You Are Here: Home » ఇతర » మత మతసామరస్యానికి నిలువుటధ్ధ౦ గుర్రంకొండ

మత మతసామరస్యానికి నిలువుటధ్ధ౦ గుర్రంకొండ

ఆంధ్రదేశంలో వందల ఏళ్ల చారిత్రక నేపథ్యం కలిగిన కోటలకు, దుర్గాలకు కొదవలేదు. దక్షిణాపథాన్ని పాలించిన అనేక మంది రాజులు, చక్రవర్తులు, సుల్తానులు, నవాబులు ఎంతోమంది తెలుగునేలపై ఎన్నో ప్రఖ్యాతిగాంచిన కట్టడాలను నిర్మించారు. అలాంటి అరుదైన కట్టడమే గుర్రంకొండ. చిత్తూరు జిల్లాలో పర్యాటక సౌరభాలు వెదజల్లుతూ… అలనాటి రాచరిక వ్యవస్థను కళ్లకు కడుతూ… హిందూ, ముస్లిం సంస్కృతులకు నిలువుటద్దంగా ఆనాడే మతసామరస్యాన్ని చాటిచెప్పింది గుర్రంకొండ. ఈ అరుదైన పర్యాటక ేకంద్ర విశేషాలే ఈవారం ‘విహారి’…

మక్బరా..
Gurramkonda1గుర్రం కొండకు 3 కిమీల దూరంలో మక్బరా (ఖండ్రిగ) గ్రామం ఉన్నది. ఈ మక్బరాలోనే టిప్పు సుల్తాన్‌ మేనమామ, గుర్రం కొండ దుర్గం నవాబు అయిన మీర్‌ రజా అలీఖాన్‌ సమాధి ఉన్నది. ఈ సమాధి వలనే ఈ గ్రామానికి మక్బరా (సమాధి) అనే పేరు వచ్చింది. సమాధిపై ఉన్న పారశీక శాసనంలో ఈయన మరణించిన సంవత్సరం 1780గా సూచించబడింది. ఈ మక్బరా అరబిక్‌ శైలిలో రెండు అంతస్తులతో ఉంటుంది. మొదటి అంతస్తులో ఇతని కుటుంబ సభ్యుల సమాధులు వుండగా… రెండవ అంతస్తులో అలీఖాన్‌ సమాధి ఉన్నది. రెండవ అంతస్తులో సమాధి ఉన్న గుంబజ్‌ (గుమ్మటం) నిర్మాణం పూర్తిగా బీజాపూర్‌లోని గోల్‌ గుంబజ్‌ను పోలి వుండటమే కాకుండా గోల్‌ గుంబజ్‌ తరువాత స్థానాన్ని ఈ సమాధి ఆక్రమించి, రెండవ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ ప్రదేశాలన్నీ పురావస్తుశాఖ వారి ఆధ్వర్యంలో వున్నవి.

రాచరిక వ్యవస్థకు నిలువుటద్దం
గుర్రం కొండ ఆ రోజుల్లో ఒక బలమైన దుర్గానికి కేంద్రమై, ఓ వెలుగు వెలిగింది. రెండు వందల సంవత్సరాలపాటు రాచరిక పాలనా వ్యవస్థకు కేంద్రంగా, జాగీరుగా, వ్యాపార వాణిజ్యాలకు, జమిందార్ల నిలయంగా వెలుగొందిన గుర్రం కొండ దుర్గం నేడు ఎవరూ పట్టించుకోని ఒక మారుమూల కుగ్రామంగా తయారైంది. గుర్రం కొండ చరిత్రను ఒకసారి అవలోకిస్తే గుర్రం కొండ దుర్గానికి సంబంధించి తద్వారా దానితో ముడిపడి ఉన్న ఇతర పెద్ద సామ్రాజ్యాల చరిత్రకు సంబంధించిన అనేక విషయాలు పర్యాటకుల స్మృతిపథంలో మెదులుతాయి. మంచి పర్యాటక కేంద్రమయ్యేందుకు తగిన చారిత్రక నేపథ్యం కలిగివున్నా, ప్రభుత్వ నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా ఇది మరుగున పడిపోయింది. ఈ ప్రాచీన ట్టడాల్ని పురావస్తు శాఖ కనిపెట్టుకుని వున్నా, వచ్చే పర్యాటకులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైంది.

వెల్లివిరిసిన మతసామరస్యం
Gurramkonda_Narasimhaswamyకోట లోపల నిర్మింపబడిన శ్రీలక్ష్మీ నరసింహ స్వామి, వినాయక ఆలయం, ఆంజనేయ స్వామి విగ్రహం, రెండు మసీదులు, మూడు దర్గాలు ఉండడం నాటి మతసామరస్యానికి, హిందూ, ముస్లిం ఐక్యతను చాటిచెబుతోంది. నెయ్యి గది, వైద్యశాల, ధాన్యపు గదులు అన్నీ నేడు శిథిలావస్థలో వున్నాయి. గుర్రం కొండ దుర్గానికి పడమర వైపున ఉన్న మక్బరా (పవిత్ర సమాధి) దుర్గం మొత్తం మీద సందర్శకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన మండల కేంద్రమే గుర్రంకొండ. కడప – బెంగళురు రహదారిలో ఉన్న ఈ గుర్రం కొండ ఎంతో చారిత్రక నేపథ్యం కలిగి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చారిత్రక పర్యాటక కేంద్రమైన గుర్రం కొండను జాఫరాబాదు అని కూడా పిలుస్తారు.
గుర్రం కొండ కోట నిర్మాణం

విజయనగర సామ్రాజ్యం ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు విజయనగర పాలకులు గుర్రం కొండ దుర్గాన్ని నిర్మించారు. అయితే హైదర్‌ అలీ కుమారుడు టిప్పు సుల్తాన్‌ మహారాష్ట్ర నుండి ఈ ప్రాంతాన్ని తన వశం చేసుకున్నాడు. దాదాపు నాలుగు వందల సంవత్సరాల కిందట నిర్మింపబడి, చరిత్ర ప్రసిద్ధి గాంచి, శత్రుదుర్భేద్యమైన ఈ కోటను ఆ తరువాత గోల్కొండ సుల్తానుల హయాంలో పునర్నిర్మించారు. నిర్మాణశైలి మొత్తం మహమ్మదీయ శైలిలో ఉంటుంది. ఈ కోట 500 అడుగుల ఎత్తున ఒక గొప్ప కొండపై ఉన్నది. మూడువైపులా కొండ దాదాపు నిలువుగా ఉండి ఎక్కడానికి వీలులేకుండా ఉంటుంది. నాలు గోవైపు కూడా ఏటవాలుగా ఉండి దుర్భేద్యంగా ఉన్నది. కోటలో నల భైకి పైగా మసీదులు ఉండేవి. కానీ కాలక్రమేణా అవి శిథిలమైనవి. పర్షియాలోని కిర్మాన్‌ నుండి వచ్చిన హజ్రత్‌ షా కమాల్‌ అనే సూఫీ సంతు ఇక్కడ స్థిరపడి స్థానికులకు ఇస్లాం మతాన్ని బోధించి ప్రాంతం లోని చుట్టుపక్కల గ్రామాలకు ఇస్లాం మతాన్ని వ్యాపింపజేశాడు.

ఈ కోట 18వ శతాబ్దం చివరలో టిప్పు సుల్తాన్‌ ఆధీనంలో ఉన్న కాలంలో… ఆయన ఇక్కడ నాణేలను ముద్రించేందుకు ఒక టంకశాలను కూడా ఏర్పాటుచేశాడు. ఆ తరువాత కడప నవాబుల పాలనలోకి వచ్చింది. ఇక్కడి కోట చాలా ప్రసిద్ధమైనది. ఈ కోటలో గల ‘రంగినీ మహల్‌’ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
గుర్రాన్ని చంకనెత్తుకుని..!
Gurramkonda22అయితే విజయం తప్ప ఓటమిని అంగీకరించని ఆ వీరుడు ఎలాగైనా సరే కోటను జయించాల్సిందేనని పట్టుబట్టి నిట్టనిలువు బండరాయి పైకి గుర్రాన్ని పోనిచ్చాడు. అయితే నున్నగా జారిపోతున్న ఆ బండరా యిపైకి వెళ్లేందుకు గుర్రానికి సాధ్యం కాక గాయపడింది. దాంతో మెడ, కాళ్లను గట్టి తాడుతో కట్టిన ఆ వీరుడు దాన్ని తన చంకకు తగిలించుకుని ఒక్క ఉదుటున పైకి ఎక్కేశాడట. అయితే ఒంటరిగా, అలసిపోయిన స్థితిలో కోటలోకి ప్రవేశించిన ఆ వీరుడిని నవాబు సైన్యం దారుణంగా హతమార్చింది. అయితే విషయం తెలుసుకున్న నవాబు వీరుడి వీరత్వానికి మైమరచి, అతన్ని అక్కడే సమాధి చేయించి భక్తితో పూజించమని చెప్పాడట. యుద్ధానికి వెళ్లిన కొడుకు తిరిగి వస్తాడని గంపెడాశతో ఎదురుచూస్తున్న ఆ వీరుడి తల్లి… తన కొడుకు వెలిగించి వెళ్లిన దీపం ఆరిపోవడంతో… మరణించినట్లు అర్ధం చేసుకుని, ఆ దిగులుతోనే కన్నుమూసిందట.

కోట విశేషాలు
సందర్శకులకు మొదటగా… తొలి ప్రహరీగోడ, దాని తరువాత కందకం కనిపిస్తాయి. దుర్గానికి తూర్పు వైపున ఉన్న ఏనుగుల చెరువు (హాతీ తలాబ్‌) లోంచి ఈ కందకంలోకి నీటిని నింపి శత్రు సైన్యాల ముట్టడి నుండి దుర్గాన్ని రక్షించుకునేవారట. కందకం దాటితే రెండవ ప్రహరీ గోడ, దానిలోపలే దుర్గం ఉంది. ఈ దుర్గం అతి ఎత్తయిన కొండ (గుర్రం కొండ) కు చుట్టూ నిర్మింపబడింది. కొండపైకి వెళ్లడానికి ఒకే ఒక మార్గం ఉంది. మిగిలిన మూడువైపులా రాకపోకలు సాగించడానికి వీలులేకుండా సహజసిద్ధమైన ఏర్పాట్లున్నాయి. ఉత్తరం వైపు మినహా మిగిలిన మూడు వైపులా కొండ ఏకశిలారూపంలో నిట్టనిలువనా ఉండడంతో మానవమాత్రులెవ్వరూ ఈ మూడు వైపుల నుండి కొండపైకి ఎక్కడానికి వీలుపడదు. కొండపైకి వెళ్లడానికి ఉత్తరం వైపు విశాలమైన రాతి మెట్లు నిర్మించారు.

మెట్ల మీదుగా పైకి వెళితే మధ్యలోనే ప్రధాన ద్వారం దాటాలి. 25 అడుగుల ఎత్తులో రాతితో నిర్మింపబడిన ప్రధాన ద్వారంపై కనిపించే శంఖు, విష్ణుచక్రాల గుర్తులను బట్టి మొదట ఈ దుర్గాన్ని హిందూరాజులు నిర్మించారన్న విషయం తెలుస్తోంది. కొండకు దిగువ భాగంలో నవాబు నివాసమందిరమైన రంగినీ మహల్‌ (రంగ మహల్‌) సందర్శకులను విశేషంగా ఆకట్టుకుం టోంది. రంగినీ మహల్‌ ముఖ భాగం వైపు నుండి చూస్తే రెండు అంతస్తులతోనూ ఉండి సందర్శకులను ఆశ్చర్యచకి తులను చేస్తోంది. పై అంతస్తులో ఒక విశాలమైన హాలు, రెండు అలంకరణ గదులు, ఆరు స్నానపు గదులు నిర్మించి ఉన్నాయి. ఆనాటి భవన నిర్మాణ చతురతకు ఇదో నిదర్శనం. అయితే నేడు రంగినీ మహల్‌ ఎదురుగా ఉన్న అనేక పెద్ద భవనాలు పూర్తిగా కూలిపోయి శిథిలాలమయంగా ఉంది. ఓ పక్కగా గల వంటగది పైకప్పు కూలిపోయి మొండి గోడలతో వుండగా, నవాబు ఉపయోగించే గుర్రపు బగ్గీ కోసం నిర్మించిన పోర్టికో నేటికీ దృఢంగా, చెక్కు చెదరకుండా ఉంది.

ఇలా వెళ్లాలి
గుర్రం కొండకు వెళ్లాలంటే… బెంగుళురు నుంచి అయితే మదన పల్లె, వాల్మీకి పురం, కలకడ, మార్గాల లోనూ… కడప నుంచి అయితే రాయచోటి మార్గంలోనూ… తిరుపతి నుంచి అయితే తిరుపతి – బెంగుళురు హైవేలో వాల్మీకి పురం వరకు ప్రయాణించి ఆ తరువాత అక్కడి నుండి గుర్రం కొండ చేరుకోవచ్చు.

Other News From

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top