You Are Here: Home » చిన్నారి » వెన్నెట్లో తడిసిన పాట

వెన్నెట్లో తడిసిన పాట

‘‘మహ చక్కహా కుదిరిందే అమ్మలూ సందర్భం!’’
పాత సినిమా పాటలతో దూరదర్శన్ రాత్రిని ఓలలాడిస్తోంది. ఆ పాట వినేశాక అత్యవసరమైన సంగతి చెప్పదలిచినట్టు చటుక్కున టీవీకి గళ దిగ్బంధనం చేసి అన్నారు, నాన్నగారామాట.
పదిన్నరయి ఉంటుంది. బయటంతా చల్లగా, నిశ్శబ్దంగా; గదిలో వెచ్చగా. అలాంటి వేళలో నాన్నకీ, నాకూ పాటలు వినడం మహా ఇష్టం.

టీవీకి ఎదురుగా గోడకి చేర్చి ఉన్న మంచం మీదే బాసిం పట్టు వేసుకుని , తొడమీద తాళం వేస్తూ వింటున్నారు నాన్న. తల దిక్కున వేసుకున్న మడత మంచం మీద అమ్మ. చెంగు కప్పుకుని ఒత్తిగిలి పడుకుని ఉంది.
నాకూ ఇష్టమైన పాటే- ‘జాబిలి కూనా….’ సుశీలగారు పాడారు. బాలింత పాత్రలో జమున చంటిపిల్లని ఉయ్యాల్లో వేసి పాడే పాట.

ఆ రెండు మంచాల నడుమ, గది మధ్య చాపేసి, బారజాపిన కాళ్ల మీద మా చంటాడిని బోర్లా పడుకోబెట్టి, సుతారంగా ఊపుతున్నాను, నాన్నగారి మంచం కోడుకు జారపడి. చంటాడు నిద్దట్లోకి జారాడు. కాని వెంటనే మంచంమీదకో, ఉయ్యాలలోకో చేరిస్తే మాత్రం కేరుమంటాడు. గాఢనిద్రలోకి వెళ్లాకే ఏదైనా. అందుకే కాళ్లూపుతూ పాటలు వింటున్నాను. పాత పాట వింటే, గంధపు చెక్కల దండ దాచిన బీరువా తలుపు తెరిచినట్టు ఓ గుబాళింపు.
‘ఉండమ్మా బొట్టుపెడతా!’ సినిమాలో పాట. ఆ ఉయ్యాల, మధ్య తరగతి ఇల్లు, చంటాళ్ల గొడుగు, పాలసీసా- ఈ గదిలో దృశ్యానికి అద్దం పడుతోంది.

‘‘నరసు తాతయ్య గుర్తున్నార్టే!’’ అడిగారు నాన్న.
‘‘ లేకేం… కానీ లీలగా’’ అన్నాను నేను.
‘‘క్రితంసారి వచ్చినపుడు ఆయన ఆత్మకథ పుస్తకం పట్టుకెళ్లావు! చదివావా, లేదా?’’
‘‘అయ్యో! చెప్పేలేదు కదా! చదివాను నాన్నా. చదివాక ఉత్తరం కూడా రాద్దామనుకున్నా. బద్ధకించాను. బద్ధకం కూడా కాదులెండి. ఏం రాయాలో తోచక! ఎలాగూ పురిటికి వచ్చి ఉంటాను కదా, అప్పుడే తాపీగా మాట్లాడదాం అనుకున్నాను. ఏదీ? వీడితోనే సరిపోతోంది’’ అన్నాను ఒకింత అపరాధభావంతో.

‘‘సరే సరే, చదివాక ఏమనిపించింది? అది చెప్పు!’’ అన్నారు నాన్న మంచం మీద నుంచే వొంగి ముఖంలో ముఖం పెట్టి… ‘చదివాను’ అని చెప్పినందుకే మురిసిపోతూ.
‘‘నిజంగా చెప్పనా! అంతటి మహనీయుడి మనవరాలినంటే గర్వమనిపించింది. కానీ మనవరాలిగా కాక, ఆయన సమవయస్కురాలిగా పుట్టి ఉంటే ఎంత అదృష్టమో కదా అనుకున్నా’’ అన్నాను.
పిల్లవాడు నిద్రపోతున్న సంగతి కూడా మరిచిపోయి గట్టిగా నవ్వేశారు నాన్న. ఆపై నవ్వాపి కళ్లజోడు తీశారు. చెమర్చి ఉన్నాయి కళ్లు. తన లుంగీ కొసతోనే ఒత్తుకున్నారు.

‘‘నిజమేనే అమ్మలూ! కానీ అంతకు మించిన అదృష్టం మనింట్లో నీకొక్కదానికే దక్కిందే!’’ చివరి అక్షరాన్ని అదో విధంగా సాగదీస్తూ, నా భుజం పట్టుకుని మురిపెంగా ఊపారు, కొద్దిగా ఒంగి.
ఇంక మనసాగలేదు నాకు. పిల్లాణ్ణి నెమ్మదిగా అమ్మమ్మ పక్కలో పడుకోబెట్టి చిన్నపిల్లలా నాన్న పక్కకు చేరి అడిగాను.
‘‘అంత అదృష్టం ఏమిటో కాస్త చెబుదురూ, ఉట్టినే ఊరించక!’’
‘ఈ నాంది దానికే కదా!’ అన్నట్టు తలాడించి, అంతలోనే ‘ఒక్క నిముషం’ అన్నట్టు చేత్తో సైగించి గూట్లో ఉన్న సిగరెట్టూ, అగ్గిపెట్టె అందుకుని బయటకు నడిచారు.

నరసు తాతయ్యగార్ని ఎప్పుడు తలుచుకున్నా నాన్న ఏదో లోకంలోకి వెళ్లిపోతారు. ఉట్టినే కళ్లు చెమరుస్తూ ఉంటాయి. ‘పిల్లనిచ్చిన మామగా ఆయన ఎదురుబడితే బెరుగ్గా ఉంటాడు గానీ మన రమణమూర్తి, మామగారిలోని సత్యభామని మాత్రం తెగ లవ్ చేస్తాడ్రోయ్!’ అని ఆట పట్టించేవారు బాగా తెలుసున్నవాళ్లు. అప్పుడు అర్థమయ్యేది కాదు.
కానీ‘నటస్థానం’ – తాతయ్యగారి ఆత్మకథ- చదివాకే ఆ అద్భుత కావ్య నాయిక నా కళ్లముందుకొచ్చి నిలిచింది.

సత్యభామ రూపం తలుచుకుంటే వెన్నెట్లో తుళ్లుతున్న యమునా తరంగం కళ్ల ముందు కదులుతుంది నాకు. అందంతో అహంకరించే ఆమె రూపాన్ని స్మరించుకుంటే చెల్లాచెదురైపోతున్న నక్షత్రగుచ్ఛాలు కనిపిస్తాయేమో కవిపుంగవులకీ, కళాకారులకీ. ఆమె మేనునీ మేనువిరుపులనీ వయ్యారానికి శాశ్వత విలాసం చేసేశారు.
కానీ ఇవన్నీ స్త్రీ కాకుండా, ఓ పురుషుడు అభినయించడమే తెలుగు నాటకచరిత్ర మొత్తంలో రసవత్తర దృశ్యం.

ఆ పురుషుడే మా నరసు తాతయ్య.
తనకి ఇద్దరు తల్లులని రాసుకున్నారాయన. తాతమ్మ పురుష జన్మనిచ్చింది. ఇంకో తల్లి రంగస్థలం, ఆడజన్మనిచ్చింది. సత్యభామ పాత్రకీ, తాతయ్యకీ జన్మజన్మల బంధం ఉందేమోననిపించింది ‘నటస్థానం’ చదివాక.
ఆ పాట ఆయన నాలుక మీద అలవోకగా నర్తించడం ఆ జన్మబంధం కొనసాగింపేనేమో కూడా!
నాన్నగారి మంచం మీద దుప్పటీ, దిళ్లూ సరి చేస్తూంటే, నా గొంతులో తెలియకుండానే హమ్మింగ్- ఆ పాటే. ‘నటస్థానం’లో వర్ణించిన ఆ పాట పుట్టుక కూడా కళ్లలో కదలాడుతోంది.

పందొమ్మిదివందల ఇరవై అయిదు నాటి మాట…. కడప దగ్గర ప్రొద్దుటూరులో నాటకాలు వేయడానికి బయలు దేరింది తాతయ్య వాళ్ల తెనాలి రామవిలాస సభ. ఎర్రగుంట్లలో రైలు దింపుకుని, ఆరు రెండెడ్ల బళ్లలో తీసుకువెళుతున్నారు ఆ ఉత్సవాల నిర్వాహకులు. సంధ్య కెంజాయి తప్పుకుంటూ, క్రమంగా పిండారబోసినట్టుండే వెన్నెల విరిసింది. మార్గమధ్యంలోనే పెన్న.

సామగ్రి బళ్లలో వదిలేసి నటులంతా కాలినడకన నది దాటుతున్నారు. మోకాటి లోతే ఉంది. కొందరు అవతలి ఒడ్డుకు చేరిపోయారు. నది నడుమ విశాలమైన ఇసుకమేట. నరసు తాతయ్య, రుక్మిణి వేషం వేసే కొండపాక గోవిందరావు, హార్మోనిస్టు భీమవరపు నరసింహారావు ఆ దిబ్బ మీదే కూలబడ్డారు. నీటిలో పడుతున్న ఎడ్ల అడుగులలోను, వాటి మెడల్లో గంటల సడిలోనూ ఏదో లయ- హాయిగా. గూడు బళ్ల వెన్నెలనీడలు నెమ్మదిగా కదులుతున్నాయి నదికి అడ్డంగా.

అప్పుడే ఓ బండి ఇసుకలో కూరుకుపోయింది. అంతా కలిసి నెడుతున్నారు. అది కదలడం లేదు. బాల్యసఖుడు కూడా అయిన గోవిందరావుతో ‘నువ్వూ ఓ చెయ్యి వెయ్యిరా!’ అన్నారట నరసు తాతయ్య. గోవిందరావు కదిలితేనా! బండిని నెడుతూ పాట్లు పడుతున్న పిల్లలమర్రి సుందరరామయ్య, ‘వాడు నీమాట వింటాడ్రా?’ అన్నారట సరదాగానే.

దీంతో నరసు తాతయ్య కోపం నటిస్తూ ‘మీరజాలగలడా నా యానతి!’ అన్నారట, దీర్ఘం తీస్తూ.
పెన్న అల మీది వెన్నెల జాడలా ఆ లిప్తలోనే తళుక్కుమంది. ఎంతో కాలం నుంచి బుర్రలో మారుమోగుతున్న బాణీకి సరిపోయే మాటలు ఇవేననిపించిందట. పంక్తి వెంట పంక్తి – పెన్న చిరు కెరటాల్లా. మరునాటి సాయంత్రానికల్లా పూర్తి చేసేసి ఆ రాత్రే స్టేజీ మీద పాడారట.
‘‘మీరజాలగలడా నా యానతి, వ్రతవిధాన మహిమన్ సత్యాపతి…..’ కూనిరాగం ఎప్పుడు పాటగా మారిపోయిందో!? పైకే పాడుతున్నాను.

అప్పుడే నాన్న తరువాతి పదం అందుకుని చేతులూ, ఒళ్లూ తిప్పుకుంటూ వచ్చారు. ఒంటి మీద చేతుల బనీను, ఎగ్గట్టిన తెల్ల లుంగీ……… ‘‘వాదులాడగలడా! సత్యాపతి!…’’
నాకు నవ్వాగలేదు. ‘‘నాన్నా! మీరు కూడా వేసి ఉండాల్సింది! కనీసం రెండో సత్యభామో….. లేకపోతే ….మూడో…’’ అంటున్నాను.
దాంతో చటుక్కున లేచి కూర్చుని అమ్మ, ‘‘చాల్లే! మీ తాతయ్య పక్కన ఈ యన చెలికత్తె వేషానిక్కూడా పనికిరారు’’ నవ్వాపుకుంటూ చెప్పింది.

‘‘మీ అమ్మ చెణుకులకేం గానీ,
రెండుసార్లు గజారోహణం చేయించుకున్న మహర్జాతకుడే మీ తాతయ్య. కళాకారులలో మొదట పద్మశ్రీ అందుకున్నది మీ తాతగారే. బాబూ రాజేంద్రప్రసాద్ చేతుల నుంచి అందుకుంటున్న ఫొటో పుస్తకంలో ఉందిగా.’’ అన్నారు నాన్న, గుర్తు చేస్తూ.
‘‘నెహ్రూతో ఫొటో ఉంది కదా! దాని గురించి లేదేం?’’

‘‘రసభంగం కాకుండా చూడ్డంలో దిట్ట తాతయ్య. ఆ సంగతి వదిలి పెట్టడం అలాంటిదే. నాకు వాళ్ల ట్రూపులో ఒకాయన చెప్పాడులే. సంగీత నాటక అకాడమియే కాబోలు. ఢిల్లీలో అన్ని భాషల నాటకాలూ వేయించిందట. అప్పుడు ఉపరాష్ట్రపతి, సర్వేపల్లి రాధాకృష్ణ. మీ తాతయ్యకి పెద్ద ఫ్యాన్. ఆర్గనైజర్లకి చెప్పి, మీ తాతయ్య గారి శ్రీకృష్ణతులాభారం వేయించారాయన. ఎలా జరిగిందో ఏమో!
తాతయ్య గురించి చెప్పి, నెహ్రూని నాటకం చూడ్డానికి రమ్మని ఆహ్వానించారట సర్వేపల్లి. అంతా విని, మగాడు, స్త్రీ పాత్రలో!?ట్రాష్! అన్నాట్ట నెహ్రూ. ఆ రోజున కల్యాణం రఘురామయ్య కృష్ణుడు, తాతయ్య సత్యభామ; అదరగొట్టేశారట. తర్వాత వారం పాటు ఢిల్లీ సాంస్కృతిక సంఘాలు పిలిచి మరీ నాటకాలు వేయించాయి. పేపర్లు పోటీ పడి రాసేశాయట. అప్పుడు కబురొచ్చింది.’’ అంటూ ఆపారు నాన్న.

‘‘ఎక్కణ్ణుంచి?’’ అని అడిగాను.
‘‘సాక్షాత్తు నెహ్రూ నుంచే!’’ అన్నారు, నాన్న గాల్లోకి విసురుగా చేయి ఊపుతూ.
‘‘అబ్బా’’ అన్నాను ఆశ్చర్యంగా.
‘‘ఏమనుకున్నావే మరి?! తాతయ్య గౌరవార్థం టీపార్టీ- రాధాకృష్ణన్ ఇంట్లోనే. నెహ్రూగారు కూడా దిగాడు. తాతయ్యని మెచ్చుకుని, ఓ కోరిక కోరాడట. ‘మీరు ఆ మరాఠీ బాణీలో పాడారట పాట, ఏమిటది! మీ..ల..గర..జాలడా …. అంటూ పొందిక లేని తెలుగుతో. ‘ఆ పాటే ఒక్కసారి పాడగలరా?’ అని అడిగాడట నెహ్రూ.

‘‘దాంతో…. మీ తాతయ్య చేతులు జోడించి, పండిట్‌జీ! అది నేను వేదిక మీదే, అదీ వేషంలోనే పాడతాను. క్షమించాలి!’’ అని నిర్మొహమాటంగా చెప్పారట. విస్తుపోయారటంతా. నెహ్రూ తక్కువ్వాడా! గొప్ప కళాహృదయుడు కదా! జోడించిన తాతయ్య చేతులు పట్టుకుని, ‘కళాకారుల మనోభావాలను అర్థం చేసుకోగలను మిస్టర్ నరసింగరావ్’ అన్నాట్ట.’’
‘‘ఇంతకీ నా ఒక్కర్తికే పట్టిన అదృష్టం ఏమిటి?’’ అన్నాన్నేను.

‘‘ చిన్న ముచ్చటే, ఎప్పటి నుంచో చెబుదామని….. ఇప్పుడు, ఇలా….. నీకు ఐదో నెలో, ఆరో నెలో! నేను తాతయ్య వాళ్లింటికి వచ్చాను. అప్పటికి ఆయన వేషాలు మానేశారు. అరవై దాటాయిలే. రోజూ సాయంకాలం ఆయన శివాలయానికి వెళ్లి వచ్చేవారు. ఓ రోజు మీ అమ్మమ్మ పక్కింటికి కాబోలు వె ళ్లారు. చక్కగా వెన్నెల. నేను డాబామీద కూర్చుని ట్రాన్సిస్టర్‌లో బినాకా గీత్ మాల వింటున్నా. సావిట్లో ఉయ్యాలలో నిన్ను నిద్రపుచ్చి మీ అమ్మ వచ్చి నాతో కబుర్లు మొదలెట్టింది. అరగంట గడిచి ఉంటుంది. పాటేదో ఎనౌన్స్ చేశాక కొద్ది వ్యవధి ఉంటుందా!? ఆ లిప్తలో వినిపించిందే, గొంతు.

ఠక్కున రేడియో కట్టేశా. ఆ గొంతే….. దిగ్గున లేచి కిందికి నడిచాను. వెనక మీ అమ్మ. చివరి మెట్ల దాకా వచ్చి అలా నిలబడిపోయాం. అవతల మీ అమ్మమ్మ- వీధి గుమ్మంలో, స్థాణువే అయి. కొబ్బరాకుల మధ్య నుంచి వెన్నెల సావిడి ముందు ఆ వరండాలో పడుతోంది. అక్కడే అటూ ఇటూ తిరుగుతున్నారు తాతయ్య. ఆయన చేతుల్లో నువ్వు. తెల్లటి పంచె, చొక్కా, ఆకుపచ్చ శాలువా, నుదుట విభూతిరేఖలు, భృకుట మధ్య కుంకం, నెరిసిన జుట్టు మీద వెన్నెల పడి మెరవడం – ఇప్పటికీ గుర్తుందే!

ఎప్పుడూ మల్లెపువ్వులా ఉండేవారు. ఎంత శుభ్రమో! వేషం మానేశాక మళ్లీ పాటలూ పద్యాల జోలికి వెళ్లని మీ తాతయ్య, నెహ్రూ అడిగినా నడిరోడ్డు మీద పాడనూ అని చెప్పిన మీ తాతయ్య, లక్షల మంది చెవి కోసుకునే పాట- ఆ పాటే అందుకున్నారు.

నువ్వు నిద్ర లేచి ఏడుపు లంఘించుకున్నావట. సరిగ్గా ఆయనా ఇంటికొచ్చార్ట. ఉయ్యాల్లోంచి తీసి ముద్దులు పెట్టుకుంటూ చేతుల్లో అడ్డంగా పడుకోబెట్టుకుని, గుండెకు హత్తుకుని చేతులు సుతారంగా ఊపుతూ పాడుతున్నారే! వేల మంది ప్రేక్షకుల ముందు ఎంత శ్రద్ధగా పాడతారో అంత శ్రద్ధగానూ, హావభావాలతోనూ.-‘ మీర జాలగలడా నా యానతి సత్యాపతి — వ్రత విధాన మహిమన్ సత్యాపతి………..’’

‘‘తర్వాత?’’ అన్నాను సంతోషంగా. నా నెత్తి మీద చిన్నగా మొడుతూ అన్నారు నాన్న.
‘‘పాట వెన్నెట్లో తడిసిపోతూ ఉంటే ఎవరికి నోరు పెగులుతుందే!’’

డా॥గోపరాజు నారాయణరావు

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top