You Are Here: Home » చిన్నారి » ప్రత్యుపకారం

ప్రత్యుపకారం

చోడవరం అనే ఊరిలో శరభయ్య అనే వైద్యుడు ఉండేవాడు. అతడు తన పూర్వికుల నుంచి సంప్రదాయ నాటు వైద్యం నేర్చుకుని ఆ చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు ైవె ద్యం చేసేవాడు. ఒక రోజు శరభయ్య వేరే ఊరిలో ఉన్న ఒక రోగికి వైద్యం చేయటానికి ఆడవి మార్గం గుండా ఎండ్ల బండిలో బయలు దేరాడు. దారిలో శరభయ్య బండికి ఒక ఎలుగు బంటి అడ్డం వచ్చింది. దాన్ని చూడగానే శరభయ్య భయపడ్డాడు.

కొద్ది సేపటికి ఆ ఎలుగు బంటి బాధతో విలవిలాడుతోందని అర్థమైంది. ఆ సంగతి గమనించి వెంటనే బండిని ఆపి ఎలుగు బంటిని పరిశీలించాడు. దాని కాలులో పెద్ద ముల్లు లోతుగా దిగి ఉంది. శరభయ్య ఆ ముల్లును జాగ్రత్తగా తీశాడు. ముల్లు గుచ్చుకున్న చోట ఆకుల పసరు వేసి కట్టు కట్టి, తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. పొరుగూళ్లో ఉన్న రోగికి వైద్యంచేసి ఇంటికి చేరుకున్నాడు.

ఇది జరిగిన కొంతకాలం తర్వాత ఒకరోజు శరభయ్య అదే మార్గాన ఎండ్ల బండిలో ప్రయాణం చేస్తున్నాడు. అడవి ప్రాంతానికి చేరుకుంటుండగా హఠాత్తుగా పులి గాండ్రింపు వినిపించింది. దానితో ఎద్దులు బెదిరి అడ్డదిడ్డంగా పరిగెత్తసాగాయి. బండి పెద్ద చెట్టును గుద్దుకుంది. శరభయ్య బండి మీద నుంచి కింద పడ్డాడు. ఆ ప్రాంతం ఎత్తులో ఉండడంతో కిందికి దొర్లుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న లోయలోకి జారిపోబోతున్న శరభయ్యకి ఒక చెట్టు కొమ్మ దొరికింది. దాన్ని పట్టుకొని వేలాడసాగాడు.

కొద్దిసేపటికి చేతులు తీవ్రంగా నొప్పి పుట్టసాగాయి. కొమ్మను పట్టుకుని వేళ్లాడడం కష్టమనిపించింది. ‘ఇంకా ఎక్కువ సేపు నేను వేళ్లాడలేను. చేతులు వదిలివేస్తే చనిపోవటం ఖాయం’ అనుకుంటూ కళ్లు మూసుకున్నాడు. అంతలో శరభయ్యకి తనని ఎవరో పైకి లాగినట్లు అనిపించింది. కళ్లు తెరిచి చూస్తే ఎలుగు బంటి. లోయలో పడి ప్రాణాలు పోవాల్సిన తనను రక్షించింది కొద్దిరోజుల క్రితం తాను కాలిలో ముల్లు తీసి కట్టు కట్టిన ఎలుగు బంటేనని శరభయ్యకి అర్థమైంది.

అడవిలో తిరిగే జంతువు అంటే క్రూరజంతువు అనుకుంటాం, వాటికి ప్రాణాలు తీయడమే తెలుసు అని, సాయం చేయడం తెలియదని మన నమ్మకం. అందుకు భిన్నంగా శరభయ్య చేసిన సహాయాన్ని గుర్తుంచుకుని, ప్రత్యుపకారంగా అతని ప్రాణాలను కాపాడింది ఆ ఎలుగుబంటి. ‘నోరు లేని జంతువే ఉపకారికి తిరిగి ఉపకారం చేస్తున్నప్పుడు, మనుషులందరూ అలా చేస్తే ఎంత బాగుంటుందో’ అనుకున్నాడు శరభయ్య. ఎలుగు బంటికి మనస్సులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top