You Are Here: Home » ఆరోగ్యం » ఆరోగ్య సూత్రాలు » మెదడులో రక్తస్రావం

మెదడులో రక్తస్రావం

మెదడులో రక్తస్రావం
మెదడులో జరిగే రక్తస్రావాన్ని సెరిబ్రల్ హెమరేజ్ అంటారు. దీని ద్వారా చాలామందిలో పక్షవాతం వస్తుంది. ఇలా రక్తస్రావం అయిన సందర్భాల్లో అది చుట్టుపక్కల ఉండే నరాలను దెబ్బతీసి ప్రమాదకరమైన స్థితిలోకి నెట్టేయవచ్చు. అది వైద్యపరంగా అత్యవసరమైన పరిస్థితి. చాలామందిలో వైకల్యానికి పక్షవాతం కారణం. పక్షవాతంలో పది శాతం మెదడు పొరల్లో జరిగే అంతర్గత రక్తస్రావంతోనే వస్తాయి. మెదడులో అంతర్గత రక్తస్రావం అయినవారిలో 44 శాతం మందికి నెలరోజుల్లోనే ప్రమాదకరం కావచ్చు. మరీ కీలక ప్రాంతాల్లో రక్తస్రావం జరిగితే అది 24 గంటల్లోనే ప్రమాదకరం కావచ్చు. మెదడులో జరిగే రక్తస్రావం (సెరిబ్రల్ హెమరేజ్)పై అవగాహన కోసం ఈ కథనం.మెదడు ఆక్సిజన్‌ను నిలవ ఉంచుకోలేదు. అందుకే అంతటి కీలకమైన అవయవానికి నిత్యం రక్తనాళాల ద్వారా ఆక్సిజన్ పోషకాలు అందుతుంటాయి. ఏదైనా కారణాల వల్ల మెదడు పరిసర ప్రాంతాల్లో రక్తస్రావం అయితే ఆ పరిసరాల్లోని మెదడు కణాలకు పోషకాలు, ఆక్సిజన్ అందవు. దాంతో మెదడు కణాలు దెబ్బతినే అవకాశం ఉంది. అది ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు.

అంతర్గత రక్తస్రావంతో వచ్చే ప్రమాదాలు :
జ్ఞాపకశక్తి కోల్పోవం
మాట పడిపోవడం
ఏదైనా అవయవం చచ్చుబడడం
శాశ్వత అంగవైకల్యం

ఎవరిలో రావచ్చు : ఇది ఏ వయసు వారిలోనైనా రావచ్చు. అయితే కాస్త వయసు పైబడిన వారిలో కనిపించడం సాధారణం. వయసు పైబడుతున్న కొద్దీ సెరిబ్రల్ హెమరేజ్‌తో పక్షవాతం వచ్చే అవకాశాలు పెరుగుతుంటాయి.
సాధారణ వయసులోవారి కంటే 55 ఏళ్ల పైబడిన వారిలో, మెదడులో రక్తస్రావం (సెరిబ్రల్ హెమరేజ్) అయ్యే అవకాశాలు ఎక్కువ. అయితే ప్రతి పదేళ్లకీ ఈ రిస్క్ రెట్టింపు అవుతుంటుంది. కొన్నిసార్లు చిన్నపిల్లల్లోనూ ఇది కనిపించవచ్చు. నెలలు నిండకముందే పుట్టిన పిల్లల్లోనూ సెరిబ్రల్ హేమరేజ్ సంభవించవచ్చు.

లక్షణాలు : ఏదైనా అవయవం స్పర్శను కోల్పోవడం
బలహీనం కావడం
ముఖం, చేయి, కాలు, శరీరంలోని ఒకవైపు భాగం చచ్చుబడిపోవడం
అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి రావడం, మాట తడబడటం, చదవడం, రాయడంలో ఆటంకం
మునుపటిలా చురుగ్గా ఉండలేకపోవడం, ఎప్పుడూ నిద్రవస్తున్నట్లుగా అనిపించడం, కోమాలోకి వెళ్లడం
మింగడంలో, దృష్టిలో లోపం రావడం
నిటారుగా ఉండే శక్తి (బ్యాలెన్స్) కోల్పోవడం

సెరిబ్రల్ హెమరేజ్‌కు కారణాలు : 
తలకు గాయం కావడం (ఏదైనా ప్రమాదంవల్ల, ఎత్తు నుంచి పడిపోవడం వల్ల)
అధిక రక్తపోటు షుగర్ పొగతాగడం ఆల్కహాల్… ఈ నాలుగింటినీ ప్రైమరీ వాస్కులార్ రిస్క్ ఫ్యాక్టర్స్‌గా పేర్కొంటారు.
శరీరంలోని అన్ని రక్తనాళాల్లోనూ లోపలివైపు గోడల్లో కొవ్వుపదార్థాలు పేరుకుపోయి గట్టిగా మారతాయి. అలా రక్తనాళాల్లో కొవ్వు అడ్డుకోవడాన్ని ‘అథెరో స్ల్కీరోటిక్ బ్లాక్’ అంటారు. దాంతో లోపలివైపు రక్తనాళాల ఉపరితలం (సర్ఫేస్) రఫ్‌గా మారుతుంది. ఫలితంగా రక్తప్రసరణ స్మూత్‌గా కాకుండా అడ్డుకుంటూ ఉండటంవల్ల రక్తం గడ్డకట్టడానికి అవకాశం ఎక్కువ. ఒక్కోసారి మెదడులోని రక్తనాళాల్లో ఏదైనా ఒకచోట రక్తం గడ్డగట్టి అది రక్తప్రవాహంలో కొట్టుకుపోతూ మెదడులోని మరేదైనా ప్రాంతంలో తట్టుకోవడం వల్ల అక్కడ రక్తనాళం చిట్లడం వల్ల కూడా రక్తస్రావం కావచ్చు.

కొన్నిసార్లు రక్తనాళంలోని బలహీనమైన ప్రాంతాల్లో ఇలా గడ్డకట్టిన రక్తం చిక్కుకుపోతే అక్కడ బెలూన్‌లాగా ఉబ్బవచ్చు. ఇలా ఉబ్బడాన్ని అన్యురిజమ్ అంటారు. ఇది ఒక్కోసారి చిట్లి అంతర్గత రక్తస్రావానికి దారితీయవచ్చు. మెదడులో వచ్చే కణుతులు కూడా ఒక్కోసారి ఉబ్బి రక్తస్రావానికి దారితీయవచ్చు.

కొన్నిసార్లు డయాబెటిస్ వంటి వ్యాధులు స్మోకింగ్, ఆల్కహాల్ వంటి దురలవాట్ల వల్ల కూడా ఇలా అంతర్గత రక్తస్రావం కావచ్చు. మహిళల్లో ఒక్కోసారి గర్భధారణ, పిల్లల పుట్టుకకు సంబంధించిన రుగ్మతల వల్ల కూడా మెదడులో రక్తస్రావం కావచ్చు. రక్తస్రావం వల్ల జరిగే నష్టం అన్నది మెదడులో అది జరిగే ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది.

నిర్ధారణ :
సెరిబ్రల్ హెమరేజ్‌ను పక్షవాతం, అయోమయస్థితి, జ్ఞాపకశక్తి కోల్పోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో శక్తి లోపించడం, వ్యక్తిత్వంలో మార్పులు, ఉద్వేగభరితమైన సమస్యలు వంటి లక్షణాలతో గుర్తించవచ్చు. సీటీ స్కాన్‌తో దీని నిర్ధారణ పూర్తిగా సాధ్యమవుతుంది. సీటీ స్కాన్‌తో మెదడులోని రక్తస్రావాలనేగాక తల ఎముక (పుర్రె)లో ఏదైనా ఫ్రాక్చర్స్ ఉన్నా తెలుసుకోవచ్చు. ఎమ్మారై పరీక్ష వల్ల రక్తస్రావానికి కారణాన్ని మరింత నిర్దిష్టంగా తెలుసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి ఎమ్మార్ వీనోగ్రామ్ లేదా ఎమ్మార్ ఆర్టియోగ్రామ్ వంటి పరీక్షలు కూడా చేయవచ్చు. మరికొన్ని కేసుల్లో యాంజియోగ్రఫీ ద్వారా మెదడులో రక్తనాళాలు ఉబ్బడాన్ని (అన్యురిజమ్‌ను) గుర్తించవచ్చు.

ఏం చేయాలి : మెదడులో అయ్యే ఏ రక్తస్రావమైనా మెడికల్ ఎమర్జెన్సీనే. పైన పేర్కొన్న ఏ లక్షణాలైన కనిపించినప్పుడు లేదా గమనించినప్పుడు ఆసుపత్రికి తరలించాలి.
ఫలితంగా జరిగే నష్టాన్ని సాధ్యమైనంత తగ్గించవచ్చు. కొంతమందిలో రక్తస్రావం మళ్లీ మళ్లీ కనిపించవచ్చు. కాబట్టి వెంటనే ఆసుపత్రికి తీసుకురాలి.

చికిత్స : అంతర్గత రక్తస్రావం అయినవారికి కొన్నిసార్లు వెంటనే శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. దానివల్ల రోగి కోలుకోవడం వేగవంతమవుతుంది.
రక్తనాళంలోని ఏదైనా ఒకచోట రక్తం పేరుకుంటే ఆ చుట్టూ ఉన్న మెదడు కణజాలం ఉబ్బుతుంది. దాంతో మెదడు వాపు వస్తుంది. దాన్ని నివారించడానికి లేదా చికిత్స చేయడానికి మందులు వాడి చికిత్స చేస్తారు. ఒక్కోసారి శస్త్రచికిత్స చేసి డీకంప్రెస్ చేసి అక్కడ పేరుకున్న రక్తాన్ని సాఫీగా ప్రవహించేలా చేయాల్సి ఉంటుంది.
అన్యురిజమ్ వంటి కండిషన్ ద్వారా హెమరేజ్ అయినట్లయితే క్లిపింగ్ అనే శస్త్రచికిత్స ప్రక్రియ ద్వారా దాన్ని సరిచేయాల్సి ఉంటుంది.
సెరిబ్రల్ హెమరేజ్ ఉన్నవారికి మూర్ఛ వచ్చే అవకాశం ఎక్కువ. దానికి తగినట్లుగా మందులు వాడాలి.

దీర్ఘకాలిక చికిత్స : 
హెమరేజ్ వల్ల దీర్ఘకాలం చికిత్స తీసుకోవాల్సిన రోగుల్లో రీ-హేబిలిటేషన్ వంటి ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. స్ట్రోక్ వల్ల మాట కోల్పోయినవారికి స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియర్ మాడిఫికేషన్ వంటి చికిత్స అందించాల్సి ఉంటుంది.
బీపీ. కొలెస్ట్రాల్ వంటివి సెరిబ్రల్ హెమరేజ్‌కు దారితీస్తాయి. కాబట్టి హైబీపీ, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచే మందులు క్రమం తప్పకుండా వాడుతూ, ప్రశాంత జీవనం సాగించాలి. ఒకవేళ స్ట్రోక్ వచ్చి ఉంటే వారికి తగిన మానసిక స్థైర్యం అందించాల్సి ఉంటుంది.

బీపీ పరిమాణం ఇలా…
బీపీని గుండెలోని పై, కింది గదుల స్పందనలతో కొలుస్తారు. దీన్ని సిస్టోలిక్/డయాస్టోలిక్ బీపీగా చెబుతారు. వాటి పరిమాణం ఈ కింది విధంగా ఉంటే…
120 / 80 ఉంటే దాన్ని నార్మల్ బీపీగా పరిగణిస్తారు.
140 / 90 ఉంటే దాన్ని చాలా కొద్దిపాటి బీపీ (మైల్డ్ హైపర్‌టెన్షన్)గా చెబుతారు.
160 / 100 ఉంటే దాన్ని ఓ మోస్తరు బీపీ (మోడరేట్ హైపర్‌టెన్షన్)గా చెబుతారు.
200 / 110 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని హైబీపీ లేదా మాలిగ్నెంట్ హైపర్‌టెన్షన్ అంటారు. మైల్డ్, మోడరేట్ హైపర్‌టెన్షన్ ఉన్నవాళ్లలో ఇస్కిమిక్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. హైబీపీ లేదా మాలిగ్నెంట్ హైపర్‌టెన్షన్ ఉన్నవాళ్లలో హెమరేజిక్ స్ట్రోక్ వచ్చేందుకు అవకాశం ఎక్కువ.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top