You Are Here: Home » యాత్ర » తీర్ధ యాత్రలు » లేపాక్షి… దివ్యక్షేత్రం !

లేపాక్షి… దివ్యక్షేత్రం !

లేపాక్షి… దివ్యక్షేత్రం !

సుందర పర్యాటక క్షేత్రం లేపాక్షి అనంతపురం జిల్లాలో ఉంది. ఇది హిందూపురం పట్టణానికి 16 కి.మీల దూరంలో ఉంది. మనదేశంలో మహిమాన్వితమైన దివ్యశైవక్షేత్రాలు 108 ఉన్నాయి. వాటిలో ఒకటి లేపాక్షి. పాపనాశేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన లేపాక్షిలో వీరభద్రస్వామి ఆలయం ఉంది. దీనిని విరూపణ్ణ నిర్మించాడు. ఇతడు విజయనగరాన్ని ఏలిన అచ్యుతదేవరాయల ఉద్యోగి. లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయం అద్భుతమైన శిల్పాలకు ఆలవాలం. ఇక్కడ ఉన్న ప్రతి శిల్పం, ప్రతి స్తంభం మలిచిన తీరు వర్ణనాతీతం. త్రేతాయుగంలో సీతమ్మవారిని రావణుడు ఎత్తుకెళ్తున్న సమయంలో జటాయువు అనే పక్షి అడ్డుకుంటుంది. రావణుడు ఆ పక్షి రెక్కలను విరగ్గొట్టి సీతమ్మను తీసుకెళ్లిపోతాడు. రావణునికి, జటాయువుకు మధ్య యుద్ధం జరిగిన ప్రదేశం ఇదేనని చెబుతారు. సీతమ్మను వెతుక్కుంటూ వచ్చిన శ్రీరాముడు ఆ పక్షిని చూసి ‘లే పక్షీ’ అని పిలిచి దానికి మోక్షాన్ని అనుగ్రహించాడు. ఆ ప్రాంతమే లేపాక్షిగా నామాన్ని సార్థకం చేసుకుంది. ‘లేపాక్షి బసవయ్యా లేచిరావయ్యా’ అని పిలుచుకునే అతి పెద్ద నంది విగ్రహం ఇక్కడే ఉంది. సుమారు 20 అడుగుల పొడవు, 17 అడుగుల ఎత్తు ఉన్న ఈ నంది విగ్రహాన్ని ఏకశిలలో నిర్మించారు. అత్యంత మనోహరమైన ఈ లేపాక్షి నందిని దర్శించడానికి పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తారు. ఇది విజ్ఞానాన్ని, ఆహ్లాదాన్ని కలిగించే ప్రదేశం కావడంతో పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top