You Are Here: Home » ఇతర » విగ్రహాలయం

విగ్రహాలయం

కళ్లముందు నిలువెత్తు మహనీయులుమహానుభావుల రూపాలు విగ్రహాల్లో పదిలం ఆ చేతివాటం నిజరూపానికి దర్పణం నత్తరామేశ్వరంలో రూపుదిద్దుకుంటున్న మహామహుల విగ్రహాలు

ఎంతోమంది పుడతారు… పోతుంటారు…. కొంతమంది పోయినా ప్రజల్లో నిలిచిపోతారు… చిరస్థాయిగా గుర్తిండిపోతారు. సమాజానికి వారు చేసిన సేవలు, త్యాగాలు, చూపిన మార్గనిర్దేశాలతో మనస్సుల్లో సుస్థిరస్థానాన్ని పొందుతారు. చరిత్రలో నిలిచిపోయిన మహనీయులు, యోధులు, మేధావులు, సంఘసంస్కర్తలు, స్వాతంత్య్రవీరుల జ్ఞాపకాలను హృదయాల్లో పదిలంగా ఉంచుకుని భావితరాలకు వారి విశిష్టతను, ఔన్నత్యాన్ని తెలిపేందుకు రహదారుల్లోనూ, ప్రధాన కూడళ్లవద్ద, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలలో విగ్రహాలను ఏర్పాటుచేస్తుంటారు.

ఆ మహానీయులు రూపాలను చూసి సగర్వంగా జీవిస్తూ, వాటి నుంచి స్పూర్తి పొందుతారు. దేశ ప్రతిష్టకు ఆనవాళ్లుగా నిలిచిన మహామహులు విగ్రహాలను తయారుచేయడంలో నిష్ణాతులు డాక్టర్‌ పి.అరుణ్‌ప్రసాద్‌ ఉడయార్‌లు. పశ్చిమగోదావరి జిల్లాలోని నత్తారామేశ్వరంలోని ఏకే ఆర్ట్‌‌స సంస్థ పేరుతో గత వంద సంవత్సరాలుగా లెక్కలేనన్ని విగ్రహాలను తయారుచేస్తున్నారు. అరుణప్రసాద్‌ తాతయ్య అరుణాచలం ఉడయార్‌లు స్థాపించిన ఈ ఏకే ఆర్ట్‌‌స వందేళ్లుగా నిర్విరామంగా శిల్పాలు రూపుదిద్దుతూ సేవలు అందిస్తున్నారు.

1995 సంవత్సరంలో జెఎన్‌టియూ నుంచి ఫిల్టర్‌ టెక్నాలజీలో పట్టాపొందిన అరుణ్‌ప్రసాద్‌ ఉడయార్‌లు మనరాష్ట్రంలోనే కాకుండా దేశ,విదేశాల్లోనూ ఎన్నో విగ్రహాలు అందించారు. అత్యంత ప్రాచీనమైన వృత్తి అయిన శిల్పాలను పోతపోసి చక్కని ఆకృతితో రూపుదిద్దాలంటే ప్రశాంత వాతావరణంలోనే సాధ్యమని చెబుతున్నారు అరుణ్‌ప్రసాద్‌ ఉడయార్‌లు. తన వద్ద 70 కార్మికులు కఠోరదీక్షతో పనిచేస్తే 20 రోజుల్లో తొమ్మిది అడుగుల విగ్రహాన్ని పూర్తిచేయగలుగుతామని చెబుతున్నారు.

14sakala6కేవలం ధనార్జన కోసం కాకుండా ఆత్మతృప్తి కోసం, తమ చేతి నుంచి రూపుదిద్దుకున్న విగ్రహాలు చరిత్రలో నిలిపోతాయన్న ఉద్దేశ్యంతోనే విగ్రహాలు తయారుచేస్తున్నట్లు ఆయన పేర్కొంటున్నారు. రాష్ట్ర శిల్ప సమైక్యకు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న అరుణ్‌ప్రసాద్‌ ఉడయార్‌లు న్యూజెర్సీ వెస్ట్‌బ్రూక్‌ నుంచి డాక్టరేట్‌ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం భీమవరం, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, హైదరాబాద్‌లలో బ్రాంచీలు నిర్వహిస్తూ కావల్సిన విగ్రహాలను సరఫరా చేస్తున్నారు.

విగ్రహాలు తయారు చేసే విధానం….
తయారుచేయవలసిన విగ్రహ నమూనాను కావాల్సిన సైజుకు సరిపడవిధంగా బొమ్మగా చిత్రిస్తారు. దాని ప్రకారం‘ క్లే’ (విదేశాలలో లభించే మట్టి) ద్వారా ఆ ఏత్తు, వెడల్పుతో మట్టి విగ్రహాన్ని తయారుచేస్తారు. అన్ని హంగులు, విగ్రహభాగాలు, కవళికలు సరిగ్గా వచ్చాయని చూసాకా ఆ ‘క్లే’ నమూనాతో మోల్డింగ్‌కు సరిపడ ‘డై’(అచ్చు)ని చేసుకుంటారు. కాపర్‌ 70 శాతం, జింక్‌, లిడ్‌, టిన్‌ 30శాతం కలిపి కరగడంతో తయారైన కంచును 1200 డిగ్రీల సెల్సియస్‌లో బట్టిలో సుమారు మూడు గంటల పాటు కరిగించగా ద్రవరూపంలో మారిన కంచును డైలో పోస్తారు. డైలో విగ్రహనమూనాలో పోతపోయబడిన విగ్రహాస్వరూపాన్ని కొన్ని రోజులపాటు పాలిష్‌ చేస్తారు. విగ్రహ స్వరూపాన్ని, స్పష్టత, భావం కనిపించేందుకు ఈ పాలిష్‌దే ప్రముఖ పాత్ర. తద్వారా విగ్రహం కళ్లముందు సాక్షాత్కారమవుతుంది. యజ్ఞంలా తయారుచేసే విగ్రహం శ్రమతో పాటు ఆలోచన సమాహార ఫలితంగా రూపుదిద్దుకుం టుంది.

తయారుచేసిన విగ్రహాలు….
nukarapuనత్తారామేశ్వరంలోని అరుణ్‌ప్రసాద్‌ ఉడయార్‌లు ఇప్పటి వరకు ఎక్కువగా దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలు వేలల్లో తయారుచేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికీ వైఎస్సార్‌ విగ్రహాలు ఆర్డర్లు వస్తూనే ఉంటున్నాయన్నారు. అదేవిధంగా అంబేద్కర్‌, రాజీవ్‌గాంధీ, మదర్‌ధెరీస్సా, తాండ్రపాపారాయుడు, బ్రహ్మనాయుడు, మహాత్మాగాంధీ, శ్రీకృష్ణదేవరాయులు, అల్లూరి సీతారామరాజు విగ్రహాలతో పాటు దేవుళ్ల విగ్రహాలు కూడా తయారుచేసినట్లు తెలిపారు. స్థానికంగా వంగవీటి మోహన్‌రంగా విగ్రహాలను కూడా ఎక్కువగా తయారుచేయడం జరిగిందన్నారు.

ఇటీవల లండన్‌లో ప్రవాసాంధ్రులు ఏర్పాటుచేసిన వెంకటేశ్వర దేవాలయానికి వెంకటేశ్వరస్వామి, పద్మావతి, అలివేలు మంగతాయారు విగ్రహాలను అందించినట్లు తెలియచేశారు. అదేవిధంగా ప్రస్తుతం వైజాగ్‌ స్టేడియంలో ఉన్న భారతీయ తొలి క్రికెట్‌ కెప్టెన్‌ సి.కె.నాయుడు కంచు విగ్రహాన్ని 2007లో తయారుచేసినట్లు చెప్పారు. ఇటీవల కాలంలో వైఎస్సార్‌ రేడియం విగ్రహాన్ని తయారుచేసి వైఎస్సార్‌ తనయుడు జగన్‌ను అందచేసినట్లు పేర్కొన్నారు. ఇటువంటి రేడియం విగ్రహం ప్రపంచలోనే ఎక్కడా లేదన్నారు.

ప్రస్తుతం చేస్తున్న విగ్రహాలు……
ఇటీవల ట్యాంక్‌బండ్‌లో జరిగిన ఘటనలో ద్వంసమైన విగ్రహాలను తయారుచేసే పనుల్లో నిమగ్నమైనట్లు అరుణ్‌ప్రసాద్‌ ఉడయార్‌లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, సాంసృ్కతిక శాఖ సంయుక్తంగా ఈ విగ్రహాల తయారీ బాధ్యతలు అప్పచెప్పడం గర్వంగానూ, అదృష్టంగానూ భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇటువంటి విగ్రహాల అందించడంతో చరిత్రలో తమ పేరు చిరస్తాయిగా నిలిచిపోతుందన్న నమ్మకంతో ఎంతో నిష్టగా విగ్రహాల తయారీని చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తొమ్మిదడుగుల ఎత్తులో తయారవుతున్న ఆ విగ్రహాలు

1.గురజాడ వెంకట అప్పారావు, 2. బళ్లారి రాఘవ, 3.సార్‌ అర్థర్‌ థామస్‌ కాటన్‌, 4.త్రిపురనేని రామేశ్వరస్వామి చౌదరి, 5. కందుకూరి వీరేశలింగం పంతులు, 6.ముట్నూరి కృష్ణారావు, 7.రఘుపతి వెంకటరత్నం నాయుడు, 8.కృష్ణదేవరాయులు, 9.బ్రహ్మనాయుడు, 10.సిద్దేంద్రయోగి, 11.అన్నమాచార్య, 12.ఎర్రప్రగడ విగ్రహాలతో పాటు సి.ఆర్‌.రెడ్డి, గుర్రం జాఘువా, శ్రీశ్రీ, క్షేత్రయ్య, నన్నయ్య భట్టు విగ్రహాల దిమ్మెలు తయారుచేస్తున్నట్లు పేర్కొన్నారు.

విగ్రహాల తయారీకి బేధాలుండవు…..
ఎంతో నిబద్దతో తయారుచేస్తున్న విగ్రహాల తయారీకి కుల, మత, వర్గ, ప్రాంతీయ బేధాలుండవంటున్నారు అరుణ్‌ప్రసాద్‌ ఉడయార్లు. తమ వద్దకు విగ్రహం తయారుచేయమని వచ్చిన వారికి నచ్చిన విధంగా, మెచ్చేవిధంగా తయారుచేయడమే తమ వృత్తి ధర్మమంటున్నారు. తమ వృత్తే దైవంతో సమానమని అలాంటప్పుడు ఏ విగ్రహాల తయారులోనైనా దైవాన్ని చూసుకుంటూ అందంగా మలచడమే తమ బాధ్యతని ఆయన పేర్కొంటున్నారు. కేసిఆర్‌ కోరిక మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా తయారుచేసి ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా మేరీమాత విగ్రహాలు కూడా ఎన్నో తయారుచేసామని వివరించారు. ప్రస్తుతం చాకలి ఐలమ్మ విగ్రహాలు తయారి చేయబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనూ, దేశవిదేశాల్లోని అన్ని ప్రాంతాలలో విగ్రహాలు తయారుచేస్తూ, సజీవ రూపంతో విగ్రహాలు తీర్చిదిద్దడమే ఉడయార్‌ ధ్యేయమని పేర్కొన్నారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top