You Are Here: Home » ఇతర » బ్రహ్మచర్యమే పరమావధిగా… కల్లూరు తులశమ్మ

బ్రహ్మచర్యమే పరమావధిగా… కల్లూరు తులశమ్మ

‘‘నేను గాంధీజీ బోధించిన బ్రహ్మచర్యం అవలంభించాలనుకుంటున్నాను. మిమ్ములను నేను దైవంగా ఆరాధిస్తాను. నన్ను మీరు ఒక సోదరివలె చూసుకుంటారా ?’’ అని ఒక భార్య భర్తను అడిగితే, అతడు నిర్ఘాంతపోయి ‘‘అలాగైతే మన దాంపత్య జీవితానికి అర్థమేముంది? జన్మిం చిన ఏకైక పుు్తడ్రు కూడా గతించాడు కదా! మన వంశోద్ధారకుడు లేకపోతే ఎలా ? అని అడిగాడు. అపుడు భార్య ‘‘ఏమైనా సరే నేను గాంధీజీ చెప్పిన బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించి తీరుతాను’’ అని తన దృఢ సంకల్పాన్ని తెలియజేసారు.

thulasaభర్త కోర్కెపై ఒక అమ్మాయిని వెదికి తెచ్చి స్వయంగా తన భర్తకు వివాహం జరిపి గృహస్థ జీవితాన్ని త్యాగం చేసి, మనోవర్తిని కూడా స్వీకరించని ఉత్తమోత్తమ ఆదర్శగాంధేయ మహిళ. ఆ మహిళే తులశమ్మ . ఆమె భర్త మోపర్రు వాలు కల్లూరి రంగయ్య. వీరు 25121910న కొడాలి కృష్ణయ్య, సీతమ్మ దంపతు లకు పెదరావూరులో జన్మించారు. ఆనాటి పల్లెటూరి ఆడపిల్లల వలెనే ఈమె చదువు ఎలిమెంటరీ పాఠశాల దాటలేదు. 14 సంవత్సరాల వయసులోనే వివాహమైంది. గాంధేయ మహిళగా మారి సంస్కారాన్ని త్యజిం చింది. గాంధీజీ ‘ఆత్మకథ’ చదివి తన జీవిత సాధనకు మార్గదర్శికంగా నిరాడంబరత, సావలంబన, అపరిగ్రహం బ్రహ్మచర్యం అనే నాలుగు ముఖ్యాంశాలను స్వీకరించారు. సావలంబనకై చరఖాను చేత పట్టారు. బ్రహ్మచర్యానికై గృహస్థ జీవితాన్ని త్యాగం చేసారు.

అపరిగ్రహ వ్రతనిష్ఠకై తనతల్లి తనకిచ్చిన నగలు, ఖరీదైన వస్తువులు అన్నిటినీ ఇచ్చివేసి వచ్చేసారు. తన మెడలోనున్న అరకాసు బంగారాన్ని అమ్మగా వచ్చిన దానిలో రూ.4/లతో రాట్నం, రూ.3/లతో ఖద్దరు చీర, రూ.2/లతో నూకలు కొనుక్కొని స్వాలంబన సిద్ధాంతాన్ని అనుసరించి జీవితం గడిపారు. మోపర్రులోనే ఉంటూ ప్రతిదినమూ రాట్నం వడుకగా వచ్చిన 3 అణాల మజూరీతో నూకల అన్నం, చింతకాయ పచ్చడి, దమ్మిడీ మజ్జిగతో భోజనం చేస్తూ చరఖాసంఘంలో జీవితం గడుప సాగారు. జంతువులను చంపి వాటి చర్మాలతో చెపలు తయారు చేస్తారని నమ్మి చెపలు ధరించటం మానేశారు. సాటి మానవుని కష్టపెట్టి లాగించుకునే రిక్షాలు ఎక్కడం మానివేశారు.

1944 అక్టోబరులో బందరు చరఖా సంఘం (ఆంధ్రశాఖ) వారు నడుపుతున్న కవారుూ కార్యకర్తల శిక్షణ పొందడానికి తులశమ్మగారు వెళ్ళారు. అక్కడి హాస్టల్‌ వార్డెన్‌ మాపులేటి సత్యనారాయణరాజు గారి సహకా రంతో ప్రకృతి చికిత్సను పొందారు. తిరిగి వచ్చాక వినయాశ్రమ ప్రముఖురాలు తుమ్మల దుర్గాంబతో కలసి గ్రామ పారిశుద్ధ్యం, హరిజన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొత్తపల్లి అన్నపూర్ణమ్మ, గుత్తికొండ బుల్లెమ్మ , దావులూరి వెంకట నరసమ్మ మొదలైన సోదరీమణుల సహకారంతో గాంధీ జయంతి మొదలైన పర్వది నాల్లో పెదరావూరులో హరిజన వాడను పరిశుభ్రం చేయడానికి వెళ్ళేవారు. తెనాలిలో సుప్రసిద్ధ న్త్రేవైద్యులు డాక్టర్‌ వెంపటి సూర్యనారాయణ శ్రీకృష్ణా కంటి ఆసుపత్రిలో ప్రతిదినం జరిగే సాయంకాల ప్రార్థనలో పాల్గొనడానికి తులశమ్మగారు వెళ్ళి దూరం నుండి గాంధీజీని దర్శించారు.

తరువాత సేవాగ్రాం ఖాదీ విద్యాలయంలో చేరారు. మహాత్ముని ఆశ్రమంలో ప్రముఖ స్థానం సంపాదించిన ప్రభాకర్‌జీ తులశమ్మగారిని గాంధీజీకి పరిచయం చేశారు. తులశమ్మ మహాత్మునికి నమస్కరించి, తనదగ్గర ఉన్న ఓంకారపు బంగారు బిళ్ళ, వెండి పళ్ళెం (పూజ కొరకు), స్ర్తీతనానికి చిహ్నమైన 15 తులాల వెండి మట్టెలు సమర్పించింది. ఆలా సేవాగ్రాంలో నెల రోజులు వుండి స్వగ్రామం చేరుకున్నారు. అక్కడనుండి అనేక జాతీయోద్యమ కార్యక్రమాల్లో పాల్గొని అనేక సార్లు జైళ్ళకు వెళ్ళారు. చివరిగా గ్రామాల్లో ఖద్దరు ప్రచారం ప్రారంభించారు. ఖద్దరు అమ్మకం వల్ల మిగిలిన 3వేల రూపాయలతో స్వగ్రామంలో ఒక ఇంటిని కొని దానిని గుంటూరు జిల్లా ఖాదీసంస్థ వారికి 1111977న సమర్పించారు.

ఈనాడు ఆ ఖద్దరు ఉత్పత్తి కేంద్రంలో 11 లక్షల రూపాయలు విలువగల నూలు, 1 లక్షా 20 వేల రూపాయలు విలువ గల ఏకులు, 4 లక్షల రూపాయలు విలువగల సన్న(మజ్లిన్‌) నూలు వస్త్రాలు, 5 లక్షల రూపాయలు విలువగల ముతక ఖాదీ వస్త్రాలు ఉత్పత్తి అవుతున్నాయి. 6 కదుళ్ళ అంబర చరఖాల మీద 200 మంది స్ర్తీలు, 125 కదుళ్ళ అంబర రాట్నాల మీద 28 మంది స్ర్తీలు ప్రతి సంవత్సరం 3 లక్షల 60 వేల రూపాయలు విలువ గల మజూరీగా ఆర్జించుకుంటున్నారు. 20 నేత మగ్గాల వారు, కార్యాలయ నిర్వహణకు 6 గురు కార్యకర్తలు ఉపాధి పొందుతున్నారు. ఇదంతా వీరి త్యాగఫలమే. చివరి వరకు సర్వోదయమే తన జీవిత ధ్యేయంగా భావించిన నిజమైన గాంధేయ మహిళ తులశమ్మ.

– షేక్‌ అబ్దుల్‌ హకీం జాని

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top