You Are Here: Home » దైవత్వం » సాహిత్యం » సౌజన్యరాశి పురాణ స్త్రీలు – రుక్మిణి

సౌజన్యరాశి పురాణ స్త్రీలు – రుక్మిణి

సౌజన్యరాశి
పురాణ స్త్రీలు – రుక్మిణి
చెట్టంత మనిషి. చెట్టూ పుట్టా తానయిన మనిషి. ప్రపంచమంతా మొక్కే మనిషి. అలాంటి మహనీయుణ్ణి తులసిదళం తూచగలిగిందంటే… తూచదా మరి! ఆలా తూచిందెవరు? రుక్మిణమ్మ. ఆ మాటకొస్తే తులసి ఆకులే కాదు. త్రాసు పళ్లెంలో నూలుపోగయినా వేయకుండానే, బరువుతగ్గిపోవయ్యా అంటే నల్లనయ్య జాగుచేయక తూగిపోనూ గలడు. ఇందుకు కారణం ఆమె వ్యక్తిత్వం. కృష్ణుని మీద ప్రేమతత్వం.కుండిన నగర ప్రభువు భీష్మకుని పుత్రిక రుక్మిణి. రుక్మి, రుక్మధరుడు, రుక్మబాహువు అనే ముగ్గురు అన్నదమ్ముల మధ్య గారాబంగా పెరిగింది. ఆమె కో అంటే కొండమీది నుంచి కోతినయినా తెచ్చి క్షణాల్లో ఇచ్చేవాడు తండ్రి. కానీ ఒక దశలో ఆమె కోరుకున్న కృష్ణుణ్ణి మాత్రం తేబోనని చెప్పేశాడు.

ఆ కాలంలో ప్రభువుల పగలు అలా ఉండేవి. రుక్మిణిని శిశుపాలభూపతికిచ్చి వివాహం చేయాలనేది సోదరుడు రుక్మి సంకల్పం. అప్పటికే ఆమె కృష్ణయ్యను ప్రేమిస్తోంది. ఇదంతా తనకు ఏమాత్రం తెలీనట్టే ఉన్నాడు ఆ ద్వారకాపతి. శిశుపాలునితో వివాహ ముహూర్తం దగ్గర పడుతోంది. ఆ క్షణాల్లో రుక్మిణమ్మ మనసు ఎంత వ్యాకులతకు లోనయి ఉంటుందో ఇట్టే ఊహించవచ్చు. కోరుకున్నవాడు కాకుండా మరెవరో తనను వరించబోతున్నారంటే ఏ ఆడపిల్ల హృదయమైనా ఎంత దుఃఖసంకులమవుతుందో కదా.

ఆ పరిస్థితుల్లో అబల ఏం చేయగలుగుతుంది. ‘నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేశులం…’ అంటూ రుక్మిణి ఆదిదంపతులకు నమస్సులు చెల్లించింది. తన భావాన్ని తెలియజేసేందుకు కృష్ణుని వద్దకు దూతను పంపించింది. పంపిందే కానీ, ఆ దూత కృష్ణయ్యను చేరగలడో లేడో.

అంతావిన్న పరంధాముడు అంగీకరిస్తాడో లేదో… ఇలా తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురయింది రుక్మిణి. మొత్తానికి సంగతంతా తెలుసుకున్న కృష్ణుడు స్వయంగా రథం మీద తరలివచ్చి రుక్మిణి తండ్రిని ఆయన దళాలను ఓడించి ఆమెను తీసుకునివెళ్లి రాక్షస వివాహం చేసుకుంటాడు. దాడికి దిగిన బావమరిది రుక్మిని చంపబోతాడు. రుక్మిణి కళ్లనీళ్లు పెట్టుకుంటుంది. సహోదరుడు కన్నుమూయడాన్ని ఊహించలేకపోయింది. స్త్రీలు అంతే. పుట్టింటిని కలలో సైతం మరచిపోలేని ప్రేమావేశం వారి స్వంతం. రుక్మిణి కోరికను గ్రహించి రుక్మిని వదిలిపెట్టేస్తాడు కృష్ణుడు.

ఈ భీష్మక పుత్రి కృష్ణుని సతీమణిగా గడపలో కాలుపెట్టాక జరిగిన పరిణామాలనన్నింటినీ భర్త మీద ప్రేమ కోణంలోనుంచే చూసింది. పెద్దభార్య అయిన ఆమెకంటే సత్యభామకే హెచ్చుగా దేవకీసుతుడు ఊడిగం చేశాడు. ఈ విషయమై మిగిలిన ఆరుగురు సతులూ సణిగిపోస్తుండేవారు. కానీ రుక్మిణిలో ఈషణ్మాత్రపు స్పందన ఉండేదికాదు. తాను కోరి చేసుకున్న భర్త మరో భార్య మీద అధిక ప్రేమ ఒలకబోస్తున్నాడని తెలిసినా పట్టించుకునేది కాదు. మీదుమిక్కిలిగా మిగిలిన సవతులను సమాధానపరిచేది. కృష్ణుడు ఏం చేసినా లోకకళ్యాణం కోసమేనని గాఢంగా నమ్మేది.

అంతటి శాంతి దాంతి మనసంతా నింపుకున్న మహిళ ఆమె. భర్త బాగు కోసం తులసికోటను సదా పూజిస్తూ తరించిన మహిళామణిదీపం ఆమె. పదిమంది పిల్లలను కని, పెంచి, వారికి అనుక్షణం తండ్రి గొప్పతనాన్ని బోధించి అందులోనే ఆనందాన్ని వెతుక్కున్న గొప్ప తల్లి. తన మీద సత్యభామ ఈర్ష్య పడుతున్నట్టు తెలిసినా బాధపడలేదు, కోప్పడలేదు. ఎన్నడూ మాటమిగుల లేదు. సహనానికి ప్రతీక రుక్మిణి. అన్నిమాటలెందుకు? తులాభారంలో కృష్ణుడు ఎంతకీ తూగకపోయేసరికి సత్యభామ కూడ రుక్మిణినే శరణు వేడుతుంది. ఆమెకీ తెలుసు. రుక్మిణిప్రేమైక జీవని అని.

అంతిమంగా శ్రీకృష్ణ నిర్యాణమవుతుంది. లేడిపిల్ల అనుకుని ఒక వేటగాడు వదిలిన బాణానికి ఆ విష్ణుస్వరూపం అవతరాన్ని పరిసమాప్తి చేసుకుంటుంది. ఈ విషయాన్ని ముందుగా తెలుసుకున్న అర్జునుడు సమాచారాన్ని రుక్మిణికి చేరవేస్తాడు. వెంటనే ఆమె కృష్ణయ్య లేని లోకంలో తాను ఉండలేనని అగ్నిప్రవేశం చేస్తుంది. అంతటి సుగుణవతి, సౌశీల్య మూర్తి రుక్మిణి. ఆమె సౌజన్యరాశిగా, ఉత్తమ ఇల్లాలిగా ఇతిహాసంలో ఎప్పటికీ మిగిలిపోతుంది. అందుకే శ్రీకృష్ణుడు… తులాభారం సమయాన ఆమె తులసిదళం వేయగానే తూగిపోయి కృతజ్ఞత తెలియజేసుకున్నాడు. రుక్మిణి చరితం లోకవిఖ్యాతం. అది ఎప్పటికీ దివ్యకాంతులీనుతూనే ఉంటుంది. మంచికి మారుపేరుగా నిలుస్తుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top