You Are Here: Home » చిన్నారి » మూడు చేపల కథ

మూడు చేపల కథ

ఒక చెరువులో మూడు చే పలుండేవి. ఇంకా చాలా చేపలున్నా అవి మూడు మాత్రం మంచి స్నేహితులు. వాటిలో ఒకటి జ్ఞాని. ఏదైనా పని చేసే ముందు ఆలోచించి చేయడం దానికి అలవాటు. రెండవ చేప తెలివి గలది.

తన తెలివితో ఎటువంటి సమస్యనైనా పరిష్కరించేసేది. మూడవది అన్నిటికన్నా చిన్న చేప. జరిగేవన్ని ఎలాగూ జరుగక మానవు కదా, మరి ఎందుకు మనం శ్రమ పడాలి అన్న వాదం ఆ చేపది. అందుకని, ఎటువంటి సమస్య వచ్చినా జరిగేది జరుగుతుందని, ఏ ప్రయత్నము చెయ్యకుండా ఉండేది.

ఒకరోజు ఆ చెరువు ఒడ్డు దగ్గర ఈదుతుంటే, జ్ఞాని చేపకి ఇద్దరు మాట్లాడుకోవడం వినిపించింది. ‘‘ఈ చెరువులో చాలా చేపలున్నాయి. మనం రేపు వచ్చి వీటిని పడదాం’’ అన్నాడు ఒకతను. ‘‘సరే’’ అన్నాడు మరొకడు.

వెంటనే జ్ఞాని చేప తన మిత్రుల దగ్గరకు వెళ్లి, జరిగినంతా చెప్పి, ‘‘ఏదో రకంగా మనం ఈ చెరువుని వదలి వెళ్లాలి’’ అంది.

రెండవ చేప ‘‘ఇంతకాలం నుండి ఈ చెరువులో బతుకుతున్నాం. దీన్ని వదలి ఎక్కడికెళతాం? ఎలాగోలా సమస్యను ఇక్కడే ఎదుర్కో వాలి’’ అంది.

మూడవది ‘‘రేపు వాళ్లు వస్తారన్న నమ్మకం ఏమిటి? ఒకవేళ వచ్చినా, మనం ఏం చేయగలం’’ అంది. మొదటి చేప ‘‘సరే మిత్రులారా, బతికుంటే మళ్లీ కలుద్దాం’’ అని చెప్పి ఒక సన్నని కాలువ గుండా వేరే చిన్న చెరువులోకి వెళ్లిపోయింది.

ఆ మరునాడు జాలరులు వచ్చి వలలు విసిరారు. ఆ వలల్లో ఇద్దరు స్నేహితులు కూడా చిక్కారు. రెండవ చేప, తెలివిగా చచ్చినట్లు నటించింది. మూడవ చేప ఏమీ చేయకుండా అలాగే ఉండిపోయింది. జాలరులు చేపలని వలనుండి బయటకి తీసేటప్పుడు చచ్చినట్లు ఉన్న రెండవ చేపను తీసి చెరువులో విసిరేశారు. అది ఆనందంగా ఈదుకుంటూ వెళ్లిపోయింది. పాపం మూడవ చేప తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేయక జాలరులకు చిక్కిపోయింది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top