You Are Here: Home » భవిత » విద్య » ప్రామాణిక పుస్తకాలు, ప్రాథమిక అంశాలు

ప్రామాణిక పుస్తకాలు, ప్రాథమిక అంశాలు

ప్రామాణిక పుస్తకాలు+ప్రాథమిక అంశాలు

టెట్‌-2012

ఉపాధ్యాయ అర్హత పరీక్ష మార్కులు ఇప్పుడు కీలకంగా మారాయి. ఆగస్టులో జరగనున్న డిఎస్సీ పరీక్ష నేపథ్యంలో తాజాగా వెలువడిన టెట్‌ నోటిఫికేషన్‌కు ప్రాధాన్యత పెరిగింది. గతంలో రెండుమార్లు టెట్‌ పరీక్ష జరిగింది. వీటిలో అనుకున్నంత మార్కులు పొందలేనివారికి, మూడోసారి జరగనున్న టెట్‌ పరీక్ష మరో మంచి అవకాశం. ప్రామాణిక పుస్తకాల్లోని ప్రాథమిక అంశాలపై అభ్యర్థులు ముందుగా దృష్టి పెట్టాలి. మే 31న జరగనున్న ఈ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు ఎలా సన్నద్ధమవ్వాల్లో, సబ్జెక్టు నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం…

టెట్‌లో సాధించిన మార్కులను అనుసరించి డిఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఇస్తారు. అరమార్కుతో ఉద్యోగాన్ని కోల్పోయిన అభ్యర్థులెంతో మంది ఉన్నారు కాబట్టి, టెట్‌లో సాధించిన మార్కులు చాలా ప్రాముఖ్యత వహిస్తాయి. టెట్‌లో గరిష్ట మార్కులు సాధించిన అభ్యర్థి, ఉపాధ్యాయ ఉద్యోగానికి దగ్గరవుతాడని కచ్చితంగా చెప్పవచ్చు. అనేక జిల్లాల్లో ఉద్యోగాన్ని పొందిన వ్యక్తికి, పొందని వ్యక్తికి మధ్య మార్కుల తేడా అత్యల్పంగా ఉంటోంది. కాబట్టి టెట్‌ను కూడా డిఎస్సీలో ఒక భాగంగా అభ్యర్థులు భావించాలి. రెండంచెల పరీక్షగా రాయడానికి సిద్ధమవ్వాలి. రెండోసారి నిర్వహించిన టెట్‌ పరీక్ష కఠినంగా ఉన్నప్పటికీ అనేకమంది అభ్యర్థులు మంచి మార్కులు సాధించారు. దీన్ని బట్టి చెప్పొచ్చు…పోటీ ఏ విధంగా ఉంటుందన్న సంగతి. ఈసారి జరగనున్న టెట్‌లో గరిష్టంగా 115-120 మధ్య మార్కులు సాధించినవారికి డిఎస్సీలో ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి.

* ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌), డిఎస్సీ పరీక్షలను అభ్యర్థులు వేరు వేరుగా చూడటం మానుకోవాలి. ప్రస్తుతం ఓ వైపు డిఎస్సీకి సాధన చేస్తూనే, టెట్‌ పరీక్షకు సిద్ధమవ్వాలి. ఎలాంటి టాపిక్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నది గ్రహించి టెట్‌కు సమయాన్ని కేటాయిస్తే, డిఎస్సీ సాధన సజావుగా సాగుతుంది. ప్రిపరేషన్‌ షెడ్యూల్‌ కొంత మార్చుకుంటే బాగుంటుంది. టెట్‌ పూర్తయ్యేంత వరకూ దీనిపైనే సీరియస్‌గా దృష్టి పెడితే ఫలితం ఆశించిన మేరకు ఉంటుంది.

్‌ టెట్‌ అనంతరం డీఎస్సీ పరీక్షకు రెండు నెలల సమయం ఉంది కాబట్టి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టెట్‌ పరీక్షకు సంబంధించిన పాఠాలు, ప్రశ్నలు, సమాచారం డిఎస్సీకి కూడా ఉపయోగపడుతుంది. ఈ విధానం ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది.

* టెట్‌ పరీక్ష 150 మార్కులకు జరుగుతుంది. ఇందులో శిశువికాసం, భాష-1, భాష-2…సంబంధించి 90 మార్కులు కేటాయించారు. మిగతా కంటెంట్‌+పెడగాజీలకు 60 మార్కులు ఉన్నాయి. క్షుణ్నంగా పరిశీలిస్తే…కంటెంట్‌+పెడగాజీలలో సాధించే మార్కుల్లో తేడా పెద్దగా ఉండబోదు. ఇక కఠినమైన ప్రశ్నలు వస్తాయి అని భావించే అంశాలు…శిశువికాసం, ఇంగ్లీష్‌. ఇందులో మంచి మార్కులు సాధించడానికి ప్రయత్నం చేయాలి.

్‌ తెలుగు భాష మార్కుల సాధనలో కీలకంగా మారిందనేది అర్థమవుతోంది. ఎలా ప్రిపేరవుతే మార్కులు గరిష్టంగా సాధించవచ్చో ప్రణాళిక వేసుకోవాలి.

*‌ శిశువికాసం ప్రశ్నలు గతంలో పాఠ్యపుస్తకాల నుంచి నేరుగా అడిగేవారు. కానీ తీరు మారింది. అనువర్తిత విధానంలో రావొచ్చు. అంతేగాక పెడగాజీ ఉండటం వల్ల ప్రశ్నలన్నీ అభ్యర్థి స్థూల అవగాహన, అన్వయాలపై అడుగుతున్నారు. అందుకని పాఠ్యపుస్తకాలో, ప్రశ్నల నిధిలో చదివి సరిపోయిందని అనుకోవడానికి వీల్లేదు.

* ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు గ్రామర్‌ అంశాలకు వచ్చేసరికి ఇబ్బంది పడుతున్నారు. ఏదో ఒక గ్రామర్‌ పుస్తకాన్ని మార్కెట్లో కొనుగోలు చేసి అయిందనిపిస్తున్నారు. తీరా ప్రశ్న పత్రం చూసే సరికి, ఉపయోగకరంగా ఉండటం లేదు. 12 మార్కులు పెడగాజి అంశాలున్నాయన్న సంగతి మర్చిపోకూడదు. భాష గురించి తెలుసుకునేటప్పుడు ఇంకొకరి సహాయం తీసుకోవడం తెలివైన పని. పుస్తకాలు+స్నేహితుడు లేదా గురువు…అన్న విధానంలో అనేక అంశాల్ని సులభంగా నేర్చుకోవచ్చు. తద్వారా సమయాన్ని ఆదా చేసుకుంటూ, ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవాలి.

గత అనుభవాలతో…

ఇంత వరకు జరిగిన రెండు టెట్‌ పరీక్షల అనుభవాల్ని తెలుసుకోండి. బట్టీ విధానంతో ఏ పరీక్షనూ నెగ్గలేమన్న సంగతి తెలుసుకోండి. జ్ఞాపకశక్తికి పరీక్ష పెట్టే కొన్ని అంశాలతో కుస్తీ పడుతూ, సమయాన్ని వృధా చేసుకోకండి. ముఖ్యమైన అంశాల్ని అందులో నుంచి వెలికి తీయండి. బిట్స్‌ రూపంలో వీలైనన్ని సొంతగా తయారు చేసి, సాధన చేయండి. శిక్షణ సంస్థలపై పూర్తిగా ఆధారపడకండి. పుస్తకాల్లో ఉన్న బిట్స్‌నే ఒక పుస్తకంగా మలిచి, విద్యార్థుల ముందట కుప్ప పోస్తున్నాయి. సంపూర్థ అవగాహనతో పరీక్ష హాల్‌కు వచ్చినప్పుడే గరిష్ట మార్కులు పొందడానికి అవకాశముంటుంది. ప్రతీ పాఠ్య పుస్తకాన్ని కూలంకుషంగా చదివి. వీలైనన్ని బిట్స్‌ రూపొందించటం, స్నేహితులతో చర్చించటం వల్ల మెరుగైన ఫలితాన్ని అందుకోవచ్చు. తద్వారా మనకు తెలియని అంశాలు, చేస్తున్న పొరపాట్లు, తప్పుగా అర్థం చేసుకున్న విషయాలు తెలియడానికి అవకాశముంది. ముఖ్యంగా శిశువికాసం, పెడగాజి, పర్‌స్పెక్టివ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌లో ఈ విధానం అనుసరిస్తే బాగుంటుంది.

యథాతథంగా అన్వయించకూడదు…

టెట్‌లో పెడగాజీలో పేర్కొన్న వాటిలో…డిఎస్‌సి కోసం చదివిన అంశాలు యథాతథంగా అన్వయించకూడదు. ముఖ్యంగా శిశువికాసం సిలబస్‌లో పేర్కొన్న పెడగాజిలో పాఠశాల నిర్వహణ విద్య-ఆధారాలు, విద్య-సామాజిక అంశాల ప్రాధాన్యం ఉంది. అధ్యాపనం, కింద బోధనా మెళకువలతో పాటు విద్యా దార్శనికత, తాత్వికత, వర్తమాన విద్యాంశాలను కూడా చేర్చుకోవాలి.

* ఏ పరీక్ష తీసుకున్నా పోటీ స్థాయి విపరీతంగా పెరుగుతోంది. లక్షల సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతుండటం మెరిట్‌ విద్యార్థుల్ని సైతం ఒత్తిడికి గురిచేస్తుంది. దీంతో గంటల తరబడి సాధనకు సమయాత్తమవుతున్నారు. అయితే చదివిన అంశాల్ని ఓ క్రమపద్ధతిలో పేర్చుకుంటూ, మరోమారు సాధన చేయాల్సి ఉంటుంది. ప్రాథమిక అంశాల్ని లోతుగా చదవటం, వాటిపై అధారపడిన ఇతర అంశాల్ని సాధన చేయటం చేయాలి. ఒక టాపిక్‌ను చదివిన తర్వాత, వివిధ కోణాల్లో దాని గురించి ఆలోచించాలి.

* తగినన్ని టాపిక్స్‌ చదవటం పూర్తి చేశాకే, నమూనా ప్రశ్నా పత్రాల్ని సాధన చేయటం బాగుంటుంది. తద్వారా మనం ఎంత వరకు లక్ష్యానికి దూరంగా ఉన్నామో తెలుసుకోవచ్చు.

* ప్రతీ అభ్యర్థికి కొన్ని ఇష్టంలేని టాపిక్స్‌ కూడా ఉంటాయి. అంటే వీటిని ఎంతమాత్రమూ భరించలేని పరిస్థితి అన్నమాట. ఉదాహరణకు…బయోసైన్స్‌ అభ్యర్థులు, గణితం అంటే కొంత దూరం జరుగుతారు. అయితే వీరు మరొకరి సహాయంతో వీటిని బాగా అర్థం చేసుకొని సాధన చేయాలి. అలాగే గణితం అభ్యర్థులు బయోసైన్స్‌ అంటే భయపడతారు. ఇలాంటప్పుడే తోటి అభ్యర్థులతో చర్చించాలి. తద్వారా ఒకరికొకరు తమ తమ ప్రతికూలతలను తగ్గించుకోవాలి.

అవగాహన, అనువర్తితం…అడుగుతున్నారు…

గత రెండు టెట్‌ పరీక్షలను పరిశీలిస్తే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. కేవలం నాలెడ్జ్‌ బేస్డ్‌ ప్రశ్నలే కాకుండా, అవగాహన, అనువర్తిత రూపంలోకి అంశాల్ని మార్చి ప్రశ్నలు అడుగుతారు. టాపిక్‌ లక్ష్యం ఏంటన్నది చదివేటప్పుడు గ్రహించాలి. ఆ లక్ష్యాన్ని గుర్తిస్తున్నాడా లేదా అన్న ప్రశ్నలు పరీక్షా హాల్లో మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇక సిలబస్‌ విషయానికొస్తే…తెలుగు అకాడమీ డిఎడ్‌, బిఎడ్‌ పుస్తకాలు ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, టెట్‌ పరీక్షలో వాటి సిలబస్‌ దాటి ప్రశ్నలు అడుగుతారు. దీనివల్ల ఆ ప్రశ్నలు కష్టమనిపిస్తాయి. అందుబాటులో ఉన్న మెటీరియల్‌లో మెరుగైన దాన్ని తీసుకొని ఈ సమస్య నుంచి బయటపడాలి.

నిర్ణీత సిలబస్‌ను విస్రృత స్థాయిలో, ప్రాథమిక భావనలను సమగ్రంగా అభ్యసించాల్సిన అవసరముంది. డిఎడ్‌ అభ్యర్థులు, బిఎడ్‌ పుస్తకాలు చదవితే ఉపయోకరంగా ఉంటుంది. ప్రామాణిక పుస్తకాల్లోని ప్రాథమిక అంశాల్ని గ్రహించాలి. ఆంగ్ల మాధ్యమంలో చదివిన అభ్యర్థులు తెలుగు వ్యాకరణాంశాల్ని, బోధనా విధానాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. అలాగే తెలుగు మీడియం విద్యార్థులు ఇంగ్లీష్‌ సబ్జెక్టు గ్రామర్‌ అంశాల్ని టీచర్‌ సారథ్యంలో నేర్చుకోవాలి. లోపాలను తెలుసుకుంటూ, సవరించుకోవాలి. కఠినమైన అంశాల్లో ఉన్న ఇబ్బందులను ఇతర విద్యార్థులతో పంచుకొని, సమస్య నుంచి బయటపడాలి.

* డిఎడ్‌, బిఎడ్‌ చదివిన విద్యార్థులు వ్యాసరూప, సంక్షిప్త సమాధానాలు రాయడానికి బాగా అలవాటు పడి ఉంటారు. నాలెడ్జ్‌ ఆధారంగా ప్రశ్నల్ని ఎదుర్కొని ఉంటారు. ఇలాంటి మూస ధోరణి డిఎస్సీ, టెట్‌ పరీక్షలకు పనిచేయదు.

* ప్రస్తుతం సబ్జెక్టు లోతుపాతుల్ని అభ్యర్థి తరిచి చూశాడా, పై పైన చదివేసి వదిలేశాడా అన్న తీరులో ప్రశ్న పత్రాన్ని సెట్‌ చేస్తున్నారు. ప్రాథమిక భావనలు, సూత్రాలు కూలంకషంగా తెలుసుకొని, ఆపై ప్రాక్టీస్‌ చేయాలి. ఏ సబ్జెక్టు అవసరమే అభ్యర్థి ముందుగా నిర్ణయించుకుని, వాటిపై సమయాన్ని ఎక్కువగా వెచ్చించాలి. ముందుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సిలబస్‌, పరీక్షలో పేర్కొన్న సిలబస్‌కు సమన్వయం చేసుకొని సాధన కొనసాగించండి. విజయం మీదే..!

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top