You Are Here: Home » విశేషం » లక్షలాది కళాఖండాలకు వేదిక గ్రేట్ మాన్యుమెంట్ – లోరె మ్యూజియం

లక్షలాది కళాఖండాలకు వేదిక గ్రేట్ మాన్యుమెంట్ – లోరె మ్యూజియం

లక్షలాది కళాఖండాలకు వేదిక
గ్రేట్ మాన్యుమెంట్ – లోరె మ్యూజియం
లోరె మ్యూజియం… ఇది రాజరిక ఫ్రాన్స్ జీవనశైలిని కళ్లకు కట్టే మ్యూజియం. ఒకప్పటి ఫ్రాన్స్ రాజప్రాసాదం. ప్రపంచంలో అతి పెద్ద ప్రదర్శనశాలల్లో ఒకటి. పారిస్ నగరానికి ల్యాండ్‌మార్క్. రక్షణ నిలయంగా నిర్మాణమై రాజనివాసంగా ప్రసిద్ధికెక్కి మ్యూజియంగా స్థిరపడిన ఈ చారిత్రక కట్టడం… ప్రపంచప్రసిద్ధి చెందిన మోనాలిసా చిత్రానికి వేదిక.

ఫ్రెంచ్ చరిత్రకారుడు హెన్రీ సావ్‌వాల్ ప్రకారం ఈ భవనానికి లోరె అనే పేరు ఫ్రాంకిష్ భాషలోని లియోవర్ లేదా లియోవెర్ అనే పదాల నుంచి వచ్చింది. అంటే కోటలాంటి దుర్భేద్యమైన కట్టడం అని అర్థం. ఫ్రాంకిష్ భాషను ప్రాచీనకాలంలో వెస్ట్ జర్మనీ ప్రదేశంలో జీవించిన ఫ్రాంకు జాతీయులు మాట్లాడేవారు.

పాలాయిస్ ద లోరే పేరుతో నిర్మించిన ఈ కట్టడం దుర్భేద్యమైన కోట. 12వ శతాబ్దంలో రెండవ ఫిలిప్ అగస్టస్ దీనిని నిర్మించాడు. పొరుగుదేశాల దాడుల నుంచి దేశాన్ని రక్షించుకోవడానికి సియెన్ నది తీరాన కట్టారు.

ప్రధాన నిర్మాణం ఎత్తుగా వలయాకారంగా ఉంటుంది. మధ్యయుగానికి సంబంధించిన ఈ నిర్మాణం యథాతథ రూపాన్ని లోరె మ్యూజియంలోని సుల్లీ వింగ్‌లో చూడవచ్చు. నిర్మించిన నాటికి ఇది రాజనివాసం కాదు. అవసరార్థం తలదాచుకోవడానికి వీలుగా రక్షణవలయంగా కట్టారు. ప్రధాన నిర్మాణం పూర్తయిన నాటి నుంచి తర్వాత పాలకులు ఏదో ఒక సందర్భంలో పునర్నిర్మాణాలు చేస్తూనే వచ్చారు.

13వ శతాబ్దంలో తొమ్మిదవ లూయీ కాలంలో ఈ భవనం రాజనిధిని దాచే కోశాగారంగా మారింది. క్రమేణా 14వ శతాబ్దంలో ఐదవ చార్లెస్ కాలానికి అందమైన నిర్మాణంగా రూపుదిద్దుకుంది. కానీ ఇది తర్వాత జరిగిన యుద్ధాల్లో చాలా భాగం ధ్వంసమైంది. క్రీ.శ 1546లో మొదటి ఫ్రాన్సిస్ శిథిలాల మీద కొత్త నిర్మాణాలు చేశాడు. రాజనివాసానికి అనుగుణంగా మరిన్ని హంగులు చేర్చాడు. భారీ వరండాలను నిర్మించారు. ఇవి ఒక్కొక్కటి పావు మైలు నిడివి ఉంటాయని చరిత్రకారుడు హెన్రీ అంచనా. ఇప్పటికీ నిలిచి ఉన్నవి అవే.ప్రధాన భవనాన్ని ఓల్డ్ లోరె అని, అనుబంధ నిర్మాణాలను న్యూ లోరె అని వ్యవహరిస్తారు. ఇది నలభై హెక్టార్ల(వంద ఎకరాలు)లో విస్తరించిన నిర్మాణం.

ప్రధానంగా రెండు చతుర్ముఖ కట్టడాలు, వాటికి అనుబంధంగా రెండు విశాలమైన కోర్టుయార్డులు ఉన్నాయి. వీటిని మొదటి నెపోలియన్ పూర్తి చేసినట్లు చెబుతారు. ఇందులో సామాన్యులు సమావేశం కావడానికి ఉద్దేశించిన హాలు విస్తీర్ణం దాదాపుగా 52 వేల చదరపు మీటర్లు. ఇందులో ప్రజల కోసం ప్రదర్శనలు జరిగేవి. తర్వాత ఆ స్థలంలో నెపోలియన్ పిరమిడ్‌ను నిర్మించారు.

లోరె ప్యాలెస్‌ను 1793, ఆగస్టు 10వ తేదీన ప్రదర్శనశాలగా మార్చారు. తర్వాత మూడేళ్లలోనే మ్యూజియాన్ని 1796 నుంచి 1801 వరకు తాత్కాలికంగా మూసి తిరిగి తెరిచారు. ఇందులో ఫ్రెంచ్ రాజకుటుంబం ఉపయోగించిన వస్తువుల నుంచి అప్పటి కళాకృతులు ఉన్నాయి. ఇందులో 537 పెయింటింగులు ప్రధాన ఆకర్షణ. నెపోలియన్ భవనం సైజు, కళాఖండాల సంఖ్యను ఇతోధికంగా పెంచాడు.

నెపోలియన్ ఈ రాజప్రాసాదాన్ని తన వివాహానికి వేదిక చేసుకున్నాడు కూడ. 18వ లూయీ, పదవ చార్లెస్‌ల హయాంలో మ్యూజియంలో 20వేల కళాఖండాలు జమ అయ్యాయి. లోరె మ్యూజియంలో ఉన్న కళాకృతులను అన్నింటినీ చూడాలంటే కనీసం నెలరోజులు పడుతుంది. శిల్పాలు, చిత్రలేఖనాలు, ఇతర కళాకృతులన్నీ కలిపి మూడులక్షల ఎనభై వేలు ఉన్నాయి.

మోనాలిసా చిత్రం!
ఈ మ్యూజియాన్ని మొదటిసారి సందర్శించే వారు మోనాలిసా చిత్రాన్ని చూడడానికి ఆసక్తి చూపుతారు. లియోనార్డో డావిన్సీ వేసిన ఈ పెయింటింగ్‌ను ఇప్పుడు బుల్లెట్‌ప్రూఫ్ అద్దాల రక్షణలో అమర్చారు. 1911లో మ్యూజియం ఉద్యోగి ఈ చిత్రాన్ని దొంగిలించే ప్రయత్నం చేశాడు. అప్పటి నుంచి ఈ రక్షణ. ఇక్కడ మరో ఆకర్షణ వీనస్ డి మిలో శిల్పం. చేతుల్లేని ఈ విగ్రహం అసలు ఆఫ్రోడైట్ ఆఫ్ మిలోస్. ఈ శిల్పాన్ని ఎవరు చెక్కారన్న దానికి స్పష్టమైన ఆధారాలు లేవు, కానీ ఇది క్రీ.పూ 140 నాటిదని చరిత్రకారుల అంచనా.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top