You Are Here: Home » చిన్నారి » పేను – పెసర చేను

పేను – పెసర చేను

హాయ్ ఫ్రెండ్స్! మా అమ్మమ్మ అంటే నాకు ఇష్టం. అమ్మమ్మ చెప్పే కథలంటే ఇంకా ఇష్టం. ముఖ్యంగా పేను- పెసరచేను కథ, బుర్రుపిట్ట కథ, బాలగణేశుడి కథ. వాటిలో పేను కథ చెప్పుకుందామా మనం?
అనగనగా ఒక పేను. దానికి ఒక పెసరచేను ఉంది. పొద్దుగూకులూ కష్టపడి పని చేయడంతో చేను ఏపుగా పెరిగింది. ఒకరోజు ఆ దేశపు రాజు వేటకు వెళ్తూ ఆ పెసరచేను చూశాడు.

‘‘ఎవరిదా చేను? అని అడిగారు?
‘‘పేనుది మహారాజా’’ అన్నారు భటులు.
‘‘ఔరౌరా, పేనుకేమిరా పెసరచేను?’’అన్నాడు రాజు.
‘‘రాజుకేమిరా అందలం?’’ అంది పేను.
‘‘పేనును తీసుకురండిరా, కుక్కేస్తా!’’అన్నాడు రాజు.

‘‘రాజును తీసుకురండిరా, కుట్టేస్తా’’ అంది పేను. దాంతో రాజుకు బాగా కోపం వచ్చి, పెసరచేనంతా పీకేయించాడు. కష్టపడి పెంచుకున్న చేను కాస్తా పాడయేసరికి పేనుకు చాలా బాధేసింది. రాజుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుని ఆ రాత్రి రాజు నిద్రపోయేటప్పుడు ఆయన గడ్డంలో దూరి బాగా కుట్టడం మొదలు పెట్టింది. దాంతో రాజుకు నిద్రాభంగమై భటులను పిలిచాడు. వాళ్లు వచ్చేలోగా రాజు తలలో దూరింది పేను. భటులు దువ్వెన తెచ్చి రాజుగారి తల దువ్వటం మొదలు పెట్టారు. అయితే పేను వారికి దొరక్కుండా రాజుగారి ఒంటి మీదికి పాకి ఎక్కడ పడితే అక్కడ కుట్టటం మొదలు పెట్టింది. దాంతో రాజుకు బుద్ధి వచ్చి, ఇకపై ఎవరినీ అవమానించ కూడదు అనుకున్నాడు. పేనును పిలిచి ‘‘పేనూ పేనూ నీ పెసరచేను బాగు చేయించి ఇస్తా, కావాలంటే కందిచేను కూడా ఇస్తా, కానీ నన్ను మాత్రం వదిలిపెట్టు’’ అని బతిమాలాడు.

‘‘సరే, అలాగే కానీ, అయితే నువ్వు మాత్రం ఎప్పుడూ జుట్టు పెంచకూడదు, అలా పెంచావంటే కుటుంబంతో సహా నీ తలలోనే కాపురం పెడతా జాగ్రత్త’’అని హెచ్చరించింది. చేసేదేమీ లేక సరేన న్నాడు రాజు. అప్పటినుంచి పేను జుట్టు ఎవరు ఎక్కువగా పెంచుకుంటే వారి తలలో దూరి బాధిస్తోంది.
అందుకే నేను ఎప్పుడూ జుట్టు ఎక్కువగా పెంచుకోను, మరి మీరు కూడా పెంచుకోకండేం!
– జె.వి.ఎన్.సాయికృష్ణ, 7వ తరగతి,
నవభారత్ పబ్లిక్‌స్కూల్, పాల్వంచ

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top