You Are Here: Home » సినిమా » పాటలు » వాగ్దానం (1961)- శ్రీనగజాతనయం సహృదయం

వాగ్దానం (1961)- శ్రీనగజాతనయం సహృదయం

శ్లోకం :

శ్రీనగజాతనయం సహృదయం (2)
చింతయామి సదయం
త్రిజగన్మ హోదయం
శ్రీనగజాతనయం

వచనం :

శ్రీరామభ క్తులారా! ఇది సీతాకళ్యాణ సత్కథ. నలభై రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తూంది. నాయనా! కాస్త పాలు, మిరియాలు ఏవైనా?
కోరస్ : చిత్తం. సిద్ధం.

వచనం :

భక్తులారా! సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధివీరుల్లో… అందరినీ ఆకర్షించిన ఒకే ఒక దివ్యసుందరమూర్తి… ఆహా! అతడెవరయ్యా అంటే

పాట :

రఘురాముడు రమణీయ
వినీల ఘనశ్యాముడు
రమణీయ వినీల తక ఘనశ్యాముడు
వాడు నెలరేడు సరిజోడు మొనగాడు
వాని కనులు మగమీల నేలురా
వాని నగవు రతనాల జాలురా
॥కనులు॥
వాని జూచి మగవారలైన మైమరచి
మరుల్కొనెడు మరోమరుడు
మనోహరుడు రఘురాముడు!
సనిదని సగరిగరి రిగరి
సగరి రిగరి సగగరి సనిదని
సగగరిస దని రిసనిద
రిసనిద నిదపమగరి
రఘురాముడు…
సనిసా సనిస సగరి రిగరి
సరిసనిసా పదనిసా
సనిగరి సనిస సనిరిస నిదని
నిదసని దపమ గామాదా
నినిని నిని నిని నిని
పస పస పస పస
సపా సపా సపా
తద్దిం తరికిటతక
రఘురాముడు రమణీయ
వినీల ఘనశ్యాముడు
శభాష్… శభాష్…

వచనం :

ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షము నుండి సీతాదేవి ఓరకంట చూచినదై… చెంగటనున్న
చెలికత్తెతో…

పాట :

ఎంత సొగసుగాడే (2)
మనసింతలోనె దోచినాడే
ఎంత సొగసుగాడే
మోము కలువరేడే… (2)
నా నోము ఫలము వీడే
శ్యామలాభిరాముని చూడగ
నా మది వివశమాయె నేడే
ఎంత సొగసుగాడే

వచనం :

ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయైయుండగా, అక్కడ స్వయంవర సభామంటపంలో జనకమహీపతి సభాసదులను చూచి…

పాట :

అనియె నిట్లు ఓయనఘులారా! నాయనుగు పుత్రి సీత
వినయాధిక సద్గుణవ్రాత ముఖవిజిత లలిత జలజాత
ముక్కంటి వింటినెక్కిడజాలిన
యెక్కటి జోదును నేడు
మక్కువ మీరగ వరించి
మల్లెలమాల వైచి పెండ్లాడు…

వచనం :

అని ఈ ప్రకారం జనకమహారాజు ప్రకటించగానే, సభలోని వారందరూ ఎక్కడివారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావ ణాసురుడు కూడా ‘హా ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని చాపము. దీనిని స్పృశించుటయే మహాపాపము’ అని అనుకొనినవాడై వెనుదిరిగిపోయాడట. తదనంతరంబున

పాట :

ఇనుకుల తిలకుడు నిలకడ గల
క్రొక్కారు మెరుపువలె నిల్చి
తన గురువగు విశ్వామిత్రుని
ఆశీర్వాదము తలదాల్చి
సదమల మదగజ గమనము తోడ
స్వయంవరం వేదిక చెంత
మదన విరోధి శరాసనమును
తన కరమును బూనినయంత

గీత పద్యం :

ఫెళ్లుమనె విల్లు గంటలు ఘల్లుమనె
గుభిల్లుమనె గుండె సృపులకు
ఝల్లుమనియె జానకీ దేహము…
ఒక నిమేషమ్మునందె
నయము జయమును
భయము విస్మయము గదురా

శ్రీమద్రమారమణ గోవిందో హరి

వచనం :

భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది మరొక్కసారి…
శ్రీమద్రమారమణ గోవిందో హరి!
భక్తులారా! ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగము కావించినాడు.
అంతట –

కంద పద్యం :

భూతలనాథుడు రాముడు
ప్రీతుండై పెండ్లియాడె
పృథుగుణమణి… సంఘాతన్…
భాగ్యోపేతన్ సీతన్

కందార్థం :

భూతలనాథుడు రాముడు
ప్రీతుండై పెండ్లియాడె
శ్రీమద్రమారమణ గోవిందో హరి

చిత్రం : వాగ్దానం (1961)
రచన : శ్రీశ్రీ
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : ఘంటసాల

ఈ హరికథా ప్రారంభంలో వచ్చిన శ్లోకం పూర్వం మన హరిదాసులు ఆలపించే సంస్కృత శ్లోకం. భూతలనాథుడు… అనే కంద పద్యం బమ్మెర పోతన రచించిన భాగవతం లోనిది. ‘ఫెళ్లుమనెవిల్లు…’ అనే గీత పద్యం కరుణశ్రీ రచించినదని శ్రీశ్రీ స్వయంగా తెలిపారు

– నిర్వహణ : నాగేష్

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top