You Are Here: Home » ఇతర » వేధింపులు ఇక చెల్లవు

వేధింపులు ఇక చెల్లవు

లైంగిక వేధింపులకు గురిచేసిన వ్యక్తుల ప్రవర్తన, చర్యలు భారతీయ శిక్షాస్మృతి ప్రకారం నేరమైనప్పుడు ఆ పనిచేసే సంస్థ యజమాని, చట్ట ప్రకారం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. లైంగిక వేధింపులకు గురైన బాధితులు, సాక్షులు ఫిర్యాదు విచారణ సమయంలో బాధించబడ కుండా, వివక్షలకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత కూడా పనిచేసే సంస్థల యజమానులపై వుంటుంది. లైంగిక వేధింపులకు గురిచేసిన వ్యక్తులను ఆ ప్రదేశం నుండి బదిలీలు చేయమని గానీ లేక తమను ఆ ప్రదేశం నుంచి బదిలీ చేయమని లైంగిక వేధింపులకు గురయిన వుద్యోగులు గానీ కోరవచ్చు. ఎప్పుడైనా ఒక వుద్యోగి నడవడిక సంబంధిత సర్వీస్‌ నిబంధనల ప్రకారం సరిగా లేకపోతే ఆ ఉద్యోగిపై నిబంధనల ప్రకారం క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలి.

filleraబాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేందుకు తగిన ఫిర్యాదు విభాగాన్ని ఆ పనిచేసే సంస్థ యజమాని సృష్టించాల్సి వుంటుంది. ఎవరి నడవడిక గురించైనా బాధితురాలు ఫిర్యాదు చేసినప్పుడు చట్ట ప్రకారం నేరమైనా కాకపోయినా, ఫిర్యాదు నిబంధన ఉల్లంఘన అయినప్పటికీ, కాకపోయినప్పటికీ ఆ ఫిర్యాదులను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలి. లైంగిక వేధింపుల ఫిర్యాదులను స్వీకరించడానికి ఓ ఫిర్యాదుల కమిటీ వుండాలి. కమిటీ సభ్యుల్లో సగం మంది మహిళలే వుండాలి. ఈ కమిటీకి సహకరించ డానికి అవసరమైన సపోర్టింగ్‌ స్టాఫ్‌ని ఏర్పాటు చేయాలి. ఫిర్యాదులను రహస్యంగా వుంచాలి. సీనియర్‌ అధికారుల నుంచి అనవసరమైన ఒత్తిడిని, ప్రభావాన్ని నిరోధించడానికి, మూడో వ్యక్తులను ఈ ఫిర్యాదుల కమిటీలో వుంచాలి.

ఉద్యోగినులకు తమకున్న ఈ హక్కులు తెలిసేందుకు ముఖ్యమైన స్థలాల్లో ఈ మార్గదర్శక సూత్రాలను ప్రకటించాలి. ప్రైవేటు రంగ సంస్థలు కూడా ఈ మార్గదర్శక సూత్రాలను పాటించడానికి అవసరమైన చర్యల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కోరింది. అందుకు అవసరమైన చట్టాన్ని చేయాలని సుప్రీంకోర్టు కోరింది.మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993లో వున్న హక్కులకు ఈ మార్గదర్శక సూత్రాలు అదనం. అంతేకాని హక్కులని ఇవి తీసివేయవు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అంతేగాక వీటి స్థానంలో సరైన శాసనం తయారు చేసేంత వరకు వీటిని 141 అధికరణం ప్రకారం చట్టం లాగా భావించే అమలు చేయాలని తెలిపింది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top