You Are Here: Home » చిన్నారి » కథలు » బాధ

బాధ

STORYనా బాధ ఎవరికి చెప్పుకోను?సాయం సంధ్య. వీధి దీపాలు వెలిగాయి. చెమ్మ మంచుతరకలు వాటి మీద పడుతున్నాయి. ఇళ్ళ కప్పుల మీద, గుర్రాల వీపుల మీద, మనుషుల భుజాల మీద, టోపీల మీద పడుతున్నాయి. పల్చని పొరలు పేరుకుంటున్నాయి. బండి మీదా, బండి తోలే ఆయోనాపోతాపోవ్‌ మీదా మంచు పడింది. అతను తెల్లగా, మంచుభూతంలా ఉన్నాడు. ముణగ లాక్కుపోయి కూర్చున్నాడు. ప్రాణంతో ఉన్న మనిషి ఎంత ముణుగలాక్కుపోయి ఉండగలడో అంత ముణగలాక్కుపోయేడు. బండి మీద రాయిలా కూర్చున్నాడు. బండికి కట్టిన ముసలి గుర్రం కూడా మంచుకప్పి తెల్లగా ఉంది. కదలడం లేదు. నిశ్చలంగా ఉంది. దాని ఆకారం కోసుగా ఉంది. కాళ్ళు పుల్లల్లా ఉన్నాయి. బహుశా అది ఏదో గాఢమైన చింతలో ఉండి ఉంటుంది. అలవాటైన పరిసరాల నుంచి, పని నుంచి లాగేసి ఇలా భరించలేని దీపాలు, ఎడతెరపి లేని రణగొణ ధ్వని, జన సందోహం ఉన్న సుడిగుండంలో తోసేస్తే ఎవళ్ళేనా చింతాక్రాంతంగానే ఉంటారు.

అక్కడ్నే ఆయోనా బండి పెట్టుకొని చాలా సేపట్నుంచి ఉన్నాడు. రాత్రి భోజనాలకి ముందే బళ్ళ గేటు నుంచి బయల్దేరాడు. కాని ఇంతవరకు ఒక్క బేరం తగల్లేదు. చీకటి బాగా కమ్ముకుంటోంది. మసగ్గా వెలిగే వీధి దీపాలకి కాంతి హెచ్చింది. వీధుల్లో గోల ఎక్కువైంది.‘ఇదిగో బండీ! వీచోర్గస్కయాకి’ అని ఎవళ్ళో పిలిచారు.అయోనా ఉలిక్కి పడ్డాడు. అతని కనుబొమ్మల మీద మంచు పేరుకుంది. దాన్ని దులుపుకోకుండానే అతను చూశాడు. తల మీద బారు కోటు పడగ కప్పుకున్న ఆఫీసరు కనిపించాడు.
‘వీచోర్గస్కయాకి వస్తావా? నిద్రపోతున్నావా, ఏమిటయ్యా పలకవు? వీచోర్గస్కయాకి వస్తావా అని అడిగేను’ అన్నాడు రెట్టిస్తూ ఆ ఆఫీసరు.

వస్తానన్నట్టు అయోనా కళ్ళేలు గుంజేడు. ఆ గుంజుడుకి గుర్రం వీపు మీద నుంచీ, అయోనా భుజాల మీద నుంచీ, మంచు తెరలు తెరలుగా పడింది. ఆఫీసరు ఆ స్లెడ్జి బండి ఎక్కాడు. అయోనా గుర్రాన్ని తోలడానికి చిక్కవేశాడు, దాని మెడని బాతులా సాగదీశాడు. లేచి కమ్చీ అదిలించేడు. అతనలా చెయ్యడం ఎక్కువగా అలవాటు వల్లనే, అవసరం కంటే, ముసలి గుర్రం కూడా మెడ సాచింది. పుల్లల్లాంటి కాళ్ళని ఒంచింది. మెల్లిగా ముందుకు అడుగు వేసింది.బండి బయల్దేరిందో లేదో గుంపులో నుంచి అరుపులు వినిపించాయి. ‘ఎటు తోలుతున్నావయ్యా? నిన్ను తగలెయ్య.’‘కుడి వేపు పోవయ్యా!’

‘నీకు బండి తోలడం వచ్చునటయ్యా? కుడి వేపు తగలడు..’ అంటూ బండిలో ఉన్నతను కూడా కసురుకున్నాడు. గొప్ప బగ్గీని తోలేవాడొకడు అయోనాను తిట్టిపోశాడు. దారమ్మట పోయేవాడొకడు అడ్డంగా పరుగెత్తుతూ గుర్రం ముట్టెని తీసుకున్నాడు. అయోనా కేసి చిరచిరలాడుతూ చూసి చొక్కా చేతి మీద పడ్డ మంచు దులుపుకున్నాడు. పాపం, అయోనా సీట్లో నిప్పు తొక్కిన పిల్లిలా అటూ ఇటూ కదిలిపోయేడు. మోచేతిని కుడి వేపు ఎడం వేపు తుడుముకున్నాడు. దారమ్మటపోయే మనిషికేసి గుడ్లప్పగించి చూశాడు. ఆ పట్టణారణ్యంలో తనెక్కడున్నదీ, ఏం చేస్తున్నదీ అర్థం కానట్టు చూశాడు.‘వాళ్ళు వెధవల్లా ఉన్నారే! బండికి ఢీకొట్టుకున్నా ఢీకొట్టుకుంటారు. బండి కింద పడనేనా పడతారు! నీ మీద కుట్ర పన్నినట్టు’ అన్నాడు బండిలో ఉన్న ఆఫీసరు. అయోనా నోరు తెరిచి అతనికేసి తిరిగేడు. ఏదో చేప్దామనుకున్నాడేమో గాని గొంతుకలో నుంచి హుస్సురన్న శబ్దం మాత్రం వచ్చింది.

‘ఏమిటంటావు?’ అని ఆఫీసరు అడిగాడు.‘అయోనా నవ్వుతున్నట్టు నోరు వంకరగా పెట్టేడు. గొంతకని కూడగట్టుకుని కీచుమన్నాడు. ‘మా అబ్బాయండయ్యా.. మూడ్రోజుల నాడు పోయేడు.’‘అలాగా? ఎలా పోయేడు!’అయోనా వెనక్కి తిరిగేడు. ‘ఏమోనండీ జ్వరం వచ్చిందండి.ఆస్పత్రిలో మూడ్రోజులు ఉన్నాడు. పోయేడు. దేవుడు చిన్న చూపు చూశాడు.’ ‘ అటు తోలవయ్యా, నిన్ను తగలెయ్య. ఎటు తోలుతున్నావ్‌. కనిపించడం లేదా ఏం? చూసి తోలు’ అని చీకట్లో ఎవళ్ళో అరిచేరు. ‘ఊఁ, తోలు, తోలు! ఇలా తోలితే తెల్లారుతుంది! కమ్చీతో కొట్టు’ అని ఆఫీసరు అరిచేడు.

అయోనా మళ్ళీ మెడసారించాడు. సీట్లో నుంచి లేచి బరువుగా కమ్చీ అదిలించేడు. మాటి మాటికీ బండిలో ఉన్న ఆఫీసరు వేపు చూశాడు. కాని ఆఫీసరు కళ్ళు మూసుకున్నాడు. అయోనా చెప్పేది వినే ఆసక్తి లేనట్టు ఉన్నాడు.అతను దిగిపోయాక అయోనా బండిని ఓ సారా కొట్టు దగ్గర ఆపేడు. ముందటిలాగే ముణగలాక్కుపోయి కూర్చున్నాడు. అతన్నీ గుర్రాన్నీ తడి మంచు కమ్మింది… ఓ గంట గడిచింది.. ఇంకో గంట గడిచింది…

ముగ్గురు పడుచువాళ్ళు వాదులాడుకుంటూ వచ్చేరు. బూటు కాళ్ళతో నేల మీద ధనధనా నడుస్తున్నారు. ఇద్దరు పొడుగ్గా సన్నగా ఉన్నారు. మూడో వాడు కొంచెం గూనిగా ఉన్నాడు.‘ఏయ్‌, బండి! పోలిత్‌ జెయిన్కీ వంతెన దగ్గరికి వస్తావా? మా ముగ్గురికి ఇరవై కోపెక్కులిస్తాం’ అన్నాడు గూనివాడు.అయోనా కళ్ళేలు అదిలించి యధాప్రకారం పెదాలు చప్పరించాడు. ఇరవై కోపెక్కులు వో బాడుగా? కాని బేరమాడే స్థితిలో లేడతడు. ఇప్పుడతనికి రూబులైనా ఒకటే, అయిదు కోపెక్కులైనా ఒకటే. బేరం దొరికితే చాలు.
బండిలో ఇద్దరే పడతారు. వాళ్ళు ముగ్గురు కూర్చోవాలని గింజుకులాడేరు. వాదన రేగింది. ఎవరు కూచోవాలో, ఎవళ్ళు ముందు నుంచోవాలోనని చాలా సేపు నువ్వు, నువ్వు అని అరచుకున్నారు. కసురుకున్నారు. ఆఖరికి గూని మనిషి అందర్లోకి చిన్నగా ఉన్నాడు కాబట్టి అతను నుంచునేట్టు తేల్చారు.
‘ఆఁ పోనీ!’ అన్నాడు అయోనా వెనుక నుంచుని గూనివాడు. అతని శ్వాస అయోనా వీపు మీద తగులుతోంది.

‘వూఁ తోలు! గట్టిగా! అబ్బ నీ టోపీ ఏం టోపీయోగాని! సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ మొత్తం మీద ఇంత దరిద్రపుగొట్టు టోపీ ఉండదు’ అన్నాడు. అయోనా గట్టిగా చప్పరించి ఇకిలించాడు. ‘నాకు సరిపోతుంది లెండి’ అన్నాడు.‘పోనీ! సరిపోతుందట! తోలు గుర్రాన్ని! ఇలాగే ఈడుస్తూ పోతావా ఏంటి? వూ! ఓ పిడిగుద్దు తగిలించమన్నావా?’‘నా తల పగిలిపోతోంది’ అని ఓ బక్కపల్చని వాడు అన్నాడు.
‘నిన్న రాత్రి దక్మెసోవ్‌ బార్‌లో వాస్క, నేను కలిసి నాలుగు ఫుల్‌ కోన్యాక్‌ లాగించాం’ అన్నాడు.
‘ చూడు ఏం కోస్తున్నాడో’ అని రెండోవాడు కోపంగా అన్నాడు. ‘ఒట్టు! నిజం!’
‘నీ మొహం నిజం! పిల్లి పులి అయినంత నిజం!’ ‘కుర్రాళ్ళు హుషారుగా ఉన్నారే!’ అని ఇకిలిస్తూ అన్నాడు అయోనా.

‘వూఁ తోలు! నిన్ను తగలెయ్య! తోలతావా లేదా! బండి తోలడం తెలీదు, కమ్చీతో కొట్టవయ్యా, దిష్టిపిడతా! వూ, తోలు! గట్టిగా కొట్టు గుర్రాన్ని’ అని గూనివాడు కసిరాడు. గూనివాడు వెనకాల మెలి తిరుగుతున్నాడు. అతని గొంతుక కంపిస్తోంది. అయోనాకి అదంతా తెలుస్తూనే ఉంది. తనని తిట్టడం విన్నాడు. వాళ్ళకేసి చూశాడు. అతని గుండెని అదిమిపెటిన ఒంటరితనం కొంచెం కొంచెం తగ్గింది. గూడార్థాల బూతులతో తిట్టి తిట్టి గూనివాడికి ఆయాసం వచ్చింది. దగ్గాడు.బక్కపల్చని వాళ్ళిద్దరూ ఏవరో నడేజా గురించీ, ఇంకొకళ్ళ గురించీ మాట్లాడుకున్నారు. అయోనా వాళ్ళకేసి తిరిగేడు. వాళ్ళ మాటలు కొంచెం కట్టడగానే వాళ్ళతో అన్నాడు;‘మీకు తెలుసా అయ్యా! మా అబ్బాయి.. తెలుసా.. మూడ్రోజులనాడు పోయేడు.’‘మనమంతా పోవాల్సిన వాళ్ళమే’ అని గూనివాడు దగ్గి పెదాలు తుడుచుకుంటూ అన్నాడు. ‘వూఁ తోలు! కమ్చీ పేలిపోవాలి! ఏమర్రా ఏమిటీ పాకడం? మనల్ని చేరుస్తాడా ఇలా తోలితే’ అన్నాడు బక్కపల్చని వాళ్ళతో.

‘కొంచెం వూపు ఇయ్యి చెంపమీద!’ ‘విన్నావా దిష్టిపిడత బొమ్మా! సరిగ్గా తోలకపోతే మెడవిరుస్తా. నువ్విలా తాయితీగా తోలితే మేం నడచిపోతాం! ఏం? వినిపిస్తోందా, పిశాచం? మేం అనే మాటలు గొడ్డు మీద వానపడ్డట్టున్నాయే నీకు?’అయోనాకి తలవెనక గుద్దుల పడ్డట్టు అనిపించింది, తగలకపోయినా.
‘ఏం సంబరంగా ఉన్నారు కుర్రాళ్ళు! దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి’ అని గట్టిగా పెదాలు చప్పరించాడు.‘ఏయ్‌ బండాయనా? నీకు పెళ్లయిందా?’ అని ఓ బక్కపల్చని వాడు అడిగేడు.

‘నాకా? ఏం సరదా కుర్రాళ్ళు! ఇప్పుడు నాకు మిగిలిందంతా భూమాత మాత్రమే.. అంటే సమాధి.. మా అబ్బాయి చచ్చిపోయాడు.. నేను బతికే ఉన్నాను.. చిత్రం! మృత్యుదేవత ఓ తలుపు తట్టబోయి ఇంకో తలుపు తట్టింది… నా దగ్గరికి రావడానికి బదులు నా కన్నతండ్రి దగ్గరికి వెళ్ళింది.’
తన కొడుకు ఎలా పోయాడో చెప్పాలని అయోనా వాళ్లకేసి తిరిగాడు. సరిగ్గా అప్పుడే గూనివాడు ‘హమ్మయ్య! ఎట్టకేలకి వచ్చేశాం’ అంటూ తెరిపిగా ఊపిరితీశాడు. అయోనా వాళ్ళిచ్చిన ఇరవై కోపెక్కుల బిళ్ళ చేత్తో పట్టుకుని చాలాసేపు వాళ్ళకేసి చూస్తూ ఉండిపోయేడు. వాళ్ళు చీకట్లో కనిపించకుండా వెళ్ళిపోయే దాకా చూస్తూనే ఉన్నాడు. మళ్ళీ ఒంటరితనం ఆవహించింది. మళ్ళీ చింతలో ములిగిపోయేడు..

కొంచెం సేపు తగ్గిన బాధ ఇంకా తీవ్రమైంది. అయోనా కళ్ళు ఆవేదనతో నిండిపోయేయి. చూశేడు. ఒక్కడు, వందల వేలమందిలో ఒక్కడు, ఆగి, తన బాధ వెళ్ళగక్కితే వింటాడేమోనన్న ఆశతో చూశాడు. కాని జనం ఆగలేదు. హడావిడిగా వెళ్లిపోయేరు. అతని గురించి, అతని బాధ గురించి ఏమీ పట్టనట్టు వెళ్లిపోయేరు… అతని బాధకి గట్లు లేవు. అది ఇంతటిదీ అని చెప్పడానికి లేదు. అయోనా గుండెపగిలి ఆ బాధ ఉరవడిగా దూకినట్లయితే అది యావత్ప్రపంచాన్నీ ముంచేస్తుంది. అయినా అతని బాధని ఎవళ్ళూ గుర్తించలేదు. ఆ బాధ ఎంత బడబాగ్నిలాంటిదైనా చిన్న గుల్లలో ముడుచుకుని ఎవళ్ళకీ కనిపించకుండా ఉండిపోయింది.అప్పుడు అయోనాకి ఓ నౌకరు కనిపించేడు. అతన్ని పలకరిద్దామనుకున్నాడు.

‘ఏమయ్యోయ్‌, ఎంతయింది?’ అని అడిగేడు.‘తొమ్మిది దాటింది. ఇక్కడుండకూడదు, వెళ్ళు.’
అయోనా కొంచెం దూరం తోలుకు వెళ్ళేడు. మళ్ళీ ముడుచుకుపోయేడు. అతనికి బాధ ముంచుకువచ్చింది.. మనుషుల్ని ప్రాధేయపడ్డం వృధా అనిపించింది… అయిదు నిమిషాల్లోనే మళ్ళీ నిటారుగా కూర్చుని, గుండెలో బాధ కలుక్కుమంటూ ఉంటే, తల ఆడించి కళ్ళేలు ఊపేడు. భరించలేనంత వ్యధ.‘బళ్ళగేటుకి వెళ్ళిపోవడం మెరుగు, వెళ్ళిపోవడం మెరుగు’ అనుకున్నాడు. ముసలిగుర్రం అతని మనసుని అర్థం చేసుకున్నట్టు ఊగుతూ పరుగెత్తింది. ఓ గంటా, గంటన్నర తర్వాత అయోనా ఓ పెద్ద మకిలి నెగడు దగ్గర చేరి కూర్చున్నాడు. నెగడు తిన్నె మీద, నేల మీద, బల్లల మీద జనం గుర్రు కొడుతున్నారు. ఉక్కగా, కంపుగా ఉంది. నిద్రపోయే వాళ్ళకేసి చూశాడు. డొక్కలు బరుక్కున్నాడు. పెందరాళే తిరిగి వచ్చినందుకు తిట్టుకున్నాడు.

గుర్రం దాణాకి కూడా సంపాదించలేదు. అందుకనే ఇంత విచారంగా ఉంది. ‘పని బాగా చెయ్యగలిగిన వాడికి.. సరిపడా తిండి ఉన్నవాడికి, గుర్రానికి బాగా దాణా పెట్టగలవాడికి ఎప్పుడూ బాగానే ఉంటుంది’ అనుకున్నాడు.ఓ మూల ఎవరో పడుచువాడు లేచేడు. నిద్రమత్తుగా గుర్రుమని నీళ్ళ కూజా అందుకున్నాడు. దాహమేస్తోందా?’ అని అయోనా అడిగాడు. ‘ఆఁ అలానే ఉంది.’‘పోన్లే, దాహం తీరుతుంది.. తెలుసా, తమ్ముడూ, మా అబ్బాయి పోయేడు.. తెలుసా.. ఈ వారం మొదట్లో, ఆస్పత్రిలో… అయ్యో నా బాబూ, నా తండ్రీ!’ఆ ముక్క విని పడుచతనిలో ఏం కదలిక వచ్చిందో అయోనా అతనికేసి చూశాడు. కాని చూడ్డానికి ఏముందని, ఏమీ లేదు. అత ను దుప్పటి లాక్కుని మళ్ళీ గాఢంగా నిద్రపోయేడు. అయోనా నిట్టూర్చి డొక్కలు గీరుకున్నాడు..

ఆ పడుచువాడికి దాహం తీరడానికి నీళ్ళు అవసరమైనంతగా తన బాధ చెప్పుకోడానికి అయోనాకి మనిషి కావాల్సి వచ్చేడు. అతని కొడుకు పోయి వారం అవుతోంది. అయినా సరిగా ఎవళ్ళతోనూ తన బాధ చెప్పుకోలేకపోయేడు. తొందరలేకుండా చాలాసేపు చెప్పుకోవాలి. కొడుక్కి ఎలా జబ్బు చేసిందీ, వాడు ఎంత యాతనపడిందీ, ఆఖరి మాటలుగా ఏం చెప్పిందీ, ఎలా చనిపోయిందీ చెప్పుకోవాలి.. వాడి అంత్యక్రియలు ఎలా జరిగాయో చెప్పాలి.. వాడి బట్టల కోసం తను హాస్పిటల్‌కి వెళ్లడం చెప్పాలి.కూతురు అనీస్తాని పల్లెటూర్లో వదిలివచ్చాడు. ఆమె గురించి చెప్పాలి. ఏం చెప్పాల్సి ఉందో ఇప్పుడు. తను చెప్పింది విన్నవాడు హుఁ అనాలి. నిట్టూర్చాలి. అయ్యో అనాలి. ఆడవాళ్లయితే ఇంకా బాగుండు. ఎంత తెలివి తక్కువ వాల్లయినా రెండు ముక్కలు బాధగా చెపితే ఏడుస్తారు.

‘గుర్రం ఎలా ఉందో చూడాలి. నిద్రకేం, ఎప్పుడేనా నిద్రపోవచ్చు. త్వరలోనే ఎంత నిద్రయినా పోతానేమో..’
లేచి, కోటు తొడుక్కొని గుర్రాల శాలకి వెళ్ళేడు. ముసలి గుర్రం అక్కడ ఉంది. గుగ్గిళ్ళ గురించీ, గడ్డి గురించీ,వాతావరణం గురించీ ఆలోచించుకుంటున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు కొడుకు గుర్తుకొస్తే భరించలేడు. వాణ్ణి గురించి ఎవళ్ళతోనయినా చెప్పగలడు. కానీ వాణ్ణి గురించి అనుకోవడం, వాడు కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు ఉండడం భరించలేడు.

‘నెమరవేస్తున్నావా?’ అని గుర్రంతో అన్నాడు.దాని కళ్ళు మెరుస్తున్నాయి. ‘ఊఁ కానీ నెమరువెయ్యి! గుగ్గిళ్ళు దొరకలేదు, గడ్డితో సరిపెట్టుకో.. అవును, నేను ముసలాణ్ణి అయిపోతున్నాను.. బండి తోలలేను ఇంక.. ఇప్పుడు మా అబ్బాయి తోలాలి.. నేను కాదు.. వాడు ఎలా బండి తోలేవాడంటే.. వాడే ఉంటేనా…’అయోనా కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేదు. అప్పుడు మళ్ళీ మొదలుపెట్టేడు.‘చూశావా, ఎలా జరిగిందో, నా ముద్దుల మూటా.. వాడింక లేడు; మా అబ్బాయి కుజ్మా.. పంచభూతాల్లో కలిసిపోయేడు.. ఇప్పుడు నీకో పిల్ల ఉందనుకో, నీ కడుపున పుట్టిన పిల్ల.. ఉన్నట్టుండి అది వెళ్లి చచ్చిపోతుందనుకో.. నువ్వు దాని కోసం ఏడుస్తావు, ఏడవవూ?’ముసలిగుర్రం నెమరువేసుకుంటూనే ఉంది. అతను చెప్పేది వింటూ అతని మీద శ్వాస తీసింది.అయోనా బాధ కట్టలు తెంచుకుంది. యావత్తూ గుర్రానికి వెళ్లబోసుకున్నాడు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top