You Are Here: Home » చిన్నారి » స్నేహంకోసం…

స్నేహంకోసం…

అనగనగా ఒక ఊరిలో మురళి అనే విద్యార్థి ఉండేవాడు. అతను ఇంటిచుట్టుపక్కల ఉన్న పిల్లలను, స్కూల్‌లో తోటి విద్యార్థులను ఎప్పుడూ నవ్వుతూ పలకరించేవాడు. అందరితో సరదాగా ఉండే మురళి చుట్టూ ఎప్పుడు చూసినా చాలామంది పిల్లలు ఉండేవారు. వారిలో కొందరు మురళితో ఎక్కువ సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నించేవారు. కానీ మురళి మాత్రం ఎవరికోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించేవాడు కాదు. అందరితోనూ కాసేపు సరదాగా కబుర్లు చెప్పేవాడు. అంతకుమించి వాళ్ల గురించి పెద్దగా పట్టించుకునేవాడు కాదు.

ఒక సంవత్సరం బాలలదినోత్సవం నాడు పిల్లలందరూ కలిసి ఆ వీధిలో పండగలాగ చేసుకోవాలనుకున్నారు. ఆ రోజు వారివారి స్నేహితులకు బహుమతులు ఇచ్చుకోవాలనుకున్నారు. పిల్లలు తాము దాచుకున్న డబ్బులతో చిన్నచిన్న బహుమతులు కొని తమ స్నేహితులకు ఇచ్చారు. ప్రతిఒక్కరికి కనీసం మూడు బహుమతులైనా వచ్చాయి. కానీ మురళికి ఒక్క బహుమతి కూడా రాలేదు. అది చూసిన పిల్లలందరూ మురళికి ఒక్క బహుమతి కూడా ఎందుకు రాలేదబ్బా అని మాట్లాడుకున్నారు.

మురళి చాలా బాధపడ్డాడు. మురళి తల్లికి విషయమంతా అర్థం అయ్యింది. అందరితో సరదాగా ఉన్నా, ఎవ్వరితోనూ సన్నిహితంగా లేకపోవటంతో ఎవరూ మురళిని స్నేహితుడుగా భావించుకోలేదు. దాంతో మురళికి ఏ ఒక్కరూ బహుమతి ఇవ్వలేదు. ఆ సంగతే ఆమె మురళికి అర్థమయ్యేలా వివరించింది. అప్పటినుంచి మురళి తనతో సన్నిహితంగా ఉండాలనుకునే వారికి సమయాన్ని కేటాయిస్తూ, కేవలం సరదాగా మాట్లాడడమే కాకుండా వారి ఇబ్బందులను కూడా పట్టించుకోవడం మొదలుపెట్టాడు. దానితో మురళికి మంచి స్నేహితులు దొరికారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top