You Are Here: Home » చిన్నారి » స్ఫూర్తి » ఆత్మకథ » మిమిక్రీ ఆషాజీ

మిమిక్రీ ఆషాజీ

మిమిక్రీ ఆషాజీ

 

ఒక వ్యక్తి ఒక కళలో నైపుణ్యం సాధిస్తే గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఒక్కరే పలు కళల్లో ప్రజ్ఞ కనబరిస్తే వారిని బహుముఖ ప్రజ్ఞాశాలిగా కొనియాడతాం. అలా పలు కళల్లో ప్రజ్ఞ కనబరుస్తూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న నటి, యాంకర్‌, లైవ్‌ పెర్‌ఫార్మర్‌, ఆర్టిస్ట్‌ కోఆర్డినేటర్‌, షో అరేంజర్‌, రైటర్‌ ఆషాసింగ్‌ మన దేశపు మెుట్టమెుదటి మహిళా మిమిక్రీ కళాకారిణిగా గణతిెకక్కారు. ఆషా నాగపూర్‌ వాసి.
aashajee0దాదాపు 20ఏళ్ళ కిందట మిమిక్రీ ఆర్టిస్టుగా స్టేజ్‌ షోలు ఇస్తూ నలుగురి దృష్టినీ ఆకర్షించారామె. అప్పటి వరకు మగవారు మాత్రమే మిమిక్రీ ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆ సంప్రదాయాన్ని తోసిరాజని ఆషా పలు స్టేజ్‌ షోలలో ఒకనాటి ప్రముఖ నటీమణులు మీనాకుమారి, ఆషాపరేఖ్‌, షర్మిలాటాగూర్‌, శ్రీదేవి, మాధురీదీక్షిత్‌, కరిష్మాకపూర్‌ వంటి తారల గొంతును అచ్చుగుద్దినట్టు పలికించి ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకునేవారు.

అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆమె తన నివాసాన్ని ముంబైకి మార్చారు. అక్కడికి వెళ్లాక ఆమె మిమిక్రీ షోలతో బాగా బిజీ అయ్యారు. దాంతో పాటే కొన్ని టీవీ సీరియల్స్‌లోనూ నటించే అవకాశాలు సంపాదించారు. అలా ఒక పక్క మిమిక్రీ ప్రదర్శనలు ఇస్తూ టీవీల్లో నటిస్తూనే ఆషా మ్యూజికల్‌ గ్రూప్‌ను స్థాపించి, భిలాయ్‌లో ఉన్న భిలాయ్‌ స్టీల్‌ ప్లాంట్‌, సహారా లేక్‌ సిటీ, అంబీవాలీ, హోటల్‌ సీ ప్రిన్సెస్‌, రామీ గెస్‌‌టలైన్‌, నిషీల్యాండ్‌ పార్క్‌ వంటి చోట్ల ఆర్కెస్ట్రాలు ఇచ్చేవారు.

ప్రతి న్యూ ఇయర్‌ వేడుకలలో నాగపూర్‌లోని ప్రముఖ హోటళ్ళలో ఆమె మిమిక్రీ ప్రోగ్రామ్‌ గానీ, ఆర్కెస్ట్రా గానీ ఉండాల్సిందే. అంతలా ఆమె నాగపూర్‌ వాసుల హృదయాలను దోచుకున్నారు.1986లో నాగపూర్‌కు చెందిన ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఉత్సవాలకు హాజరైన బిగ్‌బి అమితాబ్‌ ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆషా సింగ్‌ మిమిక్రీ ప్రదర్శనను చూసి ఆమె ప్రతిభను ఎంతగానో మెచ్చుకున్నారు. బాలీవుడ్‌ సినిమాల్లో ట్రై చేయమని సలహా ఇచ్చారు.

aashajeeఇదిలా ఉండగా 1997లో ఆషాసింగ్‌ ఆధ్వర్యంలో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలలో అతిపెద్ద స్టార్‌ షోను ఏర్పాటు చేసారు. ఆ షోలో అప్పటి ప్రముఖ బాలీవుడ్‌ హీరో మిధున్‌ చక్రవర్తి, అస్రానీ, గుల్షన్‌గ్రోవర్‌, ఖాదర్‌ఖాన్‌ వంటివారు పార్టిసిపేట్‌ చేసారు. అక్కడ ఆషా ప్రదర్శించిన మిమిక్రీ ఐటెమ్స్‌ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అక్కడి నుంచి ఆషా పేరు బాలీవుడ్‌లో కూడా తరచూ వినిపించడం ప్రారంభించింది. దాంతో ఆమెకు పలు సినిమాల్లో నటించే అవకాశం కూడా వచ్చింది. అలా ఆమె బాజీగర్‌, ఆగ్‌, న్యాయ్‌ అన్యాయ్‌, ఏ ఆగ్‌ కబ్‌ భుజేగీ, దో మత్వాలే, స్వర్గ్‌ జైసా ఘర్‌, పోలీస్‌ ఆఫీసర్‌, దీదర్‌, దివ్యశక్తి, ఖుదాకానూన్‌, మహబూబ్‌ మేరే మహ్‌బూబ్‌, గీత్‌ మిలన్‌కె గాతే రహేంగే, కహానీ కిస్మత్‌కీ వంటి బాలీవుడ్‌ చిత్రాలతో పాటు భోజ్‌పురి, రాజస్థానీ, గుజరాతీ, చత్తీస్‌ ఘడ్‌, పంజాబీ వంటి విభిన్న భాషా చిత్రాల్లో కూడా నటించారు.

ఇక టీవీ సీరియల్స్‌ విషయానికి వస్తే మహాభారత్‌, కిస్సేమియా బీవీకే, మజ్‌దార్‌, ఆఖిరీ దావ్‌, ఉల్జీరహే, చల్తీరహే, జిందగీ, పూల్‌ కిలే గుల్షన్‌ గుల్షన్‌, ఇంద్రధనుష్‌, మిట్టీకే రంగ్‌, చంద్రకాంత్‌, విరాట్‌, అపరాజిత, అర్థాంగిని, ఔరత్‌, కామ్‌యాబీ, జానూన్‌, సాహిల్‌, షేక్‌, రిపోర్టర్‌, కమాండర్‌, పరంపర, అపరాధ్‌, దరార్‌, యూలే లవ్‌ స్టోరీస్‌, అక్బర్‌ బీర్బల్‌, షాహీన్‌, నజ్జీకియాన్‌, కామినీ దామినీ వంటి వాటిలో నటించారు. నాగపూర్‌లోని సంప్రదాయ కుటుంబానికి చెందిన ఆషాసింగ్‌కి చిన్నతనం నుంచీ కళలంటే ఎంతో మక్కువ. సినిమాలు ఎక్కువగా చూసేవారు. ముఖ్యంగా ఆమె మీనాకుమారిని ఆరాధించేవారు. దాంతో తనకు తెలియకుండానే ఆమెపై మీనాకుమారి ప్రభావం పడింది.

ఆమెలానే మాట్లాడేందుకు, కనిపించేందుకు ప్రయత్నించేవారు. ఆమె ధోరణికి ఇంట్లోవారు తొలుత అభ్యంతరం తెలిపినా తర్వాత తర్వాత అలవాటు చేసుకున్నారు. పెళ్ళయ్యాక కూడా ఆమె ధోరణిలో మార్పు రాలేదు. అయితే ఆమె భర్త ఆమెను ఏనాడూ ఆమెపై ఎటువంటి ఆంక్షలు పెట్టేవారు కాదు. భర్త ఇచ్చిన ప్రోత్సాహంతో మెల్లగా తెలిసిన వారి ముందు చేసే మిమిక్రీని బయట స్టేజ్‌పై చేయడం మొదలుపెట్టారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top