You Are Here: Home » చిన్నారి » భారం

భారం

‘‘ప్రపంచంలోకెల్లా భారమైంది ఏమిటి?’’
కౌన్ బనేగా కరోడ్ పతిలో కోటి రూపాయల ప్రశ్న.
కోటి అనగానే ప్రశ్నకు పిచ్చి పట్టింది. తను టెన్షన్‌లో పడింది. చుట్టుపక్కలా టెన్షన్‌లో పడేసింది.
కోటా? మజాకా?

కడుపులో చల్ల కదలనక్కర్లేదు. సూర్యుని చుట్టూ గ్రహాల్లా, తన చుట్టూ ఈ లోకాన్నే తిప్పుకోవచ్చు. కార్లూ, బంగ్లాలూ, నౌకర్లూ, పరిచారికలు… ఒక్కటేమిటి? లెక్కలే మారిపోతాయి.
అందుకే – ఈ టెన్షన్లు, తల పీకుడు, గుండె బాదుడు… ఇంతకీ ఏమిటబ్బా ఆ భారమైంది?
రాయా? రప్పా? ఇనుమా? సీసమా? బంగారమా? వజ్రమా?
కెలుకుతున్నకొద్దీ వస్తువుల లిస్టు చాంతాడంతైంది. మరెలా?
మళ్లీ టెన్షన్, అలజడి,…

ఒక పని చేస్తే! సెకండ్ ఆప్షన్ కింద కన్సల్టేషన్‌కు పోతే! వెంటనే మెదడులో చమక్కుమన్నాడు సైంటిస్టు సుబ్బారావ్. ఫోనుకు కాళ్లొచ్చాయి. రింగు రింగుమని పరుగులు తీసింది. ఆయన పరిమాణ భారాల్తో తూకాలు వేయసాగాడు.
ఇంకా సూక్ష్మంగా, కచ్చితంగా ఆలోచించి… భారం అంటే… బరువు అంటే ద్రవ్యరాశిపై గురుత్వాకర్షణ శక్తి. అది ధృవాల వద్దకు పోయే కొద్దీ పెరుగుతుంది. కొండల్లో, లోయల్లో పడ్తూ లేస్తూ ఉంటుంది.
మరి సరిగా పట్టుకోవడం ఎలా?

మళ్లీ పరుగు, అలుపెరుగని పరుగు, ఆతృత. ఆరు నూరైనా తన్నుకు పోవాలన్న తపన. ఏమైనా రాంగ్ అయ్యిందా? కోటి మాట? ఆ భారం మాట ఏమోగాని తలభారం మాత్రం పెరిగింది.
‘ఫిఫ్టీ, ఫిఫ్టీ’ కింద భారం తగ్గించుకుంటే…
ఇక్కడా చాయిస్ లేదే. లాటరీ వేసి లక్కీగా కొట్టేద్దామన్నా… మరి ఎలా?
గూగుల్ సెర్చ్‌లో వల విసిరితే?
వికీపీడియా, ఎన్‌సైక్లోపీడియాల్లో కలయబెట్టి చూస్తే?
బేతాళ ప్రశ్నల పరంపరలు…

మెటల్స్‌లో భారమైంది కావలెనా? నాన్-మెటల్స్‌లోనా?
నీటిలో భారమైంది కావలెనా? మరేదైనా ద్రవంలోనా?
భూమ్మీద భారమైంది కావలెనా? మరేదైనా గ్రహంలోనా?
కథ మళ్లీ మొదటికొచ్చింది.

కిం కర్తవ్యం? ‘కోటి’..? గుండె ఆగిపోయేంత పని, ఎలా? పోనీ వేరెవర్నయినా దొంగ చాటున అడిగితే? కాపీ రైట్స్ అడ్డొస్తాయేమో! ఏముంది… ఓ వెయ్యో, పరకో పడేస్తే చాలు.
సరే, ఎవర్నడగాలి? ఇంతకీ వాడు చెప్పేదే కరెక్టు అని ఎలా కన్‌ఫర్మ్ అవ్వగలం?
‘స్మాల్ థింగ్స్, బట్ నాట్ నెగ్లిజిబుల్’… ఎవరో పెద్ద మనిషన్నట్లు ఎవరినీ వదలకూడదు. దార్లో పోయే ప్రతి దానయ్యపై ప్రశ్నాస్త్రం సంధించాల్సిందే.

మొదటి అస్త్రం… స్కూలు పిల్లాడిపై పడింది. వీపెక్కి కూర్చున్న బండెడు బుక్స్ ‘భారం’ వెక్కిరిస్తూ పలకరించింది. ఆ కుర్రాడి మనసులో మరిన్ని భారాల బండలు దొర్లాయి. క్లాసులో పడ్డ బెత్తం భారం, హోమ్ వర్కుతో ఊపిరాడని చేయి భారం, ఆఖరికి మార్కుల పందేరంలో మసకబారిన లేత ప్రాయమే భారంగా దొర్లింది.
‘కోటి’ ఆశలతో కదిలిన మరో అస్త్రం యువత గుండెల్ని తాకింది. ‘ప్రేమ’గా కూర్చున్న ప్రియురాలి భారం, పాకెట్ ఖర్చులకు అందని నిరుద్యోగ భారం, దిశా నిర్దేశాలు తెలియని బతుకు బండి భారం…

సగటు మనిషికి నింగినంటిన నిత్యావసర వస్తువుల ధరల భారం, రైతుకు గిట్టుబాటు కాని పెట్టుబడుల భారం, అప్పుల్తో సాగలేని నేతగానికి మగ్గాల భారం, కుర్చీలకు పదవుల భారం, లక్ష్మీపతికి దొంగ లెక్కల భారం, కార్యార్థునికి లంచాల భారం, ఊరికి దొంగలు, దేశాన్కి టెరర్రిస్టులు… భారం… భారం.
‘కోటి’ ఆశలతో తిరిగిన కాళ్లు వాడెక్కాయి. అయినా డబ్బు మాయ. తల పీకుడులో సగం బుర్ర వెంట్రుకలు ఖాళీ అయ్యాయి.

ఫర్లేదు, కోటే ముఖ్యం. కావలిస్తే విగ్గు పెట్టుకోవచ్చు. విగ్గు మాటటుంచితే, ఎండకు మాడు కాలి, సేద తీరాలని కోరుకుంది కాయం. చెట్టు నీడకెళ్లగా, బక్కచిక్కిన అరవై యేళ్ల కాయం ఆవురావురుమని లాగిస్తున్న చిప్పలోని మెతుకుల్ని చూశాక, ‘కడుపు’లో మంటలు రేగాయి. ‘కోటి’ ఊహలంతటి వేగంతో పోటీపడ్డాయి కడుపులో ఎలుకలు. ‘ఆకలి మంటలు’ కంటి చూపుల్లో కదిలాయి. అది పసిగట్టిన అనుభవపూరిత బక్క కాయం ‘ఏం కావాలి నాయనా?’ అంది.
‘స్మాల్ థింగ్స్, బట్ నాట్ నెగ్లిజిబుల్’ మదిలో కదలడంతో కోటి ప్రశ్నల ధారాస్త్రం విచ్చుకుంది.
‘‘ఈ ‘కాయమే’ ప్రపంచంలో అన్నింటికన్నా భారమైంది నాయనా’’ అనుభవ బాణం బదులు కొట్టింది.
‘‘పట్టి పట్టి రెండు పాతికల బరువైనా ఉండవు, నీ శరీరం ప్రపంచంలోనే భారమైందా?’’ వ్యంగ్యాస్త్రం ఫకాల్‌మంది.

‘‘ఎవరి శరీరం వాళ్లకే భారం. అరవై యేళ్లగా మోస్తున్న అనుభవం నాయనా. ఒకరికి అరగక భారం, మరొకరికి ఆకల్తో భారం… నీ ‘కోటి’ తాపత్రయం కూడా ఈ భారాన్ని తాపీగా లాక్కుపోవడాన్కేగా. ఈ కడుపు పిడికిలంతే అయినా, ప్రపంచాన్నంతటినీ తినేయటాన్కి సిద్ధంగా ఉంటుంది.’’
అనుభవ కాయం ఉపదేశం సాగిస్తూనే ఉంది. ‘కోటి’ కలల కాయం సొమ్మసిల్లి స్పృహ కోల్పోయింది. కాయం ‘భారాన్ని’ మోయలేక ఈగలు తాపత్రయపడ్తున్నాయి.

– నౌగాపు

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top