You Are Here: Home » ఇతర » సం‘దేహం’ ఏమీలేదు..!

సం‘దేహం’ ఏమీలేదు..!

సర్వస్య గాత్రస్య శిరః ప్రధానం సర్వేంద్రియాణాం నయనం ప్రధానం
షణ్ణాం రసానాం లవణం ప్రధానం భవే న్నదీనా ముదకం ప్రధానం దేహానికి శిరస్సు చాలా ప్రధానమైనది. ఇంద్రియాలన్నిటికన్నా కళ్ళు ప్రధానమైనవి. రసములన్నిటికీ లవణం (ఉప్పు) ప్రధానం. నదులన్నిటికీ నీరు ప్రధానం.

31Feaమానవ శరీరానికి ఇంద్రియాలు అన్నీ ఉండవలసినదే. అప్పుడే శరీరానికి చైతన్యం కలుగుతుంది. లేకపోతే జఢత్వంతో నశిస్తుంది. అయితే ఆ ఇంద్రియాల్ని ప్రేరేపించే మనస్సుని స్వాధీనంలో ఉంచుకోవడం ద్వారానే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఈ మనసు అనే కనిపించని తత్వాన్ని బుద్ధి ప్రేరేపిస్తూవుంటుంది. ఆ బుద్ధి కర్మననుసరించి నడుస్తూవుంటుంది. అందుకే ‘బుద్ధీ కర్మానుసారిణీ’ అని పెద్దల ఉవాచ. దేహానికి శిరస్సు, ఇంద్రియాల్లో కళ్ళు, రసాల్లో లవణం, నదులకి నీరు ముఖ్యమైనట్టే మానవ జీవితానికి కొన్ని ఆచారవ్యవహారాలు, సంప్రదాయం, సాధన వంటి కొన్ని గుణాలు ప్రధానంగా ఉంటాయి. వాటిని అనుసరించే కర్మలు ముడిపడివుంటాయి.

మనకున్న ఇంద్రియాల్ని సక్రమంగా వినియోగించుకుంటూ, సత్కర్మల్ని ఆచరించడమే మానవ ధర్మం మరి దేహబ్రాంతిని విడిచిపెట్టమని పురాణాలు చెప్తున్నాయి. అంటే దేహాన్ని అలక్ష్యం చేయమని కాదు. దేహావసరాలు తప్పకుండా తీర్చవలసినదే. దేహాన్ని అనునిత్యం కాపాడుకుంటూ ఉండవలసినదే. దేహంలో జీవాత్మ ఉన్నంతకాలం దానిని పరిశుభ్రంగా ఉంచుకుంటేనే అది అందులో మనగలుగుతుంది. దేహం అపవిత్రమైనా, దానిని నిర్లక్ష్యం చేసినా దేహం అనారోగ్యానికి గురయ్యి, జీఆత్మ అందులో మనలేక కాలవ్యవధి తీరకుండానే తప్పుకుంటుంది. అందుకే దేహం దేవాలయంగా మార్చగలగాలి. అందుకు ఇంద్రియాల సహకారాన్ని తీసుకోవాలి. ఇంద్రియాలు సహకరించాలంటే మనస్సుని అదుపులో ఉంచుకోవాలి. బుద్దిని లాక్కుపోయే కోరికలనే గుర్రాల పగ్గాలు ఒడిసి పట్టుకుంటేనే మనసు అదుపులోకి వస్తుంది. ఇదంతా అంచెలంచెలుగా చేయవలసిన సాధన. ఈ సాధన సమకూడేది కేవలం ధ్యానం అనే ప్రక్రియ వల్లే సాధ్యం. దానినే నేడు మనం మెడిటేషన్‌ అని పిలుస్తున్నాం.

tghదీనిని బట్టి మెడిటేషన్లో మనం చేయవలసినదేమిటీ..? దాని ద్వారా మనంపొందవలసినదేమీటీ..? అనేది కొంతవరకూ తెలిసినట్టే. అయితే ఒత్తిడిని తగ్గించుకోవడానికి చేసే మెడిటేషన్‌ అనే ధ్యానం నిజమైన ధ్యానం కాదు. ధ్యాన యోగులు అరుదుగా ఉంటారు. వారిని అన్వేషించి వారి వద్ద ఈ క్రియని అభ్యసించవలసి వస్తుంది. అలా అసలైన ధ్యాన సముపార్జన కోసమే, శంకర భగవత్పాదులు, రామానుజులు, యోగివేమన వంటి మహనీయులు గురువుని వెతుక్కుంటూ దేశదేశాలూ తిరిగారు. గురుసుశ్రూషలు చేసారు. సంకల్పసిద్ధిని పొందారు. కనుక మానవ శరీరం, దానితో పాటు సకలేంద్రియాలు, కరణాలు అన్నీ జీవాత్మ ఉన్నంతకాలం ఉండవలసినదే. దేనినీ భక్తి పేరుతో పేరుతో విడిచిపెట్టకూడదు. అలాచేస్తే అది మూఢభక్తి అవు తుంది. శరీర ధర్మానికి అవరోధం కలిగించినా భగవంతుడు మెచ్చడు. అయితే ఈ శరీరం మాత్రం శాశ్వతం అనుకోవడమే పొరపాటు. ఇతర వ్యాపకాలకోసం దీనికి లేనిపోని హంగులు కూర్చడం దేహభ్రాంతి అవుతుంది. దేహం మీద వ్యామోహం లేకుండా ఈ దేహం అవసరాన్ని గుర్తెరిగిన వాళ్ళు దేహాన్ని దేవాలయంగా మలచుకోగలుగుతారు.

అందుకే రాముడు, శ్రీకృష్ణుడు పుట్టారు అని అనం. అవతరించారు అంటాం. అంటే ఆ రూపాన్ని ఆ పరమాత్మ అవసరార్ధం ధరించాడు. అంతేకానీ ఈ జీవిత చక్రంలో బందీలుగా పుట్టడం, పెరగడం, కనిపించకుండా పోవడం వంటి లౌకిక విషయాలతో ఈ పరమ ‘ఆత్మ’కు పనిలేదు. అవతరించడం అంటే అవధరించడం అనే మరో మాటకూడా ఉంది. అవ+ధరించడం అంటే అనుకున్న దేహాన్ని ధరించడం అని అర్ధం. అంతేకానీ మానవ ప్రేరితమైన శరీరాలతో వారికి పనిలేదు.

azxsdదేహం దేవాలయం అయినప్పుడే ఈ జీవాత్మ శాశ్వతత్వాన్ని పొందుతుంది. పరమాత్మగా రూపాంతరం చెందుతుంది. చిరంజీవి అంటే సశరీరంగా ఉన్నవాళ్ళు అని కాదు. జననమరణాలు జయించి శాశ్వతత్వాన్ని పొందిన ఆత్మనే చిరంజీవి అంటారు. అటువంటి ఆత్మకి పరమాత్మ అదిపతిగా ఉంటాడు. అందువల్ల కోరిన దేహాన్ని సంతరించుకోగల శక్తి సామర్ధ్యాలు ఆ ఆత్మకి కలుగుతాయి. అంటే అటువంటి ఆత్మ ఏ శరీరంలోను ప్రవేశించే అవసరం ఉండదు. ఏ రూపంలో కోరుకుంటే ఆరూపాన్ని ధరించగల శక్తి ఉంటుంది. భగవంతుడు చెప్పేది కూడా అదే. తనను ఏరూపంలో కొలిస్తే ఆరూపంలోనే దర్శనమిస్తాను అంటాడు. ఏ పేరుతో పిలిస్తే ఆపేరుతోనే పలుకుతాననడంలో ఆంతర్యం ఇదే. ఇక శరీర ధర్మాల్ని నడిపించేది కోరిక. మరి కోరికలుండకూడదు. అని కూడా పెద్దలు చెప్తూవుంటారు కదా! నిజమే, కానీ కోరిక అనేది లేకపోతే దేహానికి చలనం ఉండదు.

బుద్దిని ప్రేరేపించేవి కోరికలే. అసలు కోరిక లేని జీవి అం టూ ఉండదు. భగవంతుడు కూడా దుష్టసంహారార్ధం అవతరిస్తాను అనే కదా చెప్పాడు. దుష్టుల్ని సంహరించాలి అనేది ఆయన కోరికే కదా..! నాకు ముక్తిని ప్రసాదించు అని భగవంతుని వేడుకోవడం కూడా ఒక కోరికే. మునులు తపస్సులు చేసినా, యాగాలు చేసినా, దేవుడు అవతారం దాల్చినా అన్నీ కోరుకున్నట్లు నడుస్తున్న చర్యలే. అయితే, ఈ కోరికలు లోక కళ్యాణ ప్రదంగా ఉండాలి తప్ప అన్ని కోరికలూ కోరికలు కావు. అవి కేవలం ఆశలే.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top