You Are Here: Home » సినిమా » సినిమా రివ్యూ » రొటీన్ ‘రచ్చ’

రొటీన్ ‘రచ్చ’

రొటీన్ ‘రచ్చ’

రొటీన్ ‘రచ్చ’బీభత్సమైన ఫ్లాప్ తరువాత రామ్ చరణ్ కసితో నటించిన చిత్రం రచ్చ. మొదట్నుంచి సినిమాపై అంచనాలను పెంచేశారు. బాగానే ప్రమోట్ చేసుకున్నారు. అభిమానులు సైతం అన్నిరకాలుగా ఆలోచిస్తున్న ఈ కాలంలో ‘రచ్చ రచ్చే’ అంటూ ప్రమోట్ అయిన ఈ చిత్రం ఏ మేరకు మెగా అభిమానుల్ని, సినిమా అభిమానుల్ని అలరించిందో ఓ సారి చూద్దాం!

కథాపరంగా… బెట్టింగ్ రాజ్ అని పిలుచుకునే రాజ్ అనే కుర్రాడు పందెంతో అందరినీ గెలుస్తూ దమ్మున్నోడుగా పాపులర్ అవుతాడు అతడు ఉండే బస్తీలో. ఒక సందర్భంలో జేమ్స్(అజ్మల్)తో పందెం కాసి గెలుస్తాడు. అప్పటి వరకు బెట్టింగ్‌లో కింగ్‌గా ఫీలవుతున్న జేమ్స్ గెలుపు తప్ప ఓటమి తెలియని రాజ్‌ను చూసి కుళ్లుకుంటూ ఉంటాడు. ఒకరోజు బస్తీలో క్రికెట్ ఆడుతూ స్పృహతప్పి పడిపోయిన నారాయణ (ఎం.ఎస్. నారాయణ)ను హాస్పిటల్ చేర్చుతాడు రాజ్. నారాయణే రాజ్‌ను పెంచి పెద్ద చేస్తాడు. అయితే నారాయణకు లివర్ ట్రాన్స్‌ప్లాం తప్పనిసరై అందుకోసం ఇరవై లక్షలు అవసరమవుతాయి. ఏం చేయాలో తోచని రాజ్‌కు జేమ్స్ తారపడి ఒక పందెం కాస్తాడు. బళ్లారి(ముఖేష్ రిషి) కూతురు చైత్ర(తమన్నా)తో ఐ లవ్ యూ అని చెప్పించుకోగలిగితే ఆ ఇరవై లక్షలు ఇస్తానని పందెం కాస్తాడు. విధిలేని పరిస్థితుల్లో రాజ్ ఒప్పుకుంటాడు. ఆ క్రమంలో చైత్రని రాజ్ ప్రేమలోకి దించి పందెం గెలిచాడా? తనను పెంచిన నారాయణను కాపాడాడా? అసలు బళ్లారి ఎవరు? చైత్రకు, రాజ్‌కు ఉన్న సంబంధం ఏమిటి? అనేది మిగతా కథ!
రచ్చ..ఒక మొండి కుర్రాడి కథ.

ఎంతకైనా తెగించే దమ్మున్నోడి కథ. కథాపరంగా చూస్తే హీరో పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అదొక్కటే కనిపిస్తుంది సినిమాలో. కథలో మరో కీలక పాత్ర హీరోయిన్‌ది. కానీ హీరో క్యారెక్టరైజేషన్ ముందు అది తేలిపోయింది. ఇంట్వల్‌బ్యాంగ్ ఒక్కటీ బాగుంది. నటీనటుల గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. రామ్‌చరణ్ మెరుగైన నటన కనబరిచాడు. బ్రహ్మానందం, ఆలీ, కృష్ణ భగవాన్ వంటి కమెడియన్స్ వచ్చిపోయే పాత్రల్లో కనిపించి నవ్వించే ప్రయత్నం చేశారు. చిన్న పాత్రలు కూడా పెద్ద నటీనటులతో చేయించారు కానీ వాటికి ప్రాధాన్యం లేకుండా పోయింది. సన్నివేషాల గురించి చెప్పాలంటే… వాటిలో రామ్ చరణ్ నటించడం కొత్తగానీ సినిమాలో కొత్త సీన్ ఒక్కటీ లేదు. హీరోయిన్ వెంటపడటం, ఆమెకు సెక్యూరిటీ ఉండటం… వాళ్లను బకరాలను చేసి ఆమెకు ప్రపోజ్ చేయడం… ఇవన్నీ పాత విషయాలే కదా! పాటలు బాగున్నాయి. ఫైటింగ్‌లూ బాగున్నాయి కానీ అనవసరపు రచ్చ కనిపించింది వాటిలో. స్టోరీలో కనిపించే లొసుగులూ ఉన్నాయి… రాజ్ తన తండ్రి సూర్యనారాయణ ఆశయం నెరవేర్చే కొడుకుగా చూపించారు క్లయిమాక్స్‌లో. కానీ విషయం ఏంటంటే… సూర్యనారాయణ ఫ్రెండ్ (నాజర్) తన మూడు వేల ఎకరాల ఆస్తిని ఊరి ప్రజలకు పంచాలనుకుంటాడు. అది సూర్యనారాయణ ఆశయం ఎలా అవుతుందో అర్థం కాదు ప్రేక్షకులకు. అలాంటి కొన్ని విశేషాలూ ఉన్నాయి చిత్రంలో! ఇక ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన విషయం ‘వానా వానా వెల్లువాయే’ పాట గురించి. ఒరిజినల్ సాంగ్‌లో ఉన్న ఫీల్ ఈ ఇక్కడ కనిపించదు. ఎక్కడి మెగాస్టార్? ఎక్కడి రామ్ చరణ్! ఈ రామ్‌చరణ్ చిరంజీవి అయ్యేనాటికి కొన్నేళ్లు గడిచిపోతాయి.

సోసో కథనంతో, స్లోగా నడుస్తుందీ సినిమా. అప్పుడప్పుడూ ఇంట్రెస్ట్ క్రియేట్ అయినా అర నిమిషంలో తేలిపోతుంటుంది. ఎందుకంటే రాబోయే సీన్‌ను సగటు ప్రేక్షకుడు కూడా అంచనా వేయగలరు. అందుకే ఎవరూ ఊహించని విధంగా సినిమా తీయకున్నా… ఇంట్రెస్టింగ్‌గా చూపించడమే సక్సెస్. అదే కనిపించదు ఈ సినిమాలో. పుష్కలమైన మాస్ అంశాలతో సాంకేతికంగా కూడా రిచ్‌నెస్‌తో ఉన్న రచ్చ సినిమా మొత్తంగా చూస్తే మాత్రం విషయం లేని చిత్రంగా మిగిలింది.
సినిమా అనేది కేవలం అభిమానుల కోసమే కాదు… అందరూ చూస్తారు. ఈ విషయమే గుర్తించలేదు దర్శకుడు సంపత్ నంది. లేకపోతే ‘బన్నీ’ వంటి సినిమాను ఎందుకు ఎంచుకుంటాడు? అయినా రామ్‌చరణ్ చేయకుంటే ఆ పాత్రను ఇంతకు ముందెవరూ చేయలేదనేనా అర్థం!

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top