You Are Here: Home » ఇతర » సరస్వతి పుత్రిక

సరస్వతి పుత్రిక

‘విద్యా వినయ సంపన్నం’ అన్నాది ఆర్యోక్తి. చదువుకి పేదరికంతోగానీ, సంపదతో కానీ పనిలేదు. దీక్షా, పట్టుదల ఉంటే సాధించలేనిదీ, కలల్ని సాకారం చేసుకోలేనిదీ ఏదీ ఉండదు. అదే నిరూపించింది ముంబారుులోని తమిళ కుటుంబానికి చెందిన విద్యార్థిని 24 ఏళ్ళ వయసున్న ప్రేమా జయకుమార్‌. ‘కండక్టర్‌ కొడుకు కలెక్టరవుతాడా!’ అంటూ ఒకప్పడు అవహేళన మాటగా ఉండేది. అప్పుడు కూడా దానిని అవుతారనే నిరూపించారు కొందరు విద్యార్ధులు. ఇప్పటికీ అదే విషయానికి సవాలుగా ఒక ఆటోడ్రైవర్‌ కూతురు ఎంతో కష్టపడితేనే గానీ సాధించలేని సిఏ పరీక్షలు రాసి, తొలి ప్రయత్నంలోనే 800 మార్కులకి, 607 మార్కులు సాధించి టాపర్‌గా తన విజయేకతనాన్ని ఎగరవేసింది. విద్యార్థి చరిత్రలోనే ఒక ఆదర్శ విద్యార్థినిగా ఖ్యాతి గడించింది.


ఈమె టాప్‌ ర్యాంకులో రావటం ఇదేమీ మొదటిసారి కాదు. ఈమె చదువుకుంటున్నంత కాలం 90% మార్కులతో టాపర్స్‌ లిస్ట్‌లోనే ఉంటూ వచ్చింది. చివరికి ముంబాయి విశ్వవిద్యాలయంలో బీకాం పరీక్షల్లో కూడా 90%తో ఫస్ట్‌ ర్యాంకులోనే ఉంది. ఈమె తన విజయానికి కారణమైన కాలేజీ ప్రొఫెసర్లకీ, కోచింగ్‌ ఇన్టిట్యూట్‌ అధ్యాపకులకీ ఎంతో కృతజ్ఞతలు తెలియచేస్తోంది. వారు కూడా ఈమె కోసం ఎంతో శ్రమించి విద్యాబోధన చేయడం మూలంగా ఈ ముంబాయి విశ్వవిద్యాలయం ద్వారానే ఎంకాం కూడా అంతే స్థాయిలో ర్యాంకు తెచ్చుకుంది.

ముంబాయిలో 300 చదరపు అడుగుల చిన్న ఇంట్లో ఇరుకుగా ఉండటానికి ప్రేమా జయకుమార్‌ నిర్ణయించుకోలేదు. చాలా ఉన్నతంగా ఉండాలని కలలు కనేది. ఆ కలల సాకారానికి ఎంతో కృషిచేస్తూ వచ్చింది. ఆ కృషే అమెను టాపర్‌గా నిలబెట్టింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా’ నవంబర్‌ 2012లో నిర్వహించిన పరీక్షల్లో ఫస్ట్‌ ర్యాంకు సాధించి ఇండియా టాపర్‌గా అందర్నీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. ఈ పరీక్ష ఫలితాలు ఈనెల 22న ప్రకటించింది.

ప్రేమా మాటల్లో ఆనందం…
24dheeraప్రేమా, తల్లి, తండ్రి, తమ్ముడు ఈ నలుగురు కుటంబ సభ్యులు ముంబాయిలోని మలాద్‌లో ఎస్‌.బి. ఖాన్‌ ఛావెల్‌ ప్రాంతంలో ఇరుకైన 300 చ.అడుగుల ఒక రూములో నివాసం ఉంటున్నారు. ఈమె పరీక్షా ఫలితాలు వెల్లడించిన తర్వాత ఈమె ‘నేను మానాన్నగారికి ఇంక విశ్రాంతిని ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈయన నా సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు’. అంటూ ఎంతో ఉత్కంఠతో చెప్పింది. స్కూలు ఫీజులకోసం ఏనాడూ ఇబ్బందులు పడలేదు. నేను స్కూల్లో చదువుతుండగా స్కాలర్‌షిప్‌ సంపాదించుకున్నాను. అలాగే కాలేజీలో కూడా చాలా సాధారణ ఫీజు మాత్రమే తీసుకునేవారు. మా నాన్నగారు జయకుమార్‌ తమిళనాడు నుండి కుటుంబంతో వలస వచ్చి, ఇక్కడ 20 సంవత్సరాలుగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నా తల్లి ఒక ప్రవేటు సంస్థలో పనిచేస్తోంది.

నేను కొద్దిగా ఎదిగిన తర్వాత నేను ఆర్టికల్‌షిప్‌ ద్వారా సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత ఈమె పనిమాని ఇంటి వద్దనే నన్ను, తమ్ముడినీ చూసుకుంటూ ఉండేది. నా కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా 40,000/- రూపాయలు స్కాలర్‌ షిప్‌ లభించింది. అందువల్ల ఫీజులు కట్టలేమేమో అన్న దిగులు నాకు గానీ, మా తల్లిదండ్రులకు గానీ ఎప్పుడూ కలగలేదు.ఈమె తన కలల్ని నిజం చేసుకున్న ఈ తరుణంలో ఈమె తన 22 ఏళ్ళ సోదరుడు ధనరాజ్‌ కూడా ఈమెతోపాటే సిఏ పరీక్షలు రాసి తొలిప్రయత్నంలోనే ఉత్తీర్ణుడయ్యాడు. అతను కూడా ఈ పరీక్షల్లో అంతటి విజయాన్ని సాధించడం వెనుక ప్రేమ మార్గదర్శకత్వం ఎంతగానో ఉపయోగపడింది. ‘నా తమ్ముడు 2010లో బీకాం పూర్తిచేసిన తరువాత ఒక కాల్‌ సెంటర్లో ఉద్యోగం చేసుకుంటూ సిఏ పరీక్షకు నాతో పాటు ఫీజు చెల్లించాడు. మేమిద్దరం ఒకేమారు ధరకాస్తు చేసాం.

మా తండ్రి సంపాదన ఇంత అని కచ్ఛితంగా ఉండేది కాదు. అయినా సుమారుగా నెలకు 15000 వరకూ సంపాదించే వారు. మేము మా ఆర్టికల్‌షిప్‌ ద్వారా నెలకు 5000 సంపాదించేవాళ్ళం. ‘మా తల్లిదండ్రులు స్కూలు తరగతుల్ని మించి చదువుకోలేదు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఇంత పెద్ద చదువులు చదువుకున్నారని గర్వంగా చెప్పుకుని ఆనందప డుతున్నారు’.

కృసి వెనుక…
eera2008లో బీకాం పూర్తిచేసిన తర్వాత ప్రేమా చార్టెర్డ్‌ ఎక్కౌటింగ్‌లో ‘కామన్‌ ప్రొఫెషన్నీ టెస్ట్‌’ (సిపిటి) ప్రవేశ పరీక్షకు హాజరయ్యింది. అదేవిధంగా నవంబర్‌ 2009లో ‘ఇంటిగ్రేటెడ్‌ ప్రొఫెషనల్‌ కాంపిటెన్స్‌ ఎగ్జామినేషన్‌’ (ఐపిసిఇ)లో రెండు గ్రూప్‌లూ పూర్తిచేసి రెండున్నర సంవత్సరాలు ఆర్టికల్‌షిప్‌కి అర్హతని సాధించింది. అతి తక్కువ వ్యవధిలోనే ఈమె చార్టెర్డ్‌ ఎక్కౌంటింగ్‌ చివరి పరీక్షలకు అర్హురాలుగా నిలిచింది. ఆర్టికల్‌షిప్‌ ద్వారా ఈమెకు లభించిన ఆదాయం సిఏ పరీక్షల ఫీజులు కట్టుకోవడానికి వినియోగపడింది. రాత్రింబవళ్ళు ఒక ఆశయంతో పట్టుదలతో కష్టపడి (సారీ-ఇష్టపడి) చదవడమే ఇంతటి ఘన విజయానికి కారణం అంటూ ఆనందాతిరేకాల మధ్య ఎంతో ఉత్సాహంగా చెప్తోంది ప్రేమా జయకుమార్‌.

అసలు ఎంతమంది పరీక్ష రాసారు…
ఈ సిఏ చివరి పరీక్షలకు మొత్తం మీద రెండు గ్రూపులకీ 29339 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. అందులో 3804 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే 12.97 శాతం. గ్రూప్‌ 1కి 48320 మంది హాజరుకాగా అందులో 13193 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే ఈ గ్రూప్‌1లో 27.30 శాతం అన్నమాట. అలాగే గ్రూప్‌2కి 51906 మంది హాజరయ్యారు. అందులో 11341 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అంటే కేవలం 21.85 శాతం అన్నమాట. ఇటువంటి పోటీ పరీక్షలో అందర్నీ అధిగమించి ఒక సాధారణ పేదకుటుంబానికి చెందిన ప్రేమా జయకుమార్‌ ఇండియా టాపర్‌గా నిలిచిందంటే, నేటి యువతులకే కాకుండా యువకులకు కూడా ఎంతో ఆదర్శవంతురాలు అనడంలో అతిశయోక్తి లేదు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top