You Are Here: Home » చిన్నారి » మాట దప్పిన బతుకు గదా…

మాట దప్పిన బతుకు గదా…

‘అరే బచ్చే… నువ్వు నాకో మాటియ్యాలి నాయనా’ అని నా రెండు చేతుల్ని గట్టింగా పట్టుకునింది మా పెదమ్మ, మూడు నెలల కిందట మా ఊరికి బోయినప్పుడు.
మా పెదమ్మ పేరు కరీమా. పేరు చివర ‘మా’ అనుంటే అమ్మని పిలిచినట్టుగా ఉంటుందని నిఖా అయినాక మా పెదనాయన ఆ పేరును కాస్తా ‘కరీమున్’ చేసుకున్నాడు నైసుగా. ఆయన కూడా నైసు మనిషే. రా పోదాం డిల్లీకి అని ఎయిర్ ఫోర్సు ఉద్యోగం కోసరం కాపరానికి తీసకపోతే అంత పెద్ద ఊరిని కాదని ఆ మరుసటిరోజే ఆయన చెయ్యి యిదిలించికొట్టి కావలి రైలుకు టికెట్లు కొనిపించింది మా పెదమ్మ.
ఊరికి రావడం రావడం మా అమమ్మను వాటేసుకొని ‘తలుపు తెరిస్తే చాలు సల్లగాలి గొట్టే ఆ పాడుబడిన ఊరిలో నేనుండలేను తల్లో’ అని ఏడిస్తే, ఆ ఏడుపుకు అమ్మలక్కలంతా జేరి ‘మిలట్రీ వాడికిచ్చి పసిదాని గొంతు కోసినారు అమ్మలాలో’ అని ముక్కు చీదుకున్నారు. ఈ ఏడుపంతా ఎందుకని మా పెదనాయన ఆ బంగారంలాంటి ఉద్యోగానికి ఎగనామం పెట్టి కావలి దగ్గరే వడ్లు పండించే పనికి దిగిపోయినాడు.
అప్పట్నించి మా పెదమ్మ బతుకంతా కావలిలోనే. మొగుడు, నలగరు పిలకాయలు… రెండో చెల్లెలైన మా అమ్మ, మేమొక నలగరం పిలకాయలం, ఇంకో ఇద్దరు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు, వాళ్ల పిల్లాపీసూ…. ఇదే లోకం.
‘ఇంతమంది నా వాళ్లందరినీ చూసుకోకుండా ఒకరోజైనా ఊపిరి తీయగలనా?’ అంటా ఉండేది మా పెదమ్మ.
అయితే యీళ్లందరిలోకెల్లా నేనంటేనే మా పెదమ్మకు రొంత దగ్గిర. తన సొంత పిలకాయల్లో, తోడబుట్టినోళ్ల పిలకాయల్లో నేనొక్కణ్ణే తొలిమారు డిగ్రీ దాకా చదివినానని, చదివాక కావలిలోనే ఏదో ఒక కిళ్లీ బంకు పెట్టుకొని ఉండిపోకుండా హైద్రాబాదు దాకా చేరి ఎంత లేదన్నా పది వేలకు పైబడిన ఉద్యోగం చేస్తా ఉన్నానని, బ్యాంకీలో లక్షో రెండు లక్షలో దాచిపెట్టి గొప్ప బతుకు బతకతా ఉంటానని మా పెదమ్మకి అబిమానం.
మా చెల్లెలి పెళ్లిలో ఆడోళ్లంతా పలావు కోసరం ఆకులు సర్దుకుంటా ఉంటే మా పెదమ్మ అన్నం ఊసే ఎత్తకుండా నన్ను పక్కకి పిలిచి, బుగ్గలు పుణికి ‘బచ్చే… మీ నాయన చనిపోయినాక మీ అమ్మ అమాయకురాలు… మీరంతా చెట్టుకొకరు పుట్టకొకరుగా నాశినం అయిపోతారని అంతా ఆశించినారు. కానీ నువ్వు కట్టు చెదరకుండా ఇల్లు నిలబెట్టుకున్నావు. అప్పోసప్పో చేసి చెల్లెలి పెళ్లి దర్జాగా చేసినావు. ఇంతకంటే ఏం గావాలి? నా ఆయుష్షు కూడా పోసుకో నాయనా’ అని కడుపు నిండుగా దీవించింది.
అంత ఇష్టపడే మనిషి ఇప్పుడు ఈ కోరిక కోరింది.
‘బచ్చే… నాకు తెలుసురా… నా పని అయిపోయింది. ఈమారు నువ్వు వచ్చేపాటికి ఉండను. ఏం జరిగినా నా కబురు ఎప్పుడు చేరినా నువ్వు మాత్రం నా చావుకు తప్పక రావాలి. అలాగని మాటివ్వు నాయనా’ అంది.
‘చ.. ఏం మాటలవి.. అమఖాలా’ అన్నాను.
‘అవునురా. నేను పోతే ఊళ్లో ఉన్నోళ్లందరూ నాకాడ నిలబడి ఏడ్వడం నాకేం గొప్ప? అంత దూరం నుంచి నువ్వొచ్చి రెండు చుక్కలు రాల్చితే… చూశారా పెదమ్మ కోసరం లీవు పెట్టి మరీ వచ్చినాడు అని చెప్పుకుంటే గొప్పగానీ’ అంది చేతులు వదలకుండా.
నెల్లూరులో డాక్టరు ఇక లాబం లేదు ఇంటికి తీసుకెళ్లండి అని చెబితే కావలికి తీసుకు వస్తా ఉండగానే దారిలో చనిపోయింది మా పెదమ్మ.
ఫోను వచ్చింది.
రైలు అందే టైము కూడా ఉండింది.
నేను వెళ్లలా.
నన్ను ఇష్టం చేసిన పెదమ్మ, మా అమ్మ మీద అలిగి వాళ్లింటికి పారిపోతే ఎర్రగెడ్డల పులుసుతో అన్నం తినిపించి కొనుక్కోవడానికి డబ్బులిచ్చిన పెదమ్మ, ఇన్నేళ్ల బతుకులో ఒక సుఖానికి నోచకపోయినా ఏనాడూ దైర్యాన్ని గడపదాటనివ్వని పెదమ్మ, మా ఇళ్లల్లో ఎక్కడ ఏ కార్యం జరిగినా తలోరకం గుడ్డలు కట్టుకున్న ఆడోళ్ల మద్యలో మేచింగ్ రవికా గాజులతో చామనసాయలో ముచ్చటగా కనిపించే మా పెదమ్మ్మ నా గుర్తుల్లో అట్టాగే ఉండిపోవాలనిపించి వెళ్లలా.
మొన్న కావలికి పోయినప్పుడు మా పెదమ్మ ఆకరు కొడుకు అవుపించి ‘ఏందనా. మరీ అన్యాయంగా’ అని నిష్టూరమాడి, వద్దు వద్దంటున్నా వినకుండా బలవంతంగా సెల్‌ఫోన్‌లో ప్రాణం లేని మా పెదమ్మను చూపించినాడు.
మంచం మీద తెల్ల వస్త్రం కప్పిన మా పెదమ్మ నా వంక చూసి ‘బచ్చే.. మాటదప్పిన బతుకు బతుకుతున్నావు గదరా’ అన్నట్టుగా నాకు అనిపించింది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top