You Are Here: Home » యాత్ర » తీర్ధ యాత్రలు » బ్రజ్

బ్రజ్

సాంస్కృతికంగా కృష్ణ భగవానుడు ఏలిన ప్రాంతం బ్రజ్. మధుర, ఆగ్రా, రాజస్థాన్‌లోని భరత్పూర్-ఈ మూడు ప్రాంతాల సంగమమే బ్రజ్. సుందరమైన పచ్చిక బయళ్ళు, పేద ప్రజలకు సేవలను సమకూరుస్తున్న ఓ పెద్ద ఆసుపత్రి ఉన్న రామకృష్ణమఠం ప్రాంగణంలోకి మేము అడుగుపెట్టేసరికి రాత్రి 10.30 గంటలయింది. ప్రశాంతతను భగ్నం చేస్తూ, అంత రాత్రిపూట కూడా చెట్లకొమ్మల్లో కలివిడిగా తిరుగుతూ అప్పుడప్పుడూ భయంకరంగా అరుస్తూ ఉంది ఓ కోతుల సమూహం. అలాంటి బృందావనం నిండా తుంటరి కోతి మూకలే! హాని చేసేటట్టుగా అగుపించవు కాని, అప్పుడప్పుడు చిలిపిగా మీ వస్తువులు, చివరికి కళ్ళద్దాలతో సహా మాయం చేస్తాయి. స్వామీజీ మాకు చూపించిన రూములో పడుకున్నాం.

రాధాకృష్ణుల అందం
మరునాటి ఉదయమే చపాతీలు సుష్టుగా కడుపునిండా ఆరగించి, ఆటో రిక్షాపై కృష్ణ జన్మస్థలమైన మధురానగరం చేరుకున్నాము. అక్కడ చీకటి చీకటిగా, ఉన్న ఒక భూగర్భ దేవాలయాన్ని (ఇది కారాగారం లోపలి గృహము. మరాఠీలు నిర్మించినది.) సందర్శించుకున్నాం. అది లడ్డు గోపాల్ దేవాలయం. పురాతన కేశవ్ దేవ్ ఆలయాన్ని ధ్వంసం చేసి ఔరంగజేబు నిర్మించిన అందమైన మసీదుకు, ఈ దేవాలయానికి మధ్య ఉన్నది ఒక గోడ మాత్రమే.

మేము ఆ జైలుగదిలో, పూలగుత్తుల సువాసనల మధ్య చల్లదనాన్ని ఆస్వాదిస్తూ గడిపాము. కొంతమంది వయసుమళ్లిన స్త్రీలు బ్రజ్ భాషలో( బ్రజ్ ప్రాంతంలో మాట్లాడే హిందీ మాండలికం) శ్రీకృష్ణుని ఔన్నత్యాన్ని గురించి చాలా శ్రావ్యంగా పాడారు. ఆ తర్వాత మేము ప్రధాన ఆలయ ప్రాంగణం వైపు వెళ్లాము. దీన్ని 1960 దశకంలో పండిట్ మదన్ మోహన్ మాలవ్యా సారథ్యం వహించిన ఉద్యమం తర్వాత నిర్మించారు. మధురకు 11 కి.మీ దూరంలో ఉన్న బృందావనంలో ఉందా మఠం. దానిపెద్ద వసారాలు, ధారాళంగా గాలి, వెలుతురు ప్రసరించే పెద్ద పెద్ద గ దులు ఉన్న సువిశాలమైన దేవాలయంలో మేము అటు ఇటు తిరిగి గర్భగుడి ఎదురుగా ఉన్న పెద్ద సమావే శ మందిరంలోకి వచ్చాము. అక్కడ పాలరాయితో చెక్కబడ్డ రాధాకృష్ణుల విగ్రహాలు రకరకాల పూలతో అందంగా అలంకరించబడి ఉన్నాయి. మేము బయటకు వచ్చి, ఎదురుగా ఉన్న ఓ మిఠాయి దుకాణంలోకి జొరబడ్డాము. పేడా కోసం ఆర్డర్ చేసి కియోడా(వృక్షశాస్త్రంలో పాండానస్ ఒడోర సిమస్ అంటారు) వాసనల ఘుమ ఘుమల మధ్య అద్భుతమైన రుచితో ఉన్న లస్సీని ఆస్వాదించే పనిలో పడ్డాము. మీగడతో కూడిన ఆ లస్సీని, కుల్లడ్ అంటే మట్టిపాత్రలలో ఇస్తారు. లస్సీతో పాటు చింతపండుతో చేసిన ఇమ్లీ చెట్నీ, వేడి వేడి సమోసాలు లాగించాము.

పండగల సంగీతం
మళ్లీ ఆటో రిక్షా మాట్లాడుకుని ద్వారకాధిష్ ఆలయానికి వెళ్లాం. సేట్ గోకులదాస్ పరేఖ్ అనే గ్వాలియర్ కోశాధికారి 1815 సంవత్సరంలో దీనిని నిర్మించాడు. ముందే ఇరుకు, అందులో వచ్చి పోయే జనంతో కిటకిటలాడుతూవుండే ఆ వీధిలో అందంగా ఉన్న ఆ ఆలయంలో కళాత్మకమైన ఆకృతిలో రాధ, ఇంకా ఇతర దేవతా విగ్రహాలు చుట్టూ ఉండగా, మధ్యలో ఉత్సవవిగ్రహం కృష్ణదేవునిది. ప్రత్యేకంగా, కృష్ణుడు, సుధాముడు కలిసి ఉన్న విగ్రహం ఆకర్షణీయంగా అమర్చబడి ఉంది. జమునా నది సమీపంలో ఉన్న ఈ గుడికి జన్మాష్టమి, హోలీ పండగదినాలలో జనం తండోపతండాలుగా వస్తారు.

పాయసంతో తయారు చేసిన ప్రసాదం తింటూ కాసేపు ఆ ఆలయంలోనే గడిపాం. తీపి అన్నం, పాలకోవా, డ్రైఫ్రూట్స్‌తో తయారు చేసిన ప్రసాదం అది. ఆ గుడి బయటికి వచ్చి, క్రిక్కిరిసి ఉన్న రోడ్డుకు ఇరువైపులా సిడిలు,డివిడిలు అమ్మే దుకాణాల నుండి వస్తున్న శాస్త్రీయ సంగీతం వింటూ దగ్గరలోనే ప్రవహిస్తున్న నదివైపు నడిచాము. బ్రజ్ భూమిలో జరుపుకునే రకరకాలైన పండగ సంబరాలను ప్రతిఫలించే ఆ సంగీతం మమ్మల్ని ఎంత ఆకట్టుకుందంటే, అక్కడ రోడ్డు మీద లభించే కొన్ని కేసెట్లు కొనకుండా ఉండలేకపోయాము.

బంకె బిహారీ
సాయంత్రం బృందావన్‌లోనే అతి ముఖ్యమైన దేవాలయమైన బంకే బిహారీ ఆలయం చూడడానికి బయలుదేరాము. చుట్టూ ఉన్న వీధులకంటే ఎత్తైన ప్రదేశంలో ఉంది ఆ గుడి. మేము వెళ్లేసరికి సూర్యాస్తమయ సమయం అవుతోంది. కార్తీక మాసం కావడంతో భక్తులు వెలిగించిన దీపాలు గుడినిండా కనిపించి ముగ్ధుల్ని చేశాయి మమ్మల్ని. గర్భగుడిలోపల నల్లగా, రాజసం ఒలకబోస్తున్న దేవుని విగ్రహం చుట్టూ కూడా అలాంటి దీపాలే కాంతిని విరజిమ్ముతున్నాయి. అక్కడి నుంచి కొన్ని మెట్లు ఎక్కితే ఎత్తైన పీఠం మీద దేవుని విగ్రహాన్ని దగ్గర నుండి చూడడం ఒక గొప్ప అనుభూతి. బంకె బిహారీ ఎంత దయాళువు అంటే తన దర ్శనం కోసం పలుసార్లు ఆలయానికి వచ్చే భక్తులను అనుసరిస్తూ గర్భగుడి ని వదిలిపెట్టి వారితో బాటు వెళ్లిపోతూ ఉంటారని అక్కడ జనం చెప్పుకుంటారు.

లాట్‌మార్ హోలీ
ఆ మరునాడు మధురానగరిలో ముఖ్యమైన ప్రదేశాలు చూడడానికి టూరిస్ట్ బస్ ఎక్కాం. మొదటగా రాళ్లు, రప్పలు పచ్చదనంతో నిండిన గోవర్థనగిరి చూశాము. శ్రీకృష్ణుని కాలంలో ఈ ప్రదేశాన్ని పశువులను మేపడానికి ఉపయోగించేవాళ్ళని కదా భాగవతంలో చదువుకున్నాం. ఈ కొండను చెప్పులు లేకుండానే ఎక్కాల్సి ఉంటుంది. అక్కడ నుంచి నందగాంకి వెళ్లాం. కృష్ణుడ్ని పెంచిన యశోదానందుల ఊరు అది. ఆ తరువాత సువిశాలమైన ఆలయప్రాంగణాన్ని దర్శించి, రాధ తన బాల్యాన్ని గడిపిన బర్సాన పట్టణానికి వెళ్లాం. ఒక అలౌకిక ప్రేమసత్యంలో అవిభాజ్య భాగాలైన రాధాకృష్ణులు అక్కడ ప్రతి దేవాలయంలోను కలిసే కనిపిస్తారు. మరీ ముఖ్యంగా బర్సానలోన గోవర్థన కొండపై ఉన్న రాధారాణి మహాలయంలో. లాట్‌మార్ పండగ ఈ ప్రాంతానిదే. రాధ, ఇతర గోపికలు స్నానం చేస్తున్నపుడు వారి దుస్తులు దొంగిలించిన శ్రీకృష్ణునికి కర్రలతో బుద్ధి చెప్పిన ఘటననే ఏటా ఇలా పండగగా జరుపుకుంటారు. ఆడవాళ్లు రంగుల్లో మునిగిపోయి నూనెలో ముంచిన కర్రలతో మగవాళ్లను ఝడిపిస్తూ వెంట పడడమే లాట్‌మార్ హోలీ.

మొట్టమొదటి ఇస్కాన్ ఆలయం
మా తర్వాతి సందర్శనా స్థలం రాధాకుండ్, శ్యాంకుంజ్. ఇది చాలా పవిత్రమైన స్థలంగా ప్రసిద్ధి. ప్రాక్పశ్చిమాల నుండి వచ్చిన భక్తులతో కిటకిటలాడుతుంటుంది. అక్కడ నుంచి మా బస్సు ప్రకృతి సౌందర్యం ఉట్టిపడుతున్న కుసుమ పూలతో నిండిన సరోవరానికి చేరుకుంది. సరస్సు ఒడ్డున శ్రీకృష్ణునికి ఇష్టమైన కాదంబవృక్షాలు కోకొల్లలుగా ఉన్నాయి. తన తండ్రి రాజాసూరజ్ మల్ రాణులైన కిశోరి, హంసియాల గౌరవార్థం జవహర్ సింగ్ ఈ సరోవరాన్ని 18 వ శతాబ్దంలో నిర్మించాడు. రెండో వైపు అందమైన ఉద్యానవనాలు కలిగి, 60 అడుగుల లోతు ఉన్న ఆ సరస్సు సరదాగా ఈత కొట్టడానికి ఎంతో అనువుగా ఉంది. సుగంధ సౌరభాలు వెదజల్లుతున్న ఈ ప్రదేశంలోనే, రాధాకృష్ణులు రహస్యంగా కలుసుకునేవారట. సాయంత్రానికి ఇస్కాన్‌గుడికి చేరుకున్నాము. సాయంసంధ్యా వెలుతురులో పాలరాతిపై బంగారు రంగులో ప్రస్ఫుటంగా ప్రకాశిస్తూ ఇస్కాన్ గుడి ఎంతో అందంగా ఉంది. ఇది కృష్ణ బలరాముల మందిరం.

దైవాంశ సంభూతులైన ఆ ఇద్దరు సోదరులు ఈ ఆలయంలో ప్రతిష్టులయి ఉన్నారు. ఇది 1975 లో స్వామి ప్రభు పదానంద నెలకొల్పిన దేవాలయం. ప్రపంచంలోనే మొట్టమొదటి ఇస్కాన్ దేవాలయం. మధురలో మేం చూసిన తినుబండారాలు ఇక్కడా లభిస్తున్నాయి. కాని సైజులో వాటికంటే పెద్దవి. మరునాటి ఉదయం ఫలహారం ముగించుకుని, నిధి వనానికి నడుస్తూనే వెళ్లాము. అక్కడ మల్లెపూలతోటలో స్వామి హరిదాస్ సమాధి ఉంది. స్వామి హరిదాస్ అంటే సుమధురంగా పాటలు పాడే సన్యాసి. చరిత్రాత్మకమైన ఈ ప్రదేశాలలో కాసేపు సంచరించి కుంజ్ గలియాన్ (అంటే సన్నని దారులతో కూడిన ప్రదేశం అని అర్థం)కు వెళ్లాము. ఎక్కడికి తీసుకువెళతాయో ఎవరికీ అంతుపట్టని దారులు అవి. ఒక చోట, చిన్న తోపుడుబండిని లాగుతూ ఓ పెద్ద ఒంటె మా పైకే వస్తున్నట్టు కన్పించి గాభరా పడ్డాము. దానిని తోలుతూ ఓ మనిషిి మెల్లగా రాధే..రాధే..అని పాడుకుంటున్నాడు. అవును..బంకె బిహారీకి చెందిన ఈ భూమిలో ఇది అత్యంత ప్రియమైన శబ్దం. అన్ని సమస్యలను ప్రేమతో, భక్తితో పరిష్కరించుకుందాం అన్న సందేశాన్ని ఇస్తున్న వినసొంపైన శబ్దం!

ఇదీ ప్రేమమందిరమే
మా చివరి మజిలీ ఆగ్రాకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకున్నాము. ఆ రాత్రే హైదరాబాదుకు తిరుగుప్రయాణం. వీలయినంత ఎక్కువసేపు తాజ్‌మహల్‌ను చూడాలని మా తాపత్రయం. ఓహ్..దర్వాజ కమాన్ గుండా మహల్ శోభ మొదటి చూపులోనే ఆకట్టుకుంది. మా ముఖాలు ఒక్కసారిగా వెలిగిపోయాయి. సూర్యుడు అస్తమిస్తున్న ఆ సాయంకాలపు వేళ మేం అద్భుతమైన ఆ తాజ్ మహల్ అందాలను ఎంతో సేపు చూస్తూ ఉండిపోయాం. ఆ రాత్రి ఒక కల వచ్చింది. తాజ్ మహల్లో శ్రీకృష్ణుడు పిల్లనగ్రోవి ఊదుతూ ఉన్నాడు. సరసన రాధ. రాసలీలానృత్యం చేస్తూ గోపికాజనం. భక్తి పారవశ్యంతో కృష్ణ దేవున్నడిగాను…” స్వామీ! మీ పేరేమిటి ఇక్కడ?” కృష్ణ పరమాత్ముడు ఆనందంతో నృత్యం చేస్తూనే ‘ ఇదీ ఒక ప్రేమ మందిరమే కదా’ అన్నాడు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top