You Are Here: Home » చిన్నారి » కథలు » బ్రతుకు బండి

బ్రతుకు బండి

story1రైల్వేస్టేషన్‌లో సూమారు గంటన్నర పాటు నుండి వెయిట్‌ చేస్తూనే వున్నా… ట్రైన్‌ రానేలేదు. లగేజ్‌లు మోస్తూ కొందరు, పిల్లల్ని ఎత్తుకొని వాళ్లు ఏడుస్తుంటే సముదాయిస్తు మరికొందరు, ఒక భాష వాళ్ళు కాదు, ఒక ఊరి వాళ్ళు కాదు. ఎక్కడెక్కడి వాళ్ళో… మొత్తం మీద స్టేషన్‌ కిక్కిరిసిపోయింది. చిల్లర వ్యాపారస్థుల గోల పడలేకపోతున్నాను. ఏది ఏమైనా తొందరగా ఊరు చేరుకోవాలి. ఒక పెద్దాయన కాస్త స్పీడుగా వస్తూనే… ‘‘ఆ పక్క స్టేషన్‌లో రైలు నిలిపేసి అరగంట పై బడింది. ఇంకా ఇక్కడేం చేస్తున్నార్రా… బస్టాప్‌కు వెళ్దాంరండి’’ అంటూ అక్కడున్న తనవారిని ఆత్రుత పెట్టసాగాడు. కాసేపైన తరువాత, అక్కడున్న వారందరి నోళ్ళల్లోన ఇదే మాట నానడం మొదలైంది. ఒక్కొక్కరే వెళ్ళిపోతున్నారు. ఇక్కడున్న ఎక్కువ శాతం మంది కంపార్ట్‌మెంట్‌ బోగీలో ఎక్కేవాళ్ళే…

బెర్తుల కోసం సీటు రిజిష్టర్‌ చేయించుకున్న వాళ్ళు… వెళ్ళాలా? వద్దా? అనే సంశయంలో ఇరుక్కు పోయివున్నారు. నేను కూడా లేచి తిన్నగా బస్టాప్‌కి నడవక తప్పలేదు. ‘‘ఏం మనుషులో ఏంటో… చీటికి మాటికి బంద్‌లు చేస్తూ… సామన్య ప్రజలకు ఇక్కట్లు పెడతారు’’ నా పక్కగా నడుస్తున్న ఒకాయన ఈ మాట అన్నాడో లేదో… అతని వెనుకనే నడుస్తున్న బుర్ర మీసాల పెద్దమనిషికి చిర్రెత్తుకొచ్చింది… ‘‘చాల్లే ఊరుకోవయ్యా! ఓట్లు వేసి వాళ్ళను మనం గెలిపించింది దండుకోవటానిక్కాదు… ప్రజలను ఆదుకోవటానికి, వాళ్ళేలమో పదవులకు గిట్టుబాటు చేసుకొంటున్నారు గాని…. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నారా..? చెప్పవయ్యా…’’ బుర్రమీసాల పెద్ద మనిషి మాటకు అతను నోరు మెదపలేకపోయాడు.

తిన్నగా నడుస్తూనే బస్టాప్‌ సమీపించామో లేదో… ‘‘సర్కారు యొక్క వైఖరి మార్చుకోవాలి…’’ అంటూ నినాదాల హోరు సిటీని మొత్తం స్తంభింపజేస్తోంది. ఎక్కడి బస్సులు అక్కడే ఆగివున్నాయి. రైతుకు గిట్టుబాటు ధర లభించేంత వరకు దీక్షను విరమించుకోమంటు… శిబిరాల్లో కూర్చుని కొందరు… మరో పక్క చేనేతల తిరుగుబాటుతో చెవులు మారుమ్రోగి పోతున్నాయి. నడవటానికి వీలు లేకపోవడంతో… కాస్త దూరంగా ఆగివున్న ఆటోను సంప్రదించాను… ‘‘ప్రైయివేట్‌ బస్టాప్‌కి వస్తావా…’’ అనడిగాను ‘‘వస్తాను, కాకపోతే ఆటో బిల్లు యాభైరూపాయలు అవుతుంది….’’ తడుముకోకుండా అనేసాడు ఆటోవాడు.

‘‘పది రూపాయలే కదా తీసుకోనేది…’’ పాత రేటు గుర్తుకు తెచ్చాను. నన్ను క్రింద నుండి పైదాక కలయచూసాడు ఆటోవాడు. వాడి వాలకం ఏంటో అర్థం కాలేదు ‘‘ఈ రోజు బంద్‌… రేటు ఎక్కువైతుంది. మెయిన్‌ ట్రాక్‌లో వెళ్ళడానికి పోలీసులు అనుమతించరు. అడ్డదారిలో వెళ్ళాలి… డీజిల్‌ ఖర్చు పెరుగుతాది…’’ అన్న ఆటోవాడి మాటకు నేను ఇంకేమి మాట్లాడలేదు… ఎక్కికూర్చున్నాను. అంతే ఈ రోజు నాకు పై వాడే దిక్కని వెనక్కి తిరిగాను. ఎటు చూసినా పోలీసు పహారా… టీ కొట్టు మొదలుకొని, రేషన్‌ షాపుల వరకు అన్నీ బంద్‌… ఏం చేయాలో అర్థం కాలేదు. కడుపులో పేగుల గోల మొదలైంది. నాలుకపై తడి ఆరిపోయి పిడుచగట్టుకుపోతున్నా… చుక్క మంచినీరు కూడా దొరికేలాలేదు. పబ్లిక్‌ కొళాయిలు కూడా ఎక్కడ కనిపించడం లేదు… పక్క వీధిలోకి అడుగుపెట్టాను. ఒకాయన తిన్నగా అడుగులో అడుగులు వేసుకొంటూ… తూలుతు వస్తున్నాడు.

‘‘అన్నాయ్‌… ఇక్కడ ఎక్కడైన మంచి నీళ్ళు దొరుకుతాయా..?’’ అనడిగాను… అతను తిన్నగా నవ్వి ‘‘సారీ ఈ రోజు బంద్‌.., మందైతే దొరుకుతాది…. మంచినీళ్ళు దొరకవ్‌..’’ అంటూ వెళ్ళిపోయాడు. రెండడుగులు మందుకేసాను. జేబులో సెల్‌ఫోన్‌ రింగయ్యింది. తీసి చూస్తే మల్లేశు మామయ్య… ఊరి నుండి ఫోన్‌… ఎత్తాను…‘‘ఏరా… అల్లుడూ… ఊరు చేరుకున్నావా?’’ అనడిగాడు ‘‘లేదు మామా… సిటీ మొత్తం బంద్‌ సాయంత్రం వరకు బస్సులు వదిలేలా లేరు… కంగారు పడకండి.. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్‌ కలుపుతాను…’’ అన్నాను. ‘‘సరే జాగ్రత్త ’’ అంటూ ఫోన్‌ కట్‌ చేసాడు మల్లేశు మామా.

సిటీ పక్కనే చిన్న పల్లెటూరు మామ గారిది… వ్యాపార నిమిత్తం సిటీకి వస్తూ పోతుంటాడు. మల్లేశు మామ దగ్గర అప్పుగా ఐదు వేలు తీసుకురమ్మంటే.. వచ్చి ఇలా ఇరుక్కుపోయాను. ఈ మధ్య మల్లేశు మామ పెద్దకూతురి పెళ్ళి ఘనంగా చేసి ఆర్థికంగా చిక్కిపోయాడంట… దాంతో ఒట్టి చేతల్తో వెనక్కి రావల్సి వచ్చింది. రోడ్డు పక్కగా వెళ్తూవున్నాను… ఒకతను చిన్నపాటి అంగడికి తలుపు కాస్త తీసి… తను లోపలే వుండి… అప్పుడప్పుడు బొరియలో ఎలుకలా బయటికి తొంగిచూస్తూ సీక్రేట్‌ బిజినెస్‌ చేస్తూ కనిపించాడు. అనుమానం వచ్చి అక్కడికి వెళ్ళాను. అతను తిన్నగా తల బయటికి పెట్టి నా వైపు చూసాడు.

‘‘ఏం కావాలి?’’ అంటూ మెల్లగా అడిగాడతను. ‘‘వాటర్‌ బాటిల్‌ కావాలండి’’ అన్నానో లేదో… చటుక్కున చేయి బయటికి పెట్టి ‘‘ముప్పది రూపాయలివ్వు’’ అన్నాడు. ‘‘పదిహేను రూపాయలే కదా…’’ అంటూ అడిగాను. నా ఈ మాటతో అతనికి నరనరాల్లో నుండి కోపం చుర్రున లేచింది. ‘‘ఈ రోజు బంద్‌ అని తెలీదా? కక్కుర్తి, పడకు… అదృష్టం బాగుండి… గాలిని కనపడనీకుండ చేసాడాదేవుడు… లేదంటే పీల్చడానికి గాలి కూడా ఈ సిటీలో దొరకనివ్వరు… అది తెలుసుకోండి ముందు… తొందరగా డబ్బు తీయండి’’ అన్నాడతను.

డబ్బులు తీసి చేతిలో పెట్టగానే… లోపల్నుండి బాటిల్‌ తీసి నా చేతిలో పెట్టాడో లేదో… ఒక్క ఉదుటన నిరసనకారులు కమ్ముకున్నారు. ఆ తోపులాటలో ముప్పది రూపాయలు ఇచ్చి కొన్న నీళ్ళ బాటిల్‌… ఇంకా నోటి దగ్గరికి వెళ్ళకముందే మన్ను పాలైపోయింది. కొద్ది క్షణాల్లోనే ఆ అంగడిని ధ్వంసం చేసేసారు. అక్కడికి పరుగుతో వచ్చిన పోలీసులు లాఠీలకు పనిపెట్టారు. అందరు దిక్కులకు పరుగులు తీసారు. నేనుకూడా కాళ్ళకు బుద్ధి చెప్పేంత లోపే… లాఠీ దెబ్బ నా మోకాలికి పడింది. ఆ ఆతృతలో నొప్పి కనిపించలేదు. పక్క వీధిలోకి పరుగుతీసాను.

ఆ వీధి నిర్మాణుష్యంగా వుంది. అక్కడున్న అరుగుపై కూర్చున్నాను. మోకాలి నొప్పి భరించలేకుండా వుంది. ఆ దరిదాపుల్లో హాస్పిటల్‌ కూడా లేదు. సాయంకాలం వరకు నొప్పి భరించాను. నాకు ఎదురుగా, దారినపోయే ప్రతి మనిషిని అడుక్కొంటున్న అవిటి బిక్షగాడు… పైకి లేవలేని పరిస్థితి అతనిది… జాలేసి… వెళ్ళి రూపాయిరూక బొచ్చెలోకి వేసి, పచ్చి కూర్చున్నాను… బంద్‌ కారణంగా ఆర్థికంగ వున్నవాళ్ళకే తిండి దొరకడం కష్టంగా వుంది…. ‘‘అయ్యా… ధర్మం చేయండి బాబు’’ అంటూ అటుగా వెళ్తున్ను ఒకల్ని అడిగాడు బిక్షగాడు.. ‘‘ేహ… పోవయ్య… ప్రతి రోజు బందే… వ్యాపారాలు కుంటుపడి మేమేడుస్తుంటే నీకు బిక్షం కావాలా? ఇక రెండ్రోజులు ఇలాగే బంద్‌ కంటిన్యూ చేస్తే… మాది కూడా నీ పరిస్థితే… పోవయ్య…’’ అంటూ అతను వెళ్తుంటే నాలో నేనే నవ్వుకున్నాను.

ఏదైతేనేమి ఒక్కొక్క షాపు తెరవడం మొదలుపెట్టారు. నిరసనకారులు నీరసించారు కాబోలు… బస్సులు కూడా తిరుగుతున్నాయని తెలిసి, లేచి కుంటుతూనే ఆటో స్టాండ్‌కు చేరుకొని, అటునుంచి బస్టాప్‌కు వెళ్ళాను.దేవుడి కరుణించాడు నన్ను… ఈగలు ముసిరినట్లుగా… ప్యాసింజర్స్‌ మధ్యలో బెల్లం ముక్కలా వుంది మా ఊరి బస్సు… అందరు ఎక్కాక. చివరిగా ఎక్కిన నేను డోర్‌ పక్కనే నిల్చున్నాను. అరగంటకు కదిలింది బస్సు… రాత్రి ఏడింటికి మా ఊర్లో దింపేసింది. తిన్నగా ఇంటికి చేరుకొని, అక్కడ జరిగిన బంద్‌లో నా పరిస్థితి ఇంట్లో వాళ్ళకి చెప్పగానే… అక్కడ నా పీకులాట… వీళ్ళకు నవ్వులాటగా మారింది. మోకాలికి కాపడం పెట్టుకున్నాక, భోంచేసి, పై గదిలోకెళ్ళి పడుకున్నాడు.

సెల్‌ఫోన్‌ ఒక్కసారిగా రింగ్‌ ఇవ్వగానే… ఉలిక్కిపడి ‘కల’ లన్ని చెదిరిపోయి ‘ఇల’ లోకి జారిపడ్డాను. ఫోన్‌ రిసీవ్‌ చేయగానే… ‘‘బాబూ… మీ నాన్న లేచాడా?’’ అవతలి నుండి… ఒక వ్యక్తి అడిగేసరికి, తిన్నగా డోర్‌ తెరచి తొంగిచూసాను. నాన్న ఇంక నిద్రపోతూనే వున్నారు. ఇదే విషయం అవతల వ్యక్తికి ఫోన్‌లో చెప్పాను. ‘‘వున్న డబ్బు అప్పుగా ఇచ్చిన తప్పుకు, తిరిగి వస్తుందో రాదో అని నిద్రరాక నేనేడుస్తుంటే… తీసుకున్న కుషీలో మీ నాన్న ఆదమరిచి నిద్రపోతున్నాడు…? అక్కర తీరగానే సరిపోదండి… చేసిన అప్పు తీర్చాలనే ఇంగితజ్ఞానం వుండాలి. ఈ రోజు సాయంత్రం లోగా అప్పు చెల్లించలేదంటే పరిణామం మరో విధంగా వుంటుందని చెప్పండి’’.

తను ఎవరో ఏంటో ఊరు పేరు చెప్పకుండానే ఫోన్‌ కట్‌ చేసాడు. లేచి విండోస్‌ తీసి చూసాను. మంచు దుప్పటి కింద ఊరు ఒదిగిపోయింది. కప్పుకున్న దుప్పటి తీసేసరికి, ఒళ్లుపై శీతల బల్బులు ఒక్కసారిగా వెలిగాయి. లేచి అటు ఇటు తిరుగుతున్నాను. ఫోన్‌లో అతను మాట్లాడిన మాటలు… నా చెవుల్లో గింగిరాలు కొడుతున్నాయి.అమ్మ నాన్న లేచిన తర్వాత ఈ విషయం చెప్పాలనుకున్నాను. గంటన్నర పాటు వేచి చూడగా… నాన్న నిద్రలేచి. నన్ను నిద్రలేపడం కోసం. రోజు వచ్చినట్టే నాగదిలోకి వచ్చాడు. అందరికంటే లేటుగా నిద్రలేచే నేను, ముందుగానే నిద్రలేచి అటూఇటూ తిరుగుతున్న నన్ను చూసి నాన్న ఆశ్చర్యబోయాడు. ‘‘ఏంట్రా… ఇంత ప్రొద్దున్నే లేచావ్‌’’ అడిగాడు నాన్న. ‘‘ఎవర్రా లేపింది’’ అనడిగాడు. ‘‘అప్పులవాళ్ళు’’ నా ఈ మాటకు ఇందాక ముఖంలో వున్న సంతోషం ఫిల్మెంట్‌ కాలిపోయిన బల్బులా… వెంటనే ఆరిపోయినట్టు… నాన్న ముఖంలో విచారపు నీడ కమ్మేసింది.

ఉన్న ఆస్తి తాతగారే అమ్మేసి. గట్టుకింద ఊటనేల మిగిలించిపోయారు. దాన్ని అమ్మకానికి పెట్టినా కూడా ఎవరు కొనుగోలు చేసే దిక్కేలేరు. అందుకే వదిలేసాడు. కౌలు భూమిలోనే వ్యవసాయం సాగిస్తూ… నన్ను నా చెల్లెలు రాధిని చదివిస్తూ… సంసారాన్ని లాగుతు వచ్చాడు. విత్తిన పంట మొదటి దశలో మురిపించినప్పుడల్లా… నాన్న ముఖంలో ఉట్టిపడే ఆనందాన్ని ఇంటిల్లిపాది దోసిల్లలోకి నింపుకొని చూస్తూ మురిసిపోయోటోళ్ళం. మధ్యమ దశకు చేరిన పంటపై చీడ చేరి తినడం మొదలుపెట్టాక. నాన్న ముఖం చింతాకంత అయ్యాది. విత్తినప్పుడు వున్న ధర, కోత దశకు వచ్చేపాటికి చితికిల పడుతుంటే.. నాన్న దిగులు పడుతు కూర్చొనేవాడు.

పంటలు గిట్టక, అప్పులు తీరక, అవస్థల పాలౌతున్నాకూడా… కష్టపడి మా చదువులకు ఫీజు చెల్లిస్తుంటే…చూసి భరించే ఓపిక మాకు లేకపోయింది. ప్రకృతి వైపరిత్యాలకు పంటలు మంటల్లో వేయాల్సిన పరిస్థితి దాపురిస్తుంటే… నిత్యావసర వస్తువుల ధరలు మిన్నునంటుతుంటే… తట్టుకోలేని మధ్య తరగతి మనిషిగా ఆలోసించి. ఎలాగైనా చెల్లెలు పెళ్ళి చేయాలనే సంకల్పంతో… ఎంతో కొంత వెనకేద్దామనుకున్నాను కానీ వీలు పడలేదు.

ఫైనాన్స్‌ వాళ్ళకు చేసిన కష్టమంత ఊడ్చి పెట్టడానికే సగం జీవితం ఐపోయోలాగుంది. మళ్ళీ అతను ఫోన్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేసాడు. అతని పేరు వీర్రాజు… ఈ విషయం నాన్నతో చెప్పగానే ఒకింత భయానికి గురయ్యాడు. ప్రాణం కన్న మానం ఎక్కువని నమ్మే మనిషి నాన్న. ప్రతిరోజు చెప్తుండేవాడు… ‘‘ఒరేయ్‌ సిద్దార్థ! మనిషన్న వాడు మొండిగా ఎదగాలిగాని… భయంతో దిగజారకూడదు… ఏది జరిగిన మన మంచికే అనుకోవాలి… ఒకరు మనకు సమస్య కాకూడదు… మనం ఇంక్కొక్కరికి సమస్యలా మారకూడదు. బాగా గుర్తు పెట్టుకో..’’ అంటుండే నాన్న… వీర్రాజు మాట ఎత్తగానే నాన్నతో మొండితనం మాయమైపోయి… పిరికితనం కమ్ముకుంది…

నా మాటకు సమాధానం చెప్పలేదు. తిన్నగా బయటికి నడిచాడు నాన్న.
మధ్యాహ్నం లీజర్‌ టైంలో పేపర్‌ చూసాను. తాగుతున్న ‘టి’ మధ్యలోనే ఆపేసి ఎదపై చేయి వేసుకొని హతవిధీ…! అనుకున్నాను. గిట్టుబాటు ధర రాక దిక్కుతోయని
పక్షంలో ఐదురుగు రైతులు ఆత్మహత్మ… పంట కోత దశలో దెబ్బతిని చేతికి
అందలేదనే బాధలో మరో యువరైతు
బలవన్మరణం… ధరలు రేటు కొండెక్కిన పట్టించుకోని సర్కారుపై… రేపు ధ్వజమెత్తనున్న ప్రజాసంఘాలు… రేపు రాష్టబ్రంద్‌కు పిలుపు…

మనసును కదిలించే వార్తలు చదువుతుంటే… ‘టి’ తాగటం మరిచిపోయాను… చల్లారి పోయిన ‘టి’ని పారేసి… డ్యూటికి వెళ్ళాను… సాయంత్రం ఇంటికి వచ్చానన్న మాటేగాని, భోంచేయడానికి మనసు ఒప్పుకోవట్లేదు… ఆ రాత్రి నిద్రలేని రాత్రిగానే మిగిలిపోయింది. మరుసటి రోజు ఉదయం టిఫిన్‌, కాఫీ మగించుకున్నాక. డ్యూటీకి వెళ్ళాలంటే నిశ్చయంతో… అడుగు బయటికి పెట్టాను. ‘‘ఒరేయ్‌ సిద్దార్థ! ఎక్కడికిరా వెళ్తున్నావ్‌..’’ అడిగాడు నాన్న.
‘‘డ్యూటికీ వెళ్తున్నా…’’ అన్నాను. ‘‘ఈ రోజు రాష్టబ్రంద్‌… డ్యూటీ లేకపోతే నేరుగా ఇంటికిరా… ధర్నాలకు, జగడాలకు, పోవద్దు… మన టైం బాగా లేదురా…

జాగ్రత్త..’’ అన్నాడు నాన్న ‘‘అలాగే నాన్న’’ అంటూ బయలు దేరి వెళ్ళాను. వీధులన్ని ప్రశాంతంగా ఉన్నాయి… తుఫాను లేచే ముందు సముద్రం కూడా ప్రశాంతంగా ఉంటుందంటారు. కిరాణా కొట్లు… ‘టి’ అంగళ్ళుతో సహ మూసివున్నాయి. సమయం తొమ్మది దాటుతున్నా కూడా ఎక్కడ ఏ అలికిడి వినపడలేదు… నేను పనిచేసే కంపెని మూసి వేయడమే కాదు… కార్మికులందరు గుంపుగా చేరి ధర్నాకు సమాయత్తం అవుతున్నారు…

పార్టీలకు అతీతంగ అందరూ ధర్నాలో పాల్పంచుకొంటున్నారు. నేను కూడా తోటి కార్మికుల వెంట నడవక తప్పలేదు. సమ్మెలో పాల్గొనవద్దని నాన్న ముందే జాగ్రత్త పరచినా కూడా… తోటి కార్మిక సంఘం నన్ను ఇంటికి వెళ్ళనివ్వలేదు… ధర్నాలో పాల్గొనేందుకు నిలిచిపోవాల్సి వచ్చింది. ఇప్పటి వరకు ప్రశాంతంగా వున్న పట్టణం… పెద్ద ఎత్తున జనం ఒక్క సారిగా రోడ్డు పైకి వచ్చేసరికి… సందు గొందులు సహితం సమ్మెకారుల సందడితో నిండిపోయాయి… ఆఖరికి ఆటోలను
కూడా తిరగనీయడం లేదు… పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. నిరసన కాస్త బలపడి రగడగా పరిణమించాక, పోలీసులు బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది.

పరుగుదీస్తున్నాను… పోలీసుల రబ్బరు తూటాలకు అందకుండా పరిగెడుతున్నాను. జేబులో పెట్టుకున్న సెల్‌ఫోన్‌ ఎక్కడో జారిపడిపోయింది. ఆ సమయంలో నాకు ఏదీ జ్ఞప్తికి రాలేదు… ఏదో తెలియని ఉత్సాహం… ఎన్నడూ లేని ఆరాటం… నన్ను ఉద్యమకారునిగా మార్చేసాయి… ఎదురుగా వస్తున్న ఆటో వైపు పరుగుతీసాను… చేతిలో వున్న కర్రతో… వెనుక ముందు ఆలోచించకుండా అద్దాలు ధ్వసం చేసాను. అంతే నా వెనుకనే వున్న తోటి నిరసనకారులు

ఒక్కసారిగా వచ్చి… నన్ను వెనక్కి తోచి, ఆటోను అడ్డగించారు… నేను మాత్రం
ఆ తోపులాటలో… చాలా దూరం వెనక్కి జరిగిపోయాను. ఆటో డ్రైవర్‌ని చితక బాదారు… ఆటోలో వున్న ప్యాసింజర్స్‌ ఎవరోగాని, నిరసనకారుల్ని ఏడుస్తూనే బ్రతిమలాడుతున్నట్లు… మాటలు వినపడుతున్నాయ్‌… నాకు సరిగా అక్కడ జరుగుతున్న పరిణామం ఏమిటో కనిపించక పోయినా… గట్టిగా ఏడుస్తున్న ఆడవారి గొంతు మాత్రం వినిపిస్తోంది. ఎందుకో నాలో దయదాక్షిణ్యం పురివిప్పింది.. ‘‘ఆగండీ… ఆగండీ…’’ అంటూ ముందుకు అడుగు వేసేలోపే… పోలీసులు కలబడ్డారు… అందరూ పరుగులు దీసారు…నేను ఒక్కడినే అక్కడ నిలబడిపోయాను… ఆ ఆటోలో వున్నది ఎవరో కాదు.. అమ్మ, నాన్న, చెల్లెలు. చెల్లెలు ఏడుస్తూ వచ్చి నా ముందు నిలబడింది. ఆటోలో వున్న నాన్నకు స్పృహ లేదు. అమ్మ గట్టిగా ఏడుస్తూ కూర్చుంది. అటు పక్క ఆటో డ్రైవర్‌ సొమ్మసిల్లి పడున్నాడు.అప్పుల వాళ్ళ వత్తిడిని భరించలేక…

ఎంతో కొంత చేతికందిన పంటకు గిట్టు బాటు రాక. బతుకు బంతి భారం మోయలేక, ఊపిరాడని పక్షంలో… పురుగుల మందే మనశ్శాంతికి సరైన ఔషధమని భావించిన నాన్న. అది తాగి ప్రాణం
మీదకు తెచ్చుకున్నాడు. దిక్కుతోచని స్థితిలో… ఎవరిమీదైతే మేము తిరగబడ్డామో… ఆ పోలీసులే మమ్మల్ని రక్షించారు… ఏ ప్రభుత్వ వాహనాన్నయితే మేము తగుల పెట్టామో… ఆ ప్రభుత్వ
వాహనమే నాన్నను ఆసుపత్రికి చేర్చింది. ఆటో డ్రైవర్‌ని రక్షించింది. ఐనా… నాన్నకు బ్రతికే యోగం లేకపోయింది. పది నిమిషాలు ముందుగా వచ్చివుండి వుంటే… మీ నాన్న బ్రతికేవాడని డాక్టర్లు చెప్పగానే… నా రెండు కళ్ళను కన్నీటితో నింపుకొని, నిరసనకారులకు రెండు చేతులు జోడించి… కన్నీటి దణ్ణం పెట్టుకున్నాను.

– నరెద్దుల రాజారెడ్డి
ఫోన్‌: 9666016636

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top