You Are Here: Home » చిన్నారి » వదిలిన బద్దకం

వదిలిన బద్దకం

రామాపురం అనే గ్రామంలో రాఘవ, గోవిందు అనే స్నేహితులు ఉండేవారు. రాఘవ చాలా చురుకుగా ఉంటూ తండ్రికి వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉండేవాడు. గోవిందు ప్రతి పనికీ బద్దకించేవాడు. గోవిందు తండ్రి రోజూ కొడుకుని ‘‘రాఘవని చూసి బుద్ధి తెచ్చుకో’’ అని తిడుతూ ఉండేవాడు.

ఒకసారి గోవిందు తండ్రి వేరే ఊరికి వెళ్లవలసి వచ్చింది. అయితే అనారోగ్య కారణంగా వెళ్లలేక పోయాడు. తన బదులుగా గోవిందుని, రాఘవని కలిసి ఆ ఊరికి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్లటానికి గోవిందు ఆసక్తి చూపించలేదు. తండ్రి, రాఘవ ఇద్దరూ ఒత్తిడి చేయటంతో గత్యంతరం లేక ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి బయలుదేరారు.
ఆ ఊరికి వెళ్ళే దారిలో చిన్న అడవి ఉంది. గబగబ నడుస్తూ వెళితే చీకటిపడే సమయానికి ఊరికి చేరుకోవచ్చనుకున్నారు. కాని గోవిందు బాగా నెమ్మదిగా నడవటంతో అడవి దగ్గరకు వెళ్ళేసరికే చీకటి పడిపోయింది. అప్పుడు రాఘవ ‘‘రాత్రిపూట ఆడవి మార్గంలో ప్రమాదం. అందుకని ఈ పూటకి ఇక్కడే ఉండి ఉదయాన్నే బయలుదేరుదాం. నువ్వు వేగంగా నడవకపోవడం వల్లే ఇక్కడ అడవిలో ఆగిపోవాల్సి వస్తోంది’’ అని గోవిందుని కసురుకున్నాడు.

దాంతో కోపగించుకున్న గోవిందు… రాఘవతో మాట్లాడటం మానేశాడు. అడవిలో నిద్రపోవటానికి రాఘవ మంచె కట్టుకొని దాని మీద ఆకులు వేసి మెత్తటి పక్క తయారుచేసుకున్నాడు. గోవిందు మాత్రం ‘‘ఒక రాత్రి నిద్రపోవటానికి ఇంత తతంగం ఎందుకు? ఈ రాయిపై నిద్రపోతే చాలదా’’ అనుకున్నాడు. రాఘవ మంచె మీద, గోవిందు బండరాయి మీద పడుకున్నారు. అయితే రాయి మీద గోవిందుకి అసలు నిద్ర పట్టలేదు. ‘‘నేను కూడా రాఘవలాగ మెత్తని పక్క వేసుకొని ఉంటే బాగుండేది కదా!’’ అనుకున్నాడు.

ఈలోగా పులి గాండ్రింపు వినిపించింది. భయంతో గోవిందుకి పైప్రాణాలు పైనే పోయాయి. అది గమనించిన రాఘవ గోవిందుని కూడా మంచెపైకి రమ్మని పిలిచాడు.

గోవిందు ఒక్క పరుగున మంచె మీదకు చేరుకున్నాడు. అప్పుడు గోవిందు ‘‘నా బద్దకం వల్ల ఇలా అడవిలో గడపవలసి రావడమే కాకుండా అడవి జంతువుల బారిన పడే ప్రమాదం వచ్చింది. నన్ను క్షమించు’’ అని రాఘవతో అన్నాడు. ‘‘స్నేహితుల మధ్య క్షమాపణలు ఎందుకు? ఇప్పటికైనా నీ బద్దకాన్ని విడిచి పెడితే నేను సంతోషిస్తాను’’ అన్నాడు రాఘవ . గోవిందు ‘సరే’ అని తలూపాడు. ఆరోజు నుంచి గోవిందు ఏ పనికీ బద్దకించకుండా చురుకుగా ఉండసాగాడు. గోవిందులో వచ్చిన మార్పుకి అతడి తండ్రి సంతోషించాడు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top