You Are Here: Home » చిన్నారి » కథలు » మనసు మూలిగింది

మనసు మూలిగింది

sunday-storyమొబైల్ల అలారం మోగుతోంది. మబ్బుల అయిదు గంటలకు అయిలింపులతోటి ఒల్లు విరుచుకుంట లేచిన. బాత్రూంకు పోయి ఫ్రెష్‌ అప్‌ అయి మా ఆవిడను లేపిన వాకింగ్‌ కోసమని. ‘‘కొద్దిసేపాగయ్య’’ నిద్రలోనే మూలిగింది. ‘‘తెల్లారుతోంది. వాకింగ్‌ లేటవుతదే’’ అంటూ మళ్ళీ లేపిన. గుణుక్కుంటూ లేచింది. బాత్రూం పోయచ్చింది. చీర, తల సర్దుకొని వాకింగ్‌కు బయలుదేరింది. మా ఆవిడకకు ఉదయము నడక అలవాటు లేదు. ఈ మధ్యనే ఆమెకు షుగర్‌ వచ్చింది. ఆరోగ్య దృష్ట్యా డాక్టర్‌ సలహా ప్రకారం ‘నడక’ తప్పనిసరయింది. మనుపేమో ఉదయం ఆరుగంటలకు లేవడం, ఇల్లు బోల్లు శుభ్రం చేసుకోవడం, ఎనిమిది గంటల కల్లా చాయ్‌ కాచుకొని తాగడం… ఆ తర్వాత ఆమె వంట పనుల్ల మునగడం జరిగేది!

షుగర్‌ కంప్లెయింట్‌తో ఆమె ఆరోగ్య పరిస్థితి మారింది. రెగ్యులర్‌గా వాకింగ్‌కు పోవలసిన అవసరం ఏర్పడింది. ఆమె శరీరంల షుగర్‌, బి.పీ.లు శాశ్వత చుట్టాలయి తిష్టవేసినయి. ఈ మధ్యనే నేను ఉద్యోగం నుంచి రిటైర్‌ అయిన. ఏమీ తోచక కొందరు మిత్రులం కలిసి ‘నార్త్‌ ఇండియా’ టూర్‌ వేసినం. ఢిల్లీ, హరిద్వార్‌, ఋషికేష్‌, యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ పుణ్యక్షేత్రాలను 25 రోజుల ప్యాకేజిలో చూసి వచ్చినం. ప్రయాణంల మా ఆడిడ సుస్తీ అయింది. ఊరుకు తిరిగి వచ్చాక డాక్టర్‌కు చూపించిన రక్త, మూత్ర పరీక్షలు చేసి షుగర్‌, బి.పీ ఉన్నట్లు చెప్పిండు. ఇక అప్పటినుండి మా ఆవిడను నా తోటి వాకింగ్‌కు తీసుకెళుతున్న.

ఉదయం 5.30 గంటల కల్లా ఇంటికి తాళం వేసి నేను, మా ఆడిడ కలిసి ‘వాకింగ్‌’ కు బయలు దేరినం. అది జులై మాసం, ఆరోజు ఆకాశం నిండ దట్టంగ నల్లని మొగులు కమ్ముకుంది. చల్లగా ఈదరగాలి వేస్తంది. తారురోడ్డు మీద నడుస్తున్నం. రోడెంబడి లారీలు, ట్రాక్టర్లు గుట్టల వైపు, మానేరు వాగు వైపు పరుగులు తీస్తున్నయి. ఇసుక, కంకర గ్రానైట్‌ రాల్లను జారగొట్టడానికి, కొందరు డ్రైవర్లు ఊరి బయట రాంనగర్‌ అడ్డామీద తడక హోటల్ల చాయ్‌ తాగి బీడి కాల్చుకుంట వర్కర్ల కోసం ఎదురుచూస్తున్నరు.

మా ఆవిడ తొందరగనే అలిసిపోయింది. నడువలేకపోతోంది. బతిమాలుతూ, బామాలుతూ నడిపిసున్నా తారురోడ్డు కిరువైపులా వరుసగా పెద్ద పెద్ద చెట్లున్నయి. వాటి కొమ్మ లు గాలికి వింజామరల్లా విసురుతున్నయి. రొష్టుతూ, రొప్పుతూ రాంనగర్‌ టి.వి. స్టేషన్‌ వరకు మా ఆవిడ నడిచింది. ఇల్లు చేరే వరకు రెండు కి.మీ. నడక అయింది. డాక్టర్‌కు చూపించిన మా ఆవిడను, అన్ని పరీక్షలు చేసి మందులు రాసిండు. వాకింగ్‌, యోగా చేయమన్నడు. ఆహార నియమాలు చెప్పిండు. అల్లనేరెడుపండ్లు, జామ, బొప్పా యి, పుచ్చపండు, నిమ్మ, బత్తాయి, ఉసిరి పండ్లను తినొచ్చన్నడు. పుల్కాలు రాత్రిపూట తినమన్నడు. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోమన్నడు. సూచలన్నీ శ్రద్ధగా విన్నది మా ఆవి డ. డాక్టర్‌ చెప్పినట్లు క్రమం తప్పకుండా మం దులు వాడుతోంది. వాకింగ్‌ చేస్తోంది. బాస్ర్తి కా, కపాల్‌బాత్‌, ఆన్‌లోమ్‌, విలోమ్‌ లాంటి యోగా ప్రక్రియలు రెగ్యులర్‌గా చేస్తోంది. దా నికితోడు ఇంటిపని, వంటపని ఉండనే ఉంది.

‘‘షాబ్‌’’ గుర్ఖా పిలుపు, చూసాను, ఎందుకచ్చిండో అర్థమైంది. ఓ అయిదు రూపాయలు ఇచ్చిన. గుర్ఖా ప్రతి నెల మొదటి వారంల అయిదో, పదో అడుక్కుంటడు.
‘‘ఏమే నేను రిటైర్‌ అయి ఉన్నాననేగా…. నీకు చులకన అయిపోయిన. రోజూ నాకు సెలవే… పనేముంది. అవును ఇంట్లో ఖాళీగా కూచొని కథలు, కాకరకాయలు అంటూ కాలక్షేపం చేస్తున్నాననే గదా నీ అక్కసు!’’. మాకు ఇద్దరు పిల్లలు. బాబు పెద్ద. అమ్మాయి చిన్న. బాబు చెనై్నల ఏదో సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నడు. అమ్మాయి ఈ మధ్యనే ‘బి.టెక్‌’ పూర్తి చేసిం ది. డాట్‌నెట్‌, జావా కోర్సులు నేర్చుకుంటోం ది. అలాగే జాబ్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగంలో ఉన్నపుడు నాకు ఎప్పుడూ జాబ్‌ హడావిడి ఉండేది. ఇంటికి సంబంధించి చిన్నమెత్తు పనిచేసేవాణ్ణి కాదు. ఇప్పుడన్న మా ఆవిడకు సహకరించాలనుకున్నా!

ఉదయం పదయింది స్నానం చేసిన. పేపర్‌ చూస్తోన్న ఇంతట్ల మా ఆవిడ ‘నాస్తా’ తయా రు చేసింది. నాస్తా చేసి షుగర్‌ లెస్‌ ‘టీ’ తాగి న. వీధిల నల్లా గడబిడ వినస్తంది. మా ఆవిడ నీళ్లు పట్టడానికి బిందెలు తీసుకుని నల్లావద్దకు వెళ్లింది. బిందె మెల్లగా నిండుతుంది. నల్లాల నీళ్లు సరిగా రావడం లేదు. ఈ మధ్య నే పాత నల్లా సరిగా రాకపోతే ప్లంబర్‌కు కొం త ఆమ్యామ్‌ ముట్ట చెప్పి పాయింట్‌ మార్పిం చిన. అయినా సమస్య అట్లనే ఉంది. ‘నల్లా వేరేచోట పెట్టినప్పుడు ‘పెరోల్‌’ అనే పార్టు తీసేస్తే నీళ్లు బాగావస్తయి అంటూ నీళ్లు నమిలిండు ప్లంబర్‌. వాడి నసుగుడు అర్థమై వాడి చేతులు కొంత డబ్బు పెట్టిన. ప్లంబర్‌ పని ముగించుకొని వెళ్లిండు. ఏంచేద్దాం వ్యవస్థల కింది నుంచి మీద్దాక గట్లనే ఉంది. నిట్టూర్పిన. మొదట్ల నల్లాల నీళ్లు బాగానే వచ్చినయి. ఆ తర్వాత ప్రెషర్‌ పడిపోయింది.
ప్లంబర్‌కు ఫోను జేస్తే ‘అక్కడ ఏదో చెత్త తట్టుకొని ఉండొచ్చు బోర్‌ వాటర్‌ ఫ్రెషర్‌ పెట్టండి ‘కచరా’ ఎల్లిపోతది’. అంటూ ఏదో నసిగిండు. గది మునిసిపాలిటి వాళ్ల సంగతి.

ఇంట్ల నల్లాల వస్తలేవు. ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నీళ్లు అయిపోయినట్టున్నయి. బోర్‌వెల్‌ మోటర్‌ ఆన్‌ చెద్దామని స్విచ్‌ వేసిన. కరంటు లేదు. మీటర్‌లనే సప్లయిలేదు. పోల్‌ మీద ప్యూజ్‌ పోయినట్టుంది. లైన్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఫోను జేసి విషయం చెప్పిన. సర్వీసు నెంబర్‌, పోల్‌నెంబర్‌, అడ్రస్‌ చెప్పిన. లైన్‌మన్‌ వచ్చి ప్యూజ్‌ వేసిండు.
లైన్‌మెన్‌ పోయేటప్పుడు అతనితో అన్న ‘‘ఏమయ్యా పోల్‌మీద ప్యూజ్‌ తాపతాపకు పోతంది!’’ అని.
‘‘సార్‌ ఎక్కువ కనెక్షన్స్‌ లేని పోల్‌ నుండి మీకు సప్లయి ఇస్తా!… కానీ..!’’ అంటూ మొకం చూడసాగిండు లైన్‌మెన్‌.
అర్థమైనట్లుగా తల పంకిస్తూ లైన్‌మెన్‌ కొంత ముడుపు చెల్లించుకున్న సంతోషంగా పోల్‌ మీద కనెక్షన్‌ మార్చిపోయిండు. ‘కలికాలం’ అనుకున్నాను.

‘‘అమ్మా’’ అంటూ ఉరుమోలె కేకేసుకుంట విడిచిన బాణం లెక్క ఇంట్లోకి దూసుకు వచ్చింది అమ్మాయి. బ్యాగ్‌ని ‘టీపాయ్‌’ మీద పడేసింది. ‘‘నాన్న’’ అంటూ దగ్గరకు వచ్చింది. ప్రేమగా తల నిమిరిన. కుశల ప్రశ్నలు వేసిన. బావున్నట్లు తలూపింది. అంతలోనే మటుమాయమై వంటింట్లో ఉన్న వాళ్లమ్మ దగ్గర ప్రత్యక్షమయింది. గోముగా వాళ్ల అమ్మ మెడను చుట్టేసింది.
బిడ్డ ఒళ్లంతా పుణుక్కుంటూ ‘‘ఏమే హాస్టల్‌ తిండి పడుత లేదా! బక్క పడ్డవు’’. అంది వాళ్ళ అమ్మ.
‘‘హాస్టల్‌ తిండి తినబుద్దయిత లేదే!’’ గుణుగుతూ చెప్పింది అమ్మాయి.
‘‘ఇంట్లో ఉన్నట్లు ఉంటదా బిడ్డా! ఏదో హితవు చేసుకొని తినాలే గని! నువ్వు చదువుకుంటానికి పోయినవ్‌. తిండినోట్లెకు పోకపోతే పండో ఫలమో కొనుక్కొని తినాలె!’’ అమ్మాయికి బుద్ధి మాటలు చెప్పింది మా ఆవిడ.

‘‘సరే ప్రయాణంల అలసిపోయినట్టున్నవ్‌. ఎప్పుడు బయలు దేరినవో ఏమో! నీళ్ళు పోయ్యి మీద బెడుతున్న కాగినంగ స్నానం చేద్దువుగానీ ఇంతట్ల మొకం కడుక్కునిరా పాలు తాగుదువ్‌’’ బిడ్డను అప్యాయంగా పురమాయించింది మా ఆవిడ.
రాజీవ్‌ పార్క్‌ల యోగా చేసుకొని నేను అప్పుడే వచ్చిన. దిన పత్రికల తెలంగాణ ఉద్యమ అంశాలను, వార్తలను, ఏర్పడున్న పరిణామాలను సీరయస్‌గ చదువుతున్నా! హైదరాబాద్‌ నుండి అమ్మాయి రాకతో ఇంట్లో సందటి మొదలయింది. ఓ వైపు టీవీ గోల, మరో వైపు సెల్‌ల సంభాషణలు, అమ్మాయి వచ్చిందని ముద్దగారెలు, పాయసం చేసింది మా ఆవిడ. అందరం కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ల పాయసం తోటి ముద్దగారెలు తిన్నం. తదనంతరం తల్లీ బిడ్డలు టీవీ సరియల్లో మునిగి పోయిండ్రు. నా పుస్తక లోకంల నేనూ పడిపోయిన. మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్‌ కానిచ్చినం. ఓ కునుకు తీసినం. సాయంకాలం అందరం ‘టీ’ తాగినం.

రాత్రి ఎనిమిది అవుతోంది. మొబైల్‌ మోగుతుంది మా అబ్బాయి శరత్‌ పేరు డిస్‌ప్లే అవుతోంది. వాడు చెనై్నలో ఓ జర్మనీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నడు. ఫోన్‌ లిఫ్ట్‌ చేసి ‘‘హలో శరత్‌ అంతా మంచిదేనా? ఏం సంగతి చెప్పు బాబు’’ అడిగిన!
‘‘హలో నాన్న! అంతా మంచిదే. ఈ రోజు సాయంత్రం అయిదు గంటలకు చెనై్న నుంచి ట్రెయిన్‌లో బయలు దేరుతున్న. మరుసటి రోజు పొద్దున ఏడు గంటలకల్లా హైదరాబాద్‌ చేరుకుంటా. అత్తమ్మ ఇంట్లో ఫ్రెష్‌ అయి ఉదయం పది గంటలకల్లా స్కూటర్‌ మీద కరీంనగర్‌కు బయలు దేరుతా!’’ చెప్పిండు.
‘‘రోజూ పేపర్ల చూస్తున్న. రాజీవ్‌ హైవేలో తరచు ఆక్సిడెంట్లు జర్గుతున్నయి జాగ్రత్తరా!’’ మరీ మరీ హెచ్చరించి ఫోన్‌ పెట్టేసిన.

మావాడు హైదరాబాద్‌ల పనిచేస్తున్నప్పుడు నా హోండా ఆక్టివా తీసుకువెళ్లిండు. ఈ మధ్యనే వాడికి చెనై్న బదిలీ అయింది. అక్కడ హాస్టల్ల ఉంటూ ఆఫీసుకు లోకల్స్‌ల వెళుతున్నడట, అక్కడ స్కూటర్‌ అవసరం లేదని చెప్పిండు. చెనై్న పోతూ పోతూ స్కూటర్‌ను వాళ్లత్తమ్మ ఇంట్లో పెట్టిండు.
‘‘ఆ స్కూటర్‌ పాతదయింది. ఇక్కడికి తీసుకువస్తే ఎక్ష్సేంజిల కొత్తది తీసుకుందామని’’ నేనే వాడికి చెప్పిన. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతోంది. సకల రాజకీయం పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక, కర్షక, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు… అన్నింటి భాగస్వామ్యంతో ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. తెలంగాణా జిల్లల్లో ర్యాలీలు, నిరసనలు రైల్‌రోకోలు, వంటావార్పులు, బంద్‌లతో అట్టుడికిపోతోంది.

యూనివర్సిటీ కాంపస్‌లల్ల విద్యార్థులకు, పోలీసులకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. గట్లాంటి క్లిష్టమైన తరుణంల మావాడు కరీంనగర్‌ వస్తున్నడు ఉదయం పదకొండు గంటలకు చేరిండు. దారిల స్కూటర్‌ ట్యూబ్‌ పంచర్‌ అయిందట. దగ్గరల ఉన్న సిద్దిపేట టౌన్‌కు ఆటోలో పోయి మెకానిక్‌ను వెంటబెట్టుకొని వచ్చి బాగు చేయించుకొని బయలుదేరిండట. అలసిసొలసినట్టున్నడు. వాళ్ళమ్మ వేన్నీళ్లు పెట్టిస్తే స్నానం జేసిండు. ఇంతల మార్కెట్‌కు పోయి మటన్‌ తెచ్చిన. మా ఆవిడ మటన్‌ వండి, చారు చేసింది. పగలు ఒంటి గంట అవుతోంది. అందరం కలిసి భోంచేసినం. ఓ గంట ఆరాం తీసుకున్నంక నేను, మా అబ్బాయి కలిసి ‘సుజికి’ షోరూంకు వెళ్లినం స్కూటర్‌ ఎక్చే్సంజి చేయడానికి! అమ్మాయి హైదరాబాద్‌, అబ్బాయి చెనై్న వెళ్లిపోయిండ్రు. సందడి తగ్గింది నిశ్శబ్దంతోటి ఇల్లు బావురుమంటోంది. ఇప్పుడు మా ఇద్దరికి ఎవరి ప్రపంచం వారిదే అయింది. ఆవిడ వంటింటి పనిల మునిగిపోయింది. టీవీల తెలంగాణా ఉద్యమ వార్తలు, విశ్లేషణలు వినడం, వీక్షించడం, పత్రికలు చదువడమూ నా ప్రపంచమైపోయింది.

‘ఈ ఉద్యమం ఎటుబోతోంది? ఈ ఆత్మ బలిదానాలేమిటి? కన్న తల్లిదండ్రులుకు ఈ కడుపుకోతేమిటి? ఈ రాజకీయ పక్షాల డ్రామాలేమిటి? ఈ యువత ఎందుకు ఆధైర్యపడుతోంది. చాకలి అయిలమ్మ, దొడ్డి కొమురయ్యల పౌరుషాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలె! బతికి కొట్లాడి సాధించాలె తప్ప పిరికితనంతో ఈ ఆత్మత్యాగాలేమిటి? ఆత్మహత్య నేరం. ఆ నేరాన్ని సమర్థించే ఎంత గొప్ప కారనమైన అది సహేతుకము కాదు. జీవితంలో ఏ రూపములోనైనా సవాల్‌ చేసే కష్టనష్టాలను ధైర్యంగా ఎదుర్కొని పోరాడేవాడే
ఆసలైన యోధుడు. నెపోలియల్‌ అన్న మాటలు గుర్తుకు వచ్చినయి. పత్రికకు వ్యాసం రాసి పంపించిన ‘ఆత్మత్యాగాలు వద్దూ’ అంటూ!

అంతరంగంల ఏదో తెలియని సంక్షోభం…!
ఆవేదనతో మనసు మూలిగింది.
నెల రోజుల తర్వాత మా ఆవిడను దవాఖాన్ల చూపించిన. పిల్లలు వచ్చిన బొబ్బల మా ఆవిడ షుగర్‌ నియమాలనే మరిచిపోయింది. ఆవిడ
షుగర్‌ రిపోర్ట్‌ చూపి డాక్టర్‌ సీరియస్‌ అయిండు.
‘‘ఏమమ్మా వాకింగ్‌ చేయడం లేదా! యోగా గాలికి వదిలేసినవా..?’’ విసుక్కున్నడు డాక్టర్‌. మందులు రాసి. తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పిండు.
‘‘నేన్జెప్పలేదా! వాకింగ్‌ అయినా, యోగా అయినా రెగ్యులారిటి ఉండాలనీ…! తిండి విషయంలో నియమంగా ఉండాలనీ…!’’ బుద్ది మాటలు జెప్పిన మా ఆవిడకు ఆటో ఎక్కుతూ..!

– పంజాల జగన్నాథం
ప్రిన్సిపల్‌ (రిటైర్డ్‌), కరీంనగర్‌
సెల్‌: 99485 31985

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top