You Are Here: Home » చిన్నారి » మూడు మాటలేగా… చెప్పొచ్చుగా…

మూడు మాటలేగా… చెప్పొచ్చుగా…

శ్రీవారికి చిరాకు.
అయ్యిందా టిఫిను… నాకు టైమైపోతోంది… అంటారు కోపంగా. ఆయనకు ఇష్టమని,
ఉల్లిపాయలు ఎక్కువగా వేసి చేసే ఉప్మా
ఇష్టమని, కోస్తూ ఉంటే, కళ్ల వెంట ధారాపాతంగా నీరు కారుతూ ఉంటే, చూడక, గమనించక, చిరాకు. అంతేనా? కోపమూ…
చూడ్డానికి ఎంతో చక్కగా ఉంటాడాయన. అందగాడు. ఆ కళ్లు, నాసికా… కాని కోపంలో అవన్నీ వికారంగా మారిపోతాయి. అందంగా ఉన్న ముఖాన్ని ఎందుకు వికారంగా మార్చేసు
కోవడం?
ఒక్క నిమిషం ఓపిక పడితే ఆమె సిద్ధం చేస్తుందిగా. ఊహూ. చిరాకే.
కూతురికి?
అమ్మా… నా యూనిఫామ్ ఇస్ర్తీ చేయలేదేం? అని ఒకటే చిరాకు. పద్నాలుగేళ్లుంటాయి దానికి. పచ్చటి ఛాయ. దానిమ్మ గింజల్లాంటి పళ్లు… కాని ఆ గింజల్ని పటపటమని కొరుకుతూ చిరాకు
పడిపోతూ…
ఇదిగో తల్లీ… ఒక్క నిమిషంలో ఇస్ర్తీ
చేసిస్తానమ్మా….
కొడుకేం తక్కువా? బాత్‌రూమ్‌లో నుంచే అరిచేస్తాడు. మమ్మీ… సోప్ లేదు…. ఏం
చేయమంటావ్? అని ఒకటే చిరాకు.

పద్దెనిమిదేళ్లుంటాయ్ వాడికి. దున్నపోతంత అయ్యాడు. స్నానానికి వెళ్లేముందు సోప్ ఉందో లేదో చూసుకోవచ్చుగా?
ముందురోజే ఇంట్లో అవసరమైన సరుకులన్నీ రాసి శ్రీవారు ఆఫీసుకు వెళుతుంటే జేబులో ఆ కాగితం పెట్టింది తీసుకురమ్మని. కాని ఆయనగారు ఆఫీసయ్యాక- పెత్తనాలన్నీ చేసి- ఉత్త చేతులతో ఊపుకుంటూ వచ్చి- అందుకు ఫీలవకపోగా- ఎదురు
దబాయింపు. ఆ లిస్టులోనే సోప్ కూడా ఉంది. ఇప్పుడు సుపుత్రుడు సోప్ లేనిదే స్నానం చెయ్యడు.
చిన్నితల్లీ… కాస్త ఒక అడుగు వేసి అన్నయ్యకు సబ్బు
తెచ్చివ్వమ్మా….
నేను తేను… చిరాకు…
ఆమె త్వరత్వరగా టిఫిను టేబుల్ మీద సర్ది, జుట్టు ముడి వేసుకొని, దగ్గరలో ఉన్న స్టోర్‌కు వెళ్లి సబ్బు కొనుక్కొచ్చింది. అయినా సుపుత్రుడికి సంతృప్తి లేదు. హు… ఇది నా బ్రాండ్ కాదు… అని రుసరుసలాడిపోతూ అదే సోపుతో బాత్‌రూమ్‌లోకి వెళ్లాడు.
వెళ్లవలసిన వాళ్లందరూ వెళ్లిపోయారు. వాన వెలిసి హరివిల్లు విరిసింది ఇంట్లో.

ఆమె హమ్మయ్య అనుకుంది. ఆ తర్వాత మిగిలిన ఇంటి పనులన్నీ తీరిగ్గా చేసుకుంది. ఇంటి పనులు చేసుకోవడం ఆమెకు ఇష్టం. ఏనాడూ ఆ పనులను కష్టం అనుకోదు. కాని చేయించుకునేవాళ్లకే ఎంతో కష్టంగా ఉంది.
బయట చక్కటి ఎండ కాస్తోంది. ఆమె
ఆ ఎండను చూసి ఆనందించింది. మొన్న నర్సరీ నుంచి
కొనుక్కొచ్చిన బంతిపూలకు కొత్త మొగ్గలు తొడిగాయి. ఆమె వాటిని చూసి ఆనందించింది. ఈ మధ్య గింజల కోసం ఎక్కడి నుంచో రెండు పావురాలు వేళ తప్పకుండా ఎగిరి వస్తున్నాయి. ఆమె వాటికి కొన్ని గింజలు చల్లి ఎంతో ఆనందించింది. ఎంత ఆనందం ఉంది ఈ జగత్తులో! ఎన్ని చిన్న చిన్న సంతోషాలున్నాయి. వాటిని అనుభవించకుండా ప్రతిదానికి చిరాకు పడిపోతుంటారెందుకో ఈ మనుషులు!

ఆ సాయంత్రం శ్రీవారి బంధువులు ఊడిపడ్డారు. వాళ్లకు కాఫీలూ టిఫిన్లు… పకోడీలూ…
ఈలోపు పక్కింటి నుంచి పిలుపు. ఫోన్ వచ్చిందని.
అప్పుడప్పుడు చెల్లెలు ఫోన్ చేస్తూ ఉంటుంది. ఉండటం ఈ ఊళ్లోనే.
ఏంటే?
ఏం లేదు. సంతోష్ బర్త్ డే కదా ఇవాళ. ‘ఆమ’ లేకుండా కేక్ కట్ చేయనంటున్నాడు. వస్తావా?
అయ్యో. ఇప్పుడా చెప్పడం. ఇవతల బంధువులు వచ్చున్నారు.
నాకు తెలుసు. నీకు కుదరదని. అందుకే నిన్ను పిలవాలని
అనుకోలేదు. కాని సాయంత్రం స్కూలు నుంచి వచ్చినప్పటి నుంచి ఒకటే గోల. ఆమ.. ఆమ అని. సరే. ఏదో ఒకటి చేస్తాలే అని ఫోన్ పెట్టేసింది.

ఆమె మళ్లీ అతిథుల సేవలో మునిగిపోయింది. వాళ్లు వెళ్లిపోయారు. ఎనిమిది, ఎనిమిదిన్నరప్పుడు హటాత్తుగా తలుపు చప్పుడు. తెరిస్తే పన్నెండేళ్ల సంతోష్! తెల్లటి డ్రస్
వేసుకొని, చేతిలో గులాబీ పట్టుకొని…
దగ్గరికొచ్చి ఆ గులాబీ అందిస్తూ- నీకు పువ్వులంటే ఇష్టం కదా ఆమా… అన్నాడు నవ్వుతూ.
ఆమె తబ్బిబ్బయ్యింది. అరె… ఒంటరిగా ఎందుకొచ్చావురా. అమ్మా నాన్నా ఎంత కంగారు పడతారు?
నాకు నువ్వంటే ఇష్టం కదా ఆమా. ఈ రోజు నిన్ను తప్పకుండా చూడాలనిపించింది. ఇవాళ నా పుట్టిన రోజు కదా అందుకు. ఈ పుట్టిన రోజు రేపు ఉండదు కదా ఆమా….

కత్తి పెట్టి కొబ్బరిని చెక్కితే జివ్వున నీళ్లు చిమ్మినట్టు ఆమె హృదయంలో ప్రేమ చిమ్మింది. కళ్లల్లో నీళ్లు చిమ్మాయి. ఆమెలోని అణువణువూ కరిగి నీరయ్యి ఆ పసివాడి పాదాల దగ్గర అలలు అలలుగా కొట్టుకుంటూ…
ఎంత మాటన్నావురా కన్నా. ఎంత మంచి మాట చెప్పావు. ‘నాకు నువ్వంటే ఇష్టం’… అనే మూడు మాటలు విని ఎన్ని జన్మలైందిరా. అరిచే వాళ్లు, కరిచేవాళ్లు,
అదిలించే వాళ్లు, బెదిరించే వాళ్లు, హక్కు ప్రదర్శించే వాళ్లు, బాధ్యతను గుర్తు చేసేవాళ్లు… వీళ్లు తప్ప… వీరందరూ తప్ప… నన్ను నన్నుగా గుర్తించి… నాకు నువ్వంటే ఇష్టం అని చెప్పేవాళ్లు ఎవరూ లేరురా. ఇవాళ ఆ మాట చెప్పి నా జీవితంలో ఈ క్షణాన్ని శాశ్వతం చేశావు కదరా బంగారు తండ్రీ…
ఆమె వాణ్ణి ఒక్క ఉదుటున చేరుకొని కావలించుకుంది.
వాడు- అదనంగా- మరికొన్ని మాణిక్యాలు ఆమె దోసిళ్లలో పడవేస్తున్నట్టుగా- ఆమె బుగ్గన- ఒక ముద్దు పెట్టాడు.
కథ ముగిసింది.

రచయిత్రి జయ 1980లో రాసిన కథ- ఆనందో బ్రహ్మ- ఇది.
దీనికి వ్యాఖ్యానం చెప్పమంటారా? ఏమీ అక్కర్లేదు.
మీరు భర్త అయితే మీ భార్య పట్ల బాధ్యతతో కాకుండా ప్రేమగా ఉండండి. మీరు కుమారుడు అయితే మీ తల్లి పట్ల దయతో కాకుండా ప్రేమగా ఉండండి. మీరు కుమార్తె అయితే మీ అమ్మ పట్ల చనువుతో కాకుండా ప్రేమగా ఉండండి. దయా కరుణా వంటివి ప్రవక్తలు ప్రదర్శిస్తారు. కృతజ్ఞత శునకాలు కూడా ప్రదర్శిస్తాయి.
కాని ప్రేమను ప్రదర్శించడం మనుషుల పని.
మనుషులు చేయవలసిన ఉత్తమమైన పని.
ఆ పని చేయండి.
– సాక్షి ఫ్యామిలీ

బి.జయ (కలిదిండి జయ): కథలు, కవిత్వం రాసి ఫిల్మ్ జర్నలిస్టుగా కెరీర్ ఎంచుకుని సినీ దర్శకురాలిగా స్థిరపడ్డారు. దాదాపు నలభై కథలు రాసి ఎనభయ్యవ దశకంలో కొత్త గొంతుకగా గుర్తింపు పొందారు. స్వస్థలం ప.గో.జిల్లా సిద్ధాంతం. నివాసం హైద్రాబాద్. ఫోన్:9866622272

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top