You Are Here: Home » సఖి » రుచి » ‘మీల్‌ మేకర్‌’ తో కొన్ని వంటలు

‘మీల్‌ మేకర్‌’ తో కొన్ని వంటలు

మీల్‌ మేకర్‌ గురించిన ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తక్కువ సమయంలో వంట చేయాల్సి వచ్చినప్పుడు వంటింట్లో గృహిణిని ఆదుకునేది ఇదే. దీంతో చేసిన వంటకాలను పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. నాన్‌వెజ్‌కు దూరంగా ఉండేవారు దీన్ని మరింత ఇష్టంగా భుజిస్తారు. ఇందులో పోషక విలువలు కూడా ఎక్కువేనని పాకశాస్త్ర నిపుణులు చెబుతుంటారు. మీల్‌మేకర్‌తో కొన్ని రుచికరమైన వంటలు మీ కోసం….

ఖీమా హల్వా

కావలసిన వస్తువులు:
meal-makerమీల్‌ మేకర్‌ ఖీమా : 1/2 కిలో
చక్కెర: ఒక కప్పు
క్యారెట్‌ లేదా బీట్‌రూట్‌ తురుము: ఒక కప్పు
నెయ్యి: 100 గ్రాములు
ఇలాయిచీ పొడి: చిటికెడు
జీడీపప్పు, ద్రాక్ష: 25 గ్రాములు
పాలు: 2 కప్పులు
తయారు చేసే విధానం:
ముందుగా మీల్‌ మేకర్‌లో కొద్దిగా ఉప్పు వేసి 5 విజిల్స్‌ వచ్చేదాకా ఉడికించి జార్‌లో ఖీమా బ్లేడ్‌ పెట్టి ఖీమాలాగా చేసిపెట్టుకోవాలి. స్టవ్‌ మీద బాణలి పెట్టి నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్‌ వేయించి పక్కనబెట్టు కోవాలి. క్యారెట్‌ తురుము వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో పాలు పోసి బాగా వేడి చేసి అందులో వేయించిన క్యారెట్‌, ఉడికించిన సోయా ఖీమా వేసి తిప్పుతూ బాగా మెత్తగా ఉడకనిచ్చి ఇలాయిచి పొడి వేసి నెయ్యి తేలేలాగా దగ్గర కానివ్వాలి. దించే ముందు వేయించిన డ్రై ఫ్రూట్స్‌ వేసి దించాలి. ఇది కొద్దిగా చల్లారాక సర్వ్‌ చేసుకోవాలి. వెరైటీగా, రుచిగా ఉంటుంది.

పులావ్‌

కావలసిన వస్తువులు:
meal-maker-pulaoమీల్‌మేకర్‌ : 250 గ్రాములు
బాస్మతి బియ్యం: 250 గ్రా
నెయ్యి, నూనె: 100 గ్రాములు
ఉప్పు: ఒక టేబుల్‌ స్పూన్‌
దాల్చిన చెక్క: ఒక ముక్క
అల్లం: 25 గ్రాములు
వెల్లుల్లి రెబ్బలు: ఒక గుప్పెడు
యాలకులు: 3
లవంగాలు -15
బిర్యానీ ఆకులు -2
పుదీనా- 4 రెబ్బలు
కొత్తిమీర- 4 రెబ్బలు
పచ్చిమిర్చీ-4
ఉడికించిన గ్రీన్‌పీస్‌ – 50 గ్రాములు
ఆలుముక్కలు – 1 చిన్న కప్పు
ఉల్లి తరుగు: ఒక చిన్న కప్పు
తయారు చేసే విధానం:
ముందుగా ఆలు ముక్కలు, గ్రీన్‌పీస్‌, సోయా (మీల్‌మేకర్‌) విడివిడిగా ఉడికించుకోవాలి. స్టవ్‌పై చిన్న కుక్కర్‌ పెట్టి నెయ్యి, నూనె వేసి కొద్దిగా వేడి చేయాలి. ఇలాయిచి, దాల్చిన,సగం అల్లం, సగం వెల్లుల్లి పేస్ట్‌ వేసి వేయించాలి. అందులోనే బిర్యానీ ఆకులు, కొత్తిమీర, పుదీనా, ఉల్లితరుగు వేసి వేయించాలి. ఆ తర్వాత మిగతా అల్లం, వెల్లు ల్లి పేస్ట్‌ వేసి మంచి వాసన, రం గు, రుచి వచ్చేదాకా వేయించి, గ్రీన్‌ పీస్‌, ఆలు ముక్కలు, సోయా ముక్కలు ఉడికించినవి వేసి వేయించి తగినంత నీరు (2 కప్పులు), ఉప్పు వేసి కడిగిన బియ్యం వేసి 4 విజిల్స్‌ వచ్చే వరకు ఉంచాలి. మంచి సోయా పులావ్‌ రెడీ. దీన్ని సోయా ఖుర్మా లేదా బఠానీ ఖూర్మా లేదా పుదీనా చట్నీతో తినవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. చాలా త్వరగా అయిపోతుంది.

దాల్చా

కావలసిన వస్తువులు:
meal-maker-dalchaమీల్‌ మేకర్‌ – 100 గ్రాములు
కందిపప్పు – 50 గ్రాములు
కొబ్బరి- చిన్న ముక్క
కొత్తిమీర – నాలుగు రెమ్మలు
టమాటలు – 4
చింతపండు రసం – ఒక కప్పు
ఉల్లి తరుగు – 1/2 ఉల్లిపాయ
ఉప్పు – అర టీస్పూన్‌
కారం- ఒక టీ స్పూన్‌
ధనియాల పొడి – 3 టీ స్పూన్‌లు
పసుపు – చిటికెడు
తయారుచేసే విధానం:
ముందుగా సోయా ఉడికించి పెట్టుకోవాలి. స్టవ్‌ మీద కుక్కర్‌ చిన్నగా పెట్టి ఉడికించిన సోయా, ఉప్పు, పసుపు, 2 రెమ్మల కొత్తిమీర తరుగు వేసి 1 నిమిషం సన్నని సెగ మీద తిప్పాలి. ఆ తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా ఉడకనివ్వాలి. కొబ్బరి మిశ్రమం, కంది బేడల మిశ్రమం, చింతపండు రసం వేసి బాగా 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. కమ్మని సోయా మీల్‌మేకర్‌ దాల్చా రెడీ. ఇది అన్నం రోటీ, పూరీ ఎందులోకైనా రుచిగా ఉంటుంది. ఆయిల్‌ లేకుండా కూడా దీన్ని వండవచ్చు.

– ఎం.దాక్షాయణి
మదనపల్లి, చిత్తూరు జిల్లా

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top