి పెట్టా. అది వేసుకోండి ఇడ్లీలోకి.’’
‘‘సరే’’ అన్నాడు రామకృష్ణ విసుగును అదుపుచేసుకుంటూ.
‘‘మరీ ఇబ్బందిగా ఉంటే ఫోను చేయండి. సిటీలో మా తమ్ముడొచ్చి హాస్పిటల్‌కు తీసుకెళ్తాడు.’’
‘‘వద్దు వద్దులే…. ఫోను పెట్టేయ్. ఇక్కడ మ్యాచ్ మాంచి టెన్షన్‌లో ఉంది.’’ అంటూ రామకృష్ణ కాల్ కట్ చేశాడు.

‘‘సారీ హేమా, మా ఆవిడ ఊరెళ్లినా ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది…’’ సర్దిచెప్పాడు.
ఆమె మౌనంగా విని ఊరుకుంది.
‘‘ఈ ఏడాది బర్త్‌డే ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటావ్? గిఫ్ట్ గురించి ఆలోచిస్తున్నా! నీ చాయిస్ ఏంటి?’’
రామకృష్ణ మాటలకు ఆమె వెంటనే సమాధానం చెప్పలేదు.
‘‘ఫారిన్ వాచీ, సిల్క్ శారీ, రింగ్…. ఐదేళ్లుగా చాలా గిఫ్ట్‌లిచ్చావ్. ఇంకేమీ వద్దు’’
‘‘ఇప్పటిదాకా నాకిష్టమైనవి ఇచ్చా. ఈసారి నీకిష్టమైనది ఇస్తా. సరేనా…’’ రామకృష్ణ ఆమె మెడచుట్టూ చేతులు వేస్తూ కళ్ళలోకి చూస్తూ ఊరిస్తూ అన్నాడు.
‘‘నాకేం వద్దులే…’’ హేమ అదే మాట మళ్లీ చెప్పింది.
‘‘నువ్వలా అంటే నాపై ఒట్టే….’’

రామకృష్ణ సెంటిమెంట్ మంత్రంలా పని చేసింది. ఆమె సరే అంటూ తలూపింది.
‘‘అమ్మయ్య. ఈసారి ఏ గిఫ్ట్ సెలక్ట్ చేద్దాం?’’
హేమ తటపటాయిస్తూ తలొంచుకొని చున్నీ వేలికి చుట్టుకుంటూ ఏదో చెప్పబోయింది.
మళ్లీ కాలింగ్ బెల్ మోగింది. పరుగులాంటి నడకతో తలుపు తెరిచాడు రామకృష్ణ.
ఎదురుగా కొత్త మనిషి. సేల్స్‌ప్రమోటర్‌లా ఉన్నాడు.
‘‘సార్. సిటీకి వంద కిలోమీటర్ల దూరంలో మూడో ఎయిర్‌పోర్టు దగ్గర కొత్త వెంచర్ వేస్తున్నాం. ఎర్లీ బర్డ్ స్కీము కింద డిస్కౌంట్ ఆఫర్ ఉంది. అందరికన్న ముందు ప్లాట్ బుక్ చేసుకోండి.’’
రామకృష్ణకు తిక్కరేగింది.

‘‘బుద్ధిలేదా? బెల్ కొట్టి ఇంట్లోకి వచ్చి మరీ ప్లాట్ల బిజినెస్ చేస్తావా? అసలు నిన్నెవరు రానిచ్చారు లోనికి? ఆ వాచ్‌మెన్ గాడిద ఎక్కడ చచ్చాడు’’ అంటూ కసురుకుని విసురుగా తలుపేసేశాడు.
కోపాన్ని బలవంతంగా అణుచుకుని హేమ దగ్గరికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. మొహానికి నవ్వు పులుముకుని మాటలు మొదలెట్టాడు. ఫ్రిజ్‌లోంచి పెప్సీ బాటిల్ తీసుకుని రెండుగ్లాసుల్లో పోశాడు. ఒక గ్లాసు తను తీసుకొని మరోటి ఆమెకిచ్చాడు.
‘‘సరే, గిఫ్ట్ ఏం తీసుకుందాం. తాపీగా ఆలోచించుకుని చెప్పు.’’ రామకృష్ణ ప్రేమగా ఆమె చుబుకంపై చెయ్యేసి అడిగాడు.
‘‘ఆబిడ్స్ జ్యువెలరీ మాల్‌లో ఇండియన్ బ్రైడల్ నెక్లెస్ కొత్త మోడల్ వచ్చిందట. మా పక్కింటి ఆంటీ మొన్ననే కూతురికి కొంది.’’ గారాలు పోతూ చెప్పింది హేమ.

‘‘ఓకే. అట్లయితే షాపింగ్‌కు ఎప్పుడు పోదాం? రేటు ఎంతుంటుంది ఉజ్జాయింపుగా ?’’
‘‘పది వేల డాలర్లట’’
తల సోఫాపై ఆన్చి సీలింగ్ ఫ్యాన్ వైపు చూశాడు. ఫ్యాన్ రెక్కల బదులు తన తల మూడు ముక్కలై స్పీడుగా తిరుగుతున్నట్టు అనిపించింది. నీరసం ఆవహించి కళ్లు మూసుకున్నాడు.
అప్పటికే ఇంటికెళ్లే తొందర్లో ఉన్న హేమ అతని పరిస్థితి చూశాక తన బ్యాగ్ సర్దుకొని గబగబ అక్కడి నుంచి వెళ్లిపోయింది.

పుట్టింట్లో రెండో రోజు కూడా ఉండకుండా తెల్లారుతూనే ఆదరాబాదరాగా వచ్చేసింది సీత. ఫ్రెష్ అయి మొగుడికి కాఫీ ఇచ్చి తానూ తాగింది. భార్య వైపు చూడకుండా రామకృష్ణ పేపర్లో మొహం దూర్చి సీరియస్‌గా చదువుతున్నట్టు నటిస్తున్నాడు.
‘‘ఇప్పుడెట్లా వుందండీ ఒంట్లో?’’ సీత అతని దగ్గరికొచ్చి ఆదుర్దాగా అడిగింది.
‘‘బానే ఉంది.’’

‘‘ఒక్క రోజుకే మొహం అట్లా పీక్కుపోయిందేమిటండీ?’’
సీత మాటలకు అతను బదులు చెప్పలేదు. ఆమె చిరు కోపంగా పేపరు పక్కకు నెట్టేసి ప్రేమగా అడిగింది.
‘‘అట్లా ఉన్నారేంటి? ఏమైంది మీకు?’’
‘‘సీతా, నీకు నేను చాలా అన్యాయం చే…..’’ రామకృష్ణ గొంతు పూడుకుపోయినట్టయ్యింది.
‘‘అసలేమైందండి?’’ భర్త పక్కనే కూర్చొని కంగారుగా అడిగింది.
‘‘నువ్వు సీతవైతే కావచ్చుగాని… నేను రాముడ్ని కాదు…..’’

‘‘చాలించండి. పొద్దుపొద్దున్నే వెటకారాలు. రాత్రి పిచ్చి కలేమైనా వచ్చిందా?’’ భర్త భుజంపై చెయ్యేసి అడిగింది.
రామకృష్ణకో ఐడియా వచ్చింది. తెలివిగా ట్రాక్ మార్చాడు.
‘‘అరే, నీకెలా తెలిసింది. సీతా ఒక మాట చెప్పనా. ఏమనుకోవు కదా!’’
‘‘ఊ. చెప్పండి.’’
‘‘అవును. నిజంగా పీడకలే వచ్చింది. నీకు విడాకులిచ్చానుట. ఎందుకో… ఏంటో… నాకైతే అర్థం కావడం లేదు’’ పేపర్ మడతపెడుతూ అన్నాడు రామకృష్ణ.

‘‘ఓస్ అంతేనా! అన్ని కలలూ నిజం కావండి. చెడ్డ కలొచ్చిందంటే కచ్చితంగా మంచే జరుగుతుందట చిన్నప్పుడు మా బామ్మ చెప్పేది. మీరెప్పటికీ నాకు దూరం కారు. నాకా నమ్మకం ఉంది…’’ భర్త గుండెలపై తలవాల్చి ధీమాగా అంది సీత.
రామకృష్ణ ఈసారి నిజంగానే డంగై పోయాడు. ఆమెకు మొహం చూపించలేక సిగ్గుతో బెడ్‌రూమ్‌లోకి దూరాడు.

-మెహక్ హైదరాబాదీ

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top