You Are Here: Home » చిన్నారి » ముగ్గురు స్నేహితులు

ముగ్గురు స్నేహితులు

అనగనగా ఒక ఊరిలో సత్యం, శివం, సుందరం అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. చిన్నప్పటి నుంచి వారు ఒకరికొరకు సహాయం చేసుకుంటూ ఉండేవారు. వారి స్నేహాన్ని గుర్తించిన తల్లిదండ్రులు ఆ ముగ్గురినీ ఒకే గురుకులంలో చేర్పించారు. కొంతకాలానికి ఆ ముగ్గురూ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఇళ్లకు తిరిగి వచ్చారు. వారి తెలివిని, ప్రావీణ్యాన్ని గుర్తించిన తల్లిదండ్రులు ‘మీ తెలివితేటలతో రాజు గారి ఆస్థానంలో ఉద్యోగాలు సంపాదించుకోండి’ అని ప్రోత్సహించారు.

ఒకరోజు స్నేహితులు ముగ్గురూ రాజుగారి ఆస్థానానికి బయలుదేరారు. రాజుగారిని కలిసి ముగ్గురికీ ఒకేచోట ఉద్యోగం ఇప్పించమని కోరారు. అప్పుడు రాజు ‘‘నేను మీకు ఒక పరీక్ష పెడతాను. అందులో గెలిస్తే మీ ముగ్గురికీ ఉద్యోగాలు ఇస్తాను’’ అని చెప్పాడు. అంతలో కొందరు భటులు కొన్ని చెక్క పెట్టెలను మోసుకొని వచ్చి రాజు గారి ముందు పెట్టారు. రాజు ‘‘ఈ పెట్టెల్ని తెరిచి చూడకూడదు, ముట్టుకోకూడదు. మీరు ఉన్నచోటు నుంచి కదలకుండా వాటిలో ఏం ఉన్నాయో చెప్పాలి. అప్పుడే మీరు తెలివైనవారని ఒప్పుకుంటాను, మీరు చెప్పలేకపోతే మారు మాట్లాడకుండా మీ గ్రామానికి తిరిగి వెళ్లిపోవాలి’’ అని చెప్పాడు.

ముగ్గురూ కొద్దిసేపు వారిలో వారు మాట్లాడుకున్నారు. అప్పుడు సుందరం ‘‘మహారాజా! ఆ పెట్టెల్లో ఉన్నవి మామిడి కాయలు’’ అన్నాడు. దానికి రాజు ‘‘నిజానికి ఆ పెట్టెల్లో ఏం ఉన్నాయో నాకు కూడా తెలియదు. మీరు చెప్పిన సమాధానానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా?’’ అని అడిగాడు.

‘‘భటులు ఆ పెట్టెలు మోసుకొచ్చిన విధానం చూస్తే వాటిల్లో ఉన్నవి మరీ బరువైన లోహాల లాంటివి కాదని, తేలికగా ఉండేవే అయి ఉంటాయని నా స్నేహితులతో చెప్పాను’’ అన్నాడు సత్యం. ఆ తర్వాత శివం ‘‘ఆ పెట్టెలు కిందకు దింపుతున్నప్పుడు అవి దొర్లినట్టుగా శబ్దం వచ్చింది. కాబట్టి అవి గుండ్రటివి కావచ్చని చెప్పాను’’ అన్నాడు.

అప్పుడు సుందరం ‘‘నా స్నేహితుడు చెప్పిన ఆధారాలను బట్టి మరీ బరువు లేకుండా, గుండ్రంగా ఉండేవి ఏమై ఉంటాయా అని ఆలోచించాను . భటులు ఆ పెట్టెలను తూర్పు వైపున ఉన్న ద్వారం గుండా లోపలకి తీసుకొని వచ్చారు. అటు వైపున మామిడితోటలు ఉన్నాయి. పైగా ఇది వేసవి కాలం. కాబట్టి ఇవి మామిడికాయలు అయి ఉంటాయని ఊహించాను’’ అని వివరించాడు. రాజు ఆ ముగ్గురి తెలివితేటలను అభినందించి వారిని తన ఆంతరంగిక సలహాదారులుగా నియమించాడు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top