You Are Here: Home » చిన్నారి » సామర్థ్యానికి పదును

సామర్థ్యానికి పదును

అనగనగా ఒక గ్రామంలో లింగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడు చెట్లను నరికి జీవించేవాడు. ఒకసారి ఒక ఋషి తన ఆశ్రమం చుట్టూ ఉన్న పనికిరాని చెట్లను కొట్టించి, ఆ ప్రదేశంలో చక్కని పూలవనాన్ని వేయాలనుకున్నాడు. చెట్లను నరకడానికి కూలీగా లింగయ్యను పెట్టుకున్నాడు. లింగయ్య మొదటిరోజు పది చెట్లను నరికాడు. రెండవ రోజు ఆరు చెట్లను మాత్రమే నరికాడు. మూడోరోజు నాలుగు చెట్లను మాత్రమే నరకగలిగాడు.

ప్రతిరోజు లింగయ్య పనిని పరిశీలిస్తున్న శిష్యులు లింగయ్యపై గురువుకు ఫిర్యాదు చేశారు. లింగయ్య రోజు రోజుకూ తన పనిని తగ్గించుకుంటూ వస్తున్నాడని, మొదటి రోజు చేసిన పనికి మూడవ రోజు పనికీ చాలా తేడా వచ్చిందని చెప్పారు. మొదటి రోజు పది చెట్లు నరికిన లింగయ్య, మూడవ రోజు మాత్రం నాలుగు చెట్లను మాత్రమే నరికాడని చెప్పారు.

ఇది విన్న గురువు లింగయ్యకు కబురు పంపాడు. ‘‘మేము నీకు మొదటి రోజులాగే ప్రతిరోజూ కూలి ఇస్తున్నాం. నీవు మాత్రం మొదటి రోజు పది చెట్లను నరికావు. మూడో రోజుకు పనిలో చాలా తేడాగా నాలుగు చెట్లను మాత్రమే నరికావు ఎందుకిలా చేస్తున్నావు? అని అడిగాడు ఋషి.

‘‘లేదయ్యా! నేను రోజూ ఒకేరకంగా ఉదయాన్నే వచ్చి సాయంత్రం వరకు కష్టపడి పని చేస్తునే ఉన్నాను. నా పనిలో నిర్లక్ష్యం కానీ, అశ్రద్ధ కానీ లేదు. ఒళ్లు దాచుకోకుండా పని చేశాను. నిజానికి మొదటి రోజు కంటే మిగిలిన రోజుల్లోనే ఎక్కువ కష్టపడ్డాను. నేను మాత్రం ఏం తప్పు చేయలేదు. ఇలా ఎందుకు జరిగిందో నాకూ అర్థం కావటం లేదు’’ అని బదులిచ్చాడు లింగయ్య.

అప్పుడు ఋషి ‘‘లింగయ్య నీ గొడ్డలికి రోజూ పదును పెడుతున్నావా?’’ అని ప్రశ్నించాడు. ‘‘లేదయ్యా! రోజూ పదును పెట్టడం లేదు’’ అన్నాడు లింగయ్య. అప్పుడు ఋషి ‘‘నీవు పెట్టిన పదును మొదటి రోజు చెట్లను కొట్టగానే తగ్గింది. తిరిగి పదును పెట్టకుండా మర్నాడు అలాగే చెట్లను నరికావు. దాంతో గొడ్డలి పదును ఇంకా తగ్గి మొద్దుబారి ఉంటుంది. అందువల్లనే నువ్వు మూడోరోజు ఎంత కష్టపడినా ఫలితం లేక పోయింది. నీవు ఈ విషయాన్ని గ్రహించలేదు’’ అని వివరించాడు. లింగయ్యకు అప్పటికి తన అవివేకం తెలిసి వచ్చింది. ‘అవున’ని తలూపాడు.

నీతి: సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని పెంపొందించు కోవటానికి నిరంతరం కృషి చేయాలి. లేకపోతే గొడ్డలిగాలానే మొద్దబారిపోక తప్పదు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top