You Are Here: Home » యాత్ర » తీర్ధ యాత్రలు » శాంతి నగరం ‘జెరూసలేమ్’

శాంతి నగరం ‘జెరూసలేమ్’

శాంతి నగరం ‘జెరూసలేమ్’

జెరూసలేమ్ ఒక అందమైన స్వప్నం భిన్న మతాలు సంస్కృతుల కూడలిస్థానం ఒకవైపు ఆకాశాన్నంటే హర్మ్యాలు… మరోవైపు…మూడువేల ఏళ్ల చరిత్రను చెవిలో గుసగుసలాడే పవిత్రస్థలాలు చరిత్రను గుండెల నిండా నింపుకుని ఆధునికతే పునాదిగా భవిష్యత్తును నిర్మించుకుంటూ పరుగెత్తుతున్న అందాల నగరం ఎడారి మధ్య ప్రకృతి పూసిన నందనవనం బైబిల్ చెప్పినట్లు సకల దేశాలకు ఆభరణం జెరూసలేమ్!

ప్రపంచంలోని అతి ప్రాచీనమైన పట్టణాల్లో ఒకటి జెరూసలేమ్. ఇది మూడు అతిపెద్ద మతాలకు అత్యంత పవిత్రమైన ప్రదేశం. ప్రపంచ చరిత్రను, రాజకీయ విప్లవాలు, ఎత్తుగడలను జెరూసలేమ్ ప్రభావితం చేసినంతగా ప్రపంచంలోని మరే నగరమూ చేయలేదు. యూదుల రికార్డులు, క్రైస్తవుల బైబిల్ ప్రకారం మొట్టమొదటి మానవుడు ఆదాము సృష్టించబడిన తర్వాత 1948 సంవత్సరాలకు అబ్రాహాము జన్మించాడు. అతడు అప్పటి మెసొపొటేమియా (ఇరాక్)కు చెందిన యూదులకు, ముస్లింలకు, క్రైస్తవులకు కూడా ముఖ్యపురుషుడు. ఆయన నమ్మి సేవించిన యెహోవా దేవుడు కనాను(ఇజ్రాయెల్) దేశాన్నంతటినీ ఆయన సంతానానికి వాగ్దానంగా అనుగ్రహించాడు.

ఆయన సంతానానికి చెందిన దావీదు రాజు మొదట తన పాలనను హెబ్రోను రాజధానిగా ఆరంభించాడు. ఆ తర్వాత అప్పటికి యెబూసీయుల పట్టణంగా ఉండిన జెరూసలేమ్‌ను ఆక్రమించి ఆ పట్టణాన్ని ఇజ్రాయెల్ దేశానికి రాజధానిగా ప్రకటించాడు. ఆయన కొడుకైన సాల్మన్ చక్రవర్తి దేవుని ఆజ్ఞ మేరకు జెరూసలేమ్‌లో అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించాడు. ఆ తర్వాత యూదులకు, ముస్లింలకు, క్రైస్తవులకు కూడా జెరూసలేమ్ నగరం పరమపవిత్రమైన ప్రదేశంగా చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందింది. విశేషం ఏమిటంటే… రెండవ ఆదాముగా పిలువబడే యేసుక్రీస్తు జన్మించిన తర్వాత 1948 ఏళ్లకు ఇజ్రాయెల్ స్వతంత్రదేశంగా ఆవిర్భవించింది.

ఈ నగరం అందరిదీ !
జెరూసలేమ్ పట్టణానికి దాదాపుగా మూడువేల సంవత్సరాల చరిత్ర ఉంది. అనేక విప్లవాలు, సంఘటనల నేపథ్యంలో యూదులంతా కలిసి 1948, మే 18వ తేదీన ఇజ్రాయెల్ దేశాన్ని తమ స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. అప్పటి నుంచి ప్రపంచగమనాన్ని జెరూసలేమ్ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితం చేస్తూనే ఉంది.

అయితే ముస్లిం మతస్తులైన పాలస్తీనా ప్రజలు కూడా ఇజ్రాయెల్ దేశం, జెరూసలేమ్ నగరాలపై తమకున్న హక్కును సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న కారణంగా… వివాదాస్పద స్థలం దేశానికి రాజధానిగా ఉండకూడదన్న ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు ఇజ్రాయెల్ దేశానికి టెల్ అవీవ్ నగరం అధికారిక రాజధానిగా ప్రకటితమైంది. కానీ అధికారిక కార్యకలాపాలు ఎక్కువగా జెరూసలేమ్ నుంచే జరుగుతాయి. ఇజ్రాయేల్ పార్లమెంటు ‘నెసెట్’ భవనం జెరూసలేమ్‌లోనే ఉంది. ఆ దేశాధ్యక్షుడు, ప్రధానమంత్రి, మంత్రుల నివాసాలు, ఎక్కువ రాయబార కార్యాలయాలు కూడా జెరూసలేమ్‌లోనే ఉన్నాయి.

ఈ మూడువేల ఏళ్ల చరిత్రలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న నగరం… ఇప్పుడు ఆధునికమైన వసతులతో అందమైన నగరంగా రూపుదిద్దుకుంది. స్వాతంత్య్రం పొందిన ఈ 65 ఏళ్లలో ఇజ్రాయేల్‌ను ప్రజలు పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత విజయవంతమైనదో రుజువు చేస్తోంది ఇజ్రాయేల్. దేశంలో ఒక మామూలు పోలీసు ఉద్యోగికి కూడా ఫిర్యాదు అందితే దేశ అధ్యక్షుడిని అయినా పిలిపించి విచారించే అధికారం ఉంటుంది. పోలీసు తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఎటువంటి ఒత్తిడులూ అడ్డురావు. పాలన వ్యవస్థలో రాజకీయ ఒత్తిడులకు తావులేని ప్రజాస్వామ్యం.

భద్రత పటిష్టం !
జెరూసలేమ్ పేరుకు యూదుదేశపు రాజధాని. కానీ ఇక్కడ ఏ మతం వారైనా తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే వీలు కల్పించింది రాజ్యాంగం. ఇక్కడ మతప్రచారం నిషిద్ధం. పరమతాన్ని దూషించడం, తక్కువ చేసి మాట్లాడడం శిక్షార్హమైన నేరాలు. అలాగే అవినీతికి పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే వదిలి పెట్టరు. ఈ కారణంగా ఇజ్రాయేల్ దేశంలోని జైళ్లలో ఉన్నంత మంది రాజకీయ నాయకులు మరే దేశంలోనూ లేరని చెబుతుంటారు. నగరంలో భద్రతవ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. ఎక్కడా పోలీసు కనిపించడు కానీ ప్రతి ఒక్కరి కదలికలనూ కనిపెట్టే రాడార్ ఆధారిత భద్రతవ్యవస్థ ఉంది. దీని ఆధారంగా శత్రువుల మీద నిరంతరం ఒక కన్నేసి ఉంచుతారు. దేశ జనాభాలో నాలుగోవంతు ఈ నగరంలోనే ఉంటారు.

ప్రాచీన జెరూసలేమ్!
జెరూసలేమ్ పాతపట్టణం ప్రాకారం లోపల ఉంటుంది. ఇది మతసంబంధిత, పర్యాటక ప్రాధాన్యం ఉన్న ప్రదేశం. ఎక్కువగా క్రైస్తవ, యూదు పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. యేసుక్రీస్తును సిలువ వేసిన ప్రదేశం, ఆయన భౌతికకాయాన్ని పాతిపెట్టిన సమాధిగా చెప్పే రెండు ప్రదేశాలు ఉన్నాయి. వీటిని అత్యంత పవిత్రమైన దర్శనీయ స్థలాలుగా భావిస్తారు. ఇన్నేళ్లుగా ఇంత జనం తాకిడి ఉన్నా కూడా అవి బాగా ఉన్నాయి. ఆ ప్రాకారాలకు వెలుపల నగరం అత్యాధునికంగా ఉంటుంది.

నందనవనం నగరం!
నగరం మొత్తం పూలమొక్కలు, చెట్లతో నందనవనంగా ఉంటుంది. ఇక్కడి మనుషుల్లో ట్రాఫిక్ క్రమశిక్షణ, పర్యావరణ కాలుష్యం పట్ల శ్రద్ధ ఎక్కువ. అందుకే మూడువేల ఏళ్ల నాటి రోడ్లే అయినా ట్రాఫిక్ జామ్ సమస్య ఉండదు. మతసంబంధమైన పర్యటనకు కానీ, ఇతర పర్యటనలకు కానీ రోజూ నగరానికి మూడు లక్షల మంది వస్తుంటారు.

ఇలా వచ్చే అన్ని స్థాయుల వారి ఆర్థిక పరిస్థితికి తగినట్లు ఫైవ్‌స్టార్ హోటల్ నుంచి, మామూలు హోటళ్ల వరకు ఉన్నాయి. ఇజ్రాయేల్ దేశం పర్యాటకుల సౌకర్యానికి, వసతుల కల్పనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. పర్యాటకులు ఫిర్యాదు చేస్తే గైడ్‌లు, హోటళ్ల లెసైన్సులు రద్దవుతాయి. ఈ కారణంగా ఇక్కడ పర్యాటకులను దేవుళ్లుగా చూస్తారు.

ఇక్కడి ప్రజలు ప్రధానంగా హిబ్రూ భాష మాట్లాడుతారు, అరబిక్ మాట్లాడే వాళ్లు కూడా ఎక్కువే. వారాంతమైన శనివారాన్ని ‘సబ్బాతు’ గా పిలుస్తారు. సంప్రదాయ యూదులు ఆ రోజు రోడ్లమీద నడవరు, ప్రయాణాలు చేయరు. పొయ్యి కూడా వెలిగించరు. శుక్రవారం సూర్యాస్తమయానికి ముందు వండుకున్న ఆహారపదార్థాలనే శనివారం కూడా తింటారు.

అంటే ఆ రోజున 24 గంటలపాటు పూర్తి విశ్రాంతి పాటిస్తారు. వారంలో ఒకరోజు దేవుని ధ్యానంలో సంపూర్ణంగా గడపాలన్న దైవాజ్ఞను ఇప్పటికీ కచ్చితంగా పాటిస్తున్నారు. ఈ కారణంగా శనివారం రోజు నగరం నిర్మానుష్యంగా ఉంటుంది. జెరూసలేమ్ అంటే శాంతినగరం అని అర్థం. నిజానికి ఇది ప్రపంచంలో శాంతి కొరవడిన నగరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులంతా ప్రతి ఆదివారం జెరూసలేమ్‌లో శాంతి కోసం చర్చిలో ప్రార్థన చేస్తారు.

అందరూ సైనికులే !
ఇక్కడ పదవ తరగతి వరకు ప్రభుత్వం ఉచిత విద్యను అందిస్తుంది. 18 సంవత్సరాలు నిండిన పౌరులందరూ విధిగా సైన్యంలో చేరాలి. యువకులైతే మూడేళ్లు, యువతులు రెండేళ్లు దేశానికి సేవ చేయాలి.

ఆ తర్వాత కూడా 40 ఏళ్లు వచ్చే వరకు మగవాళ్లు ఐదేళ్లకోసారి ఆరునెలల పాటు సైన్యంలో సేవలందించాలి. వారి సేవల నాణ్యతను బట్టి ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఇస్తుంది. ఇక్కడ దేశంలో ఎవరికీ స్థిరాస్తి హక్కు లేదు. ఇజ్రాయేల్ భూములు, కొండలు, నీరు, గాలి ప్రభుత్వ ఆస్తులే. పౌరులు వాటి మీద 99 ఏళ్ల లీజును మాత్రమే పొందగలరు.

సంప్రదాయ యూదులు విధిగా నలుపురంగు దుస్తులనే ధరిస్తారు. మిగిలిన వారి వస్త్రధారణ పాశ్చాత్యదేశాలను పోలి ఉంటుంది. బ్రెడ్, కబాబ్స్, హుమాస్, ఫలాఫిల్ (మన పెసర వడల్లాంటివి) ఇక్కడి వారికి ఇష్టమైన ఆహారపదార్థాలు. నగరంలో 80 శాతం యూదులు, 20 శాతం అరబ్బులు ఉంటారు. యూదులతో పోలిస్తే అరబ్బులు ఇతరులతో స్నేహంగా మెలగుతారు.

నగరంలో పేదరికం, అవినీతి, ఆశ్రీత పక్షపాతం నామమాత్రం అనే చెప్పాలి. బైబిలు ప్రకారం ప్రపంచ పటంలో నాభిస్థలం జెరూసలేమ్. ఆసియా ఖండానికి – ఆఫ్రికా ఖండానికి మధ్యలో, ఇటు పశ్చిమ దేశాలకు- ప్రాచ్యదేశాలకు మధ్యలో ఉంది ఈ నగరం. ఇజ్రాయేల్, పాలస్తీనా దేశాల మధ్య ఉద్రిక్తతకు సంబంధించి రోజూ వార్తలు చదువుతున్నా జెరూసలేమ్‌లో ఆ ప్రభావం ఏమీ కనిపించదు. పటిష్టమైన భద్రతవ్యవస్థ, స్నేహపూర్వకమైన పర్యాటక రంగం, పర్యావరణ కాలుష్యానికి దారితీయని ఆధునికత, ప్రతి అంగుళం ఎంతో చరిత్రను, ఆధ్యాత్మికతను నింపుకున్న ప్రత్యేకత జెరూసలేమ్ నగరానిది. ప్రపంచంలోని అన్ని నాగరికతలు, అన్ని మతాలకూ అనాదిగా కూడలిస్థానం ఇది.

జెరూసలేమ్ నగరానికి ఐదుకిలోమీటర్ల దూరంలో బెత్లెహేమ్ పట్టణం ఉంది. అది పాలస్తీనా దేశం పరిధిలోకి వస్తుంది. అయినప్పటికీ పర్యాటకులు నిరాటంకంగా వెళ్లిరావచ్చు. సీమోను పర్వతం, ఒలీవల తోట, గెత్సెమన్ తోట ఇక్కడ ఉన్న మరికొన్ని దర్శనీయ స్థలాలు. చారిత్రక ఆసక్తి ఉన్న వాళ్లకు జెరూసలేమ్ మ్యూజియం, హీబ్రూ యూనివర్శిటీ, యాద్‌వషీం స్మారక భవనం వంటివి మంచి ప్రదేశాలు. యాద్‌వషీం అంటే యూదులను ఊచకోత కోసిన హిట్లర్ అనుచరుల దౌష్ట్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే ప్రదేశం.

* జెరూసలేమ్‌లో పర్యటించడానికి బృందాలుగా వచ్చేవాళ్లే ఎక్కువ. ఇజ్రాయేల్ దేశానికి రావడానికి ముందుగానే వీసా తీసుకోవాలి. * ఇక్కడ వీసా ఆన్ అరైవల్ విధానం లేదు.
* యూదు, క్రైస్తవ, ముస్లిం మతాలకు పవిత్రమైన ప్రదేశం జెరూసలేమ్.
* ఇజ్రాయేల్ దేశ జనాభా 80 లక్షలు, జెరూసలేమ్ జనాభా 20 లక్షలు.
* ఇజ్రాయేల్ అధికారిక రాజధాని టెల్ అవైవ్ జెరూసలేమ్‌కు 40 కి.మీల దూరాన ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయం టెల్‌అవైవ్‌లో ఉంది.

జెరూసలేమ్‌కు దగ్గరలోని విమానాశ్రయం టెల్ అవైవ్‌లో ఉంది. హైదరాబాద్ నుంచి టెల్ అవైవ్‌కు ఎకానమీ క్లాసు విమాన టికెట్టు 52 వేల నుంచి 66 వేల రూపాయల మధ్య ఉంటుంది. దుబాయ్, జోర్డాన్‌లలో విమానం మారాల్సి ఉంటుంది. మొత్తం ప్రయాణ సమయం ఎనిమిదన్నర గంటలు ఉంటుంది. విరామాలతో కలిసి దాదాపుగా 20 గంటలకు పైగా ఉంటుంది. ఎమిరేట్స్, రాయల్ జోర్డాన్, ఈజిప్టు ఎయిర్, జెట్ ఎయిర్‌వేస్ సర్వీసులు నడుస్తున్నాయి. కొన్ని సర్వీసులు కైరో, ముంబయిల మీదుగా ప్రయాణిస్తాయి. బడ్జెట్ హోటల్ గది అద్దె సింగిల్ రూమ్‌కి రోజుకు వెయ్యి రూపాయల నుంచి మొదలవుతుంది. డబుల్‌రూమ్ మూడున్నర వేలు, త్రిబుల్‌రూమ్ అద్దె దాదాపు ఐదు వేల నుంచి మొదలవుతుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top