You Are Here: Home » చిన్నారి » పెదవులు చదివే పాఠాలు…

పెదవులు చదివే పాఠాలు…

సాయంత్రం ఎండ చల్లబడి చంద్రుడు ఉదయించే సమయాన సముద్రం మీద నుంచి చల్లటి గాలి వీస్తూ ఉండగా ఆ పడుచుపిల్ల వేణ్ణీళ్లతో స్నానం చేసి చలువ చేసిన చీరా రవికా తొడుక్కుని
బిగువుగా జడ వేసుకొని కొప్పు నిండా పూలు పెట్టుకొని అద్దం ముందు నిలుచుని ముంగురులు సవరించుకుంటూ ఉంది.
ఆ పడుచుపిల్ల భర్త అప్పటికే స్నానం చేసి వచ్చి భోజనం కోసం ఎదురు చూస్తూ ఆ సంగతే మరిచి ఆ పిల్లనే చూస్తూ ఉన్నాడు. ఆ పిల్ల అందమైనది. అతడు రూపవంతుడు. ఆ జంట ముచ్చటైన జంట.
కొత్తగా పెళ్లయింది వాళ్లకి. పెళ్లయిన వెంటనే అతగాడి బిఏ రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్‌క్లాసులో పాస్. చదివింది కష్టపడిందీ అబ్బాయే అయినా అమ్మాయి కాలు పెట్టిన వేళావిశేషం కుర్రాడు పాస్ అయ్యాడు అని నలుగురూ మెచ్చుకోలుగా చెప్పుకున్నారు. అప్పటికే అబ్బాయికీ అమ్మాయికీ మూడునిద్దర్లు ముగిశాయి. ఆరు నిద్దర్లు పూర్తయ్యాయి. పదహారు నిద్దర్లూ పరిసమాప్తం అయ్యాయి. అయితే? కొత్త జంట. పడుచు జంట. రసయాత్రలో తొలి మైలురాయి వద్ద పెనవేసుకొని ఉన్న జంట. మనసు
తీరిపోతుందా ఏమి?

కాని ఆలోపు అబ్బాయి తండ్రి ఆటంబాంబు పేల్చాడు. అబ్బాయి చదవనైనా చదవాలి లేదంటే ఉద్యోగమైనా చేయాలి అంతే తప్ప పెళ్లాం కొంగు పట్టుకొని పొద్దస్తమానం తిరిగితే
ఊరుకోను డామ్‌డూమ్ అన్నాడు. ఏదో ఒకటి చేయాలి. తప్పదు.
ఉద్యోగం- బోర్. రెండేళ్ల లా కోర్సు? బెస్ట్. అబ్బాయి మారు మాట్లాడకుండా చలో మద్రాసు అన్నాడు. అయితే అక్కడ తనకు వంటా గింటా కష్టం కనుక ఇప్పుటికిప్పుడు సొంతంగా చేయి కాల్చుకోలేడు కనుక- అలా అని చెప్పి- భార్యను తోడు తీసుకొని మద్రాసు చేరుకున్నాడు. ఉదయం అతడు కాలేజ్‌కు
వెళతాడు. ఆమె వీక్లీ తెరిచి కూచుంటుంది. సాయంత్రం అతడు క్యారేజీ తెస్తాడు. ఆమె విస్తళ్లు పరుస్తుంది. ఇద్దరూ భోం చేస్తారు. తర్వాత… ఆ తర్వాత?

సరే, అబ్బాయి తక్కిన విషయాల్లో ఎలా ఉన్నా చదువులో యమా సీరియస్. పైగా ఏరోజు పాఠాలు ఆరోజు చదువుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటు. అందుకే అతడు ఎలా చదవాలి అనే విషయం పై పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. రోజూ రెండుసార్లు చదవాలి. అది కూడా రాత్రి పూట. మొదట- పది గంటల నుంచి పదకొండు గంటల వరకూ చదవాలి. తిరిగి- తెల్లవారుజాము నాలుగు నుంచి ఆరు వరకూ చదవాలి. అలా అని నిశ్చయించుకున్నాడు.

అది తొలిరోజు. రాత్రి పదయ్యింది. అప్పటికి భోజనాలు ముగించి, గిన్నెలు సర్ది, తలుపులు మూసి, బుగ్గన తాంబూలం బిగించి, చీర సవరించుకొని, పూలు సరి చూసుకొని, నాలుకతో పెదాలు తడుపుకొని, తన మానాన తాను పక్క మీదకు చేరిందా పిల్ల. అతడు పుస్తకం పట్టుకొని చదవడానికి నిశ్చయించుకొని తల వొంచి… వొంచి… వొంచి… పేజీ తిప్పాడు. ఆ పిల్ల. పేజీ తిప్పాడు. ఆ పిల్లే. పేజీ తిప్పాడు. తలలో మల్లెలు. పేజీ తిప్పాడు. నవ్వే పెదిమలు…
అతడు టప్పున పుస్తకం మూసి, తెల్లారి చదవొచ్చులే అని సర్ది చెప్పుకొని, అమాంతం లేచి, భార్య సన్నిధిలోకి ఒక్క దూకు దూకాడు.
నాలుగయ్యింది. అలారం మోగింది.
అతడు హడావిడిగా లేచి పుస్తకం అందుకొని చదవబోతూ యధాలాపంగా భార్య వైపు చూశాడు.
ఆ పిల్ల- రాత్రి భర్త సమక్షంలో గడిపిన అనుభూతితో తృప్తిగా కళగా హాయిగా అద్భుతంగా ముంగురులు చెదరగా పెదవి పైన చిరు చెమటతో నిదురిస్తూ ఉంది.
పేజీ తిప్పాడు. ఆ పిల్ల. పేజీ తిప్పాడు. ఆ పిల్లే. పేజీ తిప్పాడు… ఆ పిల్లేరా బాబూ.

అతడు పుస్తకం మూసి మళ్లీ చదవొచ్చులే అని సర్ది
చెప్పుకొని ఒక్క ఉదుటున మళ్లీ ఆమె సన్నిధిలోకి చేరాడు.
ఇలా వారం గడిచింది. రోజూ అతడు రాత్రి పదిగంటలకు పుస్తకం తెరవడం… వీలుగాక మూసేయడం. మళ్లీ అలారం పెట్టుకొని నాలుగ్గంటలకు నిద్ర లేచి పుస్తకం తెరవడం. వీలుగాక మూసేయడం.
ఎనిమిదో రోజు రాత్రి అతడు యధావిధిగా తెల్లవారుజాము పాఠాల కోసం అలారం బిగిస్తూ ఉంటే, ఆమె ఉలిక్కిపడి, అతడి సమీపానికి చేరి, ఒళ్లు విరుచుకుంటూ, అలసట నిండిన ముఖంతో, బతిమిలాడుతున్నట్టుగా- ఏమండీ మీ పాఠాల వల్ల రోజూ రాత్రి
పదకొండు వరకూ మేలుకొని… మళ్లీ తెల్లారి నాలుగు గంటలకు కూడా మేల్కొని… ఈ వారం రోజులుగా అస్సలు నిద్ర చాలడం లేదండీ… మీరు దయచేసి తెల్లవారి పాఠాలు చదవకండి… అంతగా అయితే ఆ పాఠాలు కూడా ఇప్పుడే చదివేయండీ… ప్లీజ్‌అండీ… అంది.

కథ ముగిసింది.
తెలుగు కథ అంటే యమా సీరియస్ అని, ప్రతి కథలో నోట్లో నుంచి బీడీ తీసి తుపుక్కుమని ఊసే పోలయ్య ఉండాలని, ఏవయ్యో… కూడు తిందూగాని రా అని పిలిచే భార్య ఉండాలని, ఒక గంభీరమైన సమస్య, అంతకంటే గంభీరమైన ముగింపు, శాలువా వేసుకొని తూర్పు వైపు నడిచేయడం, లేదంటే కట్టగట్టుకొని బావిలో దూకడం… ఇదే మంచి కథ… ఇలాంటిదే మంచి కథ అని కొందరు సీరియస్ కథా విమర్శకులు తెలుగు కథను సర్వనాశనం పట్టించారు. అది మంచి కథే. కాదనము. కాని అది మాత్రమేనా మంచి కథ?

ఒక నవ్వు లేదు. ఒక కలహం లేదు. ఒక సరసం లేదు. భార్యభర్తల మధ్య ప్రేయసీ ప్రియుల మధ్య నడిచే శృంగారం లేదు. ఒక ముద్దు లేదు. ఒక మురిపెం లేదు. తెలుగు సమాజం అంతా ఇవేమీ లేకుండానే ముందుకు సాగిపోతోందా ఏమిటి?
అదృష్టవశాత్తు కొందరు రచయితలు ఇలాంటి కథలను కూడా రాశారు. మెప్పించేలా రాశారు. ముచ్చటగొలిపేలా రాశారు. అలాంటి ముచ్చటగొలిపే కథ- రచయిత కప్పగంతుల సత్యనారాయణ రాసిన కథ- తెల్లవారుజాము పాఠాలు.
తెల్లవారి లేచి దుప్పటి సర్దుతూ ఉంటే భారంగా నలిగి
కనిపించే మల్లెపూవులాంటి కథ ఇది. పగలు కూడా చదువుకోదగ్గ రాత్రి కథ ఇది. మంచి కథ.
సకల శుభాలతోపాటు ఇలాంటి రసమయమైన జగత్తునూ 2011 తీసుకురావాలని కోరుకుంటూ- హ్యాపీ న్యూ ఇయర్!
– సాక్షి ఫ్యామిలీ

కప్పగంతుల సత్యనారాయణ: వివరాలు పెద్దగా తెలియడం లేదు. మద్రాసు మెయిల్ పత్రికలో పని చేసే వారని సమాచారం. నాటకాలు కూడా రాశారట. వారి కథల పుస్తకం ఎమెస్కో వారో మరొకరో వేశారట. స్వస్థలం ఏమిటో! పిల్లలు ఎక్కడ ఉన్నారో! తెలిస్తే 9290064047కు సమాచారం అందించండి.

send your response to sakshikatha@gmail.com

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top