You Are Here: Home » చిన్నారి » భూమయ్య బంగారం

భూమయ్య బంగారం

రామాపురంలో భూమయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. అతడు ఒట్టి పిసినారి. అంతులేని సంపద ఉన్నప్పటికీ, తను తినేవాడుకాదు, ఇతరులకు పెట్టేవాడు కాదు. భూమయ్యని ఊరంతా ‘పిసినారి భూమయ్య’ అనేవారు. ఎంత పిసినారి అయినప్పటికీ చేతిలో డబ్బు ఉంది కదా! ఎంతో కొంత సహాయం చెయ్యకపోతాడా? అన్న ఆశతో ఊరి ప్రజలు సాయం కోసం వచ్చేవారు.

అయితే భూమయ్య మాత్రం ఎప్పుడూ ఎవరికీ సహాయం చేసేవాడు కాదు. ఏవేవో సాకులు చెప్పి తప్పించుకునేవాడు. పైగా సహాయం కోసం వచ్చే వాళ్ళ నుంచి తప్పించుకోవటానికి భూమయ్య ఒక పథకం ఆలోచించాడు. ఆలోచించినదే తడవుగా తన పొలం, ఇతర ఆస్తులను అమ్మి ఆ ధనంతో బోలెడు బంగారం కొన్నాడు.

ఎవరూ చూడకుండా ఊరి బయట పాడుబడి, నీరు ఎండిపోయిన నూతిలోకి దిగి, అక్కడ గొయ్యి తవ్వి ఆ బంగారాన్ని అందులో పాతిపెట్టాడు. రోజూ రహస్యంగా అక్కడకు వచ్చి బంగారం ఉందో లేదోనని చూసుకొని వెళ్తుండేవాడు. ఈ విధంగా వచ్చి వెళ్తున్న భూమయ్యని ఒక దొంగ గమనించాడు. ఆ రోజు రాత్రి ఆ దొంగ బావిలోకి దిగి, బంగారాన్ని దొంగిలించుకుపోయాడు.

మరునాడు బంగారం కనిపించకపోవడంతో భూమయ్య గుండె చెరువు అయింది. తినీతినక కూడ బెట్టిన బంగారాన్నంతా ఎవరో ఎత్తుకెళ్లిపోయారని లబోదిబోమని ఏడవసాగాడు. ఆ దారిలో వెళ్తున్న ఒక వృద్ధుడు ‘‘ఎందుకు ఏడుస్తున్నావు భూమయ్యా?’’అని అడిగాడు. జరిగినదంతా చెప్పాడు భూమయ్య. అంతా విన్న వృద్ధుడు ‘‘ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం! ఆ బంగారం నీ దగ్గర ఉన్నప్పుడు ఏమైనా అనుభవించావా? నువ్వు ఏనాడూ అనుభవించని సంపద పోయిందని ఇప్పుడు ఏడవటం దండగ. ఆ బంగారం నీ దగ్గర ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నీవు అనుభవించలేని ఐశ్వర్యం నీ దగ్గర ఎందుకు చెప్పు? పైగా దాన్ని కాపాడుకోవటానికి ఎన్ని ఇబ్బందులు పడ్డావు. పోనీలే నీ బాధ విరగడైంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నలుగురికీ ఉపయోగపడేలా బతకటం నేర్చుకో’’ అని చెప్పి మంచిమాటలు చెప్పి వెళ్లిపోయాడు. ఆ మాటలతో భూమయ్యలో మార్చు వచ్చింది. బుద్ధి తెచ్చుకుని ఒంటరిగా కాక పదిమందిలో ఒకడిగా జీవించడం మొదలు పెట్టాడు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయసాగాడు. ఇదే సరైన జీవన విధానం అని గ్రహించాడు. భూమయ్యలో వచ్చిన మార్పుకి ఊరివారంతా సంతోషించారు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top