శ్రమ చీమ
ఒక ఇంటి ఆవరణలో ఒక చీమ,దోమ, ఈగ ఉండేవి. దోమ పాటలు పాడుతూ మొక్కలు, పొదల మధ్య తిరుగుతుండేది. ఈగ ఎక్కడ ఆహారం కనబడితే అక్కడే ఆ ఆహారం చుట్టూ తిరిగేది. చీమ మాత్రం నేల మీద అక్కడక్కడా పడే ధాన్యపు గింజల్ని ఏరి తన నివాసానికి తీసుకు వెళ్ళేది. చీమకు ఆశ ఎక్కువనీ, ఎప్పుడూ ఆహారాన్ని సేకరిస్తూ ఉంటుందని ఈగ, దోమ ఆటపట్టిస్తూండేవి. ఆ మాటలను పట్టించుకోకుండా, సమయం వచ్చినప్పుడు వాటికి బుద్ధి చెప్పాలనుకుంది చీమ.
ఈగ ఒకరోజు చీమకు ఎదురుపడింది. ఈగను తప్పించుకుని వెళ్ళబోయింది చీమ. ‘‘ఏయ్ చీమా! ఆగు. నీకంటే పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు కనిపిస్తే నమస్కరించాలన్న కనీసజ్ఞానం లేదా?’’ అంది ఈగ కోపంగా.
‘‘నువ్వు నాకంటే దేనిలో గొప్పవాడివోయ్?’’ అని చీమ ఎదురు ప్రశ్నించింది.
‘‘నేను ఏ ఆహారాన్నయినా రుచి చూడగలను. ఏ చోటుకైనా వెళ్ళగలను. ఎవరూ నన్ను ఆపలేరు’’ గర్వంగా అంది ఈగ.
బదులుగా చీమ… ‘‘అవునవును! పిలవని పేరంటానికి వెళ్లిపోతుంటావు. అందరూ నిన్ను ‘ఛీ’ కొడుతుంటారు. మీవాళ్ళు అసహ్యకరమైన పదార్థాలపై కూడా వాలుతుంటారు. అంతేకాదు మీతో పాటు ఎన్నో అనారోగ్యాలను మోసుకొస్తుంటారు. ఒకరి నుండి ఒకరికి రోగాలను అంటిస్తుంటారు. కాస్త పక్కకి తప్పుకుంటే నా దారిన నేను వెళతాను’’ అన్నది. దాంతో ఈగకు నోట మాట రాలేదు. మౌనంగా పక్కకు తప్పుకుంది.
చీమ ఇంకాస్త దూరం వెళ్ళగానే దానికి దోమ కనబడింది.
‘‘ఏమిటి చీమక్కా! కాసేపు తిండి ధోరణి మాని, ఈ ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో, నీ చుట్టుపక్కలవారు ఎంత ఆనందంగా జీవిస్తున్నారో ఒకసారి చూడు’’ అంది దోమ.
‘‘నువ్వేనా ఆనందంగా జీవిస్తున్నావు?’’ అని ఎదురు ప్రశ్నించింది చీమ.
‘‘అవును! నేను నాకు కావలసిన ప్రదేశానికల్లా వెళ్ళగలను, కావలసినంత రక్తాన్ని పీల్చగలను. రాజు బుగ్గ మీద సైతం వాలి ఆయనను కుట్టగలను’’ అంది దోమ ధీమాగా.
‘‘అప్పుడు రాజుగారు అరచేతితో నిన్ను ఒక్కటిస్తే నువ్వు చావగలవు కూడా. నువ్వు రక్తపిపాసివి. దొంగచాటుగా మనుషుల రక్తాన్ని పీలుస్తానని గర్వపడకు. నాలాగ కష్టపడి సంపాదించు. ఆహారం ఎంత రుచిగా ఉంటుందో తెలుస్తుంది. అయినా దొంగలతో, రాక్షసులతో నాకు పనేమిటి? అడ్డులే!’’ అంటూ చీమ ముందుకు కదిలింది.
దోమ బిత్తరపోయి చూసింది.
కొన్నిరోజుల తరవాత వర్షాకాలం వచ్చింది. కుండపోతగా వర్షం కురవసాగింది. దోమకు, ఈగకు ఎక్కడా ఆహారం దొరకలేదు. దాంతో ఆకలితో మలమలమాడి చచ్చాయి. చీమ మాత్రం వెచ్చగా ఇంట్లోనే ఉండి తను దాచుకున్న ఆహారాన్ని తింటూ హాయిగా, సుఖంగా ఉంది.
నీతి: సమయం అనుకూలంగా ఉన్నప్పుడే భవిష్యత్తు కోసం కూడబెట్టుకోవాలి.