You Are Here: Home » చిన్నారి » కథలు » వెలుగే చీకటైతే…

వెలుగే చీకటైతే…

SUNDAY-STORY‘‘అమ్మా… సేనికి నేనొత్తానే’’ మా అమ్మ సేనికి పోవడాన్కి సద్ది కట్టుకుం టుంటే అడిగితి. ‘‘యాల్లే, ఇంటి దగ్గర సదువుకుంటుండు’’ సద్దిగిన్నె నెత్తిమీద పెట్టుకుని, నీళ్ల బిందెల్ని తీసుకుని సేనికి పయనమాయ అమ్మ. నేనూ సేనికి పోవల్లని ఎదురుజూస్తాం టా. కాని అమ్మ నన్ను పిల్సుకోని పోదు. ఇపుడు అమ్మ మాట ఇనకుండ సేనికి పోవల్ల! సేన్లో నా ఫ్రెండ్సున్నారు. నేను సేనికి పోతే వాళ్ల మధ్య తిరుగుతూ, వాళ్లు గాలికి డాన్సేత్తుంటే సూ స్తంటి. ఇపుడు పోయి సూడల్ల.
అమ్మ సేనికి పోయినాక, పెద్ద మొగోని లాగా ఆలోచన సేసి, సేనికి పయనమైతి.
‘‘యాటికి మొగోడ..! పోతున్నావ్‌?’’ దారిలో రెడ్డొల్ల ఇల్లు దాటు తుంటే మా రామక్కవ్వ కనపడి అడిగింది.

‘‘సేనికి పోతన్నా!’’ అని సెప్పితి.
‘‘శాక్లెట్టు కొనిస్తా..తీసుకుందురా..’’ అని వ రాలంగటి దగ్గరకి పిల్సుకపోయి, తనకి ఆకు వక్కలు కొనుక్కోని, శాక్లెట్టు కొనించింది నాకు.
‘‘స్మశానం మీద పోతున్నావ్‌ జాగర్త…, భయ పడేవ్‌’’ శాక్లెట్టిస్తూ భయపెట్టింది.
‘‘నేనేమి భయపడనులే…’’ అని మా సేనికి పోయే దారి వైపు కదిలితి మీసాలొచ్చిన మొగోనిలాగ.
మా సేనికి పోవల్లంటే స్మశానంలో నడుచు కుంటా పోవల్ల. సేనికి పోయే దారి స్మశానం మీద పోతాది. ఆ స్మశానం మా ఊరికి, మా పక్కనూరికి. నాయిన యెపుడు పాడే దేవుని పాట స్మశానంలో పోతూ పాడడం మొదలెడ్తి దయ్యాలను భయపెట్టడాన్కని.

‘‘శివ శివ శంకరా… భక్తవ శంకరా, శంభో హరహర నమో నమో…’’ అని పాట పాడు కుంటా పోతుంటే, నాకెదురుగా ఒక పీన్గ్యను మోసుకుంటొచ్చిరి. అది పక్కనూరి పీన్గ్య అనుకుంటా. ఆ పీన్గ్యను సూస్తే భయమే సింది. ‘‘యెంత పని జేస్తివయ్యో! మమ్మల్ని డిసి పోతివి కదయ్యో! ఇంగ మేము బతికే దెట్లయ్యో!…’’ ఏడిసేటోళ్లను చూస్తే నాకు ఏడుపొచ్చింది. అక్కడున్న ముసలాయన దగ్గ రికిపోయి, ఆయనకేమై సచ్చిపోయినాడని అడిగితి. కొందరు కొద్ది దూరంలో ఆయన కోసరం గుంత తవ్వుతుండ్రి. ఈ ముసలా య్న గతాన్ని తవ్వడం మొదలుపెట్టినాడు.

పొద్దు మునగతాంది. కొండకు పోయిన పసులు గడ్డి మేసి ఇండ్లకొస్తున్నాయి. సేన్లకి పోయినొళ్లు ఇండ్లకొచ్చి, ఇంటి పనులు సేచ్చ
న్నారు. సిన్న పిల్లలు బడికి పోయెచ్చి, గోళీలాట, క్రికెట్టు ఆడతన్నారు. ఆ టయంలో సాయిగాడు వాళ్ల మామ ఊళ్లో నించి వస్తాంటే సూసి, వాళ్లమ్మ లచ్చిమికి సెప్పినాడు. అంతలో ఇంటికి వచ్చినాడు సాయిగానోళ్ల మామ సేకరు.

‘‘బాగున్నావా అన్నా? వదిన, పిల్లొల్లు బాగు న్నారా?’’ అని పలకరించింది లచ్చిమి వాళ్లన్న సేకరుకు నీళ్లిస్తూ.
‘‘బాగున్నారమ్మా! మీరు బాగున్నారా?’’ కాల్లు మొగం కడుక్కుంటా అడిగాడు సేకరు.
‘‘బాగున్నాము’’ అని సెప్పింది లచ్చిమి.
‘‘బావ యాటికి పాయ?’’ అడిగాడు సేకరు మంచం మీద కూచ్చోని.
‘‘సేనికి పొయ్యినాడు. ఇయాళకి వస్తుంటా డు…’’ అని సెప్పింది లచ్చిమి పొయ్యి దగ్గర కూచ్చోని నూకల్లో రాళ్లు ఏరుతూ.

లోకంలో జరిగే దాన్ల గురించి అన్నా సెల్లెళ్లు మాట్లాడు కుంటుంటే… ‘‘బావున్నావా బావా?’’ అని పలకరించాడు రంగడు ఇంటికి వస్తానే. లచ్చిమి కాళ్లు కడుక్కోడా నికి నీళ్లు తీస్కపోయి రంగడి చేతికి చ్చింది. కట్టెల కోస రం కొండకు పోయి న లలిత, ఆమె వయసు పిల్లలంతా కట్టె ల మోపులను ఎత్తుకోని ఇండ్లకి వచ్చిరి అప్పుడే. లలిత ఆ కట్టెల మోపు ఆ పాత మిద్దె యెనకాల యేసి, ఇంటికాటికి వచ్చింది.
‘‘ఏమే పిల్లో బాగున్నావా?’’ పలకరించాడు సేకరు.
‘‘బాగున్నాను మామా! ఇంటి దగ్గర అందరు బాగున్నారా? అత్త బాగుందా?’’ అడిగింది లలిత చీరకొంగుతో మొగం మీంది సెమట తూడ్సుకుంటా.

‘‘మీయత్తకేం గుండ్రాయి లాగుంది!’’
‘‘మా సెల్లెల్ని అంత… బాగా సూసుకుంటున్నావా మొగోడా..!’’ అని ఆటపట్టించాడు రంగడు.
‘‘రేయ్‌ సాయి! అక్క వెంట పోయి కట్టెలు తెగ్గొట్టుకోని రాపో’’ ఇంటికెదురూగ్గా గోళీ లాట ఆడుతున్న కొడుక్కు సెప్పినాడు రంగ డు. గొడ్డలి తీస్కోని బయటకు పాయ లలిత తమ్ముణ్ణి పిలుస్తూ.
‘‘సెప్పు బావ, ఏ పని మీద వచ్చినావ్‌? మహానుభావులు ఊర్కే రారు గదా!’’
‘‘బావా! నీవేమనుకోకపోతే నేనొక మాట సెప్తా, నన్ను అపార్థం సేసుకోకు.’’
‘‘ఆ… నేనేమనుకుంటా… సెప్పు బావ!.’’
‘‘మీ పాపను మావోడికి చేసుకోడం లేదు.’’

‘‘ఏం జరిగింది బావా?’’
‘‘అదేం లేదు! నీకు పంట ఎపుడు పండల్ల!? పెండ్లెపుడు సెయ్యాల!? మూడేళ్ల నుండి పెండ్లి నిలబెడ్తన్నావు. మొన్న గట్టు సేను గుత్తకు తీస్కోని, పంట పండించి పెళ్లి సేస్తానంటివి. అదేమో సేనంతా నీళ్లు లేక ఎండిపాయ, నీకే అప్పులాయ. ఇపుడు పెండ్లి యెట్ల సేస్తావు!? నీవు బాధ పడుకుంటా మమ్మల్ని బాధపెట్టడం యాల! అందుకే మావోడ్కి వేరే పాపని సూసినా సల్లగా సావు కబురు సెప్పినట్టు సెప్పినాడు సేకరు.
‘‘మంగమ్మత్త యాపసెట్టు కింద ఉన్నట్టుంది, పోయి పలకరించి వస్తా. ఊరి నుంచి వచ్చి, పలకరియ్యనిగాని పలకరియ్యలేదు నా బట్టా!’’ అని తిట్టినా తిడ్తాది అని లేచి, బయటకుపోతున్న సేకర్ని పాణంలేని బొమ్మల్లాగా చూస్తూ ఉండిపోయిరి.
తనలో తాను కుమిలిపోతూ పొయ్యి దగ్గరే కూలబడింది లచ్చిమి. ఎదారుచేస్తా, మంచం మీద పనుకున్నాడు రంగడు.

అది జరిగిన రెన్నెళ్ల తర్వాత…
‘‘లచ్చిమీ! సేనికి పోతన్నా, పిల్లలు జాగర్త’’ అని రాత్రి పదిగంటలకి సేనికి పయనమాయ రంగడు రోజులాగే.
సరే మామా! పొద్దున్నే పిల్లల్ని బడికి పంపిం చి, సద్ది కట్టుకోని వస్తా’’ సెప్పి, సాగనంపింది కాని అదే చివరి సూపని తెలదు లచ్చిమికి.
సేన్లల్లో ఒంటరిగా నడుసుకుంటా, ఎదారు చేస్కుంటా పోతున్నాడు రంగడు. సల్లసల్లగా గాలాడుతోంది. నిన్న లచ్చిమి అనిన మాటలు గుర్తుకొచ్చినాయ్‌.
‘‘మామా! మేపు అయిపొయ్యింది. యాదో వానలన్న పడితే గడ్డి మొలుస్తాది. వానలు గూడా సరిగ్గా పడలేదు. ఇపుడు పసులకు మేపు ఎట్లా? అందుకే మేపు కొనుక్కొస్తే బాగుంటాది’’ సెప్పింది లచ్చిమి ఎండిపోయిన సేన్ని చూసి బాధపడ్తూ.

‘‘సుబ్బరాయుడికి మన పసులను అమ్ముదా మనుకున్నాను. ఆడన్నా గడ్డి తిని బతుకుతా యవి పసులను నా పిల్లల్లాగా సూసుకున్నా. దాన్ల అమ్మగాకు మామా! యాడన్నా గడ్డివాము కొను…’’
‘‘చేతిలో రూపాయిల్లేవు. వామెట్ల కొనుక్కు నేది? పసులను అమ్మాల్సిందే! ఐనా నీకు యాల పనికి మాలిన పెత్తనాలు! మనసులోని బాధ భార్య మీద కోపంగా మారిపాయ ఆ టైంలో. కాలికి ముళ్లు కుచ్చుకున్నాయి. ఆలో చన్లు మాయమైపాయ. ముళ్లు తీసుకుని, సేన్లోకి అడుగుపెట్టేసరికి కండ్లల్లో నీళ్లు తిరిగినాయ్‌. సేన్లో యాడ సూసినా పచ్చగా కళకళలాడ్తా కనిపించాల్సిన పైరు ఎండిపోయి కనపడత్తాం ది. తొలకరిని చూసి, విత్తనాలు వేస్తే, మొల కెత్తినాయి కాని వానలు పడక అంతా ఎండిపాయ. బోరు దగ్గరకి పాయ. బోరుకి గంగపూజ సేసి, పూసిన పసుపు కుంకాలు ఇంగా మాసిపోలేదు.

వానలు పడితే ఈ బాధలు తప్పేవి. ఈ బోర్ల ను, కరెంటును నమ్ముకోవాల్సిన పనిలేదు. కాని దేవుడు కరుణించలేదు. ఈ బోరులో ఎన్ని నీళ్లుంటే ఏం పయోజనం? మోటరా డడాన్కి కరెంటు లేకపోతే! ఊర్లో కరెంటు ఎప్పుడొస్తాదో, ఎప్పుడు పోతాదో తెల్సి సావ దు. రాత్రిల్లు మేలుకొని నీళ్లు కట్టుకోవల్ల. అది రాతిరి ఒంటిగంటకొచ్చి, మోటరు అర్ధ గంటగాని ఆడక ముందే పోతాది. శానాసార్లు మోటర్లు కాలిపాయ. మొన్న మోటరు కాలి పోయి తిప్పలు పడితి. నిన్న అప్పు తెచ్చి మో టరు రిపేరు సేపిస్తి. ఆ మెకానికు వెంకటేసు గానికి ఇంగ ఐదొందలు ఇయ్యాల. పొద్దున నడిరోడ్లో పరువు తీసినాడు ఆ ఐదొందలు గురించి! తనలో తాను గొణుక్కుంటూ, స్విచ్చు బోర్డు దగ్గరకి పోయి కూర్చున్నాడు రంగడు.
కరెంటు తీగల మీద ఆత్మహత్య సేసుకున్న రైతు శవంలా వేలాడుతూ, కనిపిస్తోంది ఒక కరెంటు బల్బు. దాంట్లో వెలుగు కోసం ఎదు రుచూస్తున్నాడు. బల్బుకల్లా సూసుకుంటుం టే, లలిత కండ్ల ముందు కదలాడింది.

మూడేళ్లయింది లలితకు మంచిమాట సేసు కుని! కాని పెండ్లి సెయ్యలేకపాయ. పంట బాగా పండితే సేద్దామనుకుంటే, పంట పండి తే, రేట్లు గిట్టుబాటు కాక కూటికి, గుడ్డకు మిగిల్చింది పోయినేడు. అటు పోయినేడు వానలు పడక పంట చేతికి రాకపాయ. ఈ యేడన్న బాగుపడ్దామంటే ఏదో ఒకటి అడ్డం తగుల్తోంది. సేను గుత్త డబ్బులు, మందు లంగడిలో బాకీ, బుడ్డల వెంకట్రాముడికి ఇయ్యాల్సిన విత్తనాల డబ్బులు యాట్నించి తెచ్చియ్యాలో! పాపకు పెండ్లి ఎట్ల సెయ్యాలో!
‘‘ఒలే రంగడూ! కరెంటు వచ్చిందిలే’’ అని దగ్గరలోనున్న శెనక్కాయి తోటలో నుంచి శివుడేసిన కేక వినిపించింది. బల్బులోని ఆ వెలుగు చూసి పట్టలేని సంతోషంతో లేచి, పంచను ఎగదోసి చేతిలోకి పార తీసుకొని, మోటరు ఆన్‌ చేస్తే ఢాం అన్న శబ్దం వినిపిం చింది. అది పేలిపోయిన ఆ మోటరు శబ్దం. ఆ దెబ్బకి పక్కనున్న కరెంటు తీగల మీద ప డ్డాడు రంగడు. శాశ్వతంగా ఈ సేన్ని ఇడ్సిపా య రంగడు. పక్క తోటలో శివునోళ్ల మోటరు సెడిపాయ. వెలుగే చీకటిలో కలిపేసిపాయ.

అక్కడ గుంత తవ్వడం ఐపాయ. రంగడు ఈ ముసలోని కొడుకేనంట. తన కన్న ముం దు కొడుకు సచ్చిపాయని ఆ ముసలోడు యే డ్సుకుంటా యెళ్లిపాయ. మొన్న నాయిన నన్ను నిద్రపిస్తా.., ‘‘నీవు బాగా సదువుకోవల్ల నాయిన… రైతుల్ని ఓసారి వానలు, కరువులు మోసం చేసి ముంచితే, ఇంగోసారి మనుషులే ముంచుతారు. పంటను పండించాలంటే పిల్లల్ని పెంచే తల్లి కంటే ఎక్కువ కష్టాలు పడల్ల. నీవు బాగా సదువుకోని ఉద్యోగం సంపాదించుకోవల్ల గాని మాలాగా పెయికి బురద అంటించుకోగూదు. నలుగురికి అన్నం పెట్టే రైతుకు ఈ బూపెపంచం మీద నాలుగు మెతుకులు కరువు నాయిన..!’’ అని సెప్పినాడు.
అది నిజమేనేమో…

ఉన్నట్టుండీ నాయిన కళ్ళముందు కనపడి నాడు. నాయిన రాత్రి సేనికి నీళ్లు కట్టడాన్కని పొయ్యినాడు. నాయినకేమైన అయిందేమో నని భయమేసింది. నా సేతిలోనున్న కట్టపుల్లను ఇరిసిపారేసి, సేనువైపు పరిగెత్తినా.
సేన్లో నాతో కలిసి ఆడుకునే నా ప్రెండ్సు పాణాలు పోయి చాలారోజలైనట్లుంది. వాళ్ల మధ్య భుజమ్మీద నీళ్ల బిందెతో సేను మొత్తం తిరుక్కుంటా, నీళ్లు పోసి వాళ్లకి పాణం పోయాలని సూస్తన్నారు పార్వతీ పరమేశ్వరుల్లా అమ్మానాయినలు.

– బత్తిని తిమ్మగురుడు,
ఏ.పి.ట్రిపుల్‌ ఐటీ, ఇడుపులపాయ,
వై.యస్‌.ఆర్‌ జిల్లా, సెల్‌: 8978522041

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top