You Are Here: Home » చిన్నారి » మనిషి కాసేపు మారిపోతాడు…

మనిషి కాసేపు మారిపోతాడు…

దేవుడా… శ్రీనివాసుడా… తండ్రీ… అనుకున్నారు చైర్మన్‌గారు. ఆ తర్వాత దేవుణ్ణి ఎలా స్తుతించాలో తెలియక బిక్కముఖం వేశారు. అలాగని ఆయన గుడికి వెళ్లడని కాదు. దేవుడంటే నమ్మకం లేకా కాదు. కాని, భక్తి కంటే ఎక్కువగా ముక్తికి ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. ముక్తి దేని వల్ల వస్తుంది? ఇంక దేని వల్ల? డబ్బు వల్ల. పైసా వల్ల. కరెన్సీ వల్ల. కాసుల వల్ల. ఇవి ఉంటే లోకం మాట వింటుందని నమ్ముతారు చైర్మన్‌గారు. అందుకోసమే ఆ డబ్బును పులిలా వేటాడుతారాయన. ఇవాళ ఆయనకు ఎన్ని కోట్లు ఉన్నాయో లెక్క లేదు. ఎన్ని సంస్థలు ఉన్నాయో గుర్తు లేదు. ఎన్ని భవంతులు ఉన్నాయో అంచనా లేదు.

అయితే- దురదృష్టం ఏమిటంటే- అవన్నీ- ఈ క్షణం ఆయనకు ఏ కోశానా పనికి రావడం లేదు.
ప్రస్తుతం ఆయన తన ఆఫీసు బాత్‌రూమ్‌లో చిక్కుబడి ఉన్నారు. ఎంతో ఖరీదైన బాత్‌రూమ్ అది. చైర్మన్‌గారి స్నానపానాల కోసమే ప్రత్యేకించి కట్టిన బాత్‌రూమ్. ప్రస్తుతం అదే ఆయనకు గోరీలా మారబోతోంది. డోర్ లాకై రావడం లేదు. ఆటోమాటిక్ లాక్. ఎంత లాగినా తలుపు తెరుచుకోవడం లేదు. లోపలి నుంచి అరిస్తే ఎవరికీ వినబడే అవకాశం లేదు. వెంటిలేటర్ నుంచి చూద్దామన్నా ఏమీ కనిపించే వీలు లేదు.

దబ్బపండులాంటి రంగు కలిగిన చైర్మన్‌గారి శరీరం చెమటతో భయంతో తడిసి ముద్దయిపోయింది. అసలే ఆయన జబ్బు మనిషి. ఇటీవలే రెండున్నర లక్షలు ఖర్చు పెట్టి అమెరికాకు వెళ్లి గుండె ఆపరేషన్ చేయించుకు వచ్చారు. డబ్బున్నవాళ్లకు ఆమాత్రం చికాకులేవో వస్తాయని ఆయనకు తెలుసు. వాటిని ఇలాగే ఖర్చు పెట్టుకొని సరి చేసుకుంటారనీ తెలుసు. పేదవాళ్లకు ఈ గొడవలూ ఇంత ఖరీదైన జబ్బులూ ఉండవు కదా ఒకరకంగా ధనవంతుల కంటే పేదవాళ్లే నయం కదా అని ఆయన అభిప్రాయం.

ఆ.. ఏం నయమండీ… ఆకలితో చస్తుంటారు శుంఠలు… ఇవాళ్టి ప్రాణానికి రేపు గ్యారంటీ లేదు.. ఎలాగూ మీరు వైద్యానికి అమెరికాకు వెళుతున్నారు… వెళ్లే ముందు ఏవైనా మంచి కార్యాలు చేయండి… పేదవాళ్లకు నాలుగు ఇళ్లన్నా కట్టించిపోండి… అన్నాడో మిత్రుడు చైర్మన్‌గారితో.
మళ్లీ వస్తావో చస్తావో అని మిత్రుడి ఉద్దేశం.

కాని, చైర్మన్‌గారికి ఇలాంటి డొల్ల మాటల్లో విశ్వాసం లేదు. ఎవరికీ ఏదీ అయాచితంగా ఇవ్వడం ఆయనకు ఇష్టం లేదు. ఇదంతా తాను కష్టపడి సంపాదించిన ఆస్తి. అందులోంచి కొంచెమైనా సరే పంచి పెట్టడమా? ఇంపాజిబుల్!
అదంతా ఇప్పుడు చైర్మన్‌గారికి గుర్తుకొస్తూ ఉంది. తాను ఈ బాత్‌రూమ్‌లోనే పోబోతున్నాడా? ఇక్కడే చావబోతున్నాడా? ఆయన అనుమతి లేకుండా ఛాంబర్‌లో అడుగుపెట్టే సాహసం ఎవరికీ లేదు. ఇక బాత్‌రూమ్‌లో ఏం జరుగుతుందో ఎవరికి తెలుస్తుంది?

దేవుడా… వేంకట రమణ… నన్ను బతికించవయ్యా.. అనుకున్నారు చైర్మనుగారు దీనంగా. ఆ తత్తరుపాటులోనే కమోడ్ మీద నుంచి జారి పడ్డారు. కమోడ్‌కూ గోడకూ మధ్య ఉన్న స్థలంలో సోలిపోయారు. నడుముకున్న టవల్ ఊడిపోయింది. కదల్లేక, మెదల్లేక, తల్లి కడుపులోని శిశువు వలే, నగ్నంగా పడి ఉన్నాడాయన.

ఆ క్షణంలో ఆయన మారిపోయాడు. పూర్తిగా మారిపోయాడు. ఎంతలా మారిపోవాలో అంతలా మారిపోయాడు. దేవుడా… బుద్ధి వచ్చింది… ఈ క్షణం నేను బతికి బట్టగట్టగలిగితే చాలు మారిపోతాను. నన్ను ఎవరైనా కాపాడితే చాలు వాళ్లకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తాను. నా సంపద ఇచ్చేస్తాను. నా సర్వస్వం ఇచ్చేస్తాను. ఇది తథ్యం. ఇది ఖాయం.
దేవుడు ఆయన మొర ఆలకించాడు. అప్పుడు పాకీ మనిషి పార్వతి అక్కడికి వచ్చింది. చైర్మన్‌గారంటే హరిహరాదులకు భయం. కాని పార్వతికి చనువు. ఆయన చాంబర్‌లో ఆయన అనుమతి లేకుండా అడుగుపెట్టే ఏకైక వ్యక్తి పార్వతే. అరమరికలు లేకుండా మాట్లాడగలిగే వ్యక్తి కూడా పార్వతే.
ఏటి బాబూ… పైదేశానికి వెళుతున్నావా వైద్యానికి అని అడిగింది పార్వతి- చైర్మన్‌గారు అమెరికాకు వెళ్లే ముందు.

అవునే… గుండె నొప్పి అన్నాడాయన వెళుతున్న కారణం చెప్తూ.
నీది బలే సిన్ని గుండె బాబూ… ఏదీ తట్టుకోలేదు… అంది పార్వతి ఎంతో దయగా, మరెంతో అపేక్షగా.
ఆ చిన్ని గుండె మనిషి, చైర్మన్‌గారు, ఇలా బాత్‌రూమ్‌లో చిక్కుకుపోయిన సంగతి పార్వతి గ్రహించింది. అత్యవసరంగా కదిలింది. ఏవో చువ్వలు, కడ్డీలు తెచ్చి ప్రయత్నించి క్షణాల్లో డోర్ లాక్ తీసింది.
ఆమె- చైర్మన్‌గారి అవస్థ చూసి ఆశ్చర్యపోయిందా? ఏమీ లేదు. ఇది అందరికీ సంభవించే ప్రమాదంలాంటిదే అన్నట్టుగా నిబ్బరంగా
ఆయనను లేవదీసింది. నడుముకు బట్ట కట్టింది. ఆ తర్వాత ఆయనను ఆయన గదిలోకి తీసుకొని వచ్చి, మంచం మీద పరుండబెట్టి బలేవారే బాబూ… బాత్‌రూమ్‌లో ఇరుక్కు
పోయినారా… నయమే… నేను రావడం ఆలస్యమైంది కాదు… అని ఆ తర్వాత బాత్‌రూమ్ కడగడానికి వెళ్లిపోయింది.
పార్వతికి సంబంధించినంత వరకూ ఆ ఉదంతం అంతటితో
ముగిసింది.
కాని- మరెందుకనో- ఆ మరుసటి రోజే చైర్మన్‌గారు పార్వతిని పనిలో నుంచి తీసేశారు.
కథ ముగిసింది.

రచయిత పురాణం సుబ్రహ్మణ్యశర్మ 1980లలో రాసిన కథ ఇది.
మనుషుల పేగుల్లో ఉండే కుళ్లు, మనుషుల్లో నిలువెల్లా ఉండే అహము, మనుషుల్లో ఏరు దాటి తెప్ప తగలేసే హీనత్వము, మనుషుల్లో చేసిన మేలు మర్చిపోయే మతిమరుపుగుణమూ, మనుషుల్లో అవసరం తీరాక ముఖం చాటేసే కుటిల బుద్ధీ…. ఇవన్నీ కలిపి చూపిన కథ ఇది.
చరిత్ర రెండు రకాలు.
ఒకటి- కృతజ్ఞత మీద నిర్మితమైనది. రెండు- కృతఘ్నత మీద నిర్మితమైనది.
ఒకటి వెలుగు. రెండు చీకటి.
వెలుగు గెలవాలంటే చీకటి ఉండక తప్పదు. మంచి నిర్మితం కావాలంటే చెడు నిర్మితం కాక తప్పదు. ఈ చెడును చూపి మనలోని మంచిని టికిల్ చేసే కథ ఇది.
గొప్ప కథ. పూజగదిలాంటి కథ.
– సాక్షి ఫ్యామిలీ

పురాణం సుబ్రహ్మణ్యశర్మ: రచయితగా, సంపాదకునిగా సవ్యసాచి. తెలుగు మేగజైన్ జర్నలిజమ్‌లో ప్రమాణాలు స్థిరపరిచారు. ‘నీలి’ వీరి ప్రసిద్ధ కథాసంపుటి. పురాణం సీత పేరుతో వీరు రాసిన ‘ఇల్లాలి ముచ్చట్లు’ పెద్ద హిట్. స్వస్థలం పిఠాపురం. 1996లో మృతి చెందారు. ఇతర వివరాలకు వారబ్బాయి శ్రీనివాసశాస్ర్తి నంబర్: 9293186031

నూరేళ్ల తెలుగు కథకు ‘సాక్షి’ సలాం
send your response to sakshikatha@gmail.com

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top