You Are Here: Home » చిన్నారి » కవితలు » లోపలి దృశ్యం

లోపలి దృశ్యం

పొరలను ఛేదించుకుంటూ, తెరలను తొలగించుకుంటూ
వెళ్తాను లోపలికి
భ్రాంతిమయమైన రహస్యాలు కనబడ్తాయి
అసలు నేననుకున్న నువ్వు..నువ్వు కావు
పాలు ఎర్రగా..వెన్నెల నల్లగా.. ఒక వినబడని పిల్లనగ్రోవి పాట..వర్షంలా
ఏమిటీ అంటే..?
ఏమీలేదు.. ఒట్టి అడుగులు..ముద్రలు ముద్రలుగా-

యింతకూ మన దశాబ్దాల పరస్పరత అంతా
మానవ చరిత్ర లయించి గానం చేస్తున్న
పురాశిథిల దుర్గాల గర్భాల్లోనుండి ధ్వనించే
నిశ్శబ్ద ఆత్మసంకీర్తనలే కదా..ఊఁ..
ఒక తోటలో ఒట్టి మట్టిపొరనై నేను
వ్రేళ్ళు వ్రేళ్ళుగా నాలో ఊనుకుంటూ మొలకగా నువ్వు
ఎవరు ఎవరిలోకి విస్తరిస్తున్నారన్నది ప్రశ్న..?

తెడ్డు..పడవ..నీరు..ఏమిటీ అంతస్సంబంధం
ప్రయాణమొక్కటి.. ఒక అంతిమ తంతు
కదలిక..ఈ తీరం నుండి ఆ తీరం దాకా
నువ్వు నావెంట రావాలని నేను
నేను నీవెంట ఉండాలని నువ్వు
ఎవరు ఎవరివెంట వస్తారని?..

అసలు రావడం, పోవడం ఒట్టి మాయ
చివరికి అనిశ్చలమై ఆవశేషమై ప్రవహించే నీరు
అలసి..దుఃఖిస్తూ వెల్లికిలా మట్టిపై పడుకుని ఆకాశ నివేదన
ఒక ఒంటరిపక్షికి ఎప్పట్నుండో
మేఘాలనూ, ఆకాశాన్నీ జయించాలని పిచ్చి కోరిక
కుబుసాలనూ, తొడుగులనూ, ముసుగులనూ విడిచి విడిచి
బాటంతా విసర్జిత వస్తు సంచయమే

నన్ను పశ్చాత్తాప మందిరంలోకి రానివ్వండి.. ప్లీజ్‌
ఏడ్వనివ్వండి..అరవనివ్వండి..దుఃఖించనివ్వండి
నన్ను నేను ఛిద్రించుకుని నిజమైన నన్ను బయటకు రానివ్వండి
లెట్‌ మీ కన్ఫెస్‌.. వీపింగ్‌
నేను తప్పులు చేశాను.
బుద్ధి తెలిసిననాటినుండి తప్పులు చేస్తూనే వున్నాను తెలిసే

కాలకృత్యాలో, కామకృత్యాలో అన్నీ నన్ను పొడుస్తున్నాయి.
హృదయమంతా ఎర్రని పుండు..రక్తవర్ణాగ్ని
నిజానికి నాలోపలి దృశ్యమంతా
పరమ వికారంగా ఉందిరా
నీలో..ఆమెలో..అతనిలో..ఆ ఆమెలో.. అందర్లో ఉన్నట్టే
అత్యంత వికారంగా..ఆఁ..,

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top