You Are Here: Home » ఆరోగ్యం » ఆరోగ్య సూత్రాలు » సర్వరోగ నివారిణి… యోగా

సర్వరోగ నివారిణి… యోగా

సర్వరోగ నివారిణి… యోగా

DSFTMimagelarge
జీవన శైలిలో మార్పుల వల్ల ఎన్నోరకాల మానసిక ఒత్తిళ్లలో కొట్టుమిట్టాడుతున్నాం. రానురాను ఈ ఒత్తిళ్లు కాస్తా శారీరక రుగ్మతలుగా రూపాంతరం చెంది మనో శారీరక రుగ్మతలు (సైకోసొమాటిక్)గా పరిణమిస్తాయి. ఆధునిక వైద్య విధానం అవలంబించే మాత్రలు, ఇంజక్షన్స్ ఈ రోగాల నుంచి తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇస్తున్నాయి. కాని పూర్తిగా నివారించలేక పోతున్నాయి. ఈ పరిస్థితుల్లో యోగాను మించిన సాధనం లేదని అందరూ అంగీకరిస్తున్నారు. వ్యాధులు నయం చేయటమే కాకుండా నివారించే సామర్థ్యం కూడా యోగాకు ఉంది. యోగాభ్యాసం ద్వారా తక్కువ శక్తిని ఖర్చు చేసుకుని ఎక్కువ లాభాన్ని పొందవచ్చు. ఇందుకోసం జిమ్‌లకు వెళ్లి కష్టపడనవసరంలేదు.ఎప్పుడైనా ఎక్కడైనా ఇంట్లోఅయినా చేయవచ్చు. అందుకే ఈబిజీ జీవితంలో ఎక్కువమంది యోగాపట్ల ఆసక్తి చూపిస్తున్నారు.

యోగా అంటే..?
యోగా అనే పదం క్రీస్తు పూర్వం 5 వేల సంవత్సరాలకు ముందే మనదేశంలో ఉంది. యోగ శాస్త్రం పై వెలువడిన తొలి ప్రామాణిక గ్రంథం మాత్రం క్రీ.పూ. 200 నుంచి 300 మధ్య కాలంలో పతంజలి మహర్షిచే సూత్రీకరించ బడింది. సంస్కృతంలో యుజ్ అనే ధాతువు నుంచి యోగా అనే పదం వచ్చింది. యుజ్ అనగా కలపటం అని అర్థం. శరీరాన్ని మనస్సుని కలపటమే యోగా. శరీరం ఆరోగ్యంగా, దృఢంగా ఉంటేనే మన కర్తవ్యాన్ని నిర్వహించగలం. శరీరానికి మనస్సుకు అవినాభావ సంబంధం ఉంది. మనస్సు స్థిరంగా, ప్రశాంతంగా ఉండాలంటే కేవలం వ్యాయామం సరిపోదు. యోగాభ్యాసం కేవలం శరీరానికే సంబంధించినది కాదు, అది మనః ప్రవృత్తులకు సంబంధించినది. అందుకనే చిత్తః వృత్తిః నిరోధః యోగః అన్నారు. యోగ సాధన వల్ల బాహ్యశుద్ధి, ఆంతరికశుద్ధి రెండూ సమకూరతాయి. యోగాలో మన ఆరోగ్యానికి అవసరమైన వాటిలో ఒకటి యోగాసనాలైతే రెండవది ప్రాణాయామం.

యోగాసనాలు
yoga
పతంజలి మహర్షి యోగ సూత్రాల ప్రకారం ఆసనం వేయడంలో స్థిరం, సుఖం అనే రెండు విషయాలకు ప్రాధాన్యత ఉంది. స్థిరత్వం శరీరానికి సంబంధించినది. ఎముకలు, కండరాలు, రక్తాన్ని ప్రవహింప చేసే నాడులు, నాడీ కేంద్రాలు, గ్రంథుల లాంటి నిరంతరం పనిచేసే అవయవాలన్నీ ఇందులోకి వస్తాయి. వీటితోబాటు శారీరక వ్యవస్థలు అయినటువంటి జీర్ణవ్యవస్థ, శ్వాసవ్యవస్థ, విసర్జక వ్యవస్థలు… అన్నింటినీ అదుపులో ఉంచుతూ సమన్వయంగా కలిసికట్టుగా పనిచేయటమే స్థిరం అన్న మాటకు అంతరార్థం. స్థూల శరీరానికి సంబంధించిన పంచభూతాలైనటు వంటి పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశాల సమతుల్యం అన్నది కూడా ఇందులో ఇమిడి ఉంది. మానసిక, శారీరక అంశాల పరస్పర సమన్వయమే యోగాసనాలు.

లాభాలెన్నో..
-శరీరంలోని గ్రంథులన్నీ సమతూకంతో పని చేస్తాయి. శరీరంలోని మలినాలు పూర్తిగా తొలగిపోతాయి.
-రక్త ప్రసరణ సమానంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.
-శ్వాస అదుపులో ఉండడం వల్ల అనేక శారీరక, మానసిక లాభాలు పొందడంతో పాటు శ్వాస కోశాలు శక్తివంతంగా పని చేస్తాయి.
-స్థూల శరీరంతో పాటు, సూక్ష్మ శరీరం మీద కూడా మంచి ప్రభావం చూపిస్తుంది. తద్వారా సహనం, మానసిక దృఢత్వం, ఆత్మవిశ్వాసం వంటి మంచి గుణాలు అభివృద్ధి చెందుతాయి. అందం కూడా పెరుగుతుంది.

ఎప్పుడు చేయాలి?
-యోగాసనాలు సుశిక్షకులైన యోగ నిపుణుల వద్దనే అభ్యసించాలి. ఆపరేషన్ చేయించుకున్నవారు, గుండె జబ్బులు, ఇతరత్రా వ్యాధులు ఉన్నవారు, యోగా నిపుణుల సలహా మేరకు మాత్రమే ఆసనాలు వేయాలి.
-యోగాసనాలు ఖాళీ కడుపుతో మాత్రమే చేయాలి, భోజనం చేసినట్లయితే నాలుగున్నర గంటల సమయం తరువాత, అల్పాహారం చేసినట్లయితే రెండున్నర గంటల తరువాత మాత్రమే చేయాలి.
-యోగా చేస్తున్నపుడు వదులైన దుస్తులు ధరించాలి. ప్రశాంతమైన మనస్సుతో చేయాలి, శరీరం అలసి పోయిన సమయంలో చేయకూడదు.
-ఆసనాలు చేస్తున్న సమయంలో మనస్సును పూర్తిగా చేస్తున్న దానిపైనే కేంద్రీకరించాలి.
-స్త్రీలు నెలసరి సమయంలో ఆసనాలు వేయకూడదు

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top