విద్య
ఒక ఊరిలో పూర్ణదత్తుడు అనే యువకుడు ఉండేవాడు. అతడికి చిన్నతనంలో చదువు అబ్బలేదు. తల్లిదండ్రులు అతడిని బడికి పంపించాలని ఎంత ప్రయత్నించినా పూర్ణదత్తుడు బడికి వెళ్ళేవాడు కాదు. దానితో అతనికి వయసు పెరిగిందే కానీ, వయసుకు తగ్గట్టుగా సరైన విద్య రాలేదు.
పూర్ణదత్తుడిని అందరూ అజ్ఞానిగా, నిరక్షరాస్యుడిగా లెక్కగట్టేవారు. యుక్తవయసు వచ్చాక అతడికి పొరపాటు తెలిసి వచ్చింది. తోటివారు బుద్ధిగా చదువుకుని మంచి స్థాయిలో ఉండటం చూసి సిగ్గుపడి ‘ఎలాగైనా సరే, వాళ్లందరికంటే ఎక్కువ జ్ఞానం సంపాదించాలి’ అని నిర్ణయించుకున్నాడు.
ఒక గురుకులానికి వెళ్లి, ఒక గురువును కలిసి, ‘నాకు త్వరగా విద్య వచ్చేలా చూడండి’ అని ఆయనను ప్రాధేయపడ్డాడు.
పూర్ణదత్తుడి మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న గురువు ‘రేపు వస్తే విద్యాబోధన ప్రారంభిస్తాను’ అని చెప్పాడు.
ఆ మరుసటిరోజు పూర్ణదత్తుడు వచ్చేసరికి గురువు తన ఆశ్రమం పక్కనే ఉన్న నది ఒడ్డున కూర్చుని నదిలోకి ఇసుకరేణువులను విసురుతున్నాడు. పూర్ణదత్తుడిని చూడగానే, ‘‘రా నాయనా! నువ్వూ విసురు. ఈ నది మీద ఇసుకతో వంతెన కడదామనుకుంటున్నాను’’ అన్నాడు.
‘‘మీ మాటలు విచిత్రంగా ఉన్నాయి గురుదేవా! ఇలా ఒక్కో రేణువు వేస్తే వంతెన తయారౌతుందా?’’ అని ఆశ్చర్యంగా అడిగాడు పూర్ణదత్తుడు.
‘‘ఎందుకు కాదు? నువ్వు జ్ఞానమంతా ఒకేసారి వస్తుందని ఆశిస్తున్నప్పుడు నేను రేణువులతో వంతెన ఏర్పడుతుందని ఆశించడం తప్పా?’’ అన్నాడు గురువు.
పూర్ణదత్తుడికి తన పొరపాటు అర్థమైంది. తరువాత బుద్ధిగా గురువు దగ్గర విద్యాభ్యాసం మొదలుపెట్టాడు.
నీతి: విద్య ఒక్కరోజులో వచ్చేది కాదు. కొన్ని సంవత్సరాలు అభ్యసించాక జ్ఞానం కలుగుతుంది.