You Are Here: Home » భవిత » విద్య » పుస్తకాలే.. నేస్తం(ఆదివారం ప్రత్యేకం)

పుస్తకాలే.. నేస్తం(ఆదివారం ప్రత్యేకం)

ఐఎఎస్‌ల పిల్లలే ఐఎఎస్‌లవుతారు.చిన్నప్పట్నుంచీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్‌లో చదివారు కాబట్టి ఏ పరీక్షలోనైనా మంచి మార్కులొస్తాయి.వాళ్ళకి బాగా డబ్బుంది. ఎంత ఖర్చుపెట్టయినా మంచి కోచింగ్ తీసుకుంటారు కదా… అందుకే పాసవుతారు. ఈ మారుమూల పల్లెటూల్లో వున్నవాళ్ళం. ఆ గ్రూప్ వన్‌లు, టూలు మనకెక్కడ వస్తాయి?… అవన్నీ పెద్దోళ్ల పిల్లలకే. ఇవన్నీ గెలవలేనివారు ఆత్మసంతృప్తి కోసం సృష్టించుకున్న మాటలు. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే ఆశయం… మనసా వాచా కర్మణా… పట్టుదలతో కృషిచేస్తే అనుకున్నది సాధించగలమనే ఆత్మవిశ్వాసం… ఉన్నవారికి సమాజ, కుటుంబ నేపధ్యాలు అడ్డురావు. పల్లెటూళ్ళు, పేదరికాలు ప్రతిబంధకాలు కావు. ఇవి కేవలం వ్యక్తిత్వ వికాస వాక్యాలు కావు… ఒక వ్యక్తి సాధించి నిరూపించిన నిజాలు. అతని పేరు జాపా నరేందర్ రెడ్డి.

ఇటీవల ప్రకటించిన గ్రూప్-2 ఫలితాల్లో స్టేట్ సెకండ్ ర్యాంకర్.ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తాయని, పోటీ పరీక్షలు నిర్వహిస్తారనే విషయం కూడా తెలియని ప్రాంతాలు తెలంగాణాలో చాలా వున్నాయి. ఇటీవలి కాలంలో కొంత చైతన్యం పెరిగినప్పటికీ సాధారణంగా పరిశీలిస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు ముఖ్యంగా ఉన్నతస్థాయి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌లకు తెలంగాణాలో ముఖ్యంగా మెదక్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి స్పందన చాలా తక్కువగా వుంటుంది. చైతన్యం తోపాటు అసలు ఇతర అంశాలలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ మట్టిలో మాణిక్యాల్లా – 2004 గ్రూప్-1లో రాష్ట్రస్థాయి తొమ్మిదో ర్యాంక్ కైవసం చేసుకొని ఆర్.టి.ఓ.గా ఎంపికైన నిజామాబాద్ వాసి ఎం. చంద్రశేఖర్ గౌడ్, 2007 గ్రూప్-1లో స్టేట్ ఫోర్త్ ర్యాంకర్‌గా నిలిచి డిప్యూటీ కలెక్టర్ పోస్టును సొంతం చేసుకున్న మహబూబ్‌నగర్ వాసి నారాయణరెడ్డి, ఇప్పుడు తాజా గ్రూప్-2 ఫలితాలలో రాష్ట్రస్థాయిలో రెండవస్థానంలో నిలిచి ఎక్సయిజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టును సాధిం చుకున్న మెదక్ జిల్లా వాసి జాపా నరేందర్‌రెడ్డి. పుట్టిన ఊరు, పెరిగిన వాతావరణం, పేదరికం తదితర అనేక ప్రతికూల అంశాలు వున్నప్పటికీ తనకు తానే చైతన్యస్వరూపుడై, స్ఫూర్తిదాతై బలమైన ఆకాంక్షలతో లక్షలాది మంది అభ్యర్ధులను దాటుకొని టాప్‌టెన్ స్థానాల్లో ఒకడుగా నిలిచి ఉన్నత సర్వీసులను అందుకున్న విజేత నరేందర్‌రెడ్డి గ్రూప్స్ పరీక్షలలో విజయం సాధించాలనే తపనతోపాటు సంవత్సరాల పాటుగా పరీక్షలు రాసిన అనుభవం, ప్రిపరేషన్‌లో మెళుకువలు నరేందర్ రెడ్డి నేటి విజయానికి కారణాలుగా నిలిచాయి.

అదేపనిగా ప్రిపరేషన్….
‘‘నేను గత నాలుగైదు సంవత్సరాలుగా ఎపిపిఎస్‌సి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. ఇందులో గ్రూప్-2 పరీక్షలను లక్ష్యంగా పెట్టుకొని ఏకంగా 19 నెలలు ప్రిపేరయ్యాను. నా కళ్ళముందు ఒకటే లక్ష్యం. అదే గ్రూప్-2 సర్వీస్ ఉద్యోగం. అది సొంతం చేసుకోవడానికి ఎంత కాలమైనా అలాగే ఆపకుండా పోటీపరీక్షలకు ప్రిపరేషన్ కొనసాగించేవాడిని’’. అని జాపా నరేందర్‌రెడ్డి చెప్పిన మాటల్లో గ్రూప్ సర్వీసులు సాధించాలనే కోరిక అతనిలో ఎంత బలీయంగా వుందో అర్ధమవుతుంది. అతనికి 500 మార్కులకు గాను 377 మార్కులు రావడానికి వెనుక ముఖ్యకారణం ఈ తపనే.

తల్లిదండ్రుల ప్రోత్సాహం
జాపా నరేందర్ రెడ్డి తండ్రి వెూహన్‌రెడ్డి, జెడ్.పి.ప్రైమరీ స్కూల్లో ప్రధానోపాధ్యాయులుగా వున్నారు. సోషల్‌స్టడీస్ బోధించే వెూహన్‌రెడ్డికి స్వతహాగా ప్రభుత్వ వ్యవస్థ, అధికారుల పాలనా యంత్రాంగంపై మంచి అవగాహనవుంది. అందు కేనేవెూ తన కొడుకు భవిష్యత్తులో గ్రూప్-1, గ్రూప్-2 ఆఫీసర్ కావాలని కలలు కన్నాడు. నరేందర్‌రెడ్డి తల్లి రేణుక మదిలో కూడా కొడుకు మంచి ఉన్నతస్థాయి ప్రభుత్వ ఉద్యోగి కావాలని వుండేది. ఈ విషయాన్నే తల్లిదండ్రులిద్దరూ తరచుగా తమ కొడుకుతో అంటుండేవారు.
‘‘చూడు బిడ్డా…. నిన్ను ఉన్నతస్థాయి ప్రభుత్వ ఉద్యోగంలో చూడాలని మా కోరిక. దానివలన సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం లభించడమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు సేవచేసే భాగ్యం కూడా లభిస్తుంది. నువ్వు ప్రయత్నించు… తప్పక విజయం సాధిస్తావు’’ అని అదేపనిగా తల్లిదండ్రులు అంటున్న మాటలే నరేందర్‌రెడ్డికి ప్రేరణగా నిలిచి తాను తప్పకుండా సాధిస్తాననే నమ్మకాన్ని పెంచాయి.

అపజయంతో స్ఫూర్తి
తల్లిదండ్రుల కోరిక ప్రకారం నరేందర్ రెడ్డి డిగ్రీ పూర్తికాగానే లక్ష్యసాధనకు శ్రీకారం చుట్టాడు. 200 జనవరిలో గ్రూప్స్ పోస్టునే లక్ష్యంగా బరిలోకి దిగి, ప్రిపరేషన్ ప్రారంభించాడు. సంవత్సరంపాటు స్వయం గానే గ్రూప్-1 పరీక్షకు ప్రిపేరయ్యాడు. ప్రిలిమ్స్ పరీక్షకు హాజరై 150కి 107 మార్కులు సాధించాడు. కానీ తర్వాత మెయిన్స్‌లో విజయం సాధించలేక పోయాడు. తొలి ప్రయత్నమే గ్రూప్-1 స్థాయి పరీక్షలకు ప్రయత్నించడం తాను చేసిన తప్పని, అది తన తొలి లక్ష్యం కాదని గ్రహించిన నరేందర్‌రెడ్డి ముందుగా గ్రూప్-2 సాధనగా అడుగులువేశాడు. ఈసారి ఎట్టి పరిస్థితులలోనూ, ఎంత కాలమైనా, ఎంత కష్టమైనా గ్రూప్-2 సాధించాలని గట్టి పట్టుదలతో ప్రిపరేషన్ ప్రారంభించాడు నరేందర్‌రెడ్డి. ‘‘ఆ 19 నెలలు నాకు మరో ప్రపంచం తెలియదు, చూడలేదు. నా ఎదురుగా ఈ భూమ్మీద వున్నది ఒకే ఒక్కటి అది గ్రూప్-2 పరీక్ష మాత్రమే. అహర్నిశలు కృషి చేశాను’’.

ప్రిపరేషన్ ఇలా….
‘‘మొదట్లో అంటే తొలి ప్రయత్నంతో నాకు సిలబస్ అంతా గందరగోళంగా వుండేది. ఏడాదిపాటు నా అంతట నేను జరిపిన ప్రిపరేషన్ అనుభవంతో – ఏది చదవాలి? ఎక్కడ నుండి చదవాలి? ఎంత వరకు చదవాలి? ఎక్కడ ముగించాలి? సిలబస్‌లో ఏది ముఖ్యం. ఏ సిలబస్ ఎంత కాలంలో పూర్తిచేయాలి? మొదలైన అంశాలలో సరైన అవగాహన లేక అంతా అయోమయంగా వుండేది. దానికి కారణం నేను ఎవరిమీదా ఆధారపడకుండా స్వంతంగా ప్రిపేర్ కావడమేనని అర్ధమైంది. అందుకే గ్రూప్-2లో ఈ పొరపాటు జరగూడదను కున్నాను. కోచింగ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. 2010 ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో కోచింగ్ పూర్తయిన తర్వాత ఇంటి దగ్గరే వుంటూ పరీక్షకు ప్రిపేరయ్యాను. జనరల్‌స్టడీస్ పేపర్‌కు ఆర్.సి.డ్డి పుస్తకాలతో పాటు, ఎకానమీ పేపర్‌కు చిరంజీవి, రమేష్ నోట్సులు చదివాను. ఎ.పి. చరిత్ర, సంస్కృతికి జి. నారాయణగౌడ్ పుస్తకం, ఎ.పి. హిస్టరీకి బి.ఎస్.ఎల్. హనుమంతరావు పుస్తకం, పాలిటీకి ప్రభాకర్‌రెడ్డి, కృష్ణారెడ్డి పుస్తకాలు చదివాను’’. అంటూ తన ప్రిపరేషన్ విధానాన్ని వివరించాడు.

విజయం కోసం…నిరంతర సమరం
‘పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది’ అనే తెలుగు సామెత, విజేతలు పుట్టుకతోనే గొప్పవాళ్ళు అనే తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తుంది. ప్రస్తుత సమాజంలో గొప్పవాళ్ళుగా వాసికెక్కిన వారి జీవిత చరిత్రల్ని కూడా రచయితలు అదే దృష్టితో మలుస్తున్నారు. ఆయా వ్యక్తులు పుట్టుకతోనే గొప్ప కార్యాల్ని నిర్వహించినట్లు రాసేస్తున్నారు. ఇలాంటి ధోరణులు సహజంగానే యువతకు తప్పుడు సంకేతాల్ని అందిస్తున్నాయి. పుట్టుకతోనే కొందరు విజేతలుగా, మరికొందరు పరాజితులుగా వర్గీకృతమై ఉంటారని నేటి యువతలో నూటికి తొంభై మంది విశ్వసిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఇది నిజంగా ఆత్మహత్యా సదృశ్యం. ఎందుకంటే జన్మతః ఎవరూ విజేతలుకారు, కాలేరు. విజేతలు జన్మిస్తారు అనడం కంటే తయారవుతారు అనడం సబబని ప్రస్తుతం మేధావులందరూ ఏకగ్రీవంగా అంగీక రిస్తున్నారు. ఈనాడు ప్రపంచంలో వివిధ రంగాలలో అత్యున్నత స్థానాల్ని అధిరోహించిన వారి జీవిత చరిత్రల్ని అధ్యయనం చేస్తే వారూ ఒకప్పుడు మనలాగే ఒక మామూలు స్థాయి నుండి జీవితాన్ని ప్రారం భించిన వారేనని తెలుస్తోంది. అంటే ఒకనాటి సామాన్యులు కేవలం తమ ప్రయత్నం వల్ల నేటికి అసామాన్యులుగా మారారన్న జీవిత సత్యాన్ని వారి జీవన సరళి ఆవిష్కరిస్తోందన్న మాట. నేటి యువతరంలో చాలా మందికి ఆదిలోనే ఘన విజయాలు సాధించేయాలన్న ఆశ ఎక్కువ, అదీ ఎలాంటి కష్టాలూ ఎదుర్కోకుండా సాధించాలని భావిస్తారు. అందరిలాగే కష్టాలు ఎదుర్కొని విజయాలు సాధిస్తే ఇతరులకూ మాకూ తేడా ఏముంది? అనే విచిత్రమైన లాజిక్‌ను కూడా కొందరు తీస్తారు.

ఇది అసంబద్ధం. ఎందుకంటే విజయానికి దగ్గర మార్గం అంటూ ఏది లేదు. అనాయాసంగా సాధించిన విజయాన్ని ఎలా నిలుపుకోవాలో వారికి తెలియదు కాబట్టి త్వరలోనే వారిని విజయలక్ష్మి విడిచిపోతుంది. లాటరీల్లో హఠాత్తుగా లక్షలు సంపాదించిన వ్యక్తి ఒక్కసారిగా విద్యుల్లతలాగా మెరసి, ఆ తర్వాత ఏమయ్యాడో కూడా తెలియకుండా పోవడం చూస్తున్నాం కదా? అందువల్ల విజేతలు కాదలుచుకున్న వాళ్ళు ముందుగా ఆయాచితంగా విజయం సాధించాలి అన్న ధోరణిని విడనాడాలి. ఆశయ సాధనకు నిర్దేశించిన వివిధ దశల్ని అధిగ మించడం అంత తేలిక కాదు. ఒక వ్యక్తి తనను తాను విజేతగా నిరూపించుకుంటాడా? లేక పరాజితుడుగా మిగిలిపోతాడా? అన్న అంశం ఈ దశల్ని విజయ వంతంగా అధిగమిం చడంపైనే ఆధారపడి ఉంటుంది. సంకల్పబలం, పట్టుదల, కృషి, చాకచక్యం, సమయ స్ఫూర్తి అనే అయిదు సాధనాల సాయం తోనే వీనిని అధిగ మించవచ్చు. లక్ష్య సాధన దశల్లో వివిధ అనుభవాలు నేర్పే పాఠాల్ని నిర్లక్ష్యం చేయ కూడదు. లక్ష్యం ఎంత ఉన్నతమైనదైతే అంత కఠోర శ్రమను భరించక తప్పదు, శ్రమ, రక్తం, ఒక్కోసారి కన్నీళ్ళు ధారపోయక తప్పదు. ప్రతి ప్రయత్నం ‘అనుమానం, అవమానం, విజయం’ అనే మూడు దశల గుండా సాగుతుంది. ప్రారంభంలో లక్ష్యం సాధించగలమా? లేదా? అన్న అనుమానం అందర్నీ పట్టిపీడిస్తుంది. తొలిసారిగా ఈత నేర్చుకునే వ్యక్తి ఎంత బలవంతుడైనా మొదట్లో ఉక్కిరిబిక్కిరి కాక తప్పదు. దీనికి భయపడితే ఇక జీవితంలో శాశ్వతంగా ఈత నేర్చుకోలేడు. జీవితం ఒడ్డున నిలబడి వేగంగా ఈదుతున్న వారిని చూసి నిర్వేదం చెందాల్సిందే. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రారంభ సమస్యలకు, అవమానాలకు తలవంచ కూడదు. ఆ తర్వాత ‘సంధికాల దశ’ టాన్సిషన్ పీరియడ్) ప్రారంభమ వుతుంది. దీనిని అధిగమిస్తే విజయం తాలూకు తొలి అనుభవాల్ని శాఖా మాత్రంగా ఆస్వాదించవచ్చు. అయితే ఈ దశలో అనేక సమస్యల్ని, అడ్డంకుల్ని అధిగమించక తప్పదు. చాలా జాగ్రత్తగా వ్యూహాల్ని రూపొందిస్తూ మార్పు చేర్పులు చేస్తూ, ముందుకు పోవాలి. అప్పుడే విజయం మనల్ని వరిస్తుంది.


datails

Clip to Evernote

Leave a Comment

Copy Protected by Chetans WP-Copyprotect.
Scroll to top