You Are Here: Home » చిన్నారి » ప్రతికారం

ప్రతికారం

‘‘ఫ్రెండ్స్! నా వయసిప్పుడు 78 సంవత్సరాలు.
అయినా నాట్ అవుట్‌గానే ఉన్నాను’’

ఒక చేత్తో డ్రింకు పట్టుకొని నా డ్రాయింగ్ రూమ్‌లో సర్దుకొని కూర్చుంటూ డా॥జోగారావు అన్నాడు. రావు ఉద్యోగ విరమణానంతరం టెక్కలిలో ఉండేవాడు. విశాఖపట్టణం క్లబ్బులో పాత మిత్రులతోపాటు ఒక సాయంత్రం గడపడానికి అప్పుడప్పుడూ వచ్చేవాడు. దృఢగాత్రుడైన రావును చూసి, ఆయన వయసు డెబ్భైకి మించి ఉండవచ్చని ఎవరూ ఊహించరు.

‘‘నేను మీకు వినిపించబోయే కథ 1930 ఆ ప్రాంతం నాటిది. అప్పుడు నేను కొత్తగా ఆర్మీ మెడికల్ కోర్ నుండి రిటైర్ అయ్యి, మద్రాసులో ప్రెసిడెన్సీ మెడికల్ సర్వీసెజ్‌లో ఉద్యోగం చేస్తూ ఉండేవాణ్ని.’’
ఆయన జ్ఞాపకాలు వినాలనే ఆసక్తితో నేను, నా మిత్రుడు రంగారావు ఆయనపైనే దృష్టి నిలిపాం. డా॥జోగారావు మా ఊరు వచ్చినప్పుడంతా మాకందరికీ సరదాగా గడిచేది. ఆయన మా మిత్రులందరికీ గతానికి సేతువు లాంటివాడు, ఆ కాలంలోకి తిరిగి చూడడానికి ఉపకరించే కిటికీలాంటివాడు. 25 సంవత్సరాలకు మునుపు ‘మెడికల్ సర్వీసెజ్’ నుండి రిటైర్ అయి, కోస్తా ప్రాంతంలో ప్రాక్టీసు పెట్టి బాగా డబ్బు గడించాడు.

‘‘ఫ్రెండ్స్! ఆర్మీ మెడికల్ కోర్‌లో కొంతకాలం పనిచేసిన తర్వాత 1930-31లో నేను ‘మెడికల్ సర్వీసెజ్’లోకి వచ్చాను.’’ మా అందరి దృష్టినీ తనవైపు మళ్లించడానికి ఉపోద్ఘాతంగా ఆయన మళ్లీ అన్నాడు. ‘‘నా మొదటి అపాయింట్‌మెంట్ కర్నూలు జిల్లా హెడ్‌క్వార్టర్స్ ఆస్పత్రిలో జరిగింది. ఆ రోజుల్లో కర్నూలు ఒక చిన్న టౌను. అన్నీ కంకర రోడ్లే. రోడ్లపైన రాత్రిళ్లు పెట్రోమాక్సు లైట్లు వెలుగుతూ ఉండేవి. గురబ్బ్రండ్లే రాకపోకల సాధనాలు. కారు, మోటారు సైకిలు ఇంకా కొత్త వింతలుగానే ఉండేవి.’’

‘‘మద్రాసు ప్రెసిడెన్సీలోని పెద్ద జిల్లాల్లో కర్నూలు కూడా ఒకటి. అది పాత విలువలు, ఆచారాలు రాజ్యమేలే చోటు. మిత్రుల పట్ల అచంచలమైన అభిమానాన్ని, శత్రువుల పట్ల శాశ్వత ప్రతీకారేచ్ఛను నిలుపుకోవడంలో ఎంత నష్టపోవలసి వచ్చినా ఆలోచించేవారు కాదు. వాళ్లకు మీరు నచ్చితే మీకోసం వాళ్లు ఏ పని చేయడానికీ వెనుదీయరు. కానీ, ఏ విధంగానైనా వారి ఆత్మగౌరవానికి భంగం కలిగించే పనిచేశారో, మీ ప్రాణాలకే ముప్పురావచ్చు.

జిల్లాలోని ఎన్నో ఊళ్లు తరతరాల నుండి కొనసాగుతూ వచ్చిన కక్షల కారణంగా పాడుపడిపోయాయి. రెండు వైపుల నుండి చెలరేగిన అనేక పొట్లాటల గురించి, పురాణ కథల్లాగా ప్రజలు చెప్పుకొనేవారు. గొప్ప ధైర్యసాహసాలతో పోరాడిన వీరుల కథలు, నమ్మక ద్రోహం చేసినందువల్ల చంపబడిన వారి కథలు చాలా విన్నాం. పలువర్గాల మధ్య జరిగిన ఈ పోట్లాటల్లో సాహసం, ధర్మబుద్ధి రెండూ ప్రదర్శించేవారు. స్ర్తీలకు, పిల్లలకు ఎప్పుడోగానీ కీడు చేసేవారు కాదు, ఓడిపోయిన శత్రువును అవమానించేవారూ కాదు. కేవలం వధించేవారు. అంతే. అది పాత విలువల పాత ప్రపంచం.’’

‘‘కానీ,’’ డా॥రంగారావు మధ్యలోనే ప్రశ్న వేశాడు. ‘‘వాళ్లు ఈ విధంగా ఎందుకు పోట్లాడుకునేవారు?’’
‘‘చాలాసార్లు తమ ఆత్మ గౌరవం కాపాడుకోవడానికి, తమ కుటుంబం లేక వర్గ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి, లేదా వెనుకటి తరం చేసిన అవమానం లేక హత్యకు పగ తీర్చుకోవడానికి, భర్త హత్యకు గురి అయినప్పుడు హత్య చేసినవారిపైన పగ సాధించుకొనేవరకు తమ గాజులు పగలగొట్టుకోని, వైధవ్యం స్వీకరించని స్ర్తీల కథలు కూడా మేము చాలా విన్నాం.

‘‘ఫ్రెండ్స్! నేను జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆస్పత్రిలో రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్‌గా ఉండేవాణ్ని. ఆస్పత్రి కాంపౌండులో ఒక చిన్న బంగళా నా నివాసం. అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదు. నా టైము చాలావరకు ఆస్పత్రిలోనే గడిచేది. రిలాక్స్ కావడానికి నా దగ్గర ఒకే ఒక మార్గం ఉండేది. లోకల్ ఆఫీసర్స్ క్లబ్‌లో టెన్నిస్ ఆడడం.

‘‘చిన్న నాగిరెడ్డిని మొదటిసారి చూసిన రోజు నాకిప్పటికీ గుర్తు. ఎండాకాలం. ఒకరోజు సాయంకాలం వచ్చాడు. నేను నా టెన్నిస్ బట్టలు వేసుకుంటూ ఉన్నాను. ఆస్పత్రి మెయిన్‌గేట్ దగ్గర కలకలం విని, కిటికీలో నుంచి బయటికి తొంగి చూశాను. ముదురు ముఖంవాళ్లు కొందరు. వాళ్లలో కొందరి బట్టలు రక్తంతో తడిసి ఉన్నాయి. ఒక నడివయసు మనిషిని ఒక పాత జీపులోంచి ఆస్పత్రి వరండాలో దింపుతున్నారు.

ఆ మనిషి నొప్పితో మూల్గుతూ ఉన్నాడు, మూర్ఛలోకి వెళ్లిపోయే స్థితికి చేరుకుంటున్నాడు. నేను ఒక్క ఉదుటున బయటికి వెళ్లి, ఆస్పత్రి సిబ్బంది సహాయంతో ఆయన్ను మెయిన్ హాల్లోకి తీసుకొచ్చాను. ఆయన దృఢకాయుడు. ఆయన మీసాలు, అలల్లాగా కిందికి జారిన వెంట్రుకలు భయం పుట్టించేవిగా ఉన్నాయి. సివిల్ సర్జన్‌కు ఈ విషయం తెలిపి, ఆయన రాకముందే నేను చికిత్స ప్రారంభించి, నొప్పి తగ్గటానికి ఓ మందు ఇచ్చి, తర్వాత గాయాలు కడగడం మొదలుపెట్టాను.

‘‘చిన్న నాగిరెడ్డి, ఆయన అన్న పెద్ద నాగిరెడ్డి, కర్నూలు దగ్గర కొన్ని గ్రామాల్లో ఒక వర్గానికి నాయకులు. పొరుగు తాలూకాలోని ఒక వర్గంతో చాలాకాలం నుండి వాళ్లకు కక్షలు చెలరేగుతూ ఉండేవి. పోట్లాడే ఈ రెండు వర్గాలు వొకదాన్ని మరొకటి తరచూ చాలెంజి చేస్తూ ఉండేవి.

‘‘చిన్న నాగిరెడ్డిని ఆస్పత్రికి తెచ్చిన వాళ్ల ద్వారా ఆయన ఇలాంటి కక్షలకు సంబంధించిన కొట్లాటలోనే గాయపడ్డాడని తెలిసింది. శరీరంలో చాలాచోట్ల ఎముకలు విరిగిపోయాయి… కాళ్లల్లో, చేతుల్లో, రొమ్ము ఎముకల్లో, నడుములో. ఆశ్చర్యం ఏమిటంటే ఆయన ఇంకా బతికే ఉన్నాడు. నేను, నా తోటి డాక్టర్లు కొన్ని గంటలు పోరాడి విరిగిన ఎముకలు జోడించాం. అన్నిచోట్లా కట్లు కట్టాం. ఆ రోజుల్లో కర్నూల్లో ఏయే చికిత్స చేసే అవకాశం ఉండిందో, అదంతా చేశాం. అప్పుడు యాంటీ బయోటిక్స్ ఉండేవి కావు, పెనిసిలిన్ కూడా సులభంగా దొరికేది కాదు. అది మీకూ తెలుసు. గాయాల్లో చీము పడకుండా చూసి, తర్వాత ప్రకృతిని తన పని చేసుకోనివ్వాలి అన్నంతవరకే మా ప్రయత్నం సాగింది.

‘‘కానీ నాగిరెడ్డి చాలా గుండె ధైర్యం గల మనిషి. ఆశ్చర్యకరంగా ఆయన పరిస్థితి మెరుగుపడడం మొదలైంది. మూడు రోజుల తర్వాత ఆయన కళ్లు తెరిచాడు. నన్ను చూడాలన్నాడు. నేనక్కడికి వెళ్లినప్పుడు కృతజ్ఞతతో నావైపు చూశాడు. ఆ తర్వాత మా మధ్య మాటలు బాగా సాగి ఒకరికొకరు దగ్గరయ్యాం.
‘‘సివిల్ సర్జను-అతడు యూరోపియన్-నాగిరెడ్డిని వేరే గదిలో ఉంచమని, శ్రద్ధగా చూస్తూ ఉండమని చెప్పాడు. నేను ఆయన్ను నా ఆఫీసు పక్కన ఉన్న గదిలో ఉంచి, తరుచూ చూడడానికి వెళ్తూ ఉండేవాణ్ని. ఆ గదిలో ఆయన మూడు నెలలకు పైగా ఉన్నాడు. కాలంతోపాటు మా మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది.

‘‘సాధారణంగా ఇలాంటి వాళ్లందరి విషయంలో ఉన్నట్లే, తనవాళ్లలో నాగిరెడ్డికి చాలా గౌరవం ఉండేది. ఆయన్ను కలుసుకోవడానికి చాలామంది వచ్చేవారు, ఆయన ఆరోగ్యం గురించి ఆవేదన పడేవారు, ఆయన ప్రేమాభిమానాలను పొగిడేవారు. ఆయన్ను కలుసుకొని వెళ్లేప్పుడు వాళ్లకు ఆయన ఉదారంగా ఇచ్చే కానుకలు కూడా చాలామందికి అందేవి.

‘‘ఆయన గాయాలు చాలావరకు మానడానికి, విరిగిన ఎముకలు అతుక్కోవడానికి, రెండు నెలలకంటే కూడా ఎక్కువ కాలం పట్టింది. కానీ, కుడి మోచేయి కింది భాగం ఆయన్ను ఇబ్బంది పెట్టడం మానలేదు. గాయం మానలేదు, విరిగిన ఎముకలు అతుక్కోలేదు. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి అనేదాన్ని గురించి మేము సర్జన్లమందరం పరస్పరం సంప్రదించుకున్నాం. మొత్తంపైన మేమంతా గాయం నయం కాని చేతిని తీసేసి, అనేక ఇక్కట్ల నుంచి ఆయన్ను తప్పించడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చాం.

చెయ్యి తీసేసే నిర్ణయం తీసుకొన్న తర్వాత, సీనియర్ సర్జన్ ఆ దుర్వార్త నాగిరెడ్డికిచ్చే బాధ్యత నాకు అప్పగించాడు. ‘‘నా నోట సీనియర్ సర్జన్ నిర్ణయం వినగానే, నాగిరెడ్డి అవాక్కయిపోయాడు. చెయ్యి తీసేసేందుకు అనుమతి ఇవ్వడానికి ససేమిరా నిరాకరించాడు. ఆ నిరాకరించే పద్ధతిలో దృఢత్వం ధ్వనించింది.

‘‘నేనాయనకు నచ్చచెప్పడానికి ప్రయత్నించాను. నయం కాని గాయాన్ని అలాగే ఉంచడంలో ఎలాంటి ప్రమాదం ఉందో, దాని గురించి బాగా వివరించాను. ఎంత చెప్పినా ఆయన మా సలహా వినడానికి కూడా సమ్మతించలేదు. చెయ్యి తీసేయించుకోవడం కంటే చనిపోవడమే శ్రేయస్కరంగా భావిస్తాననీ, ప్రాణాపాయం నుండి తప్పించుకోవడానికి అలా చెయ్యి తీసేయించుకోవడం తప్పనిసరి అయిన పక్షంలో, డాక్టర్లు ఆయన ఎడమ చెయ్యి కూడా తీసేసినా మంచిదే అని, ఆయన అన్నాడు.

ఆరోగ్యంగా, దృఢంగా ఉన్న కుడి చెయ్యితో ఊరు చేరడం చాలా అవసరమని ఆయన పదే పదే అన్నాడు. ఒక వారం తర్వాత, ఇక ఆయనతో వాదించి లాభం లేదని నాకు తెలిసిపోయింది. ఎడమ చేతిని తీసేయవలసిన అవసరం ఏర్పడలేదు. దాని గాయం మెల్లమెల్లగా నయమవుతూ ఉండింది కాబట్టి.’’

‘‘కుడిచెయ్యిని కాపాడుకోవాలని ఆయనకు అంత పట్టుదల ఎందుకు?’’ డా॥తన కుతూహలం ఆపుకోలేక అడిగాడు.
‘‘అదే కదా విశేషం! ఒంటరిగా ఉన్నప్పుడు నాగిరెడ్డి నాకు చెప్పాడు, ఆయన పైన జరిగిన హత్యాప్రయత్నానికి ప్రతీకారం చేయడానికి ఆయనకు కుడిచెయ్యి ఉండి తీరాలని! తన ఊరికి తిరిగి వెళ్లి, ఏదో తగాదా పెట్టుకొని, తన శత్రువును స్వయంగా నరికి పారేయాలన్నాడు.’’
‘‘నిజంగా అలా జరిగిందా ఏమిటి? పూర్తిగా నయమైన చేతితో ఆయన తన ఊరికి వెళ్లగలిగాడా? లేక ఇదంతా జరిగిన తర్వాత కూడా, మీరు ఆయన చెయ్యి తీసేయవలసి వచ్చిందా?’’ డా॥రంగారావు తొందరపడుతూ మళ్లీ అడిగాడు.

‘‘వినండి’’ డా॥జోగారావు తర్వాతి కథ చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘ఆయన కుడి చెయ్యి గాయం నయమవుతుందనే గట్టి నమ్మకం లేకపోయినా, మేము ఆయన్ను మద్రాసు జనరల్ హాస్పిటల్‌కు షిఫ్ట్ చేయాలని నిశ్చయించాం. ఆయనతో పాటు వచ్చి నేను అక్కడి డాక్టర్లకు ఆయన సమస్య గురించి వివరంగా చెప్పాలని ఆయన చాలా కోరాడు. నేను సరే అన్నాను. మేమంతా-ఆయన కుటుంబ సభ్యులు, ఆయన చిన్నాన్న-పెదనాన్న పిల్లలు, ఇద్దరు-ముగ్గురు నౌకర్లు రైల్లో మద్రాసుకు తీసుకెళ్లి, ఆయన్ను అక్కడి జనరల్ హాస్పిటల్‌లో చేర్పించాం. నేనక్కడ కొద్దిరోజులుండి, అక్కడి సీనియర్ డాక్టర్లకు అంతవరకు నాగిరెడ్డికి జరిగిన చికిత్స గురించి చెప్పాను.

ఎట్టి పరిస్థితుల్లో కూడా తన కుడిచెయ్యిని కాపాడమని నాగిరెడ్డి మద్రాసు డాక్టర్లను అభ్యర్థించాడు. దానితోపాటు తన ఈ పట్టుదలకు కారణం ఆ డాక్టర్లకెవరికీ చెప్పవద్దని కూడా ఆయన నాతో గట్టిగా చెప్పాడు. చెయ్యి తీసేసే విషయాన్ని గురించి ఆలోచించే ముందు ఇంకా కొంతకాలం చికిత్స కొనసాగించి చూడడం మంచిదని, డాక్టర్లు అభిప్రాయపడ్డారు. కొద్దిరోజులు తర్వాత నాగిరెడ్డిని అక్కడ వదిలిపెట్టి, నేను కర్నూలు వచ్చేశాను. ఈలోగా మేమిద్దరం డాక్టరు-రోగిలా కాక మిత్రుల్లా అయిపోయాం. ఆయనతో శెలవు తీసుకునే ముందు ఒకటి రెండు నెలల్లో ఆయన్ను చూడటానికి వస్తానని నేను మాట ఇచ్చాను.

‘‘నాగిరెడ్డి జనరల్ హాస్పిటల్‌లో ఆ తర్వాత మూడు నెలలున్నాడు. ఎముక అతుక్కుంటుందని, చేతిగాయం నయమవుతుందనే ఆశ కొంచెం కొంచెం చిగురిస్తూ వచ్చింది. రెండవ నెల ముగిసేలోగా చెయ్యి తీసేయకుండానే ఆయనకు చికిత్స చేయవచ్చనే నమ్మకం డాక్టర్లకు కలిగింది. కేవలం ఆత్మస్థైర్యం, సంకల్ప బలం ఆధారంగానే ఆయన చెయ్యి బాగైపోతున్నట్లు కూడా వారికి అనిపించింది.’’

‘‘ఆ తర్వాత కొద్ది రోజులకు ప్రెసిడెన్సీలోని ఒక ఉత్తర ప్రాంతం జిల్లాకు నాకు ట్రాన్స్‌ఫర్ అయింది. కర్నూలు వదలిపెట్టి, నేను ఆ కొత్త చోటికి వెళ్లిపోయాను. కర్నూలు నుండి 300 మైళ్లు దూరం. అక్కడ చేరిన దాదాపు ఒక నెల తర్వాత, ఏదో ఏ పనిమీద మదరాసు వెళ్లినప్పుడు, నాగిరెడ్డిని చూడడానికి వెళ్లాను. అప్పుడాయన పరిస్థితి చాలా బాగున్నట్లనిపించింది. ఆయన కుడి చెయ్యి దాదాపు బాగై, కొద్ది వారాల్లో ఇంటికి వెళ్లిపోయే స్థితిలో ఉన్నాడు.’’

‘‘అప్పుడు కూడా ఊళ్లో తన శత్రువును చంపే ప్రణాళిక తయారుచేసుకుంటూ ఉన్నాడా?’’ చాలాసేపటి నా మౌనాన్ని భంగం చేస్తూ నేనడిగాను.
‘‘మరేమనుకున్నావ్? మునుపు ఎంత వేగిరపాటు ఉండేదో అప్పుడు కూడా అంతే ఉండింది. కానీ, ఒక చిక్కు వచ్చిపడిందని అన్నాడు. కర్నూలు సెషన్స్ కోర్టులో ఆయన కేసు విచారణ జరిగి, ఆయన శత్రుపక్షం మనిషి నేరం రుజువయింది. జ్యూరీ ఏకగ్రీవంగా నిందితునికి వ్యతిరేకంగా తీర్పు చెప్పే రోజు ఆసన్నమైంది. అంటే జడ్జి నాగిరెడ్డి విరోధికి, ఇంకా కొంతమందికి మృత్యుదండన విధించే అవకాశం ఉంది.’’

‘‘అలా జరిగినందుకు నాగిరెడ్డి చాలా సంతోషపడాలి కదా!’’ ఉండబట్టలేక నేను మధ్యలోనే అడిగేశాను.
‘‘అబ్బే, అలా ఏంకాదు. అలా జరగలేదు. తన విరోధికి ఉరిశిక్ష పడవచ్చని తెలిసి, ఆయన దిగులుపడ్డారు. అతనికి ఉరిశిక్ష పడడం ఆయనకు ఇష్టం లేదు. ఆస్పత్రి వరండాలో ఒక కొసకు నన్ను తీసుకెళ్లి, రహస్యంగా ఆయన నాతో చెప్పిందేమిటంటే, జ్యూరీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్, వీళ్లను ఇన్‌ఫ్లుయెన్స్ చేసి ఎలాగైనా తన విరోధికి ఉరిశిక్ష కాక మరే శిక్షైనా పడేట్లు చేయడానికి ప్రయత్నిస్తున్నానని.’’
‘‘అరే! అలా ఎందుకు?’’ ఏమీ బోధపడక నేనడిగాను.
‘‘ఆ మనిషిని తన చేతులారా చంపకపోతే ఆయనకు మనశ్శాంతి ఎలా కలుగుతుంది?’’

(1982లో విశాఖపట్టణంలో రచయిత డీఐజీగా ఉన్నప్పుడు విన్న కథ)

– చెన్నూరు ఆంజనేయరెడ్డి
ఇంగ్లిషు నుంచి అనువాదం: జె.లక్ష్మిరెడ్డి

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top