You Are Here: Home » ఇతర » పేగులు అవయవాల్లో ఇరుక్కుపోతే..?

పేగులు అవయవాల్లో ఇరుక్కుపోతే..?

పేగులు అవయవాల్లో ఇరుక్కుపోతే..?

హెర్నియా అంటే శరీర భాగంలోని ఒక ప్రాంతం మరో ప్రాతంలోకి చొచ్చుకుపోవడం అనుకోవచ్చు. ఉదాహరణకు పొట్ట కండరాలో లేదా గజ్జల్లోని భాగాలు బలహీనంగా ఉన్నాయని అనుకుందాం. అందులోకి పొట్టపేగులు దూసుకువస్తే దాన్ని హెర్నియాగా భావించవచ్చు. హెర్నియా వచ్చిన సమయంలో అంటే… ఒక శరీర భాగంలోకి మరో శరీర భాగం చొచ్చుకు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో వాపు వస్తుంది. ఇలా వాపు వచ్చిన ప్రాంతాన్ని బట్టి వేర్వేరు పేర్లతో పిలుస్తారు.
పేగులు ఇతర అవయవాల్లోకి చొచ్చుకుపోయే పరిస్థితిని హెర్నియా అంటారు.హెర్నియాలో రకాలు:
ఇంగ్వైనల్ హెర్నియా: మన ఉదరం కింది భాగంలోని పేగులు గజ్జల్లోకి చొచ్చుకుపోవడం వల్ల పురుషుల్లో ఆ భాగం ఉబ్బుతుంది. మనందరిలోనూ పుట్టుకతో పొట్టభాగం నుంచి కింది వైపునకు ఒక మార్గం ఉంటుంది. పుట్టాక ఆ మార్గం మూసుకుపోతుంది. కొందరిలో ఆ మార్గం బలహీనంగా ఉండటంతో ఉదర భాగంలోని పేగులు గజ్జల వైపునకు జారవచ్చు. దాన్ని ఇంగ్వునల్ హెర్నియా అంటారు. సాధారణంగా హెర్నియాల్లో 75 శాతం ఈ తరహాకు చెందినవే. ఇవి మహిళల్లో కంటే పురుషుల్లో ఐదు రెట్లు ఎక్కువ.

ఫీమోరల్ హెర్నియా: కొందరిలో ఉదర భాగం పెద్ద రక్తనాళాల్లోకి ప్రధానంగా ఫీమోరల్ ఆర్టరీ, వెయిన్‌ల మధ్యకు దూసుకుపోతుంది. దాంతో తొడ పైభాగంలో ఉబ్బుతుంది. ఇది పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువ.

ఎపిగ్యాస్ట్రిక్ అండ్ వెంట్రల్ హెర్నియా: ఈ తరహా హెర్నియాలో బొడ్డుకు, ఎదుర్రొమ్ము ఎముకలు (ఉరఃపంజరానికి) మధ్యన ఉండే భాగం నుంచి పేగులు బయటకు ఉబికి కనిపిస్తాయి. ఇది 20 నుంచి 50 ఏళ్ల వయసు ఉండే పురుషుల్లో ఎక్కువ.

అంబ్లికల్ హెర్నియా: ఇందులో బొడ్డు కింద భాగంలోకి పేగులు దూసుకువస్తాయి. ఈ ప్రాంతంలో బలహీనమైన భాగం చాలా తక్కువగా (అంటే అర అంగుళం కంటే తక్కువగా) ఉంటుంది. ఇది అప్పుడే పుట్టిన పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దానంతట అదే తగ్గుతుంది.

పర్ అంబ్లికల్ హెర్నియా: ఇది అంబ్లికల్ హెర్నియాలాగే ఉంటుంది. అయితే ఇది పుట్టుకతోనే ఉండదు. కొందరిలో స్థూలకాయం వల్ల అదేపనిగా పొట్టకండరాలపై ఒత్తిడి పడితే ఇది వస్తుంది.

హయాటల్ హెర్నియా: ఇందులో పేగుల కంటే జీర్ణకోశం భాగం ఎక్కువగా ఇన్‌వాల్వ్ అవుతుంది. అంటే… జీర్ణకోశ భాగం రొమ్ముల్లోకి రావడాన్ని హయటల్ హెర్నియా అనవచ్చు.

హెర్నియా లక్షణాలు:
చాలా వరకు హెర్నియాలు చర్మంలోపల ఉబ్బడం కారణంగా ఏర్పడతాయి. ఉదాహరణకు ఇంగ్వైనల్ హెర్నియా అనేది గజ్జల్లో ఉబ్బినట్లుగా వస్తుంది. అంబ్లికల్ హెర్నియా అనేది బొడ్డు దగ్గర ఏర్పడుతుంది. కొన్ని హెర్నియాలు విపరీతమైన నొప్పి, లాగడం వంటి సమస్యలకు కారణమవుతాయి. అయితే కొన్ని ఎటువంటి లక్షణాలనూ కలిగి ఉండవు.

హెర్నియాలను సులభంగా చూడవచ్చు. అలసిపోయినప్పుడు, దగ్గుతున్నప్పుడు ఉబ్బినట్లుగా ఉన్న లక్షణం బయటపడుతుంది.చాలా మంది తమ హెర్నియాలను గుర్తించగలుగుతారు. కొన్నిసార్లు వైద్యుల రొటీన్ చెకప్‌లో ఇది బయటపడుతుంది. సాధారణమైన పరీక్షల ద్వారా మీ వైద్యుడు దీనిని నిర్థారించవచ్చు. అరుదుగా మాత్రమే మీకు హెర్నియా ఉన్నా డాక్టరు పరీక్ష ద్వారా దానిని కనిపెట్టలేకపోవడం జరుగుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు మీ ఉదరభాగంలో సిటి స్కాన్ లేదా అల్ట్రాసౌండ్ పరీక్షలకు సిఫారసు చేయవచ్చు.

హెర్నియా నివారించాలంటే…
అధిక బరువులను లేపడం వంటి ఉదరభాగానికి ఒత్తిడిని ఇచ్చే పనులకు దూరంగా ఉండాలి. మీరు అధికబరువున్నవారైతే బరువు తగ్గడం అనేది సహాయకారి కావచ్చు. మీరు మలవిసర్జన చేస్తున్నప్పుడు బాగా ముక్కాల్సి వస్తే మీ వైద్యుడ్ని సంప్రదించాలి. మీ వైద్యుడు అప్పుడు మలం మెత్తబడి సాఫీగా విసర్జితమయ్యేలా మందులు ఇస్తారు. లేదా అధిక మొత్తంలో పీచు పదార్థాలు ఉండేలా మీ డైట్‌లో మార్పు చేర్పులు సూచిస్తారు.

హెర్నియాకు చికిత్స…
అన్ని హెర్నియాలకూ చికిత్స అవసరం లేనప్పటికీ కొన్ని తీవ్రమైన నొప్పికి, సమస్యలకి కారణమయ్యే వాటికి మాత్రం శస్త్రచికిత్స చేయించాల్సి ఉంటుంది.

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top