You Are Here: Home » చిన్నారి » మానవసేవయే మాధవసేవ

మానవసేవయే మాధవసేవ

అనగనగా ఒక రాజ్యంలో సుసేనుడు అనే రాజు ఉండేవాడు. రాజ్యపాలన పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరించేవాడు. సుసేనుడికి ప్రజల బాగోగుల గురించి స్వయంగా తెలుసుకోవాలని ఉండేది. కానీ రాజ్యపాలనలో తలమునకలై ఉన్నందువల్ల రాజుకి సమయం చిక్కేది కాదు.

ఒకరోజు వీలు చూసుకొని రాజ్య పర్యటనకి బయలుదేరాడు. ప్రజలు గుర్తుపట్టకుండా ఉండటానికి మారువేషం ధరించాడు. ముందుగా ఒక గ్రామానికి వెళ్లాడు. అక్కడ సుసేనుడికి కాలిబాట పక్కన నెమ్మదిగా నడుస్తూ వెళ్తున్న ఒక ముసలి అవ్వ అకస్మాత్తుగా కిందపడిపోవడం కనిపించింది. ఆమె ‘దాహం. .దాహం..’ అంటూ మూలుగుతోంది. కానీ ఆమెని ఎవరూ పట్టించుకోలేదు. ఆ పక్కనే ఒక గుడి ఉంది. ఆ గుడి పూజారి చెరువు నుంచి బిందెతో నీళ్లు తీసుకొని ఆ పక్కగా వెళ్తున్నాడు. కానీ ముసలి అవ్వకు మంచినీళ్లు ఇవ్వలేదు. దీన్ని గమనించిన సుసేనుడు పూజారి దగ్గర ఉన్న నీళ్లను లాక్కొని ముసలి అవ్వ దాహం తీర్చాడు.

కొన్ని నీళ్లు ఆమె ముఖం పైన చిలకరించాడు. అప్పుడు ఆ పూజారి ‘‘ఎంత అపచారం జరిగిపోయింది. దేవుని అభిషేకానికి తీసుకెళ్తున్న నీళ్లను లాక్కుంటావా? అసలు ఎవరు నువ్వు? ఎక్కడ నుంచి వచ్చావు?’’ అన్నాడు. ‘‘నేనెవరైతే ఏమిటి, దాహంతో ఉన్న వారికి నీళ్లివ్వడం అపచారం ఎలా అవుతుంది?’’ అని ఎదురు ప్రశ్నించాడు సుసేనుడు. ‘‘ఎంత ధైర్యం నీకు. నీ సంగతి చూస్తాను. ఇప్పుడే రాజు గారికి ఫిర్యాదు చేస్తాను’’ అని మారువేషంలో ఉన్న సుసేనుడిపై పూజారి మండిపడ్డాడు. దీనికి రాజు స్పందించి ‘‘నేనే రాజును’’ అన్నాడు. ఆ మాటతో ఖంగుతిన్న పూజారి ఆయన తనకు ఏం శిక్ష విధిస్తాడోనని భయపడి క్షమాపణ కోరాడు.

అప్పుడు రాజు ‘‘పూజారిగారూ! నేను రాజుని కాబట్టి మీరు నన్ను క్షమాపణ కోరారు. అదే వేరే వ్యక్తి అయితే అతనిపై నాకు ఫిర్యాదు చేసేవారు కదా! అతన్ని శిక్షించమని కోరేవారు కదా! కింద పడిపోయిన ముసలి అవ్వకు మంచినీళ్లు ఇవ్వటం తప్పు ఎలా అవుతుంది? మీరు చేయాల్సిన పనిని వేరే వ్యక్తి చేశాడు. మనం ఆపదలో ఉన్న వారిని ఆదుకోకుండా దేవునికి పూజ చేసినంత మాత్రాన దేవుడి అనుగ్రహం పొందలేం. ఇక నుంచైనా తోటి మానవుల పట్ల మానవత్వంతో మసలుకో’’ అని రాజు పూజారిని మందలించి పంపాడు.

ముసలి అవ్వ రాజు మంచితనానికి ఎంతో సంతోషించి, పది కాలాలపాటు చల్లగా బతకాలని దీవించింది. పూజారి కూడా తన చాదస్తం విడిచి, మానవసేవే మాధవసేవ అని తెలుసుకున్నాడు.

నీతి : ఆపదలో ఉన్నవ్యక్తికి సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్లే.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top