You Are Here: Home » చిన్నారి » స్నేహానికి ప్రతిరూపం

స్నేహానికి ప్రతిరూపం

అనగనగా ఒక రాజ్యానికి జడవర్మ అనే రాజు ఉండేవాడు. అతడు గొప్ప తెలివితేటలు, వివేకం కలిగినవాడు. ఆ రాజు మంచితనం గురించి ఇతర రాజ్యాలకు పాకింది. దానితో అనేక కళలలో ఆరితేరిన కళాకారులు జడవర్మ రాజ్యానికి వచ్చేవారు. తమ కళలను ప్రదర్శించి రాజు మెప్పుతోపాటు మంచి పారితోషకాన్ని కూడా పొందేవారు. ఇలా వచ్చే వారిలో కొంతమంది తమ తెలివితేటలను ప్రదర్శించడంతో పాటు రాజు వివేకాన్ని కూడా పరీక్షించేవారు.

ఒకసారి ఒక కళాకారుడు తాను తయారు చేసిన మూడు బొమ్మలను తీసుకుని రాజదర్బారుకు వచ్చాడు. ఆ మూడు బొమ్మలూ ఒకేలా ఉన్నాయి. వాటిలో ఏ మాత్రం తేడా లేదు. వాటిని రాజు ముందుంచి ‘రాజా! ఈ బొమ్మలను పరిశీలించి వాటిలో ఉన్న తేడాలను చెప్పండి’ అని కోరాడు.

రాజు ఆ మూడు బొమ్మలనూ చేత్తో పట్టుకొని తదేకంగా పరిశీలించాడు. ఒకే ఎత్తు, బరువు ఉండటంతోపాటు పోలికలూ ఒకేలా ఉండడాన్ని గమనించాడు. అలా పరిశీలిస్తున్నప్పుడు ఒక బొమ్మకు రెండు చెవుల్లో రంధ్రాలున్నట్లు గుర్తించాడు. ఒక సూది తీసుకుని బొమ్మ చెవిలోని రంధ్రంలో ఉంచి బొమ్మను కదిలించాడు రాజు. ఆ సూది రెండో వైపు ఉన్న చెవి రంధ్రం గుండా సులువుగా బయటకు వచ్చేసింది. అలాగే మరో బొమ్మకు చెవిలో, నోట్లో రంధ్రాలు ఉండటాన్ని గమనించిన రాజు వెంటనే సూదిని చెవిలో దూర్చగా సూది నోటి గుండా బయటకు వచ్చేసింది.

ఇక మూడో బొమ్మకు ఒక చెవిలో తప్ప మరెక్కడా రంధ్రం లేకపోవడాన్ని గమనించి సూదిని చెవిలో దూర్చగా అది బయటకు రాకుండా లోపలే ఉండిపోయింది. గంభీరంగా ఆలోచించిన రాజు, కాసేపటి తర్వాత ‘‘మీరు చాలా తెలివైన వారు’’ అని కళాకారుడిని మెచ్చుకున్నాడు. ఆ కళాకారుడు మూడు బొమ్మల మధ్య ఉన్న తేడాలు, అంతర్లీనంగా ఉన్న అర్థాల గురించి మాట్లాడుతూ అవి మూడు రకాల స్నేహితులకు పోలికలు అని చెప్పాడు.
‘‘ఇందులో మొదటి బొమ్మ మనకున్న చెడ్డ స్నేహితుడి గురించి చెబుతుంది. మీరు మీ కష్టాలను, బాధలను వినిపిస్తే ఒక చెవితో విని మరో చెవితో వదిలేస్తాడు. రెండో వాడు మన విషయాల్ని సానుభూతితో విన్నప్పటికీ వాటిని మన శత్రువులకు చేరవేస్తాడు. కాబట్టి ప్రమాదకరమైనవాడు. మూడోవాడు మన రహస్యాలను బయటకు పోనివ్వకుండా కడుపులో దాచుకుంటాడు. కాబట్టి మూడో బొమ్మ ఉత్తమస్నేహానికి ప్రతిరూపం’’ అని చెప్పాడు. జడవర్మ కళాకారుడి తెలివిని మెచ్చుకుని అతన్ని అభినందించాడు. అంతేకాక అనేక కానుకలు ఇచ్చి సత్కరించాడు.

నీతి: నిజమైన కళకు గుర్తింపు ఉంటుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top